యెషయా 49:1-26

  • యెహోవా సేవకుడి నియామకం (1-12)

    • దేశాలకు వెలుగు (6)

  • ఇశ్రాయేలుకు ఓదార్పు (13-26)

49  ద్వీపాల్లారా, నా మాట వినండి,సుదూర దేశాల్లారా,+ శ్రద్ధగా ఆలకించండి, నేను పుట్టకముందే* యెహోవా నన్ను పిలిచాడు.+ నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నా పేరును ప్రస్తావించాడు.   ఆయన నా నోటిని పదునైన ఖడ్గంలా చేశాడు;తన చేతి నీడలో నన్ను దాచివుంచాడు.+ ఆయన నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేశాడు;తన అంబులపొదిలో నన్ను దాచాడు.   ఆయన నాతో, “ఇశ్రాయేలూ, నువ్వు నా సేవకుడివి,+నీ ద్వారా నేను నా వైభవాన్ని కనబరుస్తాను”+ అన్నాడు.   కానీ నేనిలా అన్నాను: “నేను వృథాగా ప్రయాసపడ్డాను. బూటకమైన దాని కోసం నా బలాన్ని వ్యర్థంగా ఉపయోగించాను. అయితే ఖచ్చితంగా యెహోవా నాకు న్యాయం తీరుస్తాడు,నా దేవుడే నాకు జీతాన్ని* ఇస్తాడు.”+   నేను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నన్ను తన సేవకునిగా నిర్మించిన యెహోవాఇశ్రాయేలు తన దగ్గరికి చేర్చబడేలాయాకోబును తన దగ్గరికి తిరిగి తీసుకురమ్మని ఇప్పుడు నాకు చెప్పాడు.+ నేను యెహోవా దృష్టిలో మహిమపర్చబడతాను,నా దేవుడే నా బలం అవుతాడు.   ఆయనిలా అన్నాడు: “యాకోబు గోత్రాల్ని ఉద్ధరించి,ఇశ్రాయేలులో కాపాడబడిన వాళ్లను తిరిగి తీసుకొచ్చేలానేను నిన్ను నా సేవకునిగా మాత్రమే నియమించలేదు. నా రక్షణ భూమి అంచుల వరకు చేరుకునేలా+దేశాలకు వెలుగుగా కూడా నిన్ను ఇచ్చాను.”+  తృణీకరించబడిన,+ దేశం అసహ్యించుకున్న, పరిపాలకులకు సేవకునిగా ఉన్న వానితో ఇశ్రాయేలు విమోచకుడూ అతని పవిత్ర దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నిన్ను ఎంచుకున్న+ నమ్మకమైన దేవుడూ,+ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ అయిన యెహోవాను బట్టి,రాజులు చూసి, లేచి నిలబడతారు,అధిపతులు వంగి నమస్కారం చేస్తారు.”   యెహోవా ఇలా అంటున్నాడు: “అనుకూల సమయంలో* నేను నీకు జవాబిచ్చాను,+రక్షణ రోజున నేను నీకు సహాయం చేశాను;+నిన్ను ప్రజలకు ఒక ఒప్పందంగా ఇవ్వడానికి,దేశాన్ని తిరిగి నివాసయోగ్యంగా మార్చడానికి,నిర్మానుష్యమైన తమ స్వాస్థ్యాలను వాళ్లు తిరిగి పొందేలా చేయడానికి+నేను నిన్ను కాపాడుతూ వచ్చాను.+   నువ్వు, ‘బయటికి రండి!’ అని ఖైదీలతో,+ ‘బయటికి వచ్చి కనబడండి!’ అని చీకట్లో ఉన్నవాళ్లతో+ చెప్పడానికి అలా కాపాడుతూ వచ్చాను. వాళ్లు దారుల వెంబడి భోజనం చేస్తారు,పాతబడిన దారులన్నిట్లో* వాళ్ల పచ్చికబయళ్లు ఉంటాయి. 10  వాళ్లు ఆకలిదప్పులతో అలమటించరు,+మండుటెండ వాళ్లను బాధించదు, వాళ్లకు వడదెబ్బ తగలదు.+ ఎందుకంటే, వాళ్లమీద కరుణ చూపించే దేవుడు వాళ్లను నడిపిస్తాడు,+నీటి ఊటల దగ్గర వాళ్లను నడిపిస్తాడు.+ 11  నేను నా పర్వతాలన్నిటినీ దారిగా మారుస్తాను,నా రహదారులు ఎత్తు చేయబడతాయి.+ 12  చూడండి! వీళ్లు చాలా దూరం నుండి వస్తున్నారు,+ఇదిగో! వీళ్లు ఉత్తరం నుండి, పడమర నుండి వస్తున్నారు,వీళ్లు సీనీము దేశం నుండి వస్తున్నారు.”+ 13  ఆకాశమా, సంతోషంతో కేకలు వేయి; భూమీ, ఆనందించు.+ పర్వతాలు ఆనందంతో కేకలు వేస్తూ ఉల్లసించాలి.+ ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని ఓదార్చాడు,+బాధల్లో ఉన్న తన సొంత ప్రజల మీద ఆయన కరుణ చూపిస్తాడు.+ 14  కానీ సీయోను మాత్రం, “యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు,+ యెహోవా నన్ను మర్చిపోయాడు”+ అని అంటూ ఉంది. 15  స్త్రీ, పాలుతాగే తన చంటిబిడ్డను మర్చిపోతుందా?తన కడుపున పుట్టిన బిడ్డ మీద కనికరం చూపించకుండా ఉంటుందా? వాళ్లయినా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను ఎన్నడూ మర్చిపోను.+ 16  ఇదిగో! నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను. నీ ప్రాకారాలు ఎప్పుడూ నా ముందు ఉన్నాయి. 17  నీ కుమారులు త్వరత్వరగా తిరిగొస్తున్నారు. నిన్ను పడగొట్టి, నాశనం చేసినవాళ్లు నీ దగ్గర నుండి వెళ్లిపోతారు. 18  నీ తల ఎత్తి చుట్టూ చూడు. వాళ్లంతా ఒక్కచోటికి చేరుతున్నారు.+ వాళ్లు నీ దగ్గరికి వస్తున్నారు. యెహోవా ఇలా అంటున్నాడు: “నా జీవం తోడు,ఆభరణాల్ని ధరించుకున్నట్టు నువ్వు వాళ్లందర్నీ ధరించుకుంటావు,పెళ్లికూతురిలా వాళ్లందర్నీ ఒడ్డాణంగా పెట్టుకుంటావు. 19  నీ స్థలాలు నాశనం చేయబడి నిర్మానుష్యంగా తయారైనా, నీ దేశం శిథిలాలుగా మారినా,+ఇప్పుడది దాని నివాసులకు చాలా ఇరుకుగా తయారౌతుంది,+నిన్ను మింగేసినవాళ్లు+ చాలా దూరంలో ఉంటారు.+ 20  నీకు పుత్రశోకం కలిగిన తర్వాత పుట్టిన కుమారులు నీకు వినిపించేలా ఈ మాటలు అంటారు,‘ఈ చోటు మాకు చాలా ఇరుకుగా ఉంది. మేము ఇక్కడ నివసించడానికి స్థలం ఏర్పాటు చేయి.’+ 21  నువ్వు నీ హృదయంలో ఇలా అనుకుంటావు,‘నేను పుత్రశోకం కలిగిన స్త్రీని, గొడ్రాలిని,బందీగా చెరలోకి వెళ్లినదాన్ని,నాకు ఇవ్వబడిన వీళ్లు ఎవరి పిల్లలు? వీళ్ల తండ్రి ఎవరు? వీళ్లను పెంచింది ఎవరు?+ ఇదిగో! నేను ఒంటరిగా వదిలేయబడినదాన్ని,+మరి వీళ్లు ఎక్కడి నుండి వచ్చారు?’ ”+ 22  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! దేశాలు చూసేలా నా చెయ్యి ఎత్తుతాను,జనాలకు కనిపించేలా నా ధ్వజాన్ని* నిలబెడతాను.+ వాళ్లు తమ బాహువుల* మీద నీ కుమారుల్ని,తమ భుజాల మీద నీ కూతుళ్లను మోసుకొని వస్తారు.+ 23  రాజులు నీ సంరక్షకులుగా ఉంటారు,+వాళ్ల రాణులు నీకు దాదీలు అవుతారు. వాళ్లు తమ తలలు నేలకు వంచి నీకు నమస్కారం చేస్తారు,+నీ పాదాల ధూళిని నాకుతారు,+అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు;నా మీద ఆశపెట్టుకునేవాళ్లు సిగ్గుపర్చబడరు.”+ 24  బలవంతుని చేతిలో నుండి చెరపట్టబడిన వాళ్లను విడిపించడం సాధ్యమేనా?నిరంకుశ పాలకుని కింద ఉన్న బందీలను తప్పించడం సాధ్యమేనా? 25  అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “బలవంతుని చేతిలో ఉన్న బందీలు కూడా విడిపించబడతారు.+నిరంకుశ పాలకుడు చెరపట్టినవాళ్లు తప్పించబడతారు.+ నిన్ను ఎదిరించేవాళ్లను నేను ఎదిరిస్తాను,+నీ సొంత కుమారుల్ని నేను కాపాడతాను. 26  నిన్ను బాధపెట్టినవాళ్లను తమ సొంత శరీర మాంసం తినేలా చేస్తాను,తియ్యని ద్రాక్షారసంతో మత్తిల్లినట్టు, వాళ్లు తమ సొంత రక్తంతో మత్తిల్లుతారు. నీ రక్షకుడూ,+ నీ విమోచకుడూ,+యాకోబు శక్తిమంతుడూ+ అయిన యెహోవాను నేనే అని ప్రజలందరూ తెలుసుకోవాలి.”+

అధస్సూచీలు

అక్ష., “గర్భంలో ఉన్నప్పుడే.”
లేదా “ప్రతిఫలాన్ని.”
లేదా “నేను అనుగ్రహం చూపించే సమయంలో.”
లేదా “చెట్లులేని కొండలన్నిట్లో” అయ్యుంటుంది.
లేదా “గుండెల.”
లేదా “ధ్వజస్తంభాన్ని.”