నిర్గమకాండం 20:1-26
20 అప్పుడు దేవుడు ఈ మాటలన్నీ చెప్పాడు:
2 “దాస్య గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను నేనే.
3 నేను కాకుండా* నీకు వేరే ఏ దేవుళ్లూ ఉండకూడదు.+
4 “పైన ఆకాశంలో, కింద భూమ్మీద లేదా భూమికింద నీళ్లలో ఉండే దేని పోలికలోనైనా నువ్వు విగ్రహాన్ని గానీ, రూపాన్ని* గానీ చేసుకోకూడదు.+
5 వాటికి వంగి నమస్కారం చేయకూడదు, వాటిని పూజించేలా ప్రలోభానికి గురికాకూడదు.+ ఎందుకంటే నీ దేవుడైన యెహోవా అనే నేను సంపూర్ణ భక్తి కోరుకునే దేవుణ్ణి.+ నన్ను ద్వేషించేవాళ్ల విషయంలో, మూడునాలుగు తరాల వరకు తండ్రుల దోషశిక్షను కుమారుల మీదికి రప్పిస్తాను.
6 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలు పాటించేవాళ్ల విషయంలో, వెయ్యి తరాల వరకు వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తాను.+
7 “నీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా ఉపయోగించకూడదు,+ ఎందుకంటే తన పేరును వ్యర్థంగా ఉపయోగించే వ్యక్తిని యెహోవా తప్పకుండా శిక్షిస్తాడు.+
8 “విశ్రాంతి రోజును ఆచరించడం, దాన్ని పవిత్రంగా ఎంచడం మర్చిపోకు.+
9 నువ్వు ఆరు రోజులు కష్టపడి నీ పనులన్నీ చేసుకోవాలి;
10 అయితే ఏడో రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి రోజు. ఆ రోజు నువ్వు గానీ, నీ కుమారుడు గానీ, నీ కూతురు గానీ, నీ దాసుడు గానీ, నీ దాసురాలు గానీ, నీ పశువు గానీ, నీ నగరాల్లో నివసించే పరదేశి గానీ ఏ పనీ చేయకూడదు.+
11 ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న వాటన్నిటినీ చేసి, ఏడో రోజున విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు.+ అందుకే యెహోవా విశ్రాంతి రోజును దీవించి దాన్ని పవిత్రపర్చాడు.
12 “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో నువ్వు ఎక్కువకాలం జీవించేలా మీ అమ్మానాన్నల్ని గౌరవించు.+
13 “నువ్వు హత్య చేయకూడదు.+
14 “వ్యభిచారం చేయకూడదు.+
15 “దొంగతనం చేయకూడదు.+
16 “నీ సాటిమనిషి మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు.+
17 “నీ సాటిమనిషి ఇంటిని ఆశించకూడదు. అతని భార్యను గానీ,+ అతని దాసుణ్ణి గానీ, అతని దాసురాల్ని గానీ, అతని ఎద్దును గానీ, అతని గాడిదను గానీ, అతనికి చెందిన దేన్నీ నువ్వు ఆశించకూడదు.”+
18 అప్పుడు ప్రజలు ఉరుముల శబ్దాన్ని, బూర* శబ్దాన్ని వింటూ ఉన్నారు; మెరుపుల్ని, పర్వతం మీద నుండి పొగ లేవడాన్ని చూస్తూ ఉన్నారు; వాటిని చూసినప్పుడు, విన్నప్పుడు వాళ్లు భయపడిపోయి కాస్త దూరంగా నిలబడ్డారు.+
19 కాబట్టి వాళ్లు మోషేతో ఇలా అన్నారు: “నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం. కానీ దేవుణ్ణి మాతో మాట్లాడనివ్వకు, ఒకవేళ ఆయన మాతో మాట్లాడితే మేము చనిపోతామని మాకు భయంగా ఉంది.”+
20 అప్పుడు మోషే ఆ ప్రజలతో ఇలా అన్నాడు: “భయపడకండి, మిమ్మల్ని పరీక్షించడానికే సత్యదేవుడు వచ్చాడు.+ మీరు ఇలాగే తనకు భయపడుతూ ఉండాలని, దానివల్ల పాపం చేయకుండా ఉండాలని ఆయన అలా చేశాడు.”+
21 కాబట్టి ప్రజలు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు, అయితే మోషే కారుమబ్బు దగ్గరికి, అంటే సత్యదేవుడు ఉన్న చోటికి వెళ్లాడు.+
22 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పాలంటే, ‘నేను పరలోకం నుండి మీతో మాట్లాడానని మీరే స్వయంగా చూశారు.+
23 మీరు వెండి-బంగారాలతో దేవుళ్లను చేసుకోకూడదు,+ ఎందుకంటే నేను తప్ప వేరే ఏ దేవుడూ మీకు ఉండకూడదు.
24 నా కోసం మట్టితో ఒక బలిపీఠం కట్టి దానిమీద నీ దహనబలుల్ని, నీ సమాధాన బలుల్ని, నీ మందల్ని, నీ పశువుల్ని అర్పించాలి. నా పేరును గుర్తుచేసుకోవడానికి నేను ఎంచుకునే ప్రతీచోట+ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను దీవిస్తాను.
25 ఒకవేళ నువ్వు నా కోసం రాళ్లతో బలిపీఠం కడుతుంటే, చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు.+ ఎందుకంటే ఉలి తగిలితే అది అపవిత్రం అవుతుంది.
26 బలిపీఠం మీద నీ దిగంబరత్వం* కనిపించకుండా ఉండేలా, మెట్ల మీదుగా నా బలిపీఠం మీదికి ఎక్కకూడదు.’
అధస్సూచీలు
^ లేదా “నాకు విరోధంగా.”
^ లేదా “ప్రతిరూపాన్ని.”
^ అక్ష., “కొమ్ము.”
^ అక్ష., “మర్మాంగాలు.”