సమూయేలు మొదటి గ్రంథం 25:1-44

  • సమూయేలు చనిపోవడం (1)

  • నాబాలు దావీదు మనుషుల్ని అవమానించడం (2-13)

  • అబీగయీలు చేసిన తెలివైన పని (14-35)

    • ‘యెహోవా జీవపు మూటలో భద్రంగా చుడతాడు’ (29)

  • తెలివితక్కువ నాబాలును యెహోవా మొత్తడం (36-38)

  • అబీగయీలు దావీదు భార్య కావడం (39-44)

25  కొంతకాలానికి సమూయేలు+ చనిపోయాడు; అతని కోసం ఏడ్వడానికి, రామాలోని అతని ఇంటి దగ్గర+ అతన్ని పాతిపెట్టడానికి ఇశ్రాయేలీయులందరూ వచ్చారు. తర్వాత దావీదు లేచి పారాను ఎడారికి వెళ్లాడు.  మాయోనులో+ ఒకతను ఉండేవాడు. అతను కర్మెలులో*+ పనిచేసేవాడు. అతను చాలా ధనవంతుడు; అతనికి 3,000 గొర్రెలు, 1,000 మేకలు ఉండేవి. ఆ సమయంలో అతను కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు.  అతని పేరు నాబాలు,+ అతని భార్య పేరు అబీగయీలు.+ ఆమె వివేచనగలది, అందంగా ఉంటుంది. కానీ కాలేబు వంశస్థుడైన+ ఆమె భర్త కఠినుడు, చెడ్డగా ప్రవర్తించేవాడు.+  నాబాలు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని ఎడారిలో ఉన్న దావీదు విన్నాడు.  కాబట్టి దావీదు అతని దగ్గరికి పదిమంది యువకుల్ని పంపిస్తూ వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు కర్మెలుకు వెళ్లండి; నాబాలును కలిసి, నేను అతని బాగోగుల గురించి అడిగానని చెప్పండి.  తర్వాత ఇలా చెప్పండి, ‘నువ్వు ఎక్కువకాలం బ్రతకాలి, నువ్వు బాగుండాలి,* నీ ఇంటివాళ్లూ, నీకు ఉన్నవన్నీ బాగుండాలి.  నువ్వు గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నావని నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు మాతో ఉన్నప్పుడు మేము వాళ్లకు ఏ హానీ చేయలేదు,+ కర్మెలులో ఉన్నంతకాలం వాళ్లు దేన్నీ పోగొట్టుకోలేదు.  నీ సేవకుల్ని అడుగు, వాళ్లే చెప్తారు. నా యువకుల మీద నీ దయ ఉండాలి, ఎందుకంటే సంతోషించే సమయంలో* మేము వచ్చాం. దయచేసి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా నీ సేవకులకు, నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు.’ ”+  అప్పుడు, దావీదు యువకులు వెళ్లి ఆ మాటలన్నీ దావీదు పేరు మీద నాబాలుకు చెప్పారు. వాళ్లు అలా చెప్పగానే, 10  నాబాలు దావీదు సేవకులతో ఇలా అన్నాడు: “దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? ఈ రోజుల్లో చాలామంది తమ యజమానుల దగ్గర నుండి తప్పించుకొని పారిపోతున్నారు.+ 11  నేను నా రొట్టెను, నీళ్లను, నా గొర్రెల బొచ్చు కత్తిరించేవాళ్ల కోసం నేను వధించిన మాంసాన్ని తీసుకొని ఎక్కడి నుండి వచ్చారో తెలియని మనుషులకు ఇవ్వాలా?” 12  దాంతో దావీదు యువకులు తిరిగొచ్చి, అతను అన్న మాటలన్నిటినీ దావీదుకు చెప్పారు. 13  వెంటనే దావీదు తన మనుషులతో, “మీలో ప్రతీ ఒక్కరు మీ మీ కత్తులు ధరించండి!” అని చెప్పాడు.+ అప్పుడు వాళ్లందరూ తమ కత్తులు ధరించారు, దావీదు కూడా తన కత్తి ధరించాడు; దావీదు వెంట దాదాపు 400 మంది వెళ్లారు, 200 మంది సామాను దగ్గర ఉండిపోయారు. 14  ఈలోగా, నాబాలు సేవకుడు ఒకతను నాబాలు భార్య అబీగయీలుకు ఇలా చెప్పాడు: “ఇదిగో! మన యజమానికి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పడానికి ఎడారి నుండి దావీదు మనుషుల్ని పంపించాడు. కానీ అతను వాళ్లను అవమానిస్తూ గట్టిగా అరిచాడు.+ 15  వాళ్లు మాతో ఎంతో మంచిగా ఉన్నారు. వాళ్లు మాకు ఎప్పుడూ హాని చేయలేదు. మేము వాళ్లతోపాటు పొలంలో ఉన్నంతకాలం ఏ ఒక్కటీ పోగొట్టుకోలేదు.+ 16  మేము మందను కాస్తూ వాళ్లతో ఉన్నంతకాలం, వాళ్లు రాత్రింబగళ్లు మా చుట్టూ రక్షణ గోడలా ఉన్నారు. 17  మన యజమాని మీదికి, అతని కుటుంబమంతటి మీదికి ఖచ్చితంగా విపత్తు రాబోతోంది,+ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏమి చేయాలో నిర్ణయించుకో. అతను ఎంత పనికిమాలినవాడంటే,+ అతనితో ఎవ్వరూ మాట్లాడలేరు.” 18  అబీగయీలు+ వెంటనే 200 రొట్టెల్ని, రెండు పెద్ద కుండల్లో ద్రాక్షారసాన్ని, సిద్ధం చేసిన ఐదు గొర్రెల్ని, ఐదు సీయ కొలతల* వేయించిన ధాన్యాన్ని, 100 ఎండుద్రాక్ష రొట్టెల్ని, 200 అంజూర రొట్టెల్ని తీసుకొని వాటన్నిటినీ గాడిదల మీద పెట్టించింది.+ 19  తర్వాత ఆమె తన సేవకులతో, “మీరు నా ముందు వెళ్లండి; నేను మీ వెనక వస్తాను” అని చెప్పింది. కానీ తన భర్త నాబాలుకు ఆమె ఏమీ చెప్పలేదు. 20  ఆమె గాడిద మీద కిందికి వస్తుండగా కొండ అడ్డుగా ఉండడంతో ఆమెవైపుగా వస్తున్న దావీదు, అతని మనుషులు ఆమెను చూడలేదు. తర్వాత ఆమె వాళ్లను కలిసింది. 21  అప్పటివరకు దావీదు ఇలా అంటూ ఉన్నాడు: “నేను ఎడారిలో అతనికి ఉన్నవన్నీ అనవసరంగా కాపాడుతూ వచ్చాను. అతనికి చెందినదేదీ పోలేదు.+ అయినాసరే, నేను చేసిన మేలుకు బదులుగా అతను నాకు కీడే చేస్తున్నాడు.+ 22  నేను ఉదయం కల్లా అతనికి చెందిన ఒక్క మగవాడినైనా బ్రతకనిస్తే, దేవుడు దావీదు శత్రువుల మీద* పగ తీర్చుకోవాలి. ఆయన వాళ్లను ఇంకా తీవ్రంగా శిక్షించాలి.” 23  అబీగయీలు దావీదును చూడగానే త్వరత్వరగా గాడిద మీద నుండి దిగి, దావీదు ముందు మోకాళ్లూని సాష్టాంగ నమస్కారం చేసింది. 24  ఆ తర్వాత ఆమె అతని కాళ్లమీద పడి ఇలా చెప్పింది: “నా ప్రభూ, ఆ నింద నా మీదికి రానివ్వు; నీ సేవకురాలిని మాట్లాడనివ్వు, నీ సేవకురాలు చెప్పేది విను. 25  నా ప్రభూ, పనికిమాలినవాడైన+ ఆ నాబాలును దయచేసి పట్టించుకోకు, అతను తన పేరుకు తగ్గట్టే ఉన్నాడు. అతని పేరే నాబాలు,* మూర్ఖత్వం అతని స్వభావం. కానీ, నా ప్రభువు పంపించిన మనుషుల్ని నీ సేవకురాలు చూడలేదు. 26  నా ప్రభూ, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నీ మీదికి రక్తాపరాధం రాకుండా,+ నీ చేతులతో నువ్వే పగతీర్చుకోకుండా* యెహోవాయే నిన్ను ఆపాడు.+ నీ శత్రువులూ, నా ప్రభువుకు హాని చేయాలనుకునేవాళ్లూ నాబాలులా అవ్వాలి. 27  నా ప్రభువు కోసం నీ సేవకురాలు తీసుకొచ్చిన ఈ కానుకను*+ నా ప్రభువును అనుసరిస్తున్న యువకులకు ఇవ్వు.+ 28  దయచేసి నీ సేవకురాలి అపరాధాన్ని క్షమించు. యెహోవా తప్పకుండా నా ప్రభువు ఇంటిని చాలాకాలం కొనసాగనిస్తాడు.+ ఎందుకంటే నా ప్రభువు, యెహోవా యుద్ధాల్ని పోరాడుతున్నాడు,+ అలాగే, నీ రోజులన్నిట్లో ఎలాంటి చెడు నీలో కనిపించలేదు.+ 29  ఎవరైనా లేచి నిన్ను తరిమి, నీ ప్రాణం తీయడానికి ప్రయత్నించినప్పుడు, నీ దేవుడైన యెహోవా నా ప్రభువు ప్రాణాన్ని జీవపు మూటలో భద్రంగా చుడతాడు. కానీ నీ శత్రువుల ప్రాణాల్ని ఆయన వడిసెలలోని రాళ్లలా విసురుతాడు. 30  యెహోవా తాను వాగ్దానం చేసిన మంచి విషయాలన్నీ నా ప్రభువు కోసం చేసి, ఆయన నిన్ను ఇశ్రాయేలు మీద నాయకునిగా నియమించినప్పుడు,+ 31  నా ప్రభువైన నువ్వు, కారణం లేకుండా రక్తం చిందించావని, నీ చేతులతో నువ్వే పగతీర్చుకున్నావని* నీ హృదయంలో బాధపడకుండా, పశ్చాత్తాపపడకుండా ఉంటావు.+ యెహోవా నా ప్రభువైన నీకు మేలు చేసినప్పుడు, నీ సేవకురాల్ని గుర్తుచేసుకో.” 32  అప్పుడు దావీదు అబీగయీలుతో ఇలా అన్నాడు, “ఈ రోజు నన్ను కలవడానికి నిన్ను పంపించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి! 33  నువ్వు మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి! నా మీదికి రక్తాపరాధం రాకుండా,+ నా చేతులతో పగతీర్చుకోకుండా* నన్ను ఆపినందుకు నువ్వు దీవెన పొందాలి. 34  నీకు హాని చేయకుండా+ నన్ను ఆపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నువ్వు నన్ను కలవడానికి త్వరగా రాకపోయుంటే,+ ఉదయానికల్లా నాబాలుకు చెందిన ఒక్క మగవాడు కూడా మిగిలివుండేవాడు కాదు.”+ 35  దాంతో దావీదు తన కోసం అబీగయీలు తెచ్చినవాటిని తీసుకొని ఆమెతో, “నువ్వు ప్రశాంతంగా నీ ఇంటికి వెళ్లు. చూడు, నేను నీ మాట విన్నాను. నీ కోరికను మన్నిస్తాను” అన్నాడు. 36  తర్వాత అబీగయీలు నాబాలు దగ్గరికి వెళ్లింది. అతను తన ఇంట్లో ఒక రాజులా విందు చేసుకుంటున్నాడు. నాబాలు* చాలా ఉల్లాసంగా ఉన్నాడు, విపరీతంగా తాగి ఉన్నాడు. అబీగయీలు తెల్లారేవరకు అతనికి ఒక్కమాట కూడా చెప్పలేదు. 37  ఉదయం నాబాలు మత్తు దిగిన తర్వాత, అతని భార్య ఆ విషయాల్ని అతనికి చెప్పింది. అప్పుడు అతని గుండె, చనిపోయిన వ్యక్తి గుండెలా అయ్యింది. అతను రాయిలా బిగుసుకుపోయాడు. 38  దాదాపు పది రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తడంతో అతను చనిపోయాడు. 39  నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, అతను ఇలా అన్నాడు: “యెహోవా స్తుతించబడాలి. నాబాలు చేసిన అవమానం+ విషయంలో ఆయన నా తరఫున వాదించి,+ తన సేవకుడు ఏ తప్పూ చేయకుండా చూశాడు;+ యెహోవా నాబాలు చెడుతనాన్ని అతని తలమీదికే రప్పించాడు!” తర్వాత దావీదు తాను అబీగయీలును పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఆమెకు కబురు పంపించాడు. 40  దాంతో దావీదు సేవకులు కర్మెలులో అబీగయీలు దగ్గరికి వచ్చి, “నిన్ను తన భార్యగా చేసుకోవాలని దావీదు మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు” అని ఆమెతో అన్నారు. 41  ఆమె వెంటనే లేచి నేలమీద సాష్టాంగపడి, “ఒక సేవకురాలిగా నా ప్రభువు సేవకుల పాదాలు కడగడానికి+ నేను సిద్ధంగా ఉన్నాను” అంది. 42  అప్పుడు అబీగయీలు+ వెంటనే లేచి తన గాడిదమీద బయల్దేరింది. ఆమె వెనక ఆమె ఐదుగురు సేవకురాళ్లు నడుస్తూ వెళ్లారు. ఆమె దావీదు మనుషులతోపాటు వెళ్లింది; దావీదుకు భార్య అయ్యింది. 43  దావీదు యెజ్రెయేలుకు+ చెందిన అహీనోయమును+ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు స్త్రీలు అతని భార్యలయ్యారు.+ 44  అయితే సౌలు తన కూతురూ, దావీదు భార్యా అయిన మీకాలును+ గల్లీముకు చెందిన లాయిషు కుమారుడైన పల్తీకి+ ఇచ్చాడు.

అధస్సూచీలు

ఇది యూదాలోని ఒక నగరం; కర్మెలు పర్వతం కాదు.
లేదా “నీకు శాంతి ఉండాలి.”
అక్ష., “మంచి రోజున.”
అప్పట్లో ఒక సీయ 7.33 లీటర్లతో (దాదాపు 10 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “దావీదు మీద” అయ్యుంటుంది.
“తెలివితక్కువవాడు; మూర్ఖుడు” అని అర్థం.
లేదా “రక్షణ సంపాదించుకోకుండా.”
అక్ష., “దీవెనను.”
లేదా “రక్షణ సంపాదించుకున్నావని.”
లేదా “రక్షణ సంపాదించుకోకుండా.”
అక్ష., “నాబాలు హృదయం.”