కీర్తనలు 37:1-40

 • యెహోవా మీద నమ్మకముంచేవాళ్లు వర్ధిల్లుతారు

  • చెడ్డవాళ్లను చూసి బాధపడకు (1)

  • “యెహోవాను బట్టి అధికంగా సంతోషించు” (4)

  • “నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు” (5)

  • “సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు” (11)

  • నీతిమంతులు భిక్షమెత్తరు (25)

  • నీతిమంతులు భూమ్మీద శాశ్వతంగా జీవిస్తారు (29)

దావీదు కీర్తన. א [ఆలెఫ్‌] 37  చెడ్డవాళ్లను చూసి బాధపడకు,*తప్పుచేసేవాళ్లను చూసి ఈర్ష్యపడకు.+   వాళ్లు గడ్డిలా త్వరగా ఎండిపోతారు,+పచ్చగడ్డిలా వాడిపోతారు. ב [బేత్‌]   యెహోవా మీద నమ్మకముంచి మంచి చేయి;+భూమ్మీద* నివసిస్తూ నమ్మకంగా ప్రవర్తించు.+   యెహోవాను బట్టి అధికంగా సంతోషించు,అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు. ג [గీమెల్‌]   నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు;+ఆయన మీద ఆధారపడు, అప్పుడు ఆయన నీ తరఫున చర్య తీసుకుంటాడు.+   ఆయన నీ నీతిని ఉదయకాల వెలుగులా,నీ న్యాయాన్ని మిట్టమధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తాడు. ד [దాలెత్‌]   యెహోవా ఎదుట మౌనంగా ఉండి,+ఆయన కోసం ఓపిగ్గా* ఎదురుచూడు. తన పన్నాగాల్ని అమలు చేయడంలోసఫలమయ్యే మనిషిని చూసి బాధపడకు.+ ה [హే]   కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు;+కోపం తెచ్చుకొని చెడు చేయాలనుకోకు.*   ఎందుకంటే, చెడ్డవాళ్లు నాశనమౌతారు,+కానీ యెహోవా కోసం కనిపెట్టుకునేవాళ్లు భూమిని స్వాధీనం చేసుకుంటారు.+ ו [వావ్‌] 10  కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు;+ఒకప్పుడు వాళ్లు ఉన్న స్థలాన్ని నువ్వు వెదికినావాళ్లు కనిపించరు.+ 11  అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు,+వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.+ ז [జాయిన్‌] 12  దుష్టుడు నీతిమంతుల మీద పన్నాగాలు పన్నుతాడు;+వాళ్లను చూసి పళ్లు కొరుకుతాడు. 13  కానీ యెహోవా అతన్ని చూసి నవ్వుతాడు,ఎందుకంటే అతను నాశనమౌతాడని ఆయనకు తెలుసు.+ ח [హేత్‌] 14  అణచివేయబడినవాళ్లను, పేదవాళ్లను పడగొట్టడానికి,నిజాయితీగా నడుచుకునేవాళ్లను చంపడానికిదుష్టులు తమ కత్తులు దూస్తారు, తమ విల్లులు ఎక్కుపెడతారు. 15  కానీ వాళ్ల కత్తి వాళ్ల గుండెలోకే దూసుకెళ్తుంది;+వాళ్ల విల్లులు విరగ్గొట్టబడతాయి. ט [తేత్‌] 16  చాలామంది దుష్టుల దగ్గరున్న సమృద్ధి కన్నానీతిమంతుల దగ్గరున్న కొంచెమే శ్రేష్ఠమైనది.+ 17  ఎందుకంటే, దుష్టుల చేతులు విరగ్గొట్టబడతాయి,అయితే నీతిమంతుల్ని యెహోవా ఆదుకుంటాడు. י [యోద్‌] 18  నిర్దోషులు* ఏమేం ఎదుర్కొంటున్నారో* యెహోవాకు తెలుసు,వాళ్ల స్వాస్థ్యం నిరంతరం ఉంటుంది.+ 19  విపత్తు సమయంలో వాళ్లు అవమానించబడరు;కరువు సమయంలో వాళ్ల దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది. כ [కఫ్‌] 20  కానీ దుష్టులు నాశనమౌతారు;+యెహోవా శత్రువులు పచ్చికబయళ్ల సొగసులా కనుమరుగైపోతారు;వాళ్లు పొగలా మాయమైపోతారు. ל [లామెద్‌] 21  దుష్టుడు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వడు,కానీ నీతిమంతుడు ఉదారంగా ఇస్తాడు,* కనికరం చూపిస్తాడు.+ 22  దేవుడు ఆశీర్వదించినవాళ్లు భూమిని స్వాధీనం చేసుకుంటారు,ఆయన శపించినవాళ్లు నాశనమౌతారు.+ מ [మేమ్‌] 23  యెహోవా ఒక మనిషి మార్గాన్ని చూసి సంతోషించినప్పుడు,+ఆయన అతని అడుగుల్ని నిర్దేశిస్తాడు.*+ 24  అతను తొట్రిల్లినా కింద పడిపోడు,+ఎందుకంటే యెహోవా తన చేతితో అతన్ని ఆదుకుంటాడు.+ נ [నూన్‌] 25  ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి,అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం+ గానీ,అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం గానీ నేను చూడలేదు.+ 26  అతను ఎప్పుడూ ఉదారంగా అప్పు ఇస్తాడు,+అతని పిల్లలు దీవెనలు పొందుతారు. ס [సామెఖ్‌] 27  చెడు చేయడం మానేసి, మంచి చేయి,+అప్పుడు నువ్వు భూమ్మీద శాశ్వతంగా జీవిస్తావు. 28  ఎందుకంటే, యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు,ఆయన తన విశ్వసనీయుల్ని విడిచిపెట్టడు.+ ע [అయిన్‌] వాళ్లు ఎప్పటికీ కాపాడబడతారు,+కానీ దుష్టుల సంతానం నాశనమౌతుంది.+ 29  నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు,+వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.+ פ [పే] 30  నీతిమంతుని నోరు తెలివిని బోధిస్తుంది,*అతని నాలుక న్యాయం గురించి మాట్లాడుతుంది.+ 31  అతని దేవుని ధర్మశాస్త్రం అతని హృదయంలో ఉంటుంది;+అతని అడుగులు తడబడవు.+ צ [సాదె] 32  దుష్టుడు నీతిమంతుణ్ణి చంపాలనిఅతన్ని గమనిస్తూ ఉంటాడు. 33  అయితే యెహోవా అతన్ని దుష్టుని చేతికి అప్పగించడు,+తీర్పు తీర్చేటప్పుడు అతన్ని అపరాధిగా ఎంచడు.+ ק [ఖొఫ్‌] 34  యెహోవా కోసం కనిపెట్టుకొని ఉంటూ ఆయన మార్గాన్ని అనుసరించు,అప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నువ్వు భూమిని స్వాధీనం చేసుకుంటావు, దుష్టులు నాశనమైనప్పుడు+ నువ్వు చూస్తావు.+ ר [రేష్‌] 35  నేను క్రూరుడైన చెడ్డవాణ్ణి చూశాను,తన నేలలో పెరిగే పచ్చని చెట్టులా అతను పెరుగుతాడు.+ 36  కానీ అతను ఉన్నట్టుండి చనిపోయి లేకుండా పోయాడు;+నేను అతని కోసం వెతికాను కానీ అతను కనబడలేదు.+ ש [షీన్‌] 37  నిందలేనివాణ్ణి* గమనించు,నిజాయితీపరుణ్ణి+ చూస్తూ ఉండు,ఎందుకంటే, అతని భవిష్యత్తు నెమ్మదిగా ఉంటుంది.+ 38  అయితే అపరాధులందరూ నాశనం చేయబడతారు;దుష్టులకు భవిష్యత్తే ఉండదు.+ ת [తౌ] 39  నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది;+కష్ట సమయంలో ఆయనే వాళ్ల కోట.+ 40  యెహోవాయే వాళ్లకు సహాయం చేసి, వాళ్లను రక్షిస్తాడు.+ఆయన దుష్టుల నుండి వాళ్లను రక్షించి, కాపాడతాడు. ఎందుకంటే, వాళ్లు ఆయన్ని ఆశ్రయించారు.+

అధస్సూచీలు

లేదా “కోపగించుకోకు.”
లేదా “దేశంలో.”
లేదా “ఆశగా.”
లేదా “కోప్పడకు, ఎందుకంటే అది కీడుకే దారితీస్తుంది” అయ్యుంటుంది.
అక్ష., “నిర్దోషుల రోజులు.”
లేదా “నిందలేని వాళ్లు.”
లేదా “అనుగ్రహం చూపిస్తాడు.”
లేదా “స్థిరపరుస్తాడు.”
లేదా “చిన్న స్వరంతో తెలివిని పలుకుతుంది.”
లేదా “యథార్థవంతుణ్ణి.”