ఎస్తేరు 4:1-17

  • మొర్దెకై దుఃఖించడం (1-5)

  • మొర్దెకై ఎస్తేరును జోక్యం చేసుకోమని చెప్పడం (6-17)

4  జరిగిందంతా+ మొర్దెకైకి+ తెలిసినప్పుడు, అతను తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద చల్లుకున్నాడు. తర్వాత అతను చాలా వేదనతో గట్టిగట్టిగా ఏడుస్తూ నగరం మధ్యలోకి వెళ్లాడు. 2  అతను రాజగృహ ద్వారం వరకు మాత్రమే వెళ్లాడు, కానీ లోపలికి వెళ్లలేదు. ఎందుకంటే గోనెపట్ట కట్టుకొని ఎవ్వరూ రాజగృహ ద్వారం లోపలికి ప్రవేశించకూడదు. 3  రాజు శాసనం చాటించబడిన ప్రతీ సంస్థానంలో,+ యూదులు దుఃఖంలో మునిగిపోయారు; వాళ్లంతా ఉపవాసముంటూ,+ ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. చాలామంది గోనెపట్ట కట్టుకొని, బూడిదలో కూర్చున్నారు.+ 4  ఎస్తేరు సేవకురాళ్లు, ఆమె దగ్గర సేవ చేసే నపుంసకులు వచ్చి ఆ సంగతి గురించి చెప్పినప్పుడు రాణి ఎంతో మనోవేదనకు గురైంది. అప్పుడు ఆమె మొర్దెకై వేసుకోవడానికి బట్టలు పంపించింది, అతను గోనెపట్ట తీసేసి వాటిని వేసుకోవాలని అలా పంపింది. కానీ అతను వాటిని తీసుకోలేదు. 5  అప్పుడు ఎస్తేరు, రాజుగారి నపుంసకుల్లో ఒకడైన హతాకును పిలిచింది. అతను ఎస్తేరు దగ్గర సేవ చేయడానికి రాజు నియమించిన వ్యక్తి. ఎస్తేరు అతన్ని మొర్దెకై దగ్గరికి వెళ్లి అసలేం జరిగిందో, మొర్దెకై ఎందుకలా ఉన్నాడో తెలుసుకోమని ఆజ్ఞాపించింది. 6  కాబట్టి హతాకు నగర వీధిలో రాజగృహ ద్వారం ఎదుట ఉన్న మొర్దెకై దగ్గరికి వెళ్లాడు. 7  అప్పుడు మొర్దెకై తనకు జరిగిందంతా అతనికి చెప్పాడు, అలాగే హామాను యూదుల్ని నాశనం చేయడానికి+ రాజు ఖజానాకు సరిగ్గా ఎంత డబ్బు+ ఇస్తానని మాటిచ్చాడో కూడా చెప్పాడు. 8  అంతేకాదు, యూదుల్ని సమూలంగా నాశనం చేయడం గురించి షూషనులో* జారీ అయిన తాకీదు+ ప్రతి ఒకటి అతనికి ఇచ్చాడు. అతను దాన్ని ఎస్తేరుకు చూపించి, దాని గురించి వివరించాలి; ఆమెను రాజు దగ్గరికి వెళ్లి అతని అనుగ్రహం కోసం బ్రతిమాలమని, తన ప్రజల కోసం రాజును నేరుగా వేడుకోమని నిర్దేశించాలి.+ 9  హతాకు ఎస్తేరు దగ్గరికి తిరిగొచ్చి, మొర్దెకై మాటల్ని ఆమెకు చెప్పాడు. 10  అప్పుడు ఎస్తేరు, మొర్దెకైతో+ ఇలా చెప్పమని హతాకును పంపింది: 11  “పురుషుడే గానీ స్త్రీయే గానీ రాజు పిలవనిదే రాజగృహ లోపలి ఆవరణలోకి+ వెళ్తే ఏమౌతుందో రాజు సేవకులందరికీ, రాజు సంస్థానాల్లోని ప్రజలందరికీ తెలుసు. అలాంటప్పుడు ఒక్కటే నియమం వర్తిస్తుంది: అలా వెళ్లిన వ్యక్తిని చంపేయాలి; రాజు తన బంగారు దండాన్ని ఆ వ్యక్తి వైపు చాపితేనే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉంటాడు.+ గత 30 రోజులుగా నాకు రాజు నుండి పిలుపు అందలేదు.” 12  ఎస్తేరు పంపిన సమాచారం విన్న తర్వాత మొర్దెకై 13  ఎస్తేరుకు ఇలా జవాబిచ్చాడు: “నువ్వు రాజ కుటుంబంలో ఉన్నంతమాత్రాన మిగతా యూదులందరితో పాటు చనిపోకుండా ప్రాణాలతో బయటపడతావని అనుకోకు. 14  ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం, విడుదల మరోవైపు నుండి వస్తాయి;+ కానీ నువ్వూ నీ తండ్రి ఇంటివాళ్లూ తుడిచిపెట్టుకుపోతారు. ఎవరికి తెలుసు, బహుశా ఇలాంటి సమయం కోసమే నువ్వు రాణివయ్యావేమో!”+ 15  అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఇలా జవాబిచ్చింది: 16  “వెళ్లి, షూషనులో* ఉన్న యూదులందర్నీ సమకూర్చు, అందరూ కలిసి నా కోసం ఉపవాసం ఉండండి.+ మూడురోజుల పాటు+ పగలూరాత్రీ ఏమీ తినకండి, తాగకండి. నేను కూడా నా సేవకురాళ్లతో పాటు ఉపవాసం ఉంటాను. నేను రాజ నియమానికి వ్యతిరేకంగా రాజు సముఖంలోకి వెళ్తాను, ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే చనిపోతాను.” 17  అప్పుడు మొర్దెకై అక్కడి నుండి వెళ్లిపోయి, ఎస్తేరు తనకు నిర్దేశించిందంతా చేశాడు.

అధస్సూచీలు

లేదా “సూసలో.”
లేదా “సూసలో.”