కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గాడిదలు అవే లేకపోతే ఏం చేసేవాళ్ళం?

గాడిదలు అవే లేకపోతే ఏం చేసేవాళ్ళం?

గాడిదలు అవే లేకపోతే ఏం చేసేవాళ్ళం?

ఇతియోపియాలోని తేజరిల్లు! రచయిత

ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో 16వ స్థానంలో నిలిచే ఇతియోపియా రాజధాని నగరమైన ఆడిస్‌ అబాబా వీధుల్లో ఎంతోకాలంగా గాడిదలనే ప్రధాన ప్రయాణ మాధ్యమంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా గాడిదలకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, అవి ఏమి చేసైనా అక్కడికి వెళ్లే తీరతాయనే విషయం తెలిసిన అనేకమంది డ్రైవర్లు వాటిని దృష్టిలో పెట్టుకుని వాహనాలు నడపడం నేర్చుకున్నారు. గాడిదలు వాహనాల రద్దీకి ఏమాత్రం బెదరవు, అయితే అవి మోసుకెళ్ళే విస్తారమైన బరువులను అదుపుచేయడం చాలా కష్టం, పైగా అవి వెనక్కి తిరిగి చూడవు. కాబట్టి, అవి మోసుకెళ్ళే బొగ్గు, పిడకలు, లేదా మరి ఏవైనా మీకు తగలకుండా ఉండాలంటే, మీరు వాటి దారికి అడ్డురాకుండా తప్పుకోవాల్సిందే!

ఇతియోపియాలో దాదాపు 50 లక్షల గాడిదలు ఉన్నాయని అంచనా, అంటే ప్రతీ 12 మందికి ఒక గాడిద అన్నమాట. లక్షలాదిమంది ఇతియోపీయులు పర్వతశిఖరాలపై నివసిస్తున్నారు, వాటి మధ్య లోతైన లోయలున్నాయి. ఆ దేశంలోని పెద్ద మధ్యస్థ పీఠభూమిని భాగాలుగా విభజించే అసంఖ్యాక పిల్లకాలవలున్నాయి. వాటి మీదుగా వంతెనలు నిర్మించాలన్నా లేదా చివరికి చదును చేయబడని రోడ్లు వేయాలన్నా కూడా ఏ దేశంలోని వనరులైనా హరించుకుపోతాయి. అందుకే ఎలాంటి నేలమీదైనా తేలిగ్గా నడవగలిగి, ఓపికగా ఉండే గాడిదే ప్రయాణించేందుకు సరైనది.

గాడిదలు ఇతియోపియాలోని అన్నిరకాల వాతావరణాలను తట్టుకోగలవు అంటే తేమలేని, ఉష్ణ నిమ్నభూములనుండి పర్వప్రాంతాలవరకు ఏ ప్రాంతంలోనైనా ఉండగలవు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో, ఇరుకైన రోడ్లపై, అడుగున రాళ్లుండి ఎక్కువగా లోతులేని నదుల్లోని రాళ్ళపై, మట్టి రోడ్లపై లేదా ఎత్తుపల్లాలుగా ఉండే ఇతర ప్రాంతాల్లో ప్రయాణించడానికి గాడిదే చక్కగా సరిపోతుంది. గుఱ్ఱాలు, ఒంటెలు వెళ్ళలేని చోటికి అది వెళ్ళగలదు. సామగ్రిని చేరవేసేందుకు లక్షలాదిమంది ఈ గాడిదనే ప్రధాన రవాణా మాధ్యమంగా ఉపయోగిస్తారు, ప్రత్యేకంగా నగరాల్లో చాలామంది తమ ఇళ్ళకు వాహనాలపై వెళ్ళలేరు కాబట్టి దానిపైనే ప్రయాణిస్తారు.

చిన్నచిన్న సందుల్లోనుండి, కంచెలుకట్టిన సన్నని దారుల్లో గాడిదలు సునాయాసంగా ప్రయాణించగలవు. వాటికి ఖరీదైన టైర్లు అవసరం లేదు, జారుడు నేలపై నడవడం కూడా వాటికి పెద్ద సమస్య కాదు. అవి అన్నిరకాల బరువులను మోస్తూ, ఎక్కడున్నా సరే ఇంటివరకు సామాను చేర్చగలవు. ఒకవైపు ట్రాఫిక్‌ రద్దీలో ఇరుక్కుపోయి కోపోద్రిక్తులైన డ్రైవర్లు హారన్‌లు మోగిస్తూ కూర్చుంటే, మరోవైపు గాడిదలు ఎంతో సులువుగా వాహనాల మధ్య దారి చేసుకుని వెళ్తాయి. వన్‌-వే వీధిలో తప్పు వైపునుండి వచ్చే గాడిదకు జుల్మానా విధించాలని ఏ పోలీసు అనుకోడు. గాడిదలకు పార్కింగ్‌ సమస్యలుండవు. ఒక గాడిద సుమారు 50 డాలర్లకు లభించవచ్చు, అయితే వాహనాల్లో ప్రయాణించడానికయ్యే ఖర్చుతో పోలిస్తే, నింగికీ నేలకూ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది!

రాజధానిలో గాడిదలు

ఉదయాన్నే వేల సంఖ్యలో గాడిదలు తరచూ 25 కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం ప్రయాణించి 30,00,000 జనాభా ఉన్న ఆడిస్‌ అబాబాకు చేరుకుంటాయి. వారంలో ప్రత్యేకంగా బుధ, శనివారాలు మార్కెట్‌ రోజులు కాబట్టి రద్దీగా ఉంటాయి. ఆ ప్రయాణం మూడు గంటలపాటు ఉండవచ్చు కాబట్టి అవి వేకువనే ప్రయాణమవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాటి యజమానులు వాటితోపాటు నడుస్తారు, కానీ అనేకమార్లు వాటి వేగాన్ని అందుకోవడానికి వాటి వెనక పరిగెడతారు.

సాధారణంగా అవి ధాన్యపు, కూరగాయల, వంటచెరుకు, సిమెంటు, బొగ్గు బస్తాలు, వంటనూనె ఉన్న లోహపు డబ్బాలను, బీరు లేదా సోడా సీసాలున్న బాక్సులను మోసుకెళ్తాయి. కొన్ని గాడిదలు 90 కేజీల బరువులను లేదా అంతకన్నా ఎక్కువ బరువులను మోస్తాయి. పొడవైన వెదురు బొంగులు లేదా నీలగిరి గుంజలను తాళ్ళతో వాటి నడుముకు కడతారు, అవి వాటిని తమ వెనుక ఈడ్చుకువెళ్తాయి. అవి గడ్డి మోపులను మోస్తూ వాటి క్రింద దాదాపు కనిపించకుండా ఉన్నప్పుడు అత్యంత చూడముచ్చటగా ఉంటాయి.

ఉదయాన్నే అవి బరువుల్ని మోస్తూ మార్కెట్టుకు వెళ్తున్నప్పుడు చాలా వేగంగా నడుస్తాయి. సరుకు అమ్ముడైపోయాక వాటి బరువులు తగ్గినప్పుడు, అవి మార్గంమధ్యలో రోడ్డుప్రక్క గడ్డిని ఆరగిస్తూ హాయిగా, తీరిగ్గా ఇంటికి నడిచివస్తాయి. మార్కెట్టు లేని రోజుల్లో కూడా వాటిని నీళ్ళు మోయడం, వంటచెరుకు తేవడం లాంటి రోజువారీ పనులకు ఉపయోగిస్తారు. వాటిని అరువుకు లేదా అద్దెకు కూడా ఇస్తారు. వ్యాపారరీత్యా గాడిదలపై వస్తువులు చేరవేసే సంస్థల్లో కూడా అవి ఉపయోగించబడతాయి! కొన్ని ప్రాంతాల్లో గాడిదలు చిన్న బండ్లనే లాగేస్తాయి, ఒక్కోసారి రెండు గాడిదలు ఒక మోస్తరు బండిని లాగేయగలవు.

ప్రశంసార్హమైనవి

గాడిదల ఆహారం, ఇతరత్రా విషయాలపట్ల అంతగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. అవి ఆహారాన్ని వాటంతటవే వెతుక్కుంటాయి, దాదాపు ఏదైనా తినేస్తాయి. వాటితో సరిగా వ్యవహరించినప్పుడు, గాడిదలు తమ యజమానులపట్ల మక్కువ పెంచుకుంటాయి. తెలివితేటల్లో అవి గుర్రాలకన్నా ఒక మెట్టుపైనే ఉన్నాయని తేలింది. దారులు గుర్తుంచుకునే విషయంలో వాటికి అద్భుతమైన జ్ఞాపకశక్తి కూడా ఉంది. అవి ఎవరితోడు లేకుండానే దాదాపు 8 కిలోమీటర్ల దూరానున్న ప్రాంతం నుండి నీళ్ళు తీసుకుని రాగలవు, కేవలం ఆ బరువును ఎత్తడానికి, దించడానికి గమ్యస్థానాల్లో ఎవరో ఒకరు ఉంటే చాలు. సామాను తీసుకోవాల్సిన ప్రజలు వాటి రాకను గుర్తించి, సామగ్రి తీసుకునేందుకు వీలుగా వాటికి గంటలు కూడా కడతారు.

గాడిదలు కష్టపడి పనిచేసేవైనా, బరువు, విశ్రాంతి విషయాల్లో అవి ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో లేదా వాటికి నొప్పి కలిగే విధంగా బరువు మోపబడినప్పుడు అవి అలాగే కూర్చుండిపోతాయి. అలాంటప్పుడు ప్రజలు వాటిని అపార్థం చేసుకుని వాటిని మాటలతో, శారీరకంగా హింసించే అవకాశం ఉంది. బైబిల్లో అలాంటి సంఘటనే ఒకసారి జరిగినట్లు మీరు గుర్తుతెచ్చుకోవచ్చు.​—⁠సంఖ్యాకాండము 22:​20-31.

గాడిదలపట్ల శ్రద్ధ, సానుభూతి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిపై బరువు సరిగ్గా పెట్టక అవి పట్టుతప్పి గుంటలో పడి కాళ్ళు విరగ్గొట్టుకోవడం నిజంగా విషాదకరం. దాని శరీరం పుండ్లు, వివిధ పరాన్నజీవులు సోకడం, కాళ్ళకు సోకే వ్యాధి రావడం, నిమోనియా లేదా ఇతర సమస్యలు, ఎంతో కష్టపడి బరువులు మోసే ఈ జీవిని బలహీనపర్చగలవు. అందుకే ఆడిస్‌ అబాబాకు కొంత దూరంలోనే ఉన్న డెబ్రీ జెయిట్‌లో ఆధునిక గాడిదల ఆస్పత్రి స్థాపించబడింది. అందులో కంప్యూటర్లు, చికిత్సా గదులు, ప్రథమ చికిత్స చేయడానికి ఆంబులెన్స్‌లు, శస్త్ర చికిత్స చేయడానికి ఒక మంచి ఆపరేషన్‌ థియేటర్‌ లాంటివి కూడా ఉన్నాయి. అలా 2002లో దాదాపు 40,000 గాడిదలకు వివిధ వ్యాధులకు సంబంధించి చికిత్స చేయబడింది.

పితరుడైన అబ్రాహాము మోరీయా పర్వతానికి వెళ్తున్నప్పుడు తన గాడిదపైనే పర్వతప్రాంతాన్ని దాటాడు. (ఆదికాండము 22:3) ఇశ్రాయేలీయుల సుదీర్ఘ చరిత్రలో గాడిదలు వారి దైనందిన జీవితంలో భాగంగా ఉండేవి. చివరకు యేసుక్రీస్తు కూడా విజయోత్సాహంతో యెరూషలేముకి గాడిదమీదే వచ్చాడు.​—⁠మత్తయి 21:​1-9.

ఇతియోపియాలో కూడా గాడిదకు సుదీర్ఘ చరిత్రే ఉంది. అయినా, అక్కడి ప్రజల జీవితాల్లో దాని ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. గడిచిన సంవత్సరాల్లో ట్రక్కులు కార్ల రూపాలు మారాయి కానీ గాడిదలు మాత్రం అలాగే ఉన్నాయి! అవి ఖచ్చితంగా ప్రశంసార్హమైనవి! (g 12/06)

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

‘The Donkey Sanctuary’, Sidmouth, Devon, UK