యెషయా 65:1-25

  • విగ్రహాల్ని పూజించేవాళ్లకు వ్యతిరేకంగా యెహోవా తీర్పు (1-16)

    • అదృష్ట దేవత, విధి దేవుడు (11)

    • “నా సేవకులు భోజనం చేస్తారు” (13)

  • కొత్త ఆకాశం, కొత్త భూమి (17-25)

    • ఇళ్లు కట్టుకుంటారు; ద్రాక్షతోటలు నాటుకుంటారు (21)

    • ఎవ్వరూ వృథాగా ప్రయాసపడరు (23)

65  “నా కోసం అడగని వాళ్లను నన్ను వెతకనిచ్చాను;నన్ను వెతకని వాళ్లకు నేను దొరికాను.+నా పేరు ఎత్తని జనంతో ‘నేను ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నాను!’ అని అన్నాను.+   మొండి ప్రజల+ కోసం,తమ సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తూ+చెడ్డ మార్గంలో నడుస్తున్న ప్రజల+ కోసం రోజంతా నేను నా చేతులు చాపాను;   తోటల్లో బలులు అర్పిస్తూ,+ ఇటుకల మీద ధూపం వేస్తూవాళ్లు అస్తమానం ముఖం మీదే నన్ను అవమానించారు.+   వాళ్లు సమాధుల మధ్య కూర్చుంటారు,+పందుల మాంసం తింటూ+చాటుగా ఉన్న చోట్లలో* రాత్రి గడుపుతారు, కంపుకొట్టేవాటి* పులుసు వాళ్ల పాత్రల్లో ఉంది.+   వాళ్లు, ‘నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రావద్దు,ఎందుకంటే నేను నీకన్నా పవిత్రుణ్ణి’* అంటారు. వాళ్లు నా ముక్కురంధ్రాల్లో పొగలా, రోజంతా మండుతున్న నిప్పులా ఉన్నారు.   ఇదిగో! అది నా ముందు రాయబడింది;నేను ఊరికే నిలబడను, వాళ్లకు ప్రతీకారం చేస్తాను,+నేను వాళ్ల మీద పూర్తిగా పగతీర్చుకుంటాను.   వాళ్ల తప్పుల్ని బట్టి, వాళ్ల పూర్వీకుల తప్పుల్ని బట్టి అలా చేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు.“వాళ్లు పర్వతాల మీద ధూపం వేసికొండల మీద నన్ను నిందించారు+ కాబట్టినేను ముందుగా వాళ్ల కూలిని వాళ్లకు పూర్తిగా లెక్క కట్టి ఇస్తాను.”   యెహోవా ఇలా అంటున్నాడు: “ద్రాక్షగుత్తిలో కొత్త ద్రాక్షారసం కనిపించినప్పుడు‘దాన్ని పాడు చేయొద్దు, అందులో కాస్త మంచిది* ఉంది’ అని అంటారు కదా? నా సేవకుల విషయంలో నేను కూడా అలాగే చేస్తాను; నేను వాళ్లందర్నీ నాశనం చేయను.+   నేను యాకోబు నుండి ఒక సంతానాన్ని* బయటికి తెస్తాను,యూదా నుండి, నా పర్వతాల్ని స్వాస్థ్యంగా పొందే వ్యక్తిని బయటికి తెస్తాను;+ నేను ఎంచుకున్న వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకుంటారు, నా సేవకులు అందులో నివసిస్తారు.+ 10  షారోను+ గొర్రెలకు మేత స్థలం అవుతుంది, ఆకోరు లోయ+ పశువులకు విశ్రాంతి స్థలం అవుతుంది,నన్ను వెదికే నా ప్రజల కోసం అలా జరుగుతుంది. 11  కానీ మీరు యెహోవాను మర్చిపోయే ప్రజలు,+మీరు నా పవిత్ర పర్వతాన్ని మర్చిపోయి+అదృష్ట దేవతకు బల్లను సిద్ధం చేస్తారు,విధి దేవుడికి పానీయార్పణలు అర్పిస్తారు. 12  కాబట్టి నేను మిమ్మల్ని ఖడ్గానికి అప్పగిస్తాను,+ వధించబడడం కోసం మీరంతా వంగుతారు,+ ఎందుకంటే నేను పిలిచాను, కానీ మీరు పలకలేదు, నేను మాట్లాడాను, కానీ మీరు వినలేదు;+ మీరు నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తూ వచ్చారు, నాకు నచ్చని వాటిని ఎంచుకున్నారు.”+ 13  కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! నా సేవకులు భోజనం చేస్తారు, కానీ మీరు ఆకలిగా ఉంటారు.+ నా సేవకులు నీళ్లు తాగుతారు,+ కానీ మీరు దాహంగా ఉంటారు. నా సేవకులు సంతోషిస్తారు,+ కానీ మీరు అవమానాలపాలు అవుతారు.+ 14  ఇదిగో! నా సేవకులు హృదయానందంతో సంతోషంగా కేకలు వేస్తారు, కానీ మీరు హృదయ వేదనతో ఏడుస్తారు, కృంగిన మనసుతో* విలపిస్తారు. 15  మీరు విడిచివెళ్లే పేరును, నేను ఎంచుకున్న ప్రజలు శపించడానికి ఉపయోగిస్తారు, సర్వోన్నత ప్రభువైన యెహోవా మీలో ప్రతీ ఒక్కర్ని హతమారుస్తాడు, కానీ తన సేవకుల్ని ఆయన వేరే పేరుతో పిలుస్తాడు;+ 16  దానివల్ల భూమ్మీద తమ కోసం దీవెనను వెదికే వాళ్లు సత్యవంతుడైన* దేవుని చేత దీవించబడతారు, భూనివాసుల్లో ఒట్టేసి ప్రమాణం చేసేవాళ్లు సత్యవంతుడైన* దేవుని తోడని ప్రమాణం చేస్తారు.+ ఎందుకంటే పాత కష్టాలన్నీ మరవబడతాయి; అవి నా కళ్లకు కనిపించకుండా దాచబడతాయి.+ 17  ఎందుకంటే ఇదిగో! నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాను;+ పాత సంగతులు గుర్తుకురావు, అవి హృదయంలో కూడా ఉండవు.*+ 18  నేను సృష్టించేవాటిని బట్టి మీరు ఉల్లసించండి, ఎప్పటికీ సంతోషించండి. ఎందుకంటే, ఇదిగో! నేను సీయోనును సంతోష కారణంగా చేయబోతున్నాను, దాని ప్రజల్ని ఉల్లాస కారణంగా చేయబోతున్నాను.+ 19  నేను యెరూషలేమును బట్టి ఆనందిస్తాను, నా ప్రజల్ని బట్టి చాలా సంతోషిస్తాను;+ ఏడ్పులు గానీ, ఆర్తనాదాలు గానీ ఇంకెప్పుడూ దానిలో వినిపించవు.”+ 20  “పుట్టిన కొన్ని రోజులకే చనిపోయే పసిబిడ్డలు గానీ, ఆయుష్షు నిండకుండానే చనిపోయే ముసలివాళ్లు గానీ అక్కడ ఇక ఉండరు. ఎందుకంటే, నూరేళ్ల వయసులో చనిపోయే వ్యక్తి కూడా బాలుడిగానే ఎంచబడతాడు, పాపం చేసిన వ్యక్తి వందేళ్లవాడైనా సరే శపించబడతాడు.* 21  వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు,+ ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు.+ 22  వాళ్లు కట్టుకున్న ఇళ్లలో వేరేవాళ్లు నివసించరు, వాళ్లు నాటుకున్న వాటిని వేరేవాళ్లు తినరు. ఎందుకంటే నా ప్రజల ఆయుష్షు వృక్ష ఆయుష్షు అంత ఉంటుంది,+ నేను ఎంచుకున్న ప్రజలు తమ చేతుల కష్టాన్ని పూర్తిగా అనుభవిస్తారు. 23  వాళ్లు వృథాగా ప్రయాసపడరు,+ అకస్మాత్తుగా వచ్చే అపాయానికి గురయ్యేలా పిల్లల్ని కనరు; ఎందుకంటే వాళ్లు, వాళ్ల వంశస్థులు+ యెహోవా దీవించిన సంతానం.+ 24  వాళ్లు వేడుకోకముందే నేను జవాబిస్తాను; వాళ్లు మాట్లాడడం పూర్తికాక ముందే నేను వింటాను. 25  తోడేలు, గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది,+ పాముకు మట్టి ఆహారమౌతుంది. నా పవిత్ర పర్వతమంతటా అవి ఏ హాని గానీ, నాశనం గానీ చేయవు”+ అని యెహోవా అంటున్నాడు.

అధస్సూచీలు

లేదా “కాపలా గుడిసెల్లో” అయ్యుంటుంది.
లేదా “అపవిత్రమైనవాటి.”
లేదా “ఎందుకంటే నా పవిత్రతను నీకు బదిలీ చేస్తాను” అయ్యుంటుంది.
అక్ష., “దీవెన.”
అక్ష., “విత్తనాన్ని.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్‌.”
లేదా “నమ్మకమైన.” అక్ష., “ఆమేన్‌.”
అక్ష., “హృదయంలోకి కూడా రావు.”
లేదా “వందేళ్లు నిండకుండానే చనిపోయే వ్యక్తి శాపగ్రస్తుడిగా ఎంచబడతాడు” అయ్యుంటుంది.