కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యాయం 28

‘నీవు మాత్రమే విశ్వసనీయుడవు’

‘నీవు మాత్రమే విశ్వసనీయుడవు’

1, 2.దావీదు రాజుకు అవిశ్వసనీయత తెలియనిదికాదని ఎందుకు చెప్పవచ్చు?

 దావీదు రాజుకు అవిశ్వసనీయత అంటే తెలియనిది కాదు. ఆయన పరిపాలనాకాలంలో, అల్లకల్లోలంగా ఉన్న ఒక సందర్భంలో ఆయన సొంత జనాంగ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అంతేకాకుండా, దావీదు సన్నిహితులని మనం తలంచే వారే ఆయనకు నమ్మకద్రోహం చేశారు. దావీదు మొదటి భార్య మీకాలు విషయమే పరిశీలించండి. తొలుత ఆమె నిస్సందేహంగా అతని రాజరిక విధులకు మద్దతిస్తూ ‘దావీదు మీద ప్రేమ కలిగి ఉండింది.’ కానీ ఆ తర్వాత ఆమె ‘తన మనస్సులో అతని హీనపరుస్తూ,’ దావీదును ‘వ్యర్థుడని’ కూడా తలంచింది.—1 సమూయేలు 18:20; 2 సమూయేలు 6:16, 20.

2 అహీతోపెలు అనే వ్యక్తి దావీదు ఆంతరంగిక సలహాదారునిగా ఉండేవాడు. అతని ఆలోచన నేరుగా యెహోవా నుండి వచ్చిన మాటగా పరిగణించబడేది. (2 సమూయేలు 16:23) కానీ ఈ నమ్మినబంటు చివరకు విశ్వాసఘాతకునిగా మారి దావీదుకు వ్యతిరేకంగా వ్యవస్థీకృత తిరుగుబాటులో చేరిపోయాడు. ఆ కుతంత్రానికి సూత్రధారి ఎవరు? దావీదు సొంత కుమారుడైన అబ్షాలోమే! ఆ కుతంత్ర అవకాశవాది ప్రత్యర్థ రాజుగా నిలబడి ‘ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొన్నాడు.’ అబ్షాలోము తిరుగుబాటు ఎంత తీవ్రంగా మారిందంటే దావీదు రాజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయే పరిస్థితి ఏర్పడింది.—2 సమూయేలు 15:1-6, 12-17.

3.దావీదుకు ఎలాంటి నమ్మకముంది?

3 దావీదు పక్షాన విశ్వసనీయంగా నిలబడినవారే లేరా? తన కష్టకాలమంతటిలో తనపట్ల ఒకరు విశ్వసనీయంగా ఉన్నారని దావీదుకు తెలుసు. ఎవరాయన? మరెవరో కాదు స్వయంగా యెహోవా దేవుడే. యెహోవా గురించి దావీదు ఇలా అన్నాడు: “దయగల [“విశ్వసనీయతగల,” NW] వారియెడల నీవు దయ [“విశ్వసనీయత,” NW] చూపించుదువు.’ (2 సమూయేలు 22:26) విశ్వసనీయత అంటే ఏమిటి, ఈ లక్షణానికి సంబంధించి యెహోవా ఏ విధంగా సర్వోన్నత మాదిరిగా ఉన్నాడు?

విశ్వసనీయత అంటే ఏమిటి?

4, 5.(ఎ)“విశ్వసనీయత” అంటే ఏమిటి? (బి) నమ్మకత్వానికి విశ్వసనీయతకు ఉన్న తేడా ఏమిటి?

4 హీబ్రూ లేఖనాల్లో ఉపయోగించబడినట్లుగా “విశ్వసనీయత” అంటే ఒక శాల్తీకి ప్రేమగా హత్తుకొని, ఆ శాల్తీకి సంబంధించి తన సంకల్పం నెరవేరేవరకు దానిని విడువకుండావుండే దయ అని అర్థం. దీనిలో నమ్మకత్వంకంటే ఎక్కువ ఇమిడివుంది. ఇది నిజం, ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం తన విధ్యుక్త ధర్మం అనే భావంలో నమ్మకంగా ఉండవచ్చు. కానీ దానికి భిన్నంగా, విశ్వసనీయత ప్రేమలో వేరుపారి ఉంటుంది. * అంతేకాకుండా, “నమ్మకత్వం” అనే మాటను నిర్జీవ వస్తువులకు కూడా అన్వయించవచ్చు. ఉదాహరణకు, చందమామ ప్రతీ రాత్రి క్రమంగా కనబడుతుంది కాబట్టి కీర్తనకర్త “మింటనుండు సాక్షి నమ్మకముగా” ఉందని అన్నాడు. (కీర్తన 89:​36) కానీ చందమామ విశ్వసనీయంగా ఉన్నట్లు వర్ణించడం కుదరదు. ఎందుకు? ఎందుకంటే విశ్వసనీయత అనేది నిర్జీవ వస్తువులు ప్రదర్శించలేని ప్రేమ యొక్క వ్యక్తీకరణ.

చందమామ నమ్మకమైన సాక్షి అని పిలువబడింది, కానీ నిజానికి బుద్ధిసూక్ష్మతగల సజీవ ప్రాణులు మాత్రమే యెహోవా విశ్వసనీయతను ప్రతిబింబించగలరు

5 లేఖన భావం ప్రకారం విశ్వసనీయతలో ఆప్యాయత ఉంది. అది చూపబడడమే దానిని చూపే వ్యక్తికీ, అది చూపబడుతున్న వ్యక్తికీ మధ్య సంబంధం ఉందని సూచిస్తుంది. అలాంటి విశ్వసనీయత అచంచలమైనది. అది గాలి తీరునుబట్టి ఎగసిపడే సముద్ర కెరటాల్లా ఉండదు. బదులుగా, విశ్వసనీయతకు లేదా విశ్వసనీయ ప్రేమకు అతి భీకరమైన అడ్డంకులను అధిగమించగల స్థిరత్వం, బలం ఉన్నాయి.

6.(ఎ)మానవుల్లో విశ్వసనీయత ఎంత అరుదుగా ఉంటుంది, ఇది బైబిల్లో ఎలా సూచించబడింది? (బి) విశ్వసనీయత కలిగివుండేందుకు ఏది అనివార్యమో తెలుసుకోవడానికి శ్రేష్ఠమైన మార్గమేది, అది ఎందుకు శ్రేష్ఠమైనది?

6 నిజమే, అలాంటి విశ్వసనీయత నేడు అరుదుగా కనబడుతుంది. సన్నిహిత సహవాసులు ఒకరినొకరు ‘నష్టపరచుకోవడం’ సాధారణమైపోయింది. తమ వివాహ జతను వదిలేసే భార్యాభర్తల గురించి మనం అంతకంతకు ఎక్కువగా వింటున్నాం. (సామెతలు 18:24; మలాకీ 2:14-16) విశ్వాసఘాతక చర్యలు ఎంత సర్వసాధారణమై పోతున్నాయంటే మలాకీ ప్రవక్త పలికిన ఈ మాటలనే మనమూ ప్రతిధ్వనింపజేస్తాము: “భక్తుడు [“విశ్వసనీయుడు,” NW] దేశములో లేకపోయెను.” (మీకా 7:2) మానవులు తరచూ ప్రేమపూర్వక దయను చూపలేకపోయినా, విశ్వసనీయత యెహోవా సహజ లక్షణం. వాస్తవానికి, విశ్వసనీయత కలిగివుండేందుకు ఏది అనివార్యమో తెలుసుకోవడానికి, యెహోవా ప్రేమకు సంబంధించిన ఈ ప్రధాన అంశాన్ని ఆయనెలా ప్రదర్శిస్తాడో పరిశీలించడమే శ్రేష్ఠమైన మార్గం.

యెహోవా సాటిలేని విశ్వసనీయత

7, 8.యెహోవా మాత్రమే విశ్వసనీయుడని ఎలా చెప్పవచ్చు?

7 యెహోవా గురించి బైబిలు ఇలా చెబుతోంది: “నీవు మాత్రము పవిత్రుడవు [“విశ్వసనీయుడవు,” NW].” (ప్రకటన 15:3, 4) అదెలా సాధ్యం? ఇటు మానవులు అటు దేవదూతలు కూడా ఆయా సందర్భాల్లో మెచ్చుకోదగిన రీతిలో విశ్వసనీయతను ప్రదర్శించలేదా? (యోబు 1:1; ప్రకటన 4:8) మరి యేసుక్రీస్తు విషయమేమిటి? ఆయన దేవుని ప్రధాన “విశ్వసనీయుడు” కాడా? (కీర్తన 16:10, NW) అలాంటప్పుడు యెహోవా మాత్రమే విశ్వసనీయుడు అని ఎలా చెప్పవచ్చు?

8 మొట్టమొదట, విశ్వసనీయత ప్రేమకు సంబంధించిన ఒక అంశమని గుర్తుంచుకోండి. ‘దేవుడు ప్రేమా స్వరూపి’ అంటే ఈ లక్షణమే ఆయనలో మూర్తీభవించి ఉంది కాబట్టి యెహోవా కాక ఇంకెవరు విశ్వసనీయతను సంపూర్ణంగా ప్రదర్శించగలరు? (1 యోహాను 4:8) నిజానికి, దేవదూతలు, మానవులు దేవుని గుణాలను ప్రతిబింబించవచ్చు, కానీ యెహోవా మాత్రమే సర్వోన్నత స్థాయిలో విశ్వసనీయుడు. ‘మహావృద్ధునిగా’ ఆయన భూమ్మీది లేదా పరలోకంలోని ప్రాణులన్నింటికంటే కూడా ఎక్కువకాలం నుండి ప్రేమపూర్వక దయను ప్రదర్శిస్తున్నాడు. (దానియేలు 7:9) కాబట్టి, విశ్వసనీయతకు యెహోవాయే ప్రతిరూపం. ఈ లక్షణాన్ని ప్రదర్శించడంలో ఎవరూ ఆయనకు సాటిరాలేరు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

9.యెహోవా ఎలా ‘తన క్రియలన్నిటిలో విశ్వసనీయుడు’?

9 యెహోవా “తన క్రియలన్నిటిలో కృపచూపువాడు [“విశ్వసనీయుడు,” NW].” (కీర్తన 145:17) ఏ విధంగా? 136వ కీర్తన దానికి జవాబిస్తోంది. అందులో ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంగుండా విశేషమైన రీతిలో విడుదల చేయడంతోపాటు యెహోవా రక్షణ కార్యాలనేకం ఉదహరించబడ్డాయి. ప్రధానంగా, ఈ కీర్తనలోని ప్రతీ వచనం “ఆయన కృప [“విశ్వసనీయత,” NW] నిరంతరముండును” అనే మాటలతో ముగుస్తున్నాయి. 289వ పేజీలో, ధ్యానించడానికి ఇవ్వబడిన ప్రశ్నల్లో ఈ కీర్తన చేర్చబడింది. ఆ వచనాలను మీరు చదువుతుండగా, యెహోవా తన ప్రజలపట్ల అనేక విధాలుగా ప్రదర్శించిన కృపను లేదా ప్రేమపూర్వక దయను చూసి మీరు ముగ్ధులవుతారు. అవును, యెహోవా తన నమ్మకమైన సేవకులు సహాయం కోసం పెట్టే మొరలు వినడం ద్వారా, తగినకాలంలో చర్య తీసుకోవడం ద్వారా వారిపట్ల విశ్వసనీయతను ప్రదర్శిస్తాడు. (కీర్తన 34:6) యెహోవాకు తన సేవకులపట్ల ఉన్న విశ్వసనీయమైన ప్రేమ వారు తన పట్ల విశ్వసనీయంగా ఉన్నంత కాలం చెక్కుచెదరదు.

10.యెహోవా తన ప్రమాణాల విషయంలో తన విశ్వసనీయతను ఎలా ప్రదర్శిస్తున్నాడు?

10 దీనికితోడుగా, యెహోవా తన ప్రమాణాలకు కట్టుబడి ఉండడం ద్వారా తన సేవకులపట్ల తన విశ్వసనీయతను ప్రదర్శిస్తాడు. కేవలం ఆకస్మిక ఉత్సాహంతో, భావోద్వేగాలచే నిర్దేశించబడే క్రమరహిత మానవుల్లా యెహోవా ఏది మంచి ఏది చెడు అనేదానికి సంబంధించిన తన దృక్కోణంలో ఊగిసలాడడు. యుగాలన్నింటిలో అభిచారం, విగ్రహారాధన, నరహత్య వంటివాటికి సంబంధించిన ఆయన దృక్కోణంలో మార్పులేదు. “మీ ముసలితనంవరకు నేను అలాంటివాణ్ణే” అని తన ప్రవక్తయైన యెషయా ద్వారా ఆయన చెప్పాడు. (యెషయా 46:3-4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కాబట్టి, దేవుని వాక్యంలో లభించే స్పష్టమైన నైతిక మార్గదర్శకాన్ని అనుసరించడం ద్వారా మనం ప్రయోజనం పొందుతామనే నమ్మకంతో ఉండవచ్చు.—యెషయా 48:17-19.

11.యెహోవా తన వాగ్దానాలకు నమ్మకంగా కట్టుబడి ఉంటాడని చూపడానికి కొన్ని ఉదాహరణలివ్వండి.

11 యెహోవా తన వాగ్దానాలకు నమ్మకంగా కట్టుబడి ఉండడం ద్వారా కూడా విశ్వసనీయతను చూపుతున్నాడు. ఆయన ఏదైనా ముందుగా ప్రకటిస్తే అది తప్పక జరుగుతుంది. యెహోవా ఈ విధంగా సెలవిచ్చాడు: “నా నోటనుండి వచ్చు వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలముచేయును.” (యెషయా 55:10, 11) యెహోవా తన మాటకు నమ్మకంగా కట్టుబడి ఉండడం ద్వారా తన ప్రజలపట్ల విశ్వసనీయతను చూపిస్తాడు. ఆయన తాను జరుపనుద్దేశించని దానికోసం వారు ఆశతో ఎదురుచూసేటట్లు చేయడు. ఈ విషయంలో ఆయన ఖ్యాతి ఎంత నిర్దోషమైనదంటే దాని గురించి ఆయన సేవకుడైన యెహోషువ ఇలా చెప్పగలిగాడు: “యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను.” (యెహోషువ 21:44) అందువల్ల, యెహోవా తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం కావడం ద్వారా మనలను ఎన్నడూ నిరుత్సాహపరచడని మనం నమ్మకంతో ఉండవచ్చు.—యెషయా 49:23; రోమీయులు 5:5.

12, 13.యెహోవా ప్రేమపూర్వక దయ ఏయే విధాలుగా “నిరంతరము” ఉంటుంది?

12 ముందు పేర్కొన్నట్లుగా, యెహోవా కృప లేదా ప్రేమపూర్వక దయ “నిరంతరముండును” అని బైబిలు మనకు తెలియజేస్తోంది. (కీర్తన 136:1) అది ఏ విధంగా ఉంటుంది? ఒక విధంగా, యెహోవా పాపాలను శాశ్వతంగా క్షమిస్తాడు. 26వ అధ్యాయంలో చర్చించబడినట్లుగా, గత పొరపాట్ల విషయంలో ఒక వ్యక్తి క్షమించబడిన తర్వాత యెహోవా వాటిని మళ్ళీ ప్రస్తావించడు. “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” కాబట్టి యెహోవా ప్రేమపూర్వక దయ నిరంతరం ఉంటుంది కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం కృతజ్ఞతతో ఉండాలి.—రోమీయులు 3:23.

13 అయితే యెహోవా ప్రేమపూర్వక దయ మరో భావంలో కూడా నిరంతరం ఉంటుంది. నీతిమంతుడు “నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును, అతడు చేయునదంతయు సఫలమగును” అని ఆయన వాక్యం చెబుతోంది. (కీర్తన 1:3) ఎన్నడూ ఆకువాడక పచ్చగా కళకళలాడుతుండే ఒక చెట్టును ఊహించుకోండి! అలాగే, మనం దేవుని వాక్యంలో నిజంగా సంతోషిస్తూ ఉంటే మన జీవితాలు కూడా సుదీర్ఘంగా, శాంతిగా, ఫలవంతంగా ఉంటాయి. యెహోవా విశ్వసనీయంగా తన నమ్మకమైన సేవకులకు విస్తరించే ఆశీర్వాదాలు నిత్యం నిలిచివుంటాయి. యెహోవా తీసుకొచ్చే నీతియుక్త నూతనలోకంలో విధేయతగల మానవాళి ఆయన ప్రేమపూర్వక దయను నిరంతరం అనుభవిస్తారు.—ప్రకటన 21:3, 4.

యెహోవా ‘తన విశ్వసనీయులను విడువడు’

14.యెహోవా తన సేవకుల విశ్వసనీయతపట్ల తన ప్రశంసనెలా చూపిస్తాడు?

14 యెహోవా ఎన్నోసార్లు తన విశ్వసనీయతను ప్రదర్శించాడు. ఆయన పరిపూర్ణమైన రీతిలో ఒకే విధంగా ఉంటాడు కాబట్టి, ఆయన తన నమ్మకమైన సేవకులపట్లచూపే విశ్వసనీయత ఎన్నటికీ క్షీణించదు. కీర్తనకర్త ఇలా వ్రాశాడు: “నేను చిన్నవాడనై యుంటిని ఇప్పుడు ముసలివాడనై యున్నాను అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను [“విశ్వసనీయులను,” NW] విడువడు.” (కీర్తన 37:25, 28) అవును, సృష్టికర్తగా యెహోవా మన ఆరాధనకు అర్హుడు. (ప్రకటన 4:10) అయినప్పటికీ, యెహోవా విశ్వసనీయుడు కాబట్టి ఆయన మన నమ్మకమైన క్రియలను విలువైనవిగా పరిగణిస్తాడు.—మలాకీ 3:16, 17.

15.యెహోవా ఇశ్రాయేలీయులతో జరిపిన వ్యవహారాలు ఆయన విశ్వసనీయతను ఎలా నొక్కిచెబుతున్నాయో వివరించండి.

15 యెహోవా తన ప్రేమపూర్వక దయనుబట్టి, తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు పదేపదే వారికి సహాయం చేస్తాడు. కీర్తనకర్త మనకిలా చెబుతున్నాడు: “తన భక్తుల [“విశ్వసనీయుల,” NW] ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు; భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును.” (కీర్తన 97:10) ఆయన ఇశ్రాయేలు జనాంగంతో జరిపిన వ్యవహారాలను పరిశీలించండి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంగుండా అద్భుతరీతిలో విడుదల చేయబడిన తర్వాత, వారు యెహోవాకు పాడిన గీతంలో ఇలా ప్రకటించారు: “నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత [“విశ్వసనీయ ప్రేమచేత,” NW, అధస్సూచి] తోడుకొనిపోతివి.” (నిర్గమకాండము 15:13) యెహోవా తన విశ్వసనీయ ప్రేమ కారణంగానే ఎర్ర సముద్రం దగ్గర ఆ విడుదల తీసుకొచ్చాడనడంలో సందేహం లేదు. అందుకే మోషే ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కువేగదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలముచేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండియు ఐగుప్తురాజైన ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించెను.”—ద్వితీయోపదేశకాండము 7:7, 8

16, 17.(ఎ)ఇశ్రాయేలీయులు ఎలాంటి విభ్రాంతికరమైన కృతఘ్నతను కనబరిచారు, అయినా యెహోవా వారిపట్ల ఎలా కనికరం చూపించాడు? (బి) చాలామంది ఇశ్రాయేలీయులు తమకు ‘నివారణ’ లేదన్నట్లు ఎలా చూపారు, అది మనకెలాంటి హెచ్చరికను ఇస్తోంది?

16 నిజమే, ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా యెహోవా ప్రేమపూర్వక దయకు కృతజ్ఞత చూపడంలో విఫలమయ్యారు, ఎందుకంటే వారి విడుదల తర్వాత “వారు ఆయనకు [యెహోవాకు] విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. . . . మహోన్నతుని మీద తిరుగబడిరి.” (కీర్తన 78:17) శతాబ్దాలపాటు వారు యెహోవాను విడిచి అబద్ధ దేవతలవైపు తిరుగుతూ కళంకం తప్ప మరేమీ తీసుకురాని అన్యాచారాలు పాటిస్తూ పదేపదే ఆయనపై తిరుగుబాటు చేశారు. అయినా సరే, యెహోవా తన నిబంధనను ఉల్లంఘించలేదు. బదులుగా, యిర్మీయా ప్రవక్త ద్వారా యెహోవా తన ప్రజలనిలా వేడుకున్నాడు: “ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము . . . మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను [“విశ్వసనీయుడను,” NW].” (యిర్మీయా 3:12) అయితే 25వ అధ్యాయంలో చూసినట్లుగా, ఇశ్రాయేలీయుల్లో చాలామందిలో పరివర్తన రాలేదు. నిజంగా, “వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు” వచ్చారు. దాని ఫలితమేమిటి? చివరకు “నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.”—2 దినవృత్తాంతములు 36:15, 16.

17 దీనినుండి మనమేమి నేర్చుకుంటాము? యెహోవా విశ్వసనీయత గుడ్డిదికాదు లేదా మోసగించబడనేరదు. అవును, యెహోవా ‘విస్తారమైన ప్రేమపూర్వక దయగలవాడు,’ అలాగే ఆయన అవకాశమున్నప్పుడు కరుణ చూపడానికి ఇష్టపడతాడు. అయితే ఒక తప్పిదస్థుడు బొత్తిగా దుష్టుడని నిరూపించబడినప్పుడు ఏమి జరుగుతుంది? అలాంటప్పుడు, యెహోవా తన సొంత నీతి ప్రమాణాలకు కట్టుబడి ప్రతికూల తీర్పు తీరుస్తాడు. మోషేకు చెప్పబడినట్లు, ‘యెహోవా ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు.’—నిర్గమకాండము 34:6, 7.

18, 19.(ఎ)యెహోవా దుష్టులను దండించడమే ఎలా విశ్వసనీయ చర్యగా ఉంటుంది? (బి) చనిపోయేంతగా హింసించబడిన తన సేవకులపట్ల యెహోవా ఏ విధంగా తన విశ్వసనీయతను ప్రదర్శిస్తాడు?

18 దేవుడు దుష్టులను దండించడమే ఒక విశ్వసనీయ కార్యం. ఎలా? ప్రకటన గ్రంథంలో “మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని” ఏడుగురు దేవదూతలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక సూచన కనబడుతోంది. మూడవ దూత తన పాత్రను “నదులలోను జలధారలలోను కుమ్మరింపగా” అవి రక్తంగా మారతాయి. అప్పుడు ఆ దేవదూత యెహోవాతో ఇలా అంటాడు: “వర్తమాన భూతకాలములలో ఉండు పవిత్రుడా [“విశ్వసనీయుడా,” NW], పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పుతీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి; దీనికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పుతీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవు.”—ప్రకటన 16:1-6.

మరణపర్యంతం తమ విశ్వసనీయతను నిరూపించుకున్న వారిని యెహోవా విశ్వసనీయతతో జ్ఞాపకముంచుకొని పునరుత్థానం చేస్తాడు

19 ఆ తీర్పు సందేశాన్ని ప్రకటించేటప్పుడు ఆ దేవదూత యెహోవాను “విశ్వసనీయుడా” అని సూచించడాన్ని గమనించండి. ఎందుకు? ఎందుకంటే దుష్టులను నాశనం చేయడం ద్వారా యెహోవా తన సేవకులపట్ల విశ్వసనీయతను ప్రదర్శిస్తున్నాడు, వారిలో చాలామంది చనిపోయేంతగా హింసించబడ్డారు. విశ్వసనీయంగా యెహోవా అలాంటి వారిని సజీవంగా తన జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. చనిపోయిన ఈ నమ్మకస్థులను మళ్ళీ చూడాలని ఆయన ఇష్టపడతాడు, వారిని పునరుత్థానం చేయడం ద్వారా వారికి ప్రతిఫలమివ్వాలన్నది ఆయన సంకల్పమని బైబిలు స్థిరంగా చెబుతోంది. (యోబు 14:14, 15) విశ్వసనీయులైన తన సేవకులు జీవించిలేనంత మాత్రాన ఆయన వారిని మరచిపోడు. బదులుగా, ‘ఆయన దృష్టికి వారందరు జీవిస్తున్నారు.’ (లూకా 20:37, 38) తన జ్ఞాపకమందున్న వారిని తిరిగి సజీవులను చేయాలన్న యెహోవా సంకల్పం ఆయన విశ్వసనీయతకు బలమైన రుజువు.

బెర్నార్డ్‌ లూమెస్‌ను (పైన), వుల్ఫ్‌గాంగ్‌ కుస్సేరోను (మధ్య) నాజీలు హత్యచేశారు

మోసెస్‌ న్యాముస్సావ్‌ను ఒక రాజకీయ ముఠా బరిశెలతో పొడిచి చంపారు

యెహోవా విశ్వసనీయ ప్రేమ రక్షణ మార్గాన్ని తెరుస్తుంది

20.“కరుణాపాత్ర ఘటములు” ఎవరు, యెహోవా వారిపట్ల విశ్వసనీయతను ఎలా చూపించాడు?

20 చరిత్రంతటిలో నమ్మకమైన మానవులపట్ల యెహోవా గమనించదగిన విశ్వసనీయతను ప్రదర్శించాడు. నిజానికి, యెహోవా వేలాది సంవత్సరాల పాటు ‘నాశనమునకు సిద్ధపడిన ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించాడు.’ ఎందుకు? ‘మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములయెడల తన మహిమైశ్వర్యము కనుపరచడానికే.’ (రోమీయులు 9:22, 23) ఈ “కరుణాపాత్ర ఘటములు” క్రీస్తుతోపాటు ఆయన రాజ్యములో తోడివారసులుగా ఉండేందుకు పరిశుద్ధాత్మచే అభిషేకించబడిన, సరైన మానసిక వైఖరిగలవారే. (మత్తయి 19:28) ఈ కరుణాపాత్ర ఘటములకు రక్షణ మార్గం తెరవడం ద్వారా యెహోవా, “నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును” అని తాను నిబంధనా ప్రమాణంచేసిన అబ్రాహాముపట్ల విశ్వసనీయంగా నిలిచాడు.—ఆదికాండము 22:18.

యెహోవా విశ్వసనీయత కారణంగానే ఆయన నమ్మకమైన సేవకులందరికీ నమ్మదగిన భవిష్యత్‌ నిరీక్షణ ఉంది

21.(ఎ)“మహాశ్రమలు” దాటి పరదైసు భూమిపై నిత్యం జీవించే ఉత్తరాపేక్షగల “గొప్పసమూహము” పట్ల యెహోవా విశ్వసనీయతను ఎలా చూపిస్తున్నాడు? (బి) యెహోవా విశ్వసనీయత ఏమి చేయడానికి మిమ్మల్ని పురికొల్పుతుంది?

21 యెహోవా అదే విధమైన విశ్వసనీయతను, “మహాశ్రమలు” దాటి పరదైసు భూమిపై నిత్యం జీవించే ఉత్తరాపేక్షగల “గొప్పసమూహము” పట్ల చూపిస్తాడు. (ప్రకటన 7:9, 10, 14) తన సేవకులు అపరిపూర్ణులైనప్పటికీ, యెహోవా విశ్వసనీయంగా పరదైసు భూమిపై నిత్యం జీవించే అవకాశాన్ని వారికిస్తున్నాడు. ఆయన ఆ అవకాశాన్ని ఎలా ఇస్తాడు? యెహోవా విశ్వసనీయతను మహాగొప్పగా ప్రదర్శించిన విమోచన క్రయధనం ద్వారానే. (యోహాను 3:16; రోమీయులు 5:8) తమ హృదయాల్లో నీతికొరకు ఆకలిగొన్నవారిని యెహోవా విశ్వసనీయత ఆకర్షిస్తుంది. (యిర్మీయా 31:3) యెహోవా ఇంత వరకు చూపిన, ఇంకనూ చూపబోయే ప్రగాఢ విశ్వాస్యతను బట్టి ఆయనకు సన్నిహితమైనట్లు మీరు భావించడం లేదా? దేవునికి సన్నిహితం కావాలనేదే మన కోరిక కాబట్టి విశ్వసనీయంగా ఆయన సేవ చేయాలనే మన తీర్మానాన్ని బలపరచుకోవడం ద్వారా మనమాయన ప్రేమకు ప్రతిస్పందిద్దాం.

^ ఆసక్తిదాయకంగా, నూతనలోక అనువాదము (ఆంగ్లం)లో, 2 సమూయేలు 22:26​లో ‘విశ్వసనీయత’ అని అనువదించబడిన మాట మరోచోట ‘ప్రేమపూర్వక దయ’ లేదా ‘విశ్వసనీయ ప్రేమ’ అని అనువదించబడింది.