కీర్తనలు 89:1-52

 • యెహోవా విశ్వసనీయ ప్రేమ గురించి పాడడం

  • దావీదుతో ఒప్పందం (3)

  • దావీదు సంతానం ఎప్పటికీ ఉంటుంది (4)

  • దేవుని అభిషిక్తుడు ఆయన్ని “తండ్రి” అని పిలుస్తాడు (26)

  • దావీదు ఒప్పందం ఖచ్చితమైనది (34-37)

  • మనిషి సమాధి నుండి తప్పించుకోలేడు (48)

మాస్కిల్‌.* ఎజ్రాహీయుడైన ఏతాను+ కీర్తన. 89  యెహోవా విశ్వసనీయ ప్రేమతో చేసిన మేలుల్ని నేను ఎప్పటికీ కీర్తిస్తాను. నీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.   ఎందుకంటే నేనిలా అన్నాను: “విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ నిలుస్తుంది,+నువ్వు నీ నమ్మకత్వాన్ని ఆకాశంలో బలంగా స్థాపించావు.”   నువ్విలా అన్నావు: “నేను ఎంచుకున్న వ్యక్తితో ఒక ఒప్పందం చేశాను;+నా సేవకుడైన దావీదుకు ఇలా ప్రమాణం చేశాను:+   ‘నేను నీ సంతానాన్ని*+ శాశ్వతంగా స్థిరపరుస్తాను,నీ సింహాసనం తరతరాలు నిలిచివుండేలా చేస్తాను.’ ”+ (సెలా)   యెహోవా, ఆకాశం నీ ఆశ్చర్యకార్యాల్ని స్తుతిస్తుంది,అవును, పవిత్రుల సమాజం నీ నమ్మకత్వాన్ని స్తుతిస్తుంది.   ఆకాశంలో యెహోవాకు సాటి ఎవరు?+ దేవుని కుమారుల్లో+ యెహోవా లాంటివాళ్లు ఎవరు?   పవిత్రుల సభలో* దేవుణ్ణి చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి;+తన చుట్టూ ఉన్న వాళ్లందరికీ ఆయన మహిమాన్వితుడు, భీకరుడు.+   యెహోవా, సైన్యాల దేవా,యెహోవా,* నీలాంటి శక్తిమంతుడు ఎవరు?+ నీ నమ్మకత్వం నీ చుట్టూ ఉంది.+   పోటెత్తే సముద్రాన్ని నువ్వు అదుపు చేస్తావు;+దాని అలలు ఎగసినప్పుడు నువ్వు వాటిని అణచివేస్తావు.+ 10  నువ్వు రాహాబును*+ పూర్తిగా ఓడించి, చంపేశావు.+ నీ బలమైన బాహువుతో నీ శత్రువుల్ని చెదరగొట్టావు.+ 11  ఆకాశం నీదే, భూమి నీదే;+పండే భూమిని, దానిలోని ప్రతీదాన్ని+ నువ్వే చేశావు. 12  ఉత్తర, దక్షిణ దిక్కుల్ని నువ్వే సృష్టించావు;తాబోరు,+ హెర్మోను పర్వతాలు+ ఆనందంతో నీ పేరును స్తుతిస్తున్నాయి. 13  నీ బాహువు శక్తివంతమైనది;+నీ చెయ్యి బలమైనది;+నీ కుడిచెయ్యి హెచ్చించబడింది.+ 14  నీతిన్యాయాలు నీ సింహాసనానికి పునాదులు;+విశ్వసనీయ ప్రేమ, నమ్మకత్వం నీ ముందు నిలబడివున్నాయి.+ 15  సంతోష స్వరంతో నిన్ను స్తుతించే ప్రజలు ధన్యులు.*+ యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్లు నడుస్తారు. 16  నీ పేరును బట్టి వాళ్లు రోజంతా ఆనందిస్తారు,నీ నీతి వల్ల హెచ్చించబడతారు. 17  నువ్వే వాళ్ల మహిమవు, బలానివి,+నీ ఆమోదం వల్లే మా బలం* హెచ్చించబడుతోంది.+ 18  ఎందుకంటే, మా డాలు యెహోవాకు చెందినది,మా రాజు ఇశ్రాయేలు పవిత్ర దేవునికి చెందినవాడు.+ 19  అప్పుడు నువ్వు ఒక దర్శనంలో నీ విశ్వసనీయులతో ఇలా అన్నావు: “నేను ఒక శక్తిమంతునికి బలాన్ని ఇచ్చాను;+ప్రజల్లో నుండి ఎంచుకున్న ఒక వ్యక్తిని హెచ్చించాను.+ 20  నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను;+నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.+ 21  నా చెయ్యి అతనికి అండగా ఉంటుంది,+నా బాహువు అతన్ని బలపరుస్తుంది. 22  ఏ శత్రువూ అతని నుండి కప్పం వసూలు చేయడు,ఏ దుష్టుడూ అతన్ని అణచివేయడు.+ 23  అతని శత్రువుల్ని అతని ముందు నలగ్గొట్టి ముక్కలుముక్కలు చేస్తాను,+అతన్ని ద్వేషించేవాళ్లను చంపేస్తాను.+ 24  నా నమ్మకత్వం, విశ్వసనీయ ప్రేమ అతనికి తోడుగా ఉన్నాయి,+నా పేరును బట్టి అతని బలం* హెచ్చించబడుతుంది. 25  నేను సముద్రం మీద అతని చేతిని,*నదుల మీద అతని కుడిచేతిని ఉంచుతాను.+ 26  అతను, ‘నువ్వే నా తండ్రివి,నా దేవుడివి, నన్ను రక్షించే ఆశ్రయదుర్గానివి’*+ అంటూ నాకు ప్రార్థిస్తాడు. 27  నేను అతన్ని పెద్ద కుమారునిగా,+భూరాజులందరిలో అత్యున్నతునిగా చేస్తాను.+ 28  నేను నిరంతరం అతని మీద నా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను,+నేను అతనితో చేసిన ఒప్పందం ఎప్పటికీ రద్దు కాదు.+ 29  నేను అతని సంతానాన్ని* శాశ్వతంగా స్థిరపరుస్తాను,అతని సింహాసనం ఆకాశంలా ఎప్పటికీ ఉండేలా చేస్తాను.+ 30  ఒకవేళ అతని కుమారులు నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి,నా ఆదేశాల* ప్రకారం నడుచుకోకపోతే, 31  నా శాసనాలు మీరి,నా ఆజ్ఞలు పాటించకపోతే, 32  దండంతో వాళ్ల అవిధేయతను,*కొరడాతో వాళ్ల తప్పును శిక్షిస్తాను.+ 33  కానీ అతని మీద నాకున్న విశ్వసనీయ ప్రేమను ఎప్పటికీ విడిచిపెట్టను,+ఇచ్చిన మాట తప్పను.* 34  నా ఒప్పందాన్ని మీరను,+నా పెదాలు పలికిన మాటను మార్చను.+ 35  నా పవిత్రత తోడని నేను దావీదుతో ఒక్కసారి ప్రమాణం చేశాను;నేను అతనితో అబద్ధమాడను.+ 36  అతని సంతానం* శాశ్వతంగా నిలిచివుంటుంది;+అతని సింహాసనం సూర్యునిలా ఎప్పటికీ నా ముందు నిలిచివుంటుంది.+ 37  ఆకాశంలో నమ్మకమైన సాక్షిగా ఉన్న చంద్రునిలా,అతని సింహాసనం శాశ్వతంగా స్థిరపర్చబడుతుంది.” (సెలా) 38  కానీ నువ్వే అతన్ని విడిచిపెట్టావు, అతన్ని తిరస్కరించావు;+నీ అభిషిక్తుని మీద చాలా కోపగించుకున్నావు. 39  నువ్వు నీ సేవకునితో చేసిన ఒప్పందాన్ని అసహ్యించుకున్నావు;అతని కిరీటాన్ని నేల మీద పారేసి దాన్ని అపవిత్రపర్చావు. 40  అతని రాతి గోడలన్నిటినీ* కూలగొట్టావు;అతని ప్రాకారాల్ని శిథిలాలుగా మార్చావు. 41  దారినపోయే వాళ్లందరూ అతన్ని దోచుకున్నారు;అతని పొరుగువాళ్లు అతన్ని నిందిస్తున్నారు.+ 42  నువ్వు అతని విరోధులకు విజయాన్ని ఇచ్చావు;*+అతని శత్రువులందరూ సంతోషించేలా చేశావు. 43  నువ్వు అతని ఖడ్గానికి విరోధివయ్యావు,అతను యుద్ధంలో గెలవకుండా చేశావు. 44  అతని వైభవాన్ని ముగింపుకు తెచ్చావు,అతని సింహాసనాన్ని నేలమీద పడేశావు. 45  అతని యౌవన రోజుల్ని తగ్గించావు;అవమానాన్ని అతనికి బట్టల్లా ధరింపజేశావు. (సెలా) 46  యెహోవా, ఎంతకాలం ఇలా కనబడకుండా ఉంటావు? ఎప్పటికీనా?+ నీ కోపం అగ్నిలా మండుతూనే ఉంటుందా? 47  నా జీవితం ఎంత చిన్నదో గుర్తుచేసుకో!+ నువ్వు ఏ సంకల్పం లేకుండా మనుషుల్ని సృష్టించావా? 48  మరణాన్ని చూడకుండా ఎప్పుడూ బ్రతికుండే మనిషి ఎవరైనా ఉన్నారా?+ సమాధి* శక్తి* నుండి అతను తన ప్రాణాన్ని కాపాడుకోగలడా? (సెలా) 49  యెహోవా, నువ్వు ఒకప్పుడు విశ్వసనీయ ప్రేమతో చేసిన పనులు ఎక్కడ?నీ నమ్మకత్వం తోడని దావీదుకు ప్రమాణం చేసిన పనులు ఎక్కడ?+ 50  యెహోవా, నీ సేవకుల మీద పడ్డ నిందల్ని గుర్తుచేసుకో;దేశదేశాల ప్రజలందరి నిందల్ని నేనెలా మోయాల్సి వస్తోందో గుర్తుచేసుకో; 51  యెహోవా, నీ శత్రువులు ఎలా అవమానించారో,నీ అభిషిక్తుడు వేసిన ప్రతీ అడుగును వాళ్లెలా అవమానించారో గుర్తుచేసుకో. 52  యెహోవా సదాకాలం స్తుతించబడాలి. ఆమేన్‌, ఆమేన్‌.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అక్ష., “విత్తనాన్ని.”
లేదా “సమాజంలో.”
అక్ష., “యా.” ఇది యెహోవా పేరుకు సంక్షిప్త రూపం.
ఐగుప్తును లేదా దాని ఫరోను సూచిస్తుండవచ్చు.
లేదా “సంతోషంగా ఉంటారు.”
అక్ష., “కొమ్ము.”
అక్ష., “కొమ్ము.”
లేదా “అధికారాన్ని.”
అక్ష., “బండరాయివి.”
అక్ష., “విత్తనాన్ని.”
లేదా “న్యాయనిర్ణయాల.”
లేదా “తిరుగుబాటును.”
అక్ష., “నా నమ్మకత్వాన్ని వమ్ముచేయను.”
అక్ష., “విత్తనం.”
లేదా “రాతి ఆశ్రయాలన్నిటినీ.”
అక్ష., “విరోధుల కుడిచేతిని పైకెత్తావు.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “చేతి.”