కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్యులు దేవుని ప్రార్థనమందిరానికి సమకూడారు

అన్యులు దేవుని ప్రార్థనమందిరానికి సమకూడారు

పదిహేడవ అధ్యాయం

అన్యులు దేవుని ప్రార్థనమందిరానికి సమకూడారు

యెషయా 56:​1-12

1, 2. ఉత్తేజకరమైన ఏ ప్రకటన 1935 లో చేయబడింది, అది దేనిలో ఒక భాగమైయుంది?

 జోసెఫ్‌. ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ 1935, మే 31 శుక్రవారం, వాషింగ్‌టన్‌, డి.సి.లో జరిగిన సమావేశంలో ప్రసంగించాడు. అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూసిన “గొప్ప సమూహము” యొక్క గుర్తింపును గురించి ఆయన చర్చించాడు. ఆయన తన ప్రసంగ ముగింపులో ఇలా అడిగాడు: “భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణగల వారంతా దయచేసి లేచి నిలబడతారా?” ఆ సమావేశానికి హాజరైన వారిలో ఒకరు దాని గురించి ఇలా చెప్పారు: “ప్రేక్షకుల్లో సగానికి పైగా లేచి నిలబడ్డారు.” అప్పుడు ప్రసంగీకుడు, “ఇదిగో! గొప్ప సమూహము!” అన్నాడు. అదే సమావేశానికి హాజరైన మరొక స్త్రీ ఇలా గుర్తుచేసుకుంటోంది: “మొదట కాస్త గుసగుసలు వినబడ్డాయి, తర్వాత ఆనందభరితమైన కేకలు, ఆ తర్వాత చాలాసేపటి వరకు బిగ్గరగా హర్షధ్వానాలు కొనసాగాయి.”​—⁠ప్రకటన 7: 9.

2 దాదాపు 2,700 సంవత్సరాల క్రితం వ్రాయబడి, మన బైబిళ్ళలో యెషయా 56 వ అధ్యాయంగా కనిపించే ఒక ప్రవచనం యొక్క కొనసాగుతున్న నెరవేర్పులో అది ఎంతో విశేషమైన సమయం. యెషయా గ్రంథంలోని అనేక ఇతర ప్రవచనాల్లాగే, దీనిలో కూడా ఓదార్పుకరమైన వాగ్దానాలు, తీవ్రమైన హెచ్చరికలు రెండూ ఉన్నాయి. మొదటి అన్వయింపులో, అది యెషయా కాలంనాటి దేవుని నిబంధన ప్రజలను ఉద్దేశించి చెప్పబడింది, కానీ దాని నెరవేర్పు శతాబ్దాలపాటు అంటే మన కాలం వరకు కొనసాగుతోంది.

రక్షణకు ఏమి అవసరం?

3. యూదులు దేవుని నుండి రక్షణ పొందాలనుకుంటే, వారేమి చేయాలి?

3 యెషయా 56 వ అధ్యాయం యూదులకు ఇవ్వబడే హెచ్చరికతో ప్రారంభమవుతుంది. అయితే, ప్రవక్త వ్రాస్తున్నదాన్ని సత్యారాధకులందరూ లక్ష్యపెట్టాలి. మనమిలా చదువుతాము: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండ తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు, ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు.” (యెషయా 56:​1, 2) దేవుని నుండి రక్షణను కోరుకునే యూదా నివాసులు, న్యాయవిధిని అనుసరిస్తూ నీతియుక్తమైన జీవితాలను గడుపుతూ మోషే ధర్మశాస్త్రానికి విధేయులు కావాలి. ఎందుకు? ఎందుకంటే యెహోవా తానే నీతిమంతుడు. నీతిని అనుసరించేవారు యెహోవా అనుగ్రహాన్ని పొందడం వల్ల లభించే ఆనందాన్ని అనుభవిస్తారు.​—⁠కీర్తన 144: 15బి.

4. ఇశ్రాయేలులో విశ్రాంతి దిన ఆచరణ ఎందుకు ప్రాముఖ్యమైనది?

4 ప్రవచనం విశ్రాంతిదిన ఆచరణను నొక్కి చెబుతోంది, ఎందుకంటే విశ్రాంతిదినం మోషే ధర్మశాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. వాస్తవానికి, యూదా నివాసులు చెరలోకి వెళ్ళడానికి గల కారణాల్లో కూడా ఒకటి, వారు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయడమే. (లేవీయకాండము 26:​34, 35; 2 దినవృత్తాంతములు 36:​20, 21) విశ్రాంతి దినము యెహోవాకు యూదులతో ఉన్న ప్రత్యేకమైన సంబంధానికి చిహ్నము, విశ్రాంతి దినాన్ని ఆచరించేవారు తాము ఆ సంబంధాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపిస్తారు. (నిర్గమకాండము 31:​13) అంతేగాక, విశ్రాంతి దినాన్ని ఆచరించడం, యెహోవాయే సృష్టికర్త అన్న విషయాన్ని యెషయా సమకాలీనులకు గుర్తుచేస్తుంది. అలాంటి ఆచరణ, ఆయన వారిపట్ల చూపించిన కనికరాలను కూడా వారికి గుర్తుచేస్తుంది. (నిర్గమకాండము 20:​8-11; ద్వితీయోపదేశకాండము 5:​12-15) చివరిగా, విశ్రాంతి దిన ఆచరణ యెహోవాను క్రమముగానూ సంస్థీకృతముగానూ ఆరాధించడాన్ని సాధ్యం చేస్తుంది. యూదా నివాసులు తమ అనుదిన పనుల నుండి వారానికి ఒకసారి విశ్రమించడం ప్రార్థించడానికీ, అధ్యయనం చేయడానికీ, ధ్యానించడానికీ అవకాశాన్ని ఇస్తుంది.

5. సూత్రబద్ధంగా, విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఇవ్వబడిన ఉపదేశాన్ని క్రైస్తవులు ఎలా అన్వయించుకోగలరు?

5 అయితే క్రైస్తవుల మాటేమిటి? విశ్రాంతి దినాన్ని ఆచరించాలన్న ప్రోత్సాహం వారికి కూడా అన్వయిస్తుందా? ప్రత్యక్షంగా అన్వయించదు, ఎందుకంటే క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద లేరు గనుక వారు విశ్రాంతి దినాన్ని ఆచరించవలసిన అవసరం లేదు. (కొలొస్సయులు 2:​16, 17) అయినప్పటికీ, నమ్మకమైన క్రైస్తవుల కోసం “విశ్రాంతి నిలిచియున్నది” అని అపొస్తలుడైన పౌలు వివరించాడు. ఈ ‘నిలిచియున్న విశ్రాంతిలో,’ రక్షణ కోసం యేసు విమోచన క్రయధనబలిలో విశ్వాసం ఉంచడమూ, కేవలం క్రియలపై ఆధారపడడాన్ని మానుకోవడమూ ఇమిడి ఉన్నాయి. (హెబ్రీయులు 4:​6-10) కాబట్టి యెషయా ప్రవచనంలోని విశ్రాంతిదినాన్ని గురించిన మాటలు, రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాటులో విశ్వాసం ఉంచవలసిన ఆవశ్యకతను నేడు యెహోవా సేవకులకు గుర్తు చేస్తాయి. యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోవలసిన, క్రమమైన సంగతమైన ఆరాధనా విధానాన్ని అవలంబించవలసిన అవసరతకు కూడా అది ఒక చక్కని జ్ఞాపిక.

అన్యులకు, షండులకు ఓదార్పు

6. ఇప్పుడు ఏ రెండు గుంపులవైపుకు అవధానం మళ్ళించబడుతోంది?

6 యెహోవా ఇప్పుడు, తన సేవ చేయాలని కోరుకుంటున్నప్పటికీ మోషే ధర్మశాస్త్రము ప్రకారం యూదా సంఘంలోకి రావడానికి అర్హులు కాని రెండు వర్గాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనమిలా చదువుతాము: “యెహోవాను హత్తుకొను అన్యుడు​—⁠నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు​—⁠నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు.” (యెషయా 56: 3) అన్యునికి, తాను ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడతానేమోనన్న భయం ఉంటుంది. తన పేరును నిలుపడానికి ఎన్నడూ పిల్లలు కలగరన్నదే షండుని చింత. ఇరువర్గాలవారు ధైర్యం తెచ్చుకోవాలి. అదెందుకో తెలుసుకునే ముందు, ఇశ్రాయేలు జనముకు సంబంధించి ధర్మశాస్త్రము ప్రకారం వారి స్థానమేమిటో మనం పరిశీలిద్దాం.

7. ధర్మశాస్త్రం ఇశ్రాయేలులోని అన్యులపై ఏ పరిమితులను విధించింది?

7 సున్నతి పొందని అన్యులు ఇశ్రాయేలుతోపాటు ఆరాధనలో భాగం వహించకూడదు. ఉదాహరణకు, వారు పస్కా పండుగలో పాల్గొనడానికి అనుమతించబడలేదు. (నిర్గమకాండము 12:​43) ఆ దేశపు నియమాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించని అన్యులు న్యాయాన్ని, ఆతిథ్యాన్ని పొందుతారు, కానీ వారు ఈ జనముతో శాశ్వత సంబంధాలు కలిగి ఉండలేరు. అయితే కొందరు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అనుసరిస్తారు, దీనికి సూచనగా పురుషులు సున్నతి చేయించుకుంటారు. అప్పుడు వారు యూదామత ప్రవిష్టులు అవుతారు, వారు యెహోవా మందిరపు ఆవరణములో ఆరాధించే ఆధిక్యతను పొంది, ఇశ్రాయేలు సంఘంలో భాగంగా పరిగణించబడతారు. (లేవీయకాండము 17:​10-14; 20: 2; 24:​22) అయితే, యుదామత ప్రవిష్టులు కూడా ఇశ్రాయేలుతో యెహోవా చేసిన నిబంధనలో పూర్తిగా భాగం వహించలేరు, వాగ్దాన దేశంలో వారికి భూమి కూడా స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు. ఇతర పరదేశులు ఆలయం వైపు తిరిగి ప్రార్థించవచ్చు, అంతేగాక వారు అర్పించే బలులు ధర్మశాస్త్రానుసారంగా ఉన్నంత వరకూ వారు యాజకత్వం ద్వారా బలులను అర్పించవచ్చని స్పష్టమవుతోంది. (లేవీయకాండము 22:​25; 1 రాజులు 8:​41-43) కానీ ఇశ్రాయేలీయులు వారితో సన్నిహితంగా సహవసించకూడదు.

షండులు నిత్యమైన పేరును పొందుతారు

8. (ఎ) ధర్మశాస్త్రము ప్రకారం షండులు ఎలా దృష్టించబడేవారు? (బి) అన్య జనములు షండులను ఎలా ఉపయోగించుకునేవి, “షండుడు” అనే పదం కొన్నిసార్లు దేన్ని సూచించవచ్చు?

8 యూదులైన తల్లిదండ్రులకే జన్మించినప్పటికీ షండులకు ఇశ్రాయేలు జనములో పూర్తి సభ్యత్వం ఇవ్వబడలేదు. a (ద్వితీయోపదేశకాండము 23: 1) బైబిలు కాలాల్లోని అన్య జనములకు చెందిన కొందరి మధ్య, షండులకు ప్రత్యేక స్థానం ఉండేది, యుద్ధంలో చెరగా తీసుకుపోబడిన కొంతమంది పిల్లల మర్మాంగములను తీసివేయడం ఆచారంగా ఉండేది. షండులు రాజాస్థానములలో అధికారులుగా నియమించబడేవారు. ఒక షండుడు “స్త్రీలకు కాపరి”గా, “ఉపపత్నులను కాయు”వానిగా, లేదా రాణి దగ్గర సేవకుడిగా ఉండవచ్చు. (ఎస్తేరు 2:​3, 12-15; 4:​4-6, 9) ఇశ్రాయేలీయులు అలాంటి ఆచారాలను పాటించేవారనడానికి లేదా ఇశ్రాయేలు రాజుల దగ్గర సేవ చేయడానికి ప్రత్యేకంగా షండుల కోసమే చూడడం జరిగేదనడానికి సాక్ష్యాధారమేమి లేదు. b

9. యెహోవా శారీరక షండులను ఉద్దేశించి ఏ ఓదార్పుకరమైన మాటలు పలుకుతున్నాడు?

9 ఇశ్రాయేలులో ఉన్న శారీరక షండులు సత్యదేవుని ఆరాధనలో కేవలం పరిమితమైన విధంగానే భాగం వహించగలగడమే గాక, తమ కుటుంబ పేరును నిలబెట్టడానికి పిల్లలను కనలేకపోవడం వల్ల కలిగే గొప్ప అవమానాన్ని కూడా అనుభవిస్తుంటారు. కాబట్టి, ప్రవచనంలోని తర్వాతి మాటలు ఎంత ఓదార్పును ఇస్తాయో కదా! మనమిలా చదువుతాము: “నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు​—⁠నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను, కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను.”​—యెషయా 56: 4, 5.

10. షండుల పరిస్థితి ఎప్పుడు మారింది, అప్పటి నుండి వారికి ఏ ఆధిక్యత ఇవ్వబడుతోంది?

10 అవును, శారీరకంగా షండులై ఉండడం, యెహోవా సేవకునిగా పూర్తిగా అంగీకరించబడే విషయంలో ఇక ఎంతమాత్రం ఒక ఆటంకంగా ఉండని సమయం వస్తుంది. షండులు విధేయులుగా ఉంటే వారికి యెహోవా ఆలయంలో “ఒక భాగము” లేదా ఒక స్థానము లభిస్తుంది, కుమారులు కుమార్తెలు అనేదాని కంటే శ్రేష్ఠమైన పేరు వారికి లభిస్తుంది. ఇదెప్పుడు జరిగింది? యేసుక్రీస్తు మరణించేంత వరకు జరగలేదు. అప్పుడు పాత ధర్మశాస్త్ర నిబంధన స్థానాన్ని క్రొత్త నిబంధన తీసుకుంది, భౌతిక ఇశ్రాయేలీయుల స్థానాన్ని “దేవుని ఇశ్రాయేలు” తీసుకుంది. (గలతీయులు 6:​16) అప్పటి నుండి, విశ్వాసం ఉంచే వారందరూ దేవునికి అంగీకృతమైన ఆరాధనను చెల్లించగలుగుతున్నారు. ఇప్పుడిక శారీరక తేడాలు, భౌతిక పరిస్థితి పరిగణలోకి తీసుకోబడవు. నమ్మకంగా సహించేవారు, వారి శారీరక స్థితి ఏదైనా సరే, వారికి ‘కొట్టివేయబడని నిత్యమైన పేరు పెట్టబడుతుంది.’ యెహోవా వారిని మరచిపోడు. వారి పేర్లు ఆయన ‘జ్ఞాపకార్థ గ్రంథములో’ వ్రాయబడతాయి, దేవుని నియమిత సమయంలో, వారు నిత్యజీవాన్ని పొందుతారు.​—⁠మలాకీ 3:​16; సామెతలు 22: 1; 1 యోహాను 2:​17.

అన్యులు దేవుని ప్రజలతో కలిసి ఆరాధిస్తారు

11. ఆశీర్వాదములను పొందడానికి ఏమి చేయాలని అన్యులు ప్రోత్సహించబడుతున్నారు?

11 అయితే, అన్యుల మాటేమిటి? ప్రవచనం ఇప్పుడు వారివైపుకు మరలుతోంది, వారి కోసం యెహోవా వద్ద గొప్ప ఓదార్పు మాటలున్నాయి. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను, నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.”​—యెషయా 56: 6, 7.

12. “వేరే గొఱ్ఱెల”ను గురించిన యేసు ప్రవచనాన్ని ఒకప్పుడు ఎలా అర్థం చేసుకోవడం జరిగింది?

12 మన కాలంలో ‘అన్యులు’ నెమ్మదిగా కనిపించడం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం జరగక ముందు, యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే నిరీక్షణ గలవారికన్నా అంటే మనం నేడు దేవుని ఇశ్రాయేలుగా గుర్తిస్తున్న వారికన్నా రక్షణ పొందేవారి సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవడం జరిగింది. “ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును” అని యేసు పలికిన, యోహాను 10:16 లో వ్రాయబడివున్న మాటల గురించి బైబిలు విద్యార్థులకు తెలుసు. ఈ “వేరే గొఱ్ఱెల”ను భూసంబంధమైన తరగతిగా అర్థం చేసుకోవడం జరిగింది. కానీ వేరే గొఱ్ఱెలు, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో కనిపించనారంభిస్తారని చాలామంది బైబిలు విద్యార్థులు విశ్వసించారు.

13. మత్తయి 25 వ అధ్యాయంలోని గొఱ్ఱెలు ఈ విధానపు చివరి దినాల్లో కనిపించాలని ఎందుకు విడమర్చి చెప్పబడింది?

13 చివరికి, గొఱ్ఱెలను గురించి తెలియజేసే మరో సంబంధిత లేఖనాన్ని అర్థం చేసుకోవడంలో అభివృద్ధి సాధించడం జరిగింది. గొఱ్ఱెలు మేకల గురించి యేసు చెప్పిన ఉపమానం మత్తయి 25 వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఆ ఉపమానం ప్రకారం, గొఱ్ఱెలు యేసు సహోదరులకు మద్దతు ఇస్తారు గనుక వారు నిత్యజీవాన్ని పొందుతారు. కాబట్టి, వారు ఒక ప్రత్యేక తరగతిగా, క్రీస్తు అభిషిక్త సహోదరుల నుండి భిన్నమైనవారు. ఆ గొఱ్ఱెలు వెయ్యేండ్ల పరిపాలన సమయంలో కాదు గానీ ఈ విధానపు చివరి దినాల్లో కనిపించాలని, అమెరికాలోని కాలిఫోర్నియా నందలి లాస్‌ ఏంజిల్స్‌లో 1923 లో జరిగిన ఒక సమావేశంలో వివరించబడింది. ఎందుకు? ఎందుకంటే, “ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అనే ప్రశ్నలకు సమాధానంలో భాగంగా యేసు ఆ ఉపమానాన్ని చెప్పాడు.​—⁠మత్తయి 24: 3.

14, 15. అంత్యకాలములో వేరే గొఱ్ఱెల స్థానాన్ని అర్థం చేసుకోవడంలో ఎలా ప్రగతి సాధించబడింది?

14 బైబిలు విద్యార్థులతో సహవసిస్తున్న కొంతమంది వ్యక్తులు 1920లలో, పరలోక పిలుపు ఉన్నట్లుగా యెహోవా ఆత్మ తమకు సాక్ష్యమివ్వడం లేదని భావించనారంభించారు. అయినప్పటికీ, వారు సర్వోన్నతమైన దేవుని అత్యాసక్తిగల సేవకులుగానే ఉన్నారు. విండికేషన్‌ అనే పుస్తకం ప్రచురించబడినప్పుడు, 1931 లో వారి స్థానాన్ని మరింత బాగా అర్థం చేసుకున్నారు. బైబిలు పుస్తకమైన యెహెజ్కేలు యొక్క ప్రతి వచన చర్చలో భాగంగా, విండికేషన్‌ అనే పుస్తకం లేఖికుని సిరాబుడ్డితో ఉన్న ‘ఒకడిని’ గురించిన దర్శనాన్ని వివరించింది. (యెహెజ్కేలు 9:​1-11) ఈ “ఒకడు” యెరూషలేము గుండా వెళుతూ అక్కడ జరుగుతున్న హేయకృత్యాలను బట్టి మూల్గులిడుచు, ప్రలాపించుచున్న వారి లలాటములపై గురుతు వేస్తూ కనిపిస్తాడు. ఈ “ఒకడు” యేసు సహోదరులకు, అంటే యెరూషలేముకు సాదృశ్యమైన క్రైస్తవమత సామ్రాజ్యానికి తీర్పు తీర్చబడే సమయంలో భూమిపై సజీవంగా ఉండే అభిషిక్త క్రైస్తవుల శేషముకు ప్రాతినిధ్యం వహిస్తాడు. గురుతు వేయబడినవారు ఆ సమయంలో జీవించే వేరే గొఱ్ఱెలు. ఆ దర్శనములో, యెహోవా తీర్పును అమలు చేసేవారు ఆ మతభ్రష్ట నగరంపైకి ఉగ్రతను తీసుకువచ్చినప్పుడు వీరు తప్పించబడతారు.

15 ఇశ్రాయేలు రాజైన యెహూ, అతనికి మద్దతునిచ్చిన ఇశ్రాయేలీయుడు కాని యెహోనాదాబుల ప్రవచనార్థక నాటకాన్ని గూర్చి 1932 లో ఏర్పడిన లోతైన అవగాహన, యెహోనాదాబు యెహూతోకూడా వెళ్ళి బయలు ఆరాధనను నిర్మూలించడంలో ఆయనకు ఎలా మద్దతునిచ్చాడో సరిగ్గా అలాగే ఈ వేరే గొఱ్ఱెలు క్రీస్తు అభిషిక్త సహోదరులకు మద్దతుగా ఎలా చర్య తీసుకుంటారో సూచించింది. చివరికి, ఈ విధానాంతంలో జీవిస్తున్న వేరే గొఱ్ఱెలే అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూసిన గొప్ప సమూహమని 1935 లో గుర్తించడం జరిగింది. మునుపు పేర్కొన్న, వాషింగ్టన్‌, డి.సి.లో జరిగిన సమావేశంలో, జోసెఫ్‌ ఎఫ్‌. రూథర్‌ఫోర్డ్‌ భూనిరీక్షణ గలవారిని ‘గొప్ప సమూహము’ అని పేర్కొన్నప్పుడు ఇది మొదటిసారిగా వివరించబడింది.

16. “అన్యులు” ఏ ఆధిక్యతలను, బాధ్యతలను పొందుతారు?

16 అలా, ఈ అంత్యదినాల్లో యెహోవా సంకల్పాల్లో “అన్యులు” పెద్ద పాత్ర నిర్వహించవలసి ఉందని క్రమంగా తెలిసింది. యెహోవాను ఆరాధించడానికి వారు దేవుని ఇశ్రాయేలు వద్దకు వస్తారు. (జెకర్యా 8:​23) ఆ ఆధ్యాత్మిక జనముతో కలిసి వారు దేవునికి అంగీకృతమైన బలులను అర్పించి, నిలిచియున్న విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు. (హెబ్రీయులు 13:​15, 16) అంతేగాక, వారు దేవుని ఆధ్యాత్మిక ఆలయంలో ఆరాధిస్తారు, అది యెరూషలేములోని ఆలయంలా ‘సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం.’ (మార్కు 11:​17) వారు యేసుక్రీస్తు విమోచన క్రయధన బలియందు విశ్వాసం ఉంచి, ‘గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసుకుంటారు.’ వారు ‘రాత్రింబగళ్లు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తూ’ విడువక యెహోవా సేవ చేస్తారు.​—⁠ప్రకటన 7:​14, 15.

17. ఆధునిక దిన అన్యులు క్రొత్త నిబంధనను ఎలా ఆధారము చేసుకుంటారు?

17 ఈ ఆధునిక దిన అన్యులు క్రొత్త నిబంధనను ఆధారము చేసుకుంటారు, అంటే వారు దేవుని ఇశ్రాయేలుతో సహవసించడం ద్వారా క్రొత్త నిబంధన నుండి వచ్చే ప్రయోజనాలను, ఆశీర్వాదాలను పొందుతారు. వారు ఆ నిబంధనలో భాగస్థులు కాకపోయినా, దానికి సంబంధించిన సూత్రాలకు వారు హృదయపూర్వకంగా విధేయులవుతారు. అలా యెహోవా ధర్మశాస్త్రము వారి హృదయాల్లో ఉంటుంది, వారు యెహోవాను తమ పరలోక తండ్రిగా, సర్వోన్నతాధికారిగా తెలుసుకుంటారు.​—⁠యిర్మీయా 31:​33, 34; మత్తయి 6: 9; యోహాను 17: 3.

18. అంత్యకాలములో ఏ సమకూర్పు పని జరుగుతోంది?

18 యెషయా ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే​—⁠నేను సమకూర్చిన ఇశ్రాయేలువారికిపైగా ఇతరులను కూర్చెదను.” (యెషయా 56: 8) అంత్యకాలములో, యెహోవా “ఇశ్రాయేలీయులలో వెలివేయబడినవారిని” అంటే అభిషిక్త శేషముకు చెందిన వారిని సమకూర్చాడు. అంతేగాక, ఆయన గొప్ప సమూహముకు చెందిన ఇతరులను కూడా సమకూరుస్తున్నాడు. వారు యెహోవా, సింహాసనాసీనుడైన ఆయన రాజైన యేసుక్రీస్తుల పైవిచారణ క్రింద సమాధానంగా, ఐక్యతతో కలిసి ఆరాధిస్తారు. యెహోవా క్రీస్తు ద్వారా చేసే పరిపాలనకు వారు చూపించే యథార్థత మూలంగా, మంచి కాపరి వారిని ఐక్యమైన, ఆనందభరితమైన మందగా చేశాడు.

గ్రుడ్డికాపరులు, మూగకుక్కలు

19. పొలములోని, అడవిలోని జంతువులకు ఏ ఆహ్వానం ఇవ్వబడుతోంది?

19 ఇంతకు ముందు పలికిన వాత్సల్యభరితమైన, ప్రోత్సాహకరమైన మాటల తర్వాత గమనార్హమైన, దాదాపు దిగ్భ్రాంతికరమైన, భిన్నమైన మాటలు వెలువడతాయి. యెహోవా అన్యుల పట్ల, షండులపట్ల కనికరంతో వ్యవహరించడానికి సిద్ధపడ్డాడు. కానీ దేవుని సంఘ సభ్యులమని చెప్పుకునే అనేకులు దోషులుగా నిర్ణయించబడి, తీర్పుపొందడానికి సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ఎక్కువగా, వారు సరైనవిధంగా సమాధి చేయబడడానికి కూడా అర్హులు కాదు, నకనకలాడుతున్న క్రూరమృగాలచే భక్షించబడడానికే తగినవారు. అందుకే మనమిలా చదువుతాము: “పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి.” (యెషయా 56: 9) ఈ క్రూరమృగాలు ఏమి భక్షించబోతున్నాయి? ప్రవచనం వివరిస్తుంది. అలా వివరించడంలో అది మనకు, రానున్న అర్మగిద్దోను యుద్ధంలో దేవుడ్ని వ్యతిరేకించేవారికి పట్టే గతిని గుర్తుచేయవచ్చు, అప్పుడు వధించబడినవారి కళేబరాలు ఆకాశపక్షులకు విందుగా అలాగే వదిలేయబడతాయి.​—⁠ప్రకటన 19:​17, 18.

20, 21. ఏ వైఫల్యాలు మతనాయకులను ఆధ్యాత్మిక కాపరులుగా నిష్ప్రయోజకులను చేస్తాయి?

20 ప్రవచనం ఇలా కొనసాగుతోంది: “వారి కాపరులు గ్రుడ్డివారు. వారందరు తెలివిలేనివారు. వారందరు మూగకుక్కలు; మొరుగలేరు, కలవరించుచు, పండుకొనువారు, నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందురు​—⁠నేను ద్రాక్షారసము తెప్పించెదను; మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.”​—యెషయా 56:​10-12.

21 యూదా మతనాయకులు తాము యెహోవాను ఆరాధిస్తున్నామని చెప్పుకుంటారు. వారు ‘ఆయన కాపరులమని’ చెప్పుకుంటారు. కాని వారు ఆధ్యాత్మికంగా గ్రుడ్డివారు, మూగవారు, నిద్రాసక్తులు. వారు మెలకువగా ఉండి ప్రమాదాన్ని గురించి హెచ్చరించలేకపోతే వారివల్ల ప్రయోజనమేమిటి? అలాంటి మతసంబంధమైన కాపరులకు అవగాహన లేదు, గొఱ్ఱెలవంటి ప్రజలకు ఆధ్యాత్మిక నడిపింపును ఇచ్చే హక్కు వారికి లేదు. అంతేగాక వారు భ్రష్టులు. వారికి స్వార్థపూరితమైన తీరని కోరికలున్నాయి. యెహోవా నడిపింపును అనుసరించే బదులు, వారు తమ సొంత మార్గాన్ని వెతుక్కుంటారు, అన్యాయమైన లాభం కోసం కృషి చేస్తారు, మత్తు కలిగించే మద్యాన్ని విపరీతంగా త్రాగుతారు, అలాగే చేయమని ఇతరులను ప్రోత్సహిస్తారు. రానున్న దేవుని తీర్పు గురించి వారు ఎంతగా మరచిపోతారంటే, అంతా బాగానే ఉంటుందని ప్రజలకు చెబుతారు.

22. యేసు కాలంనాటి మతనాయకులు ఎలా ప్రాచీన యూదా మతనాయకుల్లా ఉన్నారు?

22 యెషయా మునుపు తన ప్రవచనంలో, ఆధ్యాత్మికంగా కైపెక్కిన, మత్తులైన, అవగాహన లేని యూదా యొక్క నమ్మకద్రోహులైన మత నాయకులను వర్ణించడానికి అలాంటి భావచిత్రణనే ఉపయోగించాడు. వారు పారంపర్యాచారములతో ప్రజలపై భారాన్ని మోపారు, మతసంబంధమైన అబద్ధాలు చెప్పారు, సహాయం కోసం దేవునివైపు చూసే బదులు అష్షూరును నమ్ముకున్నారు. (2 రాజులు 16:​5-9; యెషయా 29:​1, 9-14) వారు ఏమీ నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. విచారకరంగా, మొదటి శతాబ్దంలో కూడా అలాంటి నాయకులే ఉన్నారు. దేవుని స్వంత కుమారుడు తమ వద్దకు తీసుకువచ్చిన సువార్తను హత్తుకునే బదులు, వారు యేసును నిరాకరించి, ఆయనను చంపడానికి పన్నాగం పన్నారు. యేసు వారి గురించి నిర్మొహమాటంగా ఇలా అన్నాడు: “వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు.”​—⁠మత్తయి 15:​14.

నేటి కాపరులు

23. మతనాయకులను గురించి పేతురు చెప్పిన ఏ ప్రవచనం నెరవేరుతోంది?

23 క్రైస్తవులను తప్పుదోవ పట్టించడానికి అబద్ధ బోధకులు కూడా బయలుదేరుతారని అపొస్తలుడైన పేతురు హెచ్చరించాడు. ఆయనిలా వ్రాశాడు: ‘అబద్ధప్రవక్తలు [ఇశ్రాయేలు] ప్రజలలో ఉండిరి, అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.’ (2 పేతురు 2: 1) అలాంటి అబద్ధ బోధకుల తప్పుడు బోధలు, భిన్నాభిప్రాయముల ఫలితమేమిటి? క్రైస్తవమత సామ్రాజ్య ఉద్భవమే వాటి ఫలితం, దాని మతనాయకులు నేడు తమ రాజకీయ స్నేహితులపై దేవుని ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తూ, ఉజ్వలమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యపు మతనాయకులు గ్రుడ్డివారిగా, మూగవారిగా, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించి నిద్రపోతున్నట్లుగా నిరూపించుకున్నారు.

24. ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు, అన్యులకు మధ్య ఏ ఐక్యత ఉంది?

24 అయితే, యెహోవా తన గొప్ప ఆధ్యాత్మిక ప్రార్థనా మందిరంలో దేవుని ఇశ్రాయేలులోని కడమవారితో కలిసి ఆరాధించడానికి లక్షలాదిమంది అన్యులను తీసుకువస్తున్నాడు. ఈ అన్యులు, అనేక దేశాలకు, జాతులకు, భాషలకు చెందిన వారైనప్పటికీ, ఒకరితో ఒకరూ, అలాగే దేవుని ఇశ్రాయేలుతోనూ ఐక్యంగా ఉన్నారు. రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారా యెహోవా దేవుని నుండి మాత్రమే వస్తుందని వారు ఒప్పించబడ్డారు. యెహోవా పట్ల ప్రేమతో పురికొల్పబడి, వారు గొంతెత్తి తమ విశ్వాసాన్ని ప్రకటించడంలో క్రీస్తు అభిషిక్త సహోదరులతో కలుస్తారు. వారు ఇలా వ్రాసిన అపొస్తలుని ప్రేరేపిత మాటల నుండి ఎంతో ఓదార్పును పొందుతారు: “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.”​—⁠రోమీయులు 10: 9.

[అధస్సూచీలు]

a “షండుడు” లేదా “నపుంసకుడు” అనే పదాలు, లైంగిక అవయవ విహీనతను సూచించకుండానే రాజాస్థానంలో అధికారిని సూచించే విధంగా కూడా ఉపయోగించబడుతున్నాయి. ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిన ఐతియొపీయుడు యూదామత ప్రవిష్టుడై ఉండవచ్చుననిపిస్తోంది గనుక ఆయన ఆ భావంలో షండుడై ఉండవచ్చు, ఆయన సున్నతి పొందని యూదేతరుల కోసం మార్గం తెరువబడక ముందు బాప్తిస్మం తీసుకున్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 8:​27-39.

b యిర్మీయాకు సహాయం చేయడానికి వచ్చిన, సిద్కియా రాజు దగ్గరికి నేరుగా వెళ్ళే అవకాశం ఉన్న ఎబెద్మెలెకు షండుడని పిలువబడ్టాడు. ఇది, ఆయన శారీరకంగా అంగవైకల్యం గలవానిగా చేయబడ్డవాడన్న దాని కంటే ఆయన రాజాస్థానంలో అధికారి అన్నదాన్ని సూచిస్తున్నట్లు అనిపించవచ్చు.​—⁠యిర్మీయా 38:​7-13.

[అధ్యయన ప్రశ్నలు]

[250 వ పేజీలోని చిత్రం]

విశ్రాంతి దినం ప్రార్థనకూ, అధ్యయనానికీ, ధ్యానానికీ అవకాశాన్ని ఇస్తుంది

[256 వ పేజీలోని చిత్రాలు]

1935 లో, వాషింగ్‌టన్‌ డి.సి.లో జరిగిన సమావేశంలో వేరే గొఱ్ఱెల స్థానం గురించి స్పష్టంగా వివరించబడింది (క్రింద బాప్తిస్మము ఇవ్వడం చూపించబడింది, కుడివైపున ఉన్నది కార్యక్రమం)

[259 వ పేజీలోని చిత్రం]

విందుకు రమ్మని క్రూరమృగాలు ఆహ్వానించబడుతున్నాయి

[261 వ పేజీలోని చిత్రాలు]

అన్యులు, దేవుని ఇశ్రాయేలు ఒకరితో ఒకరు ఐక్యంగా ఉన్నారు