యోహానుకు ఇచ్చిన ప్రకటన 21:1-27

  • ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి (1-8)

    • మరణం ఇక ఉండదు (4)

    • అన్నిటినీ కొత్తవిగా చేయడం (5)

  • కొత్త యెరూషలేము వర్ణన (9-27)

21  అప్పుడు నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని చూశాను.+ ఎందుకంటే ముందున్న ఆకాశం, భూమి గతించిపోయాయి;+ సముద్రం ఇక లేదు.  అంతేకాదు, పవిత్ర నగరమైన కొత్త యెరూషలేము, కాబోయే భర్త కోసం అలంకరించబడిన పెళ్లికూతురిలా+ పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగిరావడం+ నేను చూశాను.  అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక పెద్ద స్వరం ఇలా చెప్పడం నేను విన్నాను: “ఇదిగో! దేవుని నివాసం* మనుషులతో ఉంది. ఆయన వాళ్లతో పాటు నివసిస్తాడు. వాళ్లు ఆయన ప్రజలుగా ఉంటారు. దేవుడే స్వయంగా వాళ్లతోపాటు ఉంటాడు.+  వాళ్ల కళ్లలో నుండి కారే ప్రతీ కన్నీటి బొట్టును ఆయన తుడిచేస్తాడు.+ మరణం ఇక ఉండదు,+ దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.+ అంతకుముందున్న విషయాలు గతించిపోయాయి.”  అప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇదిగో! నేను అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను.”+ ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఈ మాటలు నమ్మదగినవి,* సత్యమైనవి కాబట్టి రాయి.”  ఆయన నాతో ఇలా అన్నాడు: “అవి నెరవేరాయి! నేనే ఆల్ఫాను, ఓమెగను.* నేనే ఆరంభాన్ని, ముగింపును.+ ఎవరికైనా దాహంగా ఉంటే, వాళ్లకు నేను జీవజలాల ఊట* నుండి ఉచితంగా నీళ్లు ఇస్తాను.+  జయించే ప్రతీ వ్యక్తి వీటిని పొందుతాడు.* నేను అతనికి దేవునిగా ఉంటాను, అతను నాకు కుమారుడిగా ఉంటాడు.  అయితే పిరికివాళ్లు, విశ్వాసం లేనివాళ్లు,+ అసహ్యమైన పనులు చేసే అపవిత్రులు, హంతకులు,+ లైంగిక పాపం* చేసేవాళ్లు,+ మంత్రతంత్రాలు చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, అబద్ధాలకోరులందరూ+ అగ్నిగంధకాలతో మండుతున్న సరస్సులో పడేయబడతారు.+ ఇది రెండో మరణాన్ని సూచిస్తుంది.”+  చివరి ఏడు తెగుళ్లతో+ నిండిన ఏడు గిన్నెలు పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒక దేవదూత వచ్చి నాతో ఇలా అన్నాడు: “రా, గొర్రెపిల్లకు భార్య కాబోయే పెళ్లికూతుర్ని+ నీకు చూపిస్తాను.” 10  అతను పవిత్రశక్తి ద్వారా నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతానికి తీసుకెళ్లాడు. అతను, పవిత్ర నగరమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగిరావడం+ నాకు చూపించాడు. 11  దానికి దేవుని మహిమ ఉంది.+ అది ఎంతో అమూల్యమైన రాయిలా, స్ఫటికమంత స్పష్టంగా మెరిసే సూర్యకాంతపు రాయిలా ప్రకాశిస్తోంది.+ 12  ఆ నగరానికి ఎత్తైన పెద్ద ప్రాకారం, 12 గుమ్మాలు ఉన్నాయి. ఆ గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉన్నారు. ఆ గుమ్మాల మీద ఇశ్రాయేలీయుల 12 గోత్రాల పేర్లు చెక్కబడి ఉన్నాయి. 13  తూర్పు వైపు మూడు గుమ్మాలు, ఉత్తరం వైపు మూడు గుమ్మాలు, దక్షిణం వైపు మూడు గుమ్మాలు, పడమటి వైపు మూడు గుమ్మాలు ఉన్నాయి.+ 14  ఆ నగర ప్రాకారానికి 12 పునాదిరాళ్లు కూడా ఉన్నాయి. వాటిమీద గొర్రెపిల్ల 12 మంది అపొస్తలుల 12 పేర్లు+ ఉన్నాయి. 15  నాతో మాట్లాడుతున్న దేవదూత ఆ నగరాన్ని, దాని గుమ్మాల్ని, ప్రాకారాన్ని కొలవడానికి పొడవైన బంగారు కొలకర్ర చేతితో పట్టుకొని ఉన్నాడు.+ 16  ఆ నగరం చతురస్రాకారంలో ఉంది; దాని పొడవు, వెడల్పు సమానం. అతను ఆ కొలకర్రతో నగరాన్ని కొలిచినప్పుడు అది దాదాపు 2,220 కిలోమీటర్లు* ఉంది. దాని పొడవు, వెడల్పు, ఎత్తు అన్నీ సమానంగా ఉన్నాయి. 17  అతను ఆ నగర ప్రాకారాన్ని కూడా కొలిచాడు. మనిషి కొలత ప్రకారం అది 144 మూరలు* ఉంది. దేవదూత కొలత ప్రకారం కూడా అంతే ఉంది. 18  ఆ ప్రాకారం సూర్యకాంతపు రాయితో చేయబడింది;+ ఆ నగరం స్పష్టమైన గాజు లాంటి స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. 19  ఆ నగర ప్రాకారం పునాదులు అన్నిరకాల అమూల్యమైన రాళ్లతో అలంకరించబడి ఉన్నాయి: మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండో పునాది నీలం రాయి, మూడో పునాది యమునారాయి, నాలుగో పునాది మరకతం, 20  ఐదో పునాది వైడూర్యం, ఆరో పునాది కెంపు, ఏడో పునాది లేతపచ్చ రాయి, ఎనిమిదో పునాది గోమేధికం, తొమ్మిదో పునాది పుష్యరాగం, పదో పునాది సువర్ణ సునీయం, పదకొండో పునాది పద్మరాగం, పన్నెండో పునాది ఊదారంగు రాయి. 21  అంతేకాదు, దాని 12 గుమ్మాలు 12 ముత్యాలు. ఒక్కో గుమ్మం ఒక ముత్యంతో చేయబడింది. ఆ నగర ముఖ్యవీధి పారదర్శక గాజు లాంటి స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది. 22  ఆ నగరంలో నాకు ఆలయం కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన యెహోవా* దేవుడే+ దాని ఆలయం, అలాగే గొర్రెపిల్ల కూడా. 23  ఆ నగరం మీద సూర్యుడు గానీ చంద్రుడు గానీ ప్రకాశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని మహిమ దాన్ని ప్రకాశింపజేసింది.+ గొర్రెపిల్లే దానికి దీపం.+ 24  ఆ నగరం వెలుగులో దేశాలు నడుస్తాయి.+ భూమ్మీది రాజులు తమ మహిమను దానిలోకి తీసుకొస్తారు. 25  పగలు దాని గుమ్మాలు అస్సలు మూయబడవు. ఎందుకంటే అక్కడ రాత్రి అనేదే ఉండదు.+ 26  దేశాల మహిమను, ఘనతను వాళ్లు దానిలోకి తీసుకొస్తారు.+ 27  అయితే అపవిత్రమైనది ఏదీ, అసహ్యమైన-మోసకరమైన పనులుచేసే వాళ్లెవ్వరూ ఏ విధంగానూ దానిలో ప్రవేశించరు.+ గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లయితే రాయబడ్డాయో వాళ్లు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.+

అధస్సూచీలు

అక్ష., “డేరా.”
లేదా “నమ్మకమైనవి.”
ఆల్ఫా, ఓమెగ అనేవి గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు.
లేదా “బుగ్గ.”
అక్ష., “స్వాస్థ్యంగా పొందుతాడు.”
పదకోశం చూడండి.
అక్ష., “12,000 స్టేడియా.” అప్పట్లో ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం. అనుబంధం B14 చూడండి.
దాదాపు 64 మీటర్లు (210 అడుగులు). అనుబంధం B14 చూడండి.
అనుబంధం A5 చూడండి.