దానియేలు 12:1-13
12 “నీ ప్రజల పక్షాన నిలబడుతూవున్న గొప్ప అధిపతైన+ మిఖాయేలు*+ ఆ కాలంలో నిలబడతాడు.* అప్పుడు, జనాలు ఏర్పడినప్పటి నుండి అప్పటివరకు కలగని శ్రమల కాలం వస్తుంది. ఆ సమయంలో, నీ ప్రజల్లో ఎవరెవరి పేర్లు గ్రంథంలో రాయబడ్డాయో+ వాళ్లు తప్పించుకుంటారు.+
2 చనిపోయిన* చాలామంది లేస్తారు; కొంతమంది శాశ్వత జీవితం కోసం లేస్తారు, ఇతరులు నిందలపాలు కావడం కోసం, శాశ్వత తిరస్కారానికి గురవ్వడం కోసం లేస్తారు.
3 “అయితే లోతైన అవగాహన ఉన్నవాళ్లు ఆకాశ విశాలంలా ప్రకాశవంతంగా మెరుస్తారు, నీతిమంతులయ్యేలా చాలామందికి సహాయం చేసేవాళ్లు నక్షత్రాల్లా యుగయుగాలు మెరుస్తారు.
4 “దానియేలూ, నీ విషయానికొస్తే, ఈ మాటల్ని రహస్యంగా ఉంచు; అంత్యకాలం వరకు గ్రంథానికి ముద్ర వేయి.+ అప్పుడు చాలామంది అటూఇటూ తిరుగుతారు,* నిజమైన జ్ఞానం ఎక్కువౌతుంది.”+
5 అప్పుడు దానియేలు అనే నేను చూస్తుండగా, మరో ఇద్దరు అక్కడ నిలబడివున్నారు; ఒక వ్యక్తి కాలువకు ఈ ఒడ్డున, మరో వ్యక్తి కాలువకు ఆ ఒడ్డున ఉన్నారు.+
6 వాళ్లలో ఒకతను, నార వస్త్రాలు ధరించుకుని కాలువ నీళ్ల పైన ఉన్న వ్యక్తిని+ ఇలా అడిగాడు: “ఈ అద్భుతమైన విషయాలు సమాప్తం అవ్వడానికి ఎంతకాలం పడుతుంది?”
7 నార వస్త్రాలు ధరించుకుని కాలువ నీళ్ల పైన ఉన్న ఆ వ్యక్తి తన కుడిచేతిని, ఎడమచేతిని ఆకాశం వైపు ఎత్తి, యుగయుగాలు జీవిస్తున్న దేవుని మీద ఒట్టేసి+ ఇలా చెప్పడం నేను విన్నాను: “అది ఒక నియమిత కాలం, నియమిత కాలాలు, అర్ధ కాలం* పడుతుంది. పవిత్ర ప్రజల శక్తిని కొట్టివేయడం ముగియగానే,+ ఈ విషయాలన్నీ సమాప్తం అవుతాయి.”
8 నేను ఈ మాటల్ని విన్నాను కానీ అర్థం చేసుకోలేకపోయాను;+ కాబట్టి నేను, “నా ప్రభూ, చివరికి ఏమౌతుంది?” అని అడిగాను.
9 అప్పుడు అతను నాతో ఇలా చెప్పాడు: “దానియేలూ, నువ్వు వెళ్లు. ఎందుకంటే ఈ మాటలు రహస్యంగా ఉంచబడాలి, అంత్యకాలం వరకు ముద్ర వేయబడి ఉండాలి.+
10 చాలామంది తమను తాము శుభ్రం చేసుకుని, తెల్లగా అయ్యి, శుద్ధి అవుతారు.+ చెడ్డవాళ్లు చెడ్డపనులు చేస్తారు, చెడ్డవాళ్లలో ఎవ్వరూ ఈ మాటల్ని అర్థం చేసుకోలేరు, కానీ లోతైన అవగాహన ఉన్నవాళ్లు అర్థం చేసుకుంటారు.+
11 “రోజువారీ బలులు నిలిపివేయబడి, నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు నిలబెట్టబడినప్పటి+ నుండి 1,290 రోజులు గడుస్తాయి.
12 “ఎవరైతే 1,335 రోజుల చివరి వరకూ కనిపెట్టుకొని ఉంటారో* వాళ్లు సంతోషంగా ఉంటారు!
13 “కానీ నీ విషయానికొస్తే, చివరి వరకూ స్థిరంగా ఉండు. నువ్వు విశ్రాంతి తీసుకుంటావు, అయితే రోజుల చివర్లో నీ వంతు కోసం* నిలబడతావు.”+
అధస్సూచీలు
^ “దేవుని వంటి వాడు ఎవడు?” అని అర్థం.
^ లేదా “లేస్తాడు.”
^ అక్ష., “మట్టిలో నిద్రిస్తున్న.”
^ లేదా “దాన్ని [అంటే గ్రంథాన్ని] సమగ్రంగా పరిశీలిస్తారు.”
^ అంటే, మూడున్నర కాలాలు.
^ లేదా “ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారో.”
^ లేదా “నీకు నియమించిన స్థలంలో.”