కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యువత ఇలా అడుగుతోంది . . .

ఎందుకిన్ని ఆంక్షలు?

ఎందుకిన్ని ఆంక్షలు?

“ఖచ్చితంగా ఫలానా సమయానికి ఇంట్లో ఉండాలని ఆంక్షలు విధించడం నాకు నచ్చదు! వేరేవాళ్ళు నాకన్నా ఆలస్యంగా ఇంటికి రావడానికి అనుమతించబడడం నాకు కోపాన్ని తెప్పిస్తుంది.”​—అలెన్‌.

“నా సెల్‌-ఫోన్‌ కాల్స్‌ అన్నింటి గురించి ఆరాలు తీయడం అన్యాయం. నన్నో చిన్నపిల్లలా చూస్తున్నారనిపిస్తుంది.”​—ఎలిజబెత్‌.

మీకు ఇంట్లో విధించబడే ఆంక్షలు భారంగా అనిపిస్తున్నాయా? ఎవరికీ తెలియకుండా ఇంట్లోనుండి పారిపోవాలనీ లేదా మీరు చేసిన పనుల గురించి మీ తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పాలనీ మీకెప్పుడైనా అనిపించిందా? అలా అనిపించివుంటే, మీరు కూడా ఇక్కడ పేర్కొనబడిన యౌవనస్థురాలిలాగే భావిస్తుండవచ్చు. తన తల్లిదండ్రులు తనతో అతిజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెబుతున్న ఆ యువతి, ‘వారు నన్ను మరీ కట్టిపడేసినట్లు కాకుండా కాస్త స్వేచ్ఛనివ్వాలి!’ అంటోంది.

మీ తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మీరు ఫలానా వాటిని చేయాలని, ఫలానా వాటిని చేయకూడదని నిర్దేశించడాన్నే కొన్నిసార్లు ఇంటి ఆంక్షలు అని అంటారు. బహుశా వాటిలో మీ హోంవర్కు, ఇంటి పనులు, ఫలానా సమయానికి ఇంటికి రావాలని, మీరు ఫోనులో మాట్లాడే విషయంలో, టీవీ చూడడం, కంప్యూటర్‌ ఉపయోగించడం మొదలైన వాటిల్లో ఆంక్షలు విధించడం చేరివుండవచ్చు. ఇంట్లోనేకాక స్కూల్లో మీ ప్రవర్తన విషయంలో, మీరు స్నేహితులను ఎంపిక చేసుకొనే విషయంలో కూడా ఆంక్షలు విధించబడవచ్చు.

తరచూ అనేకమంది యౌవనులు తల్లిదండ్రులు పెట్టిన హద్దులను మీరి ప్రవర్తిస్తారు. ఒక అధ్యయనంలో ఇంటర్వ్యూ చేయబడిన యౌవనస్థుల్లో మూడింట రెండొంతుల మంది, తాము ఇంట్లో విధించబడిన నియమాలను మీరినందుకు శిక్షించబడ్డామని, తామలా శిక్షించబడడానికి అదే అత్యంత సాధారణ కారణమని చెప్పారు.

అయితే, జీవితం సాఫీగా సాగడానికి కొన్ని నియమాలు అవసరమని కొందరు యౌవనస్థులు ఒప్పుకుంటున్నారు. ఇంట్లో విధించబడే ఆంక్షలు నిజంగా అవసరమైనవైతే, వాటిలో కొన్ని ఎందుకు అంత భారమైనవిగా అనిపిస్తాయి? మీ తల్లిదండ్రుల ఆంక్షలనుబట్టి మీకు నిర్బంధించబడినట్లు అనిపిస్తే, మీరు దాని విషయంలో ఏమి చేయవచ్చు?

“నేనింకా చిన్నపిల్లను కాను”!

“నేనింకా చిన్నపిల్లను కానని, నాకు కాస్త స్వేచ్ఛ అవసరమని నా తల్లిదండ్రులతో ఎలా చెప్పాలి?” అని ఎమిలీ అనే యౌవనస్థురాలు అడుగుతోంది. మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఎమిలీలాగే, మిమ్మల్ని ఓ చిన్నపిల్లలా చూస్తున్నారని మీకు అనిపిస్తుండవచ్చు కాబట్టే మీకు ఆ నియమాలు అంతగా రుచించకపోవచ్చు. కానీ, మీ తల్లిదండ్రుల దృక్కోణం మరోలా ఉండవచ్చు. మిమ్మల్ని సంరక్షించడానికి, యుక్తవయసులో ఎదురయ్యే బాధ్యతల కోసం మిమ్మల్ని సంసిద్ధుల్ని చేయడానికి ఆ నియమాలు అవసరమని వారు భావిస్తుండవచ్చు.

మీకు కాస్త స్వేచ్ఛ ఇవ్వబడినా మీ వయసుకు తగినంత స్వాతంత్ర్యం ఇవ్వబడడం లేదని మీకు అనిపిస్తుండవచ్చు. మీ తోబుట్టువులకు మరింత స్వేచ్ఛ ఇవ్వబడుతున్నట్లు అనిపిస్తుంటే అది మీకు మరింత బాధ కలిగించవచ్చు. “నాకు 17 ఏళ్లు, అప్పుడే నా విషయంలో ఆంక్షలు విధిస్తున్నారు. నేనేదైనా తప్పు చేస్తే ఇంట్లో బంధించేస్తారు. కానీ మా అన్నకు నా వయసున్నప్పుడు ఆంక్షలు విధించడం గానీ, ఇంట్లోనే ఉండమని చెప్పడం గానీ జరిగేది కాదు” అని మార్సీ అనే యౌవనస్థురాలు అంటోంది. తన యౌవనాన్ని గుర్తుచేసుకుంటున్న మాథ్యూ తన చెల్లెలు, అత్త కూతుర్ల గురించి చెబుతూ, “వారెంత పెద్ద తప్పు చేసినా శిక్షపడకుండా తప్పించుకునేవారు” అని అంటున్నాడు.

ఆంక్షలే లేకపోవడం మంచిదా?

మీరు తల్లిదండ్రుల అధికారం లేని జీవితాన్ని కోరుకోవడం అర్థంచేసుకోదగినదే. కానీ వారు ఆంక్షలు విధించకుండా ఉండడం మీకు నిజంగా మంచిదేనా? తమకు ఇష్టం వచ్చినంత సేపు బయట తిరిగేవారు, నచ్చిన దుస్తులు ధరించేవారు, వారికి తోచిన సమయాల్లో, నచ్చిన ప్రదేశాలకు స్నేహితులతో తిరిగే మీ తోటివయస్కుల్లో కొందరు మీకు తెలిసివుండవచ్చు. వారి తల్లిదండ్రులు బహుశా వారిని పట్టించుకోలేనంత బిజీగా ఉండవచ్చు. ఏదేమైనా, అలా పిల్లల్ని పట్టించుకోకుండా వదిలేయడం మంచి ఫలితాలనివ్వదని రుజువైంది. (సామెతలు 29:​15) ప్రపంచంలో మీరు చూస్తున్న ప్రేమరాహిత్యానికి ముఖ్యకారణం, అది స్వార్థపూరిత ప్రజలతో నిండివుండడమే, వారిలో అనేకమంది అలా ఇళ్ళలో అదుపులేకుండా పెరిగిన పిల్లలే.​—2 తిమోతి 3:​1-5.

ఏదో ఒకరోజు, ఆంక్షలు విధించబడని ఇంటి గురించి మీరు మరోలా భావిస్తారు. ఇంట్లో ఎక్కువగా ఆంక్షలు విధించని, తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా తక్కువగా ఉన్న లేదా అసలు పర్యవేక్షణే లేని యౌవన స్త్రీలపై నిర్వహించబడిన అధ్యయనాన్ని పరిశీలించండి. గతాన్ని అవలోకనం చేసుకున్నప్పుడు, అలా క్రమశిక్షణ కొరవడడాన్ని వారిలో ఎవరూ ఆమోదించలేదు. బదులుగా, అలా క్రమశిక్షణలో పెట్టకపోవడం తమ తల్లిదండ్రుల అశ్రద్ధకు, అసమర్థతకు రుజువని వారు భావించారు.

తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేందుకు అనుమతించబడిన యౌవనస్థులను చూసి అసూయపడే బదులు, మీ తల్లిదండ్రుల నియమాలను వారికి మీపట్లవున్న ప్రేమకు, శ్రద్ధకు నిదర్శనంగా భావించండి. సహేతుకమైన పరిమితులను విధించడం ద్వారా వారు యెహోవా దేవుణ్ణి అనుకరిస్తున్నారు. యెహోవా తన ప్రజలతో “నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని అంటున్నాడు.​—కీర్తన 32:8.

ప్రస్తుతం ఆ నియమాలు మీకు భారమైనవిగా అనిపించవచ్చు. అలాగైతే, ఇంట్లో మీ జీవితాన్ని మరింత సంతోషభరితం చేసుకునేందుకు మీరు చేయదగిన కొన్ని ఆచరణాత్మకమైన చర్యలను గమనించండి.

మంచి సంభాషణ

మీకు ఎక్కువ స్వేచ్ఛ కావాలన్నా లేక మీకున్న స్వేచ్ఛతోనే తక్కువ ఆందోళన ఉండాలన్నా, దానికి కీలకం మంచి సంభాషణే. ‘కానీ, నేను నా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నించాను, వారస్సలు వినిపించుకోరు!’ అని కొందరు అనవచ్చు. మీకూ అలాగే అనిపిస్తే, ‘నేను నా మాట్లాడే తీరును మెరుగుపరుచుకోగలనా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంభాషణ అనేది ప్రాముఖ్యమైన ఉపకరణంగా మీకు సహాయం చేయగలదు. ఎలాగంటే అది (1) మీరు కోరుకునేది మీకు లభించేలా చేయవచ్చు లేదా (2) మీరు కోరుకునేది ఎందుకు అంగీకరించబడడం లేదో అర్థం చేసుకునేందుకు సహాయం చేయవచ్చు. ఎదిగినవారికి లభించే ఆధిక్యతలే మీకు లభించాలంటే, మీరు పరిణతి చెందిన సంభాషణా నైపుణ్యాలను పెంపొందించుకోవడం నిజంగా సహేతుకమే.

మీభావాలను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. “బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును, జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును” అని బైబిలు చెబుతోంది. (సామెతలు 29:​11) చక్కగా సంభాషించడం అంటే ఫిర్యాదు చేయడం కాదు. అలా చేస్తే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మరింత గద్దించవచ్చు! కాబట్టి, ఫిర్యాదులు చేయకండి, అలగకండి, లేదా చిందులు తొక్కకండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నిర్బంధించినప్పుడు తలుపులు బాదాలని లేదా ఇంట్లో చిందులు తొక్కాలని మీకు ఎంతగా అనిపించినా, మీరలా చేస్తే మీకు స్వేచ్ఛ దొరకదు సరికదా బహుశా అది మరిన్ని ఆంక్షలకు దారితీయవచ్చు.

మీతల్లిదండ్రుల దృక్కోణం నుండి చూడడానికి ప్రయత్నించండి. ఒంటరి తల్లి సంరక్షణలో ఉన్న ట్రేసీ అనే క్రైస్తవ యౌవనస్థురాలికి ఇలా చేయడం సహాయకరంగా అనిపించింది. “‘అమ్మ ఇలా నియమాలు ఎందుకు విధిస్తోంది, నేను మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలనే కదా ఆమె తాపత్రయపడుతోంది’ అని నాలో నేను అనుకుంటాను” అని చెబుతోంది. (సామెతలు 3:​1, 2) మీ తల్లిదండ్రుల ఆందోళనను అర్థం చేసుకోవడం, మీ దృక్కోణాన్ని వారికి వివరించేందుకు మీకు సహాయం చేస్తుంది. ఉదాహరణకు, వారు మిమ్మల్ని ఫలానా పార్టీకి పంపించడానికి ఇష్టపడడం లేదనుకోండి. మీరు వారితో వాదించేబదులు, “పరిణతి చెందిన, నమ్మదగిన స్నేహితులొకరు నాతోపాటు వస్తే మీకు అభ్యంతరం ఉంటుందా?” అని అడిగి చూడండి. మీ తల్లిదండ్రులు అన్ని సందర్భాల్లో మీరు అడిగినదానికి ఒప్పుకోకపోవచ్చు. అయితే, వారు దేని విషయంలో ఆందోళనపడుతున్నారో అర్థం చేసుకుంటే, వారికి అంగీకారమైన మరో మార్గం సూచించేందుకు మీకు మంచి అవకాశం ఉంటుంది.

మీతల్లిదండ్రులకు మీపై నమ్మకం కుదిరేలా చేసుకోండి. మీ తల్లిదండ్రులకు మీపై నమ్మకం ఏర్పడేలా చేసుకోవడం అంటే బ్యాంకు అక్కౌంటులో డబ్బు ఆదా చేసుకోవడం వంటిదే. మీరు పూర్వం జమకట్టినదాన్నే మీరు తిరిగి తీసుకోగలరు. ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు జరిమానా విధిస్తారు, అలా ఎక్కువసార్లు జరిగితే మీ అక్కౌంట్‌ మూతపడే అవకాశం ఉంది. మీరు అదనపు ఆధిక్యతలు సంపాదించుకోవడం అంటే డబ్బును బయటకు తీయడం లాంటిది. మీరు బాధ్యతాయుతమైన నడవడి గలవారనే పేరు తెచ్చుకుంటేనే ఆధిక్యతలు మీకు లభిస్తాయి.

వారి నుండి ఎక్కువగా ఆపేక్షించకండి. మీరు చేసే పనులను పర్యవేక్షించడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకే బైబిలు “తండ్రి ఆజ్ఞ” గురించి “తల్లి ఉపదేశము” గురించి మాట్లాడుతోంది. (సామెతలు 6:​20) అయితే, ఇంట్లో విధించే నియమాలు మీ జీవితాన్ని దుర్భరం చేస్తాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా, మీరు మీ తల్లిదండ్రుల అధికారానికి లోబడితే, భవిష్యత్తులో ‘మేలు కలుగుతుందని’ యెహోవా వాగ్దానం చేస్తున్నాడు.​—ఎఫెసీయులు 6:​1, 2. (g 12/06)

 

ఆలోచించాల్సిన విషయాలు

  • మీకు లోబడడానికి అత్యంత కష్టంగా అనిపించే కొన్ని నియమాలు ఏమిటి?

  • తల్లిదండ్రులు విధించే ఆంక్షలను సరైన దృక్కోణంతో స్వీకరించడానికి ఈ ఆర్టికల్‌లోని ఏ విషయాలు మీకు సహాయం చేస్తాయి?

  • మీతల్లిదండ్రులకు మీపై ఉన్న నమ్మకాన్ని ఎలా పెంచుకోవచ్చు?