కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

కొన్నిసార్లు “ఎందుకు?” అనే ప్రశ్న అడిగే వ్యక్తి ఓదార్పుతోపాటు జవాబుల కోసం కూడా ప్రయత్నిస్తాడు, ఎందుకంటే తీవ్రంగా నష్టపోయిన తర్వాత వ్యక్తులు ఆ ప్రశ్న అడిగారంటే వారికి ఓదార్పు ఎంతో అవసరమని అర్థం. అలాంటి ఓదార్పు బైబిలు ఇస్తుందా? దీనికి సంబంధించిన మూడు ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలను పరిశీలించండి.

మొదటిగా, దేవుడు బాధలను ఎందుకు అనుమతించాడు అని అడగడం తప్పుకాదు. అలాంటి ప్రశ్న అడగడం దేవునిపట్ల విశ్వాసలేమిని లేక అగౌరవాన్ని కనబరిచినట్లు అవుతుందని కొందరు కలవరపడతారు. అయితే, గౌరవనీయులైన అనేకమంది నిజాయితీగా ఆ ప్రశ్న అడిగారు. నమ్మకస్థుడైన హబక్కూకు ప్రవక్త దేవుణ్ణి ఇలా అడిగాడు: “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.” (హబక్కూకు 1:3) ఆ ప్రశ్న అడిగినందుకు యెహోవా దేవుడు హబక్కూకును మందలించలేదు. బదులుగా, ఆ నమ్మకస్థుని ప్రశ్నలను మనమందరం చదివేలా ఆయన వాటిని వ్రాతపూర్వకంగా భద్రపరిచాడు.​—రోమీయులు 15:4.

రెండవదిగా, కష్టాలను అనుభవిస్తున్నవారిపట్ల దేవునికి జాలి ఉందని గ్రహించడం ప్రాముఖ్యం. ఆయన దూరంగా ఉన్న రహస్యమైన వ్యక్తి కాదు, ఆయన “న్యాయమును ప్రేమించువాడు” ఆయన దుష్టత్వాన్ని, అది కలుగజేసే బాధను అసహ్యించుకుంటాడు. (కీర్తన 37:​28; సామెతలు 6:​16-19) నోవహు దినాల్లో, భూమ్మీద వ్యాపిస్తున్న హింసనుబట్టి దేవుడు “హృదయములో నొచ్చుకొనెను.” (ఆదికాండము 6:​5, 6) దేవుడు మారలేదు, నేడు జరుగుతున్న సంఘటనల విషయంలో కూడా ఆయన దృక్పథం మారలేదు.​—మలాకీ 3:6.

మూడవదిగా, దేవుడు దుష్టత్వానికి ఎన్నడూ కారకుడు కాదు. బైబిలు దీనిని ఎంతో స్పష్టం చేస్తుంది. హత్య, ఉగ్రవాదం వంటి వాటికి దేవుడే కారకుడని చెప్పేవారు ఆయన పేరుకు అపకీర్తి తెస్తున్నారు. యోబు 34:​10 ఏమి చెబుతుందో గమనించండి: “దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము.” అలాగే, యాకోబు 1:​13 ఇలా పేర్కొంటోంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు​—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” కాబట్టి, మీకు కీడు జరిగితే, దేవుడు దానికి కారకుడు కాదని మీరు నమ్మవచ్చు.

లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు?

ఇంతవరకు మనం పరిశీలించిన అంశాలు మనముందు మరో ప్రశ్నను ఉంచుతాయి, దేవుడు ప్రేమగలవాడు, న్యాయవంతుడు, శక్తివంతుడు అయితే, మన చుట్టూ కీడు ఎందుకు ఉంది? సర్వసాధారణంగా ఉన్న ఒక తప్పుడు అభిప్రాయాన్ని మొదటిగా తొలగించాలి. సర్వశక్తిగల దేవుడు ఈ లోక పరిపాలకుడని, ఆయనే అన్నింటిని నేరుగా నియంత్రిస్తున్నాడని చాలామంది అనుకుంటారు. “ఈ విశ్వంలోని ప్రతీ పరమాణువు, ప్రతీ అణువు దేవుని నియంత్రణలో ఉంది” అని వేదాంత కళాశాల అధ్యక్షుడు చెప్పాడు. బైబిలు నిజంగా అలా బోధిస్తోందా?

అలా బోధించడం లేదు. ఈ లోకాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అనే విషయం గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు, 1 యోహాను 5:​19 ఇలా పేర్కొంటోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” ఆ దుష్టుడు ఎవరు? అతడు అపవాదియైన సాతాను అని యేసుక్రీస్తు చెప్పాడు, అతణ్ణి “లోకాధికారి” అని ఆయన పిలిచాడు. (యోహాను 14:​30) ఈ లోకంలో ఇంత కీడు, ఇన్ని బాధలు ఎందుకున్నాయో మనం దీనినిబట్టి అర్థం చేసుకోలేమా? సాతాను క్రూరుడు, మోసగాడు, ద్వేషంగలవాడు, ప్రజలు అనుభవిస్తున్న అనేక కష్టాలకు ఆ లక్షణాలే కారణం. అయితే సాతాను పరిపాలనను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు?

ఏదెనులో లేవదీయబడిన వివాదాంశం

ఒక ప్రేమగల, సమర్థుడైన తండ్రి తన పిల్లలకు అబద్ధం చెబుతున్నాడని, వారిమీద తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని, వారికి మంచి వస్తువులు అందకుండా చేస్తున్నాడని ఎవరైనా బహిరంగంగా ఆరోపిస్తే, ఆయనకు ఎలా అనిపిస్తుంది? ఆరోపించిన వ్యక్తిపై దాడి చేయడం ద్వారా ఆ అబద్ధ ఆరోపణలు తప్పని ఆ తండ్రి నిరూపిస్తాడా? అలా నిరూపించడు కదా! నిజానికి, అలా ప్రతిస్పందించడం ద్వారా ఆ ఆరోపణలు సరైనవే అని ఇతరులు నమ్మేలా చేస్తాడు.

మానవ చరిత్ర ఆరంభంలో ఏదెను అనే స్థలంలో తనకు వ్యతిరేకంగా చేయబడిన సవాలుకు జవాబు చెప్పేందుకు యెహోవా దేవుడు అనుసరించిన పద్ధతిని వివరించడానికి ఆ ఉపమానం సహాయం చేస్తుంది. దేవుడు ఆ స్థలంలోనే తన భూసంబంధ పిల్లల కోసం తాను ఏర్పాటు చేసిన అద్భుతమైన ప్రణాళిక గురించి మొదటి మానవులైన ఆదాముహవ్వలకు వివరించాడు. వారు భూమిని నిండించి, దానిని లోపరచుకొని భూమిని పరదైసుగా మార్చాలి. (ఆదికాండము 1:​28) అంతేకాక, ఆ ఉత్తేజకరమైన ప్రణాళిక విషయంలో కోట్లాదిమంది దేవుని ఆత్మకుమారులు ఎంతో ఆసక్తి చూపించారు.​—యోబు 38:​4, 7; దానియేలు 7:​10.

యెహోవా ఉదార స్వభావంగల దేవుడు కాబట్టి, ఆయన ఆదాముహవ్వలకు అనేక కమ్మని పండ్లు ఉన్న అందమైన తోటను నివాసంగా ఇచ్చాడు. కేవలం “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు” మాత్రమే వారు తినకూడదు. ఆ వృక్ష ఫలాన్ని తినకుండా ఉండడం ద్వారా ఆదాముహవ్వలు, తన పిల్లల మంచిచెడులను నిర్ణయించే హక్కు ఆయనకు ఉందని గుర్తిస్తూ తమ తండ్రిపట్ల తమకున్న పూర్తి నమ్మకాన్ని ప్రదర్శిస్తారు.​—ఆదికాండము 2:​16, 17.

విచారకరంగా, దేవుని ఆత్మ కుమారుల్లో ఒకడు ఆరాధించబడాలనే కోరికతో పురికొల్పబడి, నిషేధించబడిన ఫలాన్ని తింటే ఆమె మరణించదు అని హవ్వతో చెప్పాడు. (ఆదికాండము 2:​17; 3:​1-5) అలా ఆ దుష్ట దూతైన సాతాను, దేవునికి పూర్తి విరుద్ధంగా మాట్లాడి, నిజానికి ఆయనను అబద్ధీకుడు అని పిలిచాడు! దేవుడు ఆదాముహవ్వలకు ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పకుండా దాచాడని కూడా సాతాను ఆరోపించాడు. మానవులు మంచిచెడులను స్వయంగా నిర్ణయించుకోగలరని సాతాను పరోక్షంగా చెప్పాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు అసమర్థ పాలకుడు, తండ్రి అని సాతాను ఆరోపించాడు, తాను మరింత సమర్థుడైన పాలకుడు, తండ్రి కాగలనని అతడు పరోక్షంగా చెప్పాడు.

కుయుక్తితో, దురుద్దేశంతో చెప్పిన ఆ అబద్ధాల ద్వారా ఆ దూత తనను తాను అపవాదియైన సాతానుగా చేసుకున్నాడు. ఆ పేర్లకు “వ్యతిరేకించేవాడు,” “అపవాదులు వేసేవాడు” అని అర్థం. ఆ అబద్ధాలకు ఆదాముహవ్వలు ఎలా స్పందించారు? వారు సాతాను పక్షం వహించి దేవుణ్ణి తిరస్కరించారు.​—ఆదికాండము 3:6.

యెహోవా ఆ క్షణంలోనే ఆ తిరుగుబాటుదారులను నాశనం చేయగలిగేవాడే. అయితే, ముందు ప్రస్తావించిన ఉపమానంలో పేర్కొనబడినట్లుగా, అలాంటి వివాదాంశాలు హింసాత్మకంగా ప్రతిఘటించడం ద్వారా పరిష్కారంకావు. సాతాను దేవుణ్ణి సవాలు చేసినప్పుడు కోట్లాదిమంది దేవదూతలు విన్నారని కూడా గుర్తుంచుకోండి. నిజానికి, వెల్లడిచేయబడని అనేకమంది దేవదూతలు కొంతకాలం తర్వాత తిరుగుబాటులో సాతాను పక్షాన చేరి, దయ్యాలుగా తయారయ్యారు.​—మార్కు 1:​34; 2 పేతురు 2:4; యూదా 6.

దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదు?

ఆదాముహవ్వలు తమ సృష్టికర్త నుండి స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకునేలా వారిని తప్పుదోవ పట్టించడం ద్వారా, సాతాను స్వతంత్రంగా ఉన్న కుటుంబాన్ని కాక తన అధికారం క్రింద ఉన్న కుటుంబాన్ని స్థాపించాడు. తెలిసో తెలియకో తమ “తండ్రియగు” అపవాది ప్రభావానికి గురౌతున్న ఈ కుటుంబం తమ సొంత లక్ష్యాలను, ప్రవర్తనా సూత్రాలను నిర్ణయించుకోవడం మొదలుపెట్టింది. (యోహాను 8:​44) అయితే, ఆ జీవనవిధానం వారికి నిజమైన స్వేచ్ఛను, శాశ్వత సంతోషాన్ని ఇస్తుందా? ఇవ్వదని యెహోవాకు బాగా తెలుసు. అయినా, ఆ తిరుగుబాటుదారులు స్వతంత్రంగా ఉండేందుకు ఆయన అనుమతించాడు, ఎందుకంటే అలా అనుమతిస్తేనే ఏదెనులో లేవదీయబడిన వివాదాంశాలు శాశ్వతంగా పరిష్కరించబడతాయి.

ఇప్పటికి దాదాపు 6,000 కన్నా ఎక్కువ సంవత్సరాల నుండి, మానవజాతి అన్ని రకాల పరిపాలనను, ప్రవర్తనా నియమావళులను ప్రయత్నించి ఒక లోక వ్యవస్థను నిర్మించుకుంది. మీరు దానితో సంతోషంగా ఉన్నారా? మానవ కుటుంబం నిజంగా సంతోషంగా, శాంతిగా, ఐక్యంగా ఉందా? స్పష్టంగా, ఆ ప్రశ్నలకు లేదు అనేదే జవాబు! బదులుగా, బైబిలు చెబుతున్నట్లే, యుద్ధాలు, క్షామాలు, ప్రకృతి విపత్తులు, అనారోగ్యం, మరణం మానవజాతిని పట్టిపీడించి “నాశనమును,” “వేదనను,” “మూలుగును” కలిగిస్తున్నాయి.​—రోమీయులు 8:​19-22; ప్రసంగి 8:9.

అయినా కొందరు, ‘దేవుడు విషాద సంఘటనలను ఎందుకు ఆపలేదు?’ అని అడగవచ్చు. అలా ఆపడం అన్యాయమౌతుంది, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంవల్ల ఎలాంటి పర్యవసానాలు ఎదురుకాలేదన్నట్లు కనిపిస్తే అది వివాదాంశాన్ని అస్పష్టం చేస్తుంది. అందుకే, పరోక్షంగా లేక ప్రత్యక్షంగా యెహోవాకు అవిధేయత చూపించిన కారణంగా సంభవించే నేరాలను, విషాద సంఘటనలను ఆపుజేయడానికి ఆయన రహస్యంగా జోక్యం చేసుకోలేదు. * సాతాను వ్యవస్థ విజయం సాధించగలదనే, అది సంతోషానికిగల కీలకాన్ని కనుగొన్నదనే హానికరమైన అబద్ధాన్ని యెహోవా ఎన్నడూ సమర్థించడు! అయితే యెహోవా ఆ ఘటనలపట్ల ఉదాసీన వైఖరి కనబరచలేదు. మనం ఇప్పుడు గమనించబోతున్నట్లుగా, ఆయన ఎంతో చురుకుగా వ్యవహరించాడు.

“నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు”

వివిధ సంఘటనలు జరుగుతుంటే దేవుడు మౌనంగా కూర్చొని చూడడంలేదని యేసు చెప్పిన ఆ మాటలు చూపిస్తున్నాయి. (యోహాను 5:​17) బదులుగా, ఏదెను తోటలో తిరుగుబాటు జరిగినప్పటి నుండి ఆయన ఎంతో చురుకుగా పనిచేస్తున్నాడు. ఉదాహరణకు, భవిష్యత్‌ “సంతానం” సాతానును, అతని అనుచరులను నాశనం చేస్తుందనే తన వాగ్దానాన్ని బైబిలు రచయితలు రాసేలా ఆయన ప్రేరేపించాడు. (ఆదికాండము 3:​15) అంతేకాక, దేవుడు విధేయత చూపించే మానవులను ఆశీర్వదించి, మరణంతోపాటు బాధలకున్న అన్ని కారణాలను తొలిగించే పరలోక రాజ్యమనే ప్రభుత్వాన్ని ఆ సంతానం ద్వారా ఏర్పాటు చేస్తాడు.​—ఆదికాండము 22:​18; కీర్తన 46:9; 72:​16; యెషయా 25:8; 33:​24; దానియేలు 7:​13, 14.

ఆ అద్భుతమైన వాగ్దానాల నెరవేర్పులో భాగంగా, యెహోవా ఆ రాజ్య ప్రథమ పాలకుడయ్యేవానిని భూమ్మీదకు పంపించాడు. ఆయన ఎవరో కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తే. (గలతీయులు 3:​16) యేసు తన విషయంలో దేవునికున్న సంకల్పానికి అనుగుణంగా దేవుని రాజ్యం గురించి బోధించడంపై అవధానముంచాడు. (లూకా 4:​43) వాస్తవానికి, క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన కార్యాల ద్వారా ఆ రాజ్యానికి రాజుగా తాను ఏమి సాధించగలడో చూపించాడు. ఆయన ఆకలిగొన్న వేలాదిమందికి భోజనం పెట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, మరణించినవారిని పునరుత్థానం చేశాడు, పెను తుఫానును నిమ్మళింపజేయడం ద్వారా ప్రకృతి శక్తులమీద తనకున్న అధికారాన్ని కూడా చూపించాడు. (మత్తయి 14:​14-21; మార్కు 4:​37-39; యోహాను 11:​43, 44) యేసు గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి.”​—2 కొరింథీయులు 1:​20.

యేసు మాటలు విని “లోకములోనుండి” అంటే దేవుని నుండి విడిపోయిన సాతాను పాలిత ఈ విధానం నుండి బయటికి వచ్చేవారు యెహోవా కుటుంబంలోకి ఆహ్వానించబడతారు. (యోహాను 15:​19) నిజక్రైస్తవుల ఈ భూవ్యాప్త కుటుంబం ప్రేమ ద్వారా నడిపించబడుతుంది. శాంతిపట్ల అంకిత భావం, మతదురభిమానానికి, జాతివిభేదాలకు సంబంధించిన ఎలాంటి జాడలు తమ మధ్య ఉండకూడదనే దృఢనిశ్చయం వారిలో కనిపిస్తుంది.​—మలాకీ 3:​17, 18; యోహాను 13:​34, 35.

నిజక్రైస్తవులు ప్రస్తుత లోకాన్ని సమర్థించే బదులు, మత్తయి 24:14 లో ఉన్న యేసు ఆజ్ఞకు లోబడి దేవుని రాజ్యాన్ని సమర్థించి, దాని గురించి ప్రకటిస్తారు. క్రింది అంశాల గురించి ఆలోచించండి: ప్రపంచవ్యాప్తంగా “రాజ్య సువార్త” ఎవరు ప్రకటిస్తున్నారు? ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంగా యుద్ధంలో, వేర్పాటువాద జాతీయ, తెగ సంబంధమైన తగాదాల్లో పాల్గొనడానికి ఎవరు నిరాకరించారు? దేవుని వాక్యంలోని ఉన్నత ప్రమాణాలు ప్రజాదరణ పొందినా, పొందకపోయినా ఆ వాక్యం తమ ప్రవర్తనను నిర్దేశించేందుకు ఎవరు అనుమతిస్తున్నారు? (1 యోహాను 5:3) చాలామంది పైన పేర్కొనబడిన లక్షణాలను యెహోవాసాక్షుల్లో గమనించారు. మీరే స్వయంగా రుజువులను పరిశీలించండి.

దేవుని పరిపాలనను ఎంచుకోండి!

దేవుని నుండి దూరమై సాతాను చేత మోసగించబడుతున్న మానవజాతి, ఎన్నో బాధలను, నిరాశలను కలిగించే లోక వ్యవస్థను నిర్మించుకుంది. భూమి కూడా నాశనం చేయబడుతుంది! అయితే, యెహోవా అనేకమంది జీవితాలను మెరుగుపర్చి, ప్రతీ ఒక్కరికి ఖచ్చితమైన నిరీక్షణను ఇచ్చే పరలోక ప్రభుత్వాన్ని స్థాపించాడు. (1 తిమోతి 4:​10) ఆ రెండింటిలో మీకేది కావాలి?

సాతాను, అతని దుష్ట లోకం నిరంతరం కొనసాగేందుకు దేవుడు అనుమతించడు కాబట్టి, నిర్ణయించుకోవాల్సిన సమయమిదే. భూమిని పరదైసుగా మార్చాలనే దేవుని మొదటి సంకల్పం ఎన్నడూ మారలేదు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి, ఆయన రాజ్యం బలపడుతుంది, దాని సమర్థకులు అంతకంతకూ బలాన్ని పుంజుకుంటారు, అదే సమయంలో సాతాను అధీనంలో ఉన్న లోకాన్ని దేవుడు నాశనం చేసేంతవరకు అది అనేక “వేదనలను” అనుభవిస్తుంది. (మత్తయి 24:​3, 7, 8) కాబట్టి మీరు నిజాయితీగా “ఎందుకు?” అని దేవుణ్ణి వేడుకున్నట్లయితే, ఓదార్పు, నిరీక్షణ ఇస్తున్న బైబిలు సందేశంపట్ల నమ్మకాన్ని కనబరచడం ద్వారా ఆయన చెప్పేది వినండి. నేడు కూడా మీ కన్నీళ్లు ఆనందభాష్పాలుగా మారగలవు.​—మత్తయి 5:4; ప్రకటన 21:​3, 4. (g 11/06)

[అధస్సూచి]

^ దేవుడు మానవ వ్యవహారాల్లో అప్పుడప్పుడు జోక్యం చేసుకున్నా, ఆయన కార్యాలు ప్రస్తుత విధానాన్ని సమర్థించేవిగా లేవు. బదులుగా, ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆ కార్యాలను చేశాడు.​—లూకా 17:​26-30; రోమీయులు 9:​17-24.

[7వ పేజీలోని చిత్రాలు]

మానవ పరిపాలన సాధించిన ఫలితాలు మీకు సంతృప్తినిచ్చాయా?

[చిత్రసౌజన్యం]

పాప: © J. B. Russell/Panos Pictures; ఏడుస్తున్న మహిళ: © Paul Lowe/Panos Pictures

[8, 9వ పేజీలోని చిత్రం]

యేసు పరదైసును పునఃస్థాపిస్తాడు, మరణించినవారిని కూడా తిరిగి జీవానికి తీసుకొస్తాడు