కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అతికష్టమైన ప్రశ్న

అతికష్టమైన ప్రశ్న

అతికష్టమైన ప్రశ్న

“ఎందుకు?” ఆమామూలు పదంలో ఎంత తీవ్రమైన వేదన, బాధ దాగివుండగలవో ఆలోచిస్తే మనకు ఎంతో మనోవేదన కలుగుతుంది. విపత్తులు లేక విషాద ఘటనలు సంభవించిన తర్వాత ప్రజలు సాధారణంగా ఆ ప్రశ్న అడుగుతారు. ఒక హరికేన్‌ ఏదో ఒక ప్రాంతంమీద విరుచుకుపడి ఎంతో ప్రాణనష్టాన్ని, వినాశనాన్ని కలుగజేస్తుంది. ఒక భూకంపం ఏదో ఒక నగరాన్ని శిథిలాలుగా మారుస్తుంది. ప్రశాంతంగా, సాఫీగా సాగుతున్న రోజును ఉగ్రవాద దాడి భయాందోళనతో, హింసతో కూడిన పీడకలగా మారుస్తుంది. ఒక దుర్ఘటన మనకు ప్రియమైనవారిని గాయపరుస్తుంది లేక వారి ప్రాణాన్ని బలిగొంటుంది.

విచారకరంగా, మన మధ్య ఉండే ఎంతో అమాయకులు, నిస్సహాయులైనవారు కూడా వాటికి ఎక్కువగా బలౌతున్నారు. ఇటీవల అలాంటి విపత్తులు ఎన్నో సంభవించి, అనేకమంది “ఎందుకు?” అని దేవునికి మొరపెట్టుకునేలా చేశాయి. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి:

◼ సునామీ తమ పల్లెను సర్వనాశనం చేసినప్పుడు ఇండియాలోని ఒక వృద్ధురాలు, “దేవుడా, మాకు ఈ కష్టాలు ఎందుకిచ్చావు? నీకు కోపం తెప్పించే పని మేమేం చేశాం?” అనే ప్రశ్నలను అడిగిందని రాయ్‌టర్స్‌ వార్తా సంస్థ నివేదించింది.

◼ ఒక సాయుధవ్యక్తి చర్చిలోకి చొరబడి తుపాకీతో అనేకమంది ఆరాధకులను గాయపర్చి, చంపినప్పుడు, “దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి అన్నింటిమీద పూర్తి నియంత్రణ ఉంటే ఇలా జరిగేందుకు ఆయన ఎందుకు అనుమతించాడు?” అనే ప్రశ్నలను అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రానికి చెందిన ఒక పత్రిక లేవనెత్తింది.

◼ తన స్నేహితురాలు క్యాన్సర్‌వల్ల మృత్యువాతపడి, వారి ఐదుగురి పిల్లల బాధ్యత ఆమె భర్తమీద పడినప్పుడు, “ఆమె మరణించేందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు?” అనే ప్రశ్న ఒక స్త్రీ అడిగింది.

తమ సమస్యలకు ఏదో విధంగా దేవుడే కారకుడు అని అనుకుంటున్నది పైన పేర్కొనబడినవారు మాత్రమే కాదు. ఉదాహరణకు, ప్రకృతి విపత్తులకు సంబంధించి ఇటీవల ఇంటర్నెట్‌ ద్వారా జరిపిన సర్వేలో, దాదాపు యాభైశాతం మంది హరికేన్‌ వంటి విపత్తులకు దేవుడే కారకుడని భావించినట్లు వెల్లడైంది. చాలామంది ఎందుకలా అనుకుంటారు?

మతసంబంధ గందరగోళం

మతనాయకులు వాటికి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చే బదులు వారే కొంతమేరకు గందరగోళాన్ని సృష్టిస్తారు. విపత్తులు సంభవించడానికిగల కారణాల గురించి సాధారణంగా వారిచ్చే జవాబుల్లో కేవలం మూడింటిని మనం పరిశీలిద్దాం.

మొదటిగా, తప్పుదారిపట్టినవారిని శిక్షించడానికే దేవుడు విపత్తులను కలుగజేస్తాడని అనేకమంది మతనిష్ఠగలవారు బోధిస్తారు. ఉదాహరణకు, అమెరికాలోని న్యూ ఓర్లీన్స్‌, లూసీయానాలపై హరికేన్‌ కట్రీనా విరుచుకుపడినప్పుడు, దేవుడు ఆ నగరాన్ని శిక్షించాడని కొందరు ఫాదిరీలు వాదించారు. అవినీతి, జూదం, అనైతికత ప్రబలంగా ఉండడమే దానికి కారణమని వారు నొక్కిచెప్పారు. కొందరు బైబిలును కూడా రుజువుగా ఉదాహరిస్తూ దేవుడు దుష్టులను జలప్రయళం ద్వారా లేక అగ్ని ద్వారా నాశనం చేసిన సందర్భాలను పేర్కొన్నారు. అయితే అలాంటి వాదనలు బైబిలును వక్రీకరిస్తాయి.​—“దేవుని కార్యాలా?” అనే బాక్సు చూడండి.

రెండవదిగా, మానవజాతిమీద విపత్తులు తీసుకురావడానికి దేవునికి సరైన కారణాలు ఉన్నాయని, అయితే అవి మన అవగాహనకు అందవని కొందరు మతనాయకులు వాదిస్తారు. అలాంటి వాదన నమ్మదగినదిగా లేదని అనేకులకు అనిపిస్తుంది. ‘ప్రేమగల ఒక దేవుడు అలాంటి కీడును చేసి, ఓదార్పు కోసం తపిస్తూ “ఎందుకు?” అని వేడుకునేవారికి దానికిగల కారణాన్ని వివరించకుండా ఉంటాడా?’ అని వారనుకుంటారు. నిజానికి, “దేవుడు ప్రేమాస్వరూపి” అని బైబిలు చెబుతోంది.​—1 యోహాను 4:8.

మూడవదిగా, దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రేమగలవాడు కాదని మరికొందరు మతనాయకులు అనుకుంటారు. ఈ సందర్భంలో కూడా అలాంటి వివరణ గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. మన ఊహకు అందనంత సంక్లిష్టంగా ఉన్న అనంత విశ్వంతోపాటు “సమస్తమును సృష్టించిన” వ్యక్తి, ఈ ఒక్క గ్రహంమీదున్న బాధలను ఆపలేడా? (ప్రకటన 4:​10) ఆయన వాక్యంలో ప్రేమాస్వరూపిగా వర్ణించబడే వ్యక్తి, మనకు ప్రేమించే సామర్థ్యం ఇచ్చిన వ్యక్తి, మానవ కష్టాలను చూసి ఎలా చలించకుండా ఉంటాడు?​—ఆదికాండము 1:​27; 1 యోహాను 4:8.

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు అనే ప్రశ్నకు జవాబిచ్చేందుకు మానవులు చేసిన కొన్ని ప్రయత్నాల్లో మూడు అంశాలే పైన పేర్కొనబడ్డాయి, దానికి జవాబు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలను ఆ ప్రశ్న శతాబ్దాలుగా కలవరపెడుతోంది. ఈ ప్రాముఖ్యమైన, సమయోచితమైన అంశం గురించి బైబిలు ఏమి బోధిస్తుందో మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. మీరు గమనించబోతున్నట్లుగా, బైబిలు ఇస్తున్న చక్కని, సహేతుకమైన వివరణ ఆ గందరగోళం లేకుండా చేస్తుంది. అంతేకాక, జీవితంలో విషాదాలను చవిచూసిన వారందరికీ బైబిలు ఎంతో ఓదార్పునిస్తుంది. (g 11/06)

[4వ పేజీలోని బాక్సు/చిత్రం]

దేవుని కార్యాలా?

మనం నేడు చూస్తున్న ప్రకృతి విపత్తులకు దేవుడే కారకుడని బైబిలు బోధిస్తోందా? అలా బోధించడం లేదు! బైబిల్లో వర్ణించబడిన దేవుని తీర్పులు ప్రకృతి విపత్తులకు పూర్తి భిన్నమైనవి. ఉదాహరణకు, దేవుడు విచక్షణతో వ్యవహరిస్తాడు, ఆయన వ్యక్తుల హృదయాల్ని పరిశీలించి, తాను దుష్టులుగా పరిగణించేవారిని మాత్రమే నాశనం చేస్తాడు. (ఆదికాండము 18:​23-32) అంతేకాక, దేవుడు తీర్పుతీర్చే ముందు హెచ్చరికలను ఇవ్వడం ద్వారా నీతిమంతులకు తప్పించుకునే అవకాశాన్ని ఇస్తాడు.

వాటికి భిన్నంగా, ప్రకృతి విపత్తులు కొన్ని హెచ్చరికలతో లేక అసలు ఎలాంటి హెచ్చరికలే లేకుండా విరుచుకుపడతాయి, అవి విచక్షణారహితంగా ప్రజలను పొట్టనబెట్టుకుంటాయి, క్షతగాత్రులను చేస్తాయి. వాతావరణాన్ని నాశనం చేయడం ద్వారా, భూకంపాలు, వరదలు వచ్చే, అననుకూల వాతావరణం ఉన్న ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేపట్టడం ద్వారా మానవులు అలాంటి విపత్తుల తీవ్రతను పెంచారు.

[చిత్రసౌజన్యం]

SENA VIDANAGAMA/AFP/Getty Images

[4వ పేజీలోని చిత్రం]

మతనాయకులు గందరగోళానికి గురిచేసే వివిధ జవాబులను ఇచ్చారు