కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు ఓదార్పునిచ్చే ప్రవచనార్థక మాటలు

మీకు ఓదార్పునిచ్చే ప్రవచనార్థక మాటలు

రెండవ అధ్యాయం

మీకు ఓదార్పునిచ్చే ప్రవచనార్థక మాటలు

యెషయా 41:​1-29

1. యెషయా ప్రవచనంలో మనం ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలి?

 యెషయా తన పేరుగల పుస్తకాన్ని దాదాపు 3,000 సంవత్సరాల క్రితం వ్రాశాడు, అయినా నేడు మనకది నిజమైన విలువను కలిగి ఉంది. ఆయన వ్రాసిపెట్టిన చారిత్రక సంఘటనల నుండి మనం ప్రాముఖ్యమైన సూత్రాలను నేర్చుకోవచ్చు. ఆయన యెహోవా నామమున వ్రాసి ఉంచిన ప్రవచనాలను అధ్యయనం చేయడం ద్వారా మనం మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అవును, యెషయా జీవంగల దేవుని ప్రవక్త. చరిత్రను ముందుగా వ్రాసివుంచడానికి, సంఘటనలు జరుగకముందే వాటిని వర్ణించడానికి యెహోవా ఆయనను ప్రేరేపించాడు. అలా యెహోవా, తాను భవిష్యత్తును ముందుగా తెలియజేయగలననీ, దాన్ని మలచగలననీ చూపించాడు. నిజక్రైస్తవులు యెషయా గ్రంథాన్ని అధ్యయనం చేసిన తర్వాత, యెహోవా తాను వాగ్దానం చేసినవాటన్నిటినీ నెరవేరుస్తాడని ఒప్పించబడ్డారు.

2. యెషయా తన ప్రవచన పుస్తకాన్ని వ్రాసినప్పుడు యెరూషలేములో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎలాంటి మార్పు జరుగబోతోంది?

2 యెషయా తన ప్రవచనాన్ని వ్రాయడం ముగించే సమయానికల్లా, అష్షూరీయులు చేసిన దాడిని యెరూషలేము తట్టుకొని నిలిచింది. ఆలయం అప్పటికీ ఉంది, వందలాది సంవత్సరాలుగా చేస్తున్నట్లుగానే ప్రజలు తమ దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే, ఆ పరిస్థితి మారుతుంది. యూదా రాజుల సంపదలు బబులోనుకు కొనిపోబడే సమయమూ, యౌవనులైన యూదులు ఆ నగరంలో నపుంసకులుగా సేవచేసే సమయమూ వస్తుంది. a (యెషయా 39:​6, 7) ఇది వందకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత జరుగుతుంది.​—⁠2 రాజులు 24:​12-17; దానియేలు 1:​19.

3. యెషయా 41 వ అధ్యాయంలో ఎలాంటి సందేశం ఉంది?

3 అయితే, యెషయా ద్వారా దేవుడిచ్చిన సందేశం కేవలం నాశనాన్ని గూర్చిన సందేశం మాత్రమే కాదు. ఆయన వ్రాసిన గ్రంథంలోని 40 వ అధ్యాయ ప్రారంభంలో “ఓదార్చుడి” అనే మాట ఉంది. b యూదులు, తాముగానీ తమ పిల్లలు గానీ తమ స్వదేశానికి తిరిగి వెళ్ళగలమనే హామీని బట్టి ఓదార్పును పొందుతారు. ఆ ఓదార్పు సందేశాన్ని 41 వ అధ్యాయం కొనసాగింపజేస్తూ, దైవిక చిత్తాన్ని నెరవేర్చడానికి యెహోవా ఒక శక్తివంతమైన రాజును తీసుకువస్తాడని అది ప్రవచిస్తుంది. దానిలో హామీలు ఉన్నాయి, అది దేవునియందు నమ్మకముంచమనే ప్రోత్సాహాన్నిస్తుంది. అన్యజనులు నమ్ముకునే అబద్ధ దేవుళ్ళను అది శక్తిహీనులుగా బహిర్గతం చేస్తుంది కూడా. దీనంతటిలో, యెషయా కాలంలోనూ, మన కాలంలోనూ విశ్వాసాన్ని బలపరచేది ఎంతో ఉంది.

యెహోవా జనములను సవాలు చేస్తున్నాడు

4. యెహోవా జనములను ఏమని సవాలు చేస్తున్నాడు?

4 యెహోవా తన ప్రవక్త ద్వారా ఇలా చెబుతున్నాడు: “ద్వీపములారా, నాయెదుట మౌనముగా నుండుడి; జనములారా, నూతనబలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలెను. వ్యాజ్యెము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి.” (యెషయా 41: 1) ఈ మాటలతో యెహోవా తన ప్రజలను వ్యతిరేకించే జనములను సవాలు చేస్తున్నాడు. వారు ఆయన ఎదుట నిలబడి, మాట్లాడడానికి నడుము బిగించాలి! తర్వాత చూడబోతున్నట్లుగా, యెహోవా తాను న్యాయస్థానంలో న్యాయాధిపతి అయినట్లు, తమ విగ్రహాలు నిజమైన దేవుళ్ళనడానికి సాక్ష్యాధారాలను చూపించమని ఆ జనములను అడుగుతాడు. ఈ దేవుళ్ళు తమ ఆరాధకులకు రక్షణ కార్యాలను లేక తమ శత్రువులకు వ్యతిరేకంగా తీర్పులను ప్రవచించగలరా? అలా చేసినా, వారు ఆ ప్రవచనాలను నెరవేర్చగలరా? లేదు అన్నదే దానికి సమాధానం. యెహోవా మాత్రమే అవన్నీ చేయగలడు.

5. యెషయా ప్రవచనాలు ఒకటి కన్నా ఎక్కువసార్లు ఎలా నెరవేరుతాయో వివరించండి.

5 మనం యెషయా ప్రవచనాన్ని పరిశీలిస్తుండగా, బైబిల్లోని అనేక ప్రవచనాల విషయంలోలాగే, ఆయన మాటలకు ఒకటి కన్నా ఎక్కువ నెరవేర్పులు ఉంటాయని మనస్సులో ఉంచుకుందాము. సా.శ.పూ. 607 లో, యూదా బబులోనుకు చెరగా కొనిపోబడుతుంది. అయితే, అక్కడ చెరలో ఉన్న ఇశ్రాయేలీయులను యెహోవా విడుదల చేస్తాడని యెషయా ప్రవచనం బయలుపరుస్తోంది. ఇది సా.శ.పూ. 537 లో జరుగుతుంది. ఆ విడుదలకు, 20 వ శతాబ్దపు తొలిదినాల్లో ఒక సారూప్యత ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, భూమిపైనున్న యెహోవా అభిషిక్త సేవకులు శ్రమల కాలాన్ని అనుభవించారు. మహా బబులోనులో ప్రముఖ భాగమైన క్రైస్తవమత సామ్రాజ్యంచే పురికొల్పబడిన, సాతాను ప్రపంచం నుండి 1918 లో వచ్చిన ఒత్తిడి, సంస్థీకృతంగా సువార్త ప్రకటించబడడం వాస్తవంగా ఆగిపోయేలా చేసింది. (ప్రకటన 11:​5-10) వాచ్‌టవర్‌ సంస్థకు చెందిన బాధ్యతాయుతులైన కొంతమంది అధికారులు బూటకపు ఆరోపణలపై జైలుకు పంపబడ్డారు. దేవుని సేవకులకు వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటంలో ఈ లోకం విజయం సాధించినట్లుగానే అనిపిస్తుంది. అప్పుడు, సా.శ.పూ. 537 లో జరిగినట్లుగానే, యెహోవా అనుకోనిరీతిగా వారికి విడుదలను అనుగ్రహించాడు. నిర్బంధంలో ఉన్న అధికారులు 1919 లో విడుదల చేయబడ్డారు, వారిపై వేయబడిన ఆరోపణలు ఆ తర్వాత కొట్టివేయబడ్డాయి. ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో, 1919 సెప్టెంబరులో జరిగిన ఒక సమావేశం, రాజ్య సువార్త ప్రకటించే పనిని పునఃప్రారంభించేలా యెహోవా సేవకులను మళ్ళీ చైతన్యవంతులను చేసింది. (ప్రకటన 11:​11, 12) అప్పటి నుండి ఇప్పటి వరకు, ఆ ప్రకటనా పని యొక్క పరిధి గమనార్హమైన విధంగా విస్తరించింది. అంతేగాక, యెషయా పలికిన మాటల్లో అనేకం, రానున్న పరదైసు భూమిపై అద్భుతంగా నెరవేరుతాయి. తత్ఫలితంగా, ఎంతోకాలం క్రితం వ్రాయబడిన యెషయా మాటలు నేడు అన్ని రాజ్యాలకు, ప్రజలకు వర్తిస్తాయి.

విమోచకుడు పిలువబడ్డాడు

6. భవిష్యత్తులో వచ్చే వీరుని గురించి ప్రవక్త ఎలా వర్ణిస్తున్నాడు?

6 దేవుని ప్రజలను బబులోను నుండి రక్షించి, వారి శత్రువులపైకి తీర్పును తీసుకువచ్చే వీరుని గురించి యెహోవా యెషయా ద్వారా ముందుగా తెలియజేస్తున్నాడు. యెహోవా ఇలా అడుగుతున్నాడు: “తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పునుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరచుచున్నాడు, ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు, ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్లని త్రోవనే సురక్షితముగ దాటిపోవుచున్నాడు. ఎవడు దీని నాలోచించి జరిగించెను? ఆదినుండి మానవ వంశములను పిలిచినవాడనైన యెహోవానగు నేనే; నేను మొదటివాడను కడవరివారితోను ఉండువాడను.”​—యెషయా 41:​2-4.

7. రాబోయే వీరుడు ఎవరు, అతడు ఏమి సాధిస్తాడు?

7 తూర్పునుండి రేపి పిలువబడేది ఎవరు? మాదీయ-పారసీక, ఏలాము దేశాలు బబులోనుకు తూర్పు వైపున ఉన్నాయి. అక్కడి నుండి పారసీక దేశస్థుడైన కోరెషు శక్తివంతమైన తన సైన్యంతో కదిలివస్తాడు. (యెషయా 41:​25; 44:​28; 45:​1-4, 13; 46:​11) కోరెషు యెహోవా ఆరాధకుడు కాకపోయినప్పటికీ, అతడు నీతిగల దేవుడైన యెహోవా చిత్తానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. కోరెషు రాజులను లోబరచుకుంటాడు, వారు అతని ఎదుట ధూళివలె చెదరగొట్టబడతారు. విజయ పథంలో అతడు, ఇంతకు ముందు వెళ్ళని త్రోవలలో అన్ని ఆటంకాలను అధిగమిస్తూ “సురక్షితము”గా దాటిపోతాడు. సా.శ.పూ. 539 నాటికల్లా కోరెషు శక్తివంతమైన బబులోను నగరాన్ని చేరుకుని దాన్ని కూలదోస్తాడు. తత్ఫలితంగా, దేవుని ప్రజలు యెరూషలేముకు తిరిగి వచ్చి స్వచ్ఛారాధనను పునఃస్థాపించేలా వారు విడుదల చేయబడతారు.​—⁠ఎజ్రా 1:​1-7. c

8. యెహోవా మాత్రమే చేయగలిగేది ఏమిటి?

8 అలా, కోరెషు జన్మించడానికి చాలాకాలం ముందే ఆ రాజు ఉద్భవం గురించి యెహోవా యెషయా ద్వారా ప్రవచిస్తాడు. కేవలం సత్య దేవుడు మాత్రమే అలాంటి విషయాన్ని ఖచ్చితంగా ప్రవచించగలడు. జనముల అబద్ధ దేవుళ్ళలో యెహోవాకు సాటిరాగల వారెవరూ లేరు. మంచి కారణంతోనే, యెహోవా ఇలా పేర్కొంటున్నాడు: “మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను.” యెహోవా మాత్రమే న్యాయబద్ధంగా ఇలా చెప్పగలడు: “నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు.”​—⁠యెషయా 42: 8; 44: 6, 7.

భయవిహ్వలులైన ప్రజలు విగ్రహాలను నమ్ముకుంటారు

9-11. కోరెషు పురోగమనానికి జనములు ఎలా ప్రతిస్పందిస్తాయి?

9 ఈ భవిష్యద్‌ వీరుని బట్టి జనములు ప్రతిస్పందించడాన్ని యెషయా ఇప్పుడు వర్ణిస్తున్నాడు: “ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి. భూదిగంతములు వణకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు, ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటనుగూర్చి​—⁠అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును; సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.”​—యెషయా 41:​5-7.

10 ఇంచుమించు 200 సంవత్సరాలు భవిష్యత్తులోకి చూస్తూ, యెహోవా ప్రపంచ దృశ్యాన్ని పరిశీలిస్తాడు. కోరెషు ఆధ్వర్యంలో శక్తివంతమైన సైన్యాలు చురుగ్గా ముందుకు కదులుతూ, వ్యతిరేకించే వారందరినీ జయిస్తాయి. ప్రజలు, చివరికి ద్వీప వాసులు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా అతడి ఆగమనాన్ని బట్టి వణికిపోతారు. తీర్పు తీర్చడానికి యెహోవా తూర్పు నుండి రప్పించినవాడిని వ్యతిరేకించడానికి వాళ్ళంతా భయంతో ఐక్యమవుతారు. వాళ్ళు “ధైర్యము వహించుమని” చెప్పుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ప్రయత్నిస్తారు.

11 ప్రజలను విడుదల చేసేందుకు విగ్రహ దేవుళ్ళను తయారుచేయడానికి శిల్పకారులు కలిసి పనిచేస్తారు. వడ్రంగి చెక్క నమూనాను తయారు చేసి, ఆ తర్వాత దాని మీద లోహాన్ని, బహుశా బంగారాన్ని తాపడం చేయమని కంసాలిని ప్రోత్సహిస్తాడు. శిల్పి లోహాన్ని నున్నగా చేసి అతుకులను ఆమోదిస్తాడు. యెహోవా మందసము ఎదుట దొర్లిపడిపోయిన దాగోను విగ్రహంలా అది కదిలి పడిపోకుండా లేక బలహీనంగా ఉండకుండా దాన్ని మేకులతో బిగించడాన్ని గురించిన ప్రస్తావన బహుశా కొంత వ్యంగ్యంగా చేసినదై ఉండవచ్చు.​—⁠1 సమూయేలు 5: 4.

భయపడకండి!

12. యెహోవా ఇశ్రాయేలును ఎలా ధైర్యపరుస్తున్నాడు?

12 యెహోవా ఇప్పుడు తన అవధానాన్ని తన ప్రజల వైపుకు మళ్ళిస్తాడు. జీవంలేని విగ్రహాలను నమ్ముకునే జనముల్లా కాకుండా, నిజమైన దేవుడ్ని విశ్వసించేవారు ఎన్నడూ భయపడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలు తన స్నేహితుడైన అబ్రాహాము సంతానమని జ్ఞాపకం చేస్తూ యెహోవా ధైర్యం చెప్పడం ప్రారంభిస్తాడు. వాత్సల్యం నిండివున్న ఈ భాగంలో యెషయా యెహోవా మాటలను ఇలా నివేదిస్తున్నాడు: “నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేనేర్పరచుకొనిన యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనలనుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”​—యెషయా 41:​8-10.

13. బంధీలుగా ఉన్న యూదులకు యెహోవా మాటలు ఎందుకు ఓదార్పును ఇస్తాయి?

13 పరాయి దేశంలో బంధీలుగా ఉన్న నమ్మకమైన యూదులకు ఈ మాటలు ఎంత ఓదార్పును ఇస్తాయో కదా! తాము చెరలో ఉండి, బబులోను రాజుకు దాసులుగా ఉన్న సమయంలో యెహోవా తమను ‘నా దాసుడు’ అని పిలవడం వారికి ఎంత ప్రోత్సాహాన్ని ఇచ్చివుండవచ్చో కదా! (2 దినవృత్తాంతములు 36:​20) వారి అవిశ్వాస్యతను బట్టి యెహోవా వారిని శిక్షించినప్పటికీ, ఆయన వారిని నిరాకరించడు. ఇశ్రాయేలు యెహోవాకు చెందుతుంది గానీ బబులోనుకు కాదు. విజయం సాధిస్తున్న కోరెషు ఆగమనాన్ని బట్టి దేవుని సేవకులు వణికిపోవాల్సిన అవసరం లేదు. యెహోవా తన ప్రజలకు సహాయం చేయడానికి వారితో ఉంటాడు.

14. యెహోవా ఇశ్రాయేలుతో పలికిన మాటలు నేడు దేవుని సేవకులకు ఎలా ఓదార్పునిస్తాయి?

14 చివరికి ఈనాటి వరకూ కూడా ఆ మాటలు దేవుని సేవకులకు ధైర్యాన్నిచ్చి, వారిని బలపరిచాయి. పూర్వం 1918 లో, తమ పట్ల యెహోవా చిత్తమేమిటో తెలుసుకోవాలని వారెంతో అభిలషించారు. తామున్న ఆధ్యాత్మిక చెరవంటి స్థితిలో నుండి విడుదల పొందాలని వారు ఎంతో అపేక్షించారు. నేడు సాతాను, ఈ లోకము, మన సొంత అపరిపూర్ణతలు మనపైకి తీసుకువచ్చే ఒత్తిడుల నుండి ఉపశమనం కోసం మనమెంతో ఆకాంక్షిస్తాము. కానీ, తన ప్రజల పక్షాన ఎప్పుడు ఎలా చర్య తీసుకోవాలో యెహోవాకు ఖచ్చితంగా తెలుసని మనం గ్రహిస్తాము. సహించడానికి మనకు ఆయన సహాయం చేస్తాడనే నమ్మకంతో మనం చిన్నపిల్లల్లా ఆయన బలమైన హస్తాన్ని పట్టుకుంటాము. (కీర్తన 63:​7, 8) యెహోవా తన సేవ చేసేవారిని ఎంతో విలువైనవారిగా పరిగణిస్తాడు. ఆయన 1918-19 కాలంలో తన ప్రజలు కష్టపరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారికి మద్దతునిచ్చినట్లుగానే, ఎంతో కాలం క్రితం నమ్మకమైన ఇశ్రాయేలీయులకు మద్దతునిచ్చినట్లుగానే నేడు మనకు కూడా మద్దతునిస్తాడు.

15, 16. (ఎ) ఇశ్రాయేలు శత్రువులకు ఏమవుతుంది, ఇశ్రాయేలు ఏ యే విధాలుగా పురుగును పోలి ఉంది? (బి) భవిష్యత్తులోని ఏ దాడి దృష్ట్యా యెహోవా మాటలు నేడు ప్రాముఖ్యంగా ప్రోత్సాహకరంగా ఉన్నాయి?

15 తర్వాత యెహోవా యెషయా ద్వారా ఏమి చెబుతున్నాడో పరిశీలించండి: “నీమీద కోపపడినవారందరు సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను​—⁠భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రాయేలూ, భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.”​—యెషయా 41:​11-14.

16 ఇశ్రాయేలు శత్రువులు విజయం సాధించరు. ఇశ్రాయేలు మీద కోపపడేవారు సిగ్గుపడతారు. ఆమెతో కలహించేవారు నశించిపోతారు. బంధీలుగా ఉన్న ఇశ్రాయేలీయులు దుమ్ములో కదిలే పురుగులా బలహీనంగా, ఎదిరించలేనిదిగా కనిపించినా, యెహోవా వారికి సహాయం చేస్తాడు. నిజ క్రైస్తవులు ఈ లోకంలోని అనేకుల బలమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు “అంత్యదినముల”న్నిటిలోనూ ఇది ఎంతటి ప్రోత్సాహాన్ని ఇచ్చిందో కదా! (2 తిమోతి 3: 1) ప్రవచనంలో, “మాగోగు దేశపువాడగు గోగు” అని ప్రస్తావించబడిన సాతాను యొక్క రానున్న దాడి దృష్ట్యా యెహోవా వాగ్దానం ఎంత బలాన్నిస్తుందో కదా! గోగు చేసే క్రూరమైన దాడి సమయంలో, యెహోవా ప్రజలు “ప్రాకారములును అడ్డగడియలును గవునులునులేని” ప్రజల్లా, పురుగులా ఏమాత్రం ఎదిరించలేనివారన్నట్లు కనిపిస్తారు. అయినప్పటికీ యెహోవా కోసం నిరీక్షించేవారు భయంతో కంపించిపోనవసరం లేదు. వారిని విడుదల చేయడానికి సర్వశక్తిమంతుడు తానే పోరాడతాడు.​—⁠యెహెజ్కేలు 38: 2, 11, 14-16, 21-23; 2 కొరింథీయులు 1: 3.

ఇశ్రాయేలుకు ఓదార్పు

17, 18. ఇశ్రాయేలు బలపర్చబడడాన్ని యెషయా ఎలా వర్ణిస్తున్నాడు, మనం ఏ నెరవేర్పు గురించి నిశ్చయత కలిగి ఉండవచ్చు?

17 యెహోవా తన ప్రజలను ఓదార్చడాన్ని ఇలా కొనసాగిస్తున్నాడు: “కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు; కొండలను పొట్టువలె చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొని పోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవానుబట్టి సంతోషించుదువు. ఇశ్రాయేలు పరిశుద్ధదేవునిబట్టి అతిశయపడుదువు.”​—యెషయా 41:​15, 16.

18 చర్య తీసుకోవడానికి, ఆధ్యాత్మిక భావంలో, పర్వతము వంటి తన శత్రువులను లోబరచుకోవడానికి ఇశ్రాయేలుకు శక్తి ఇవ్వబడుతుంది. ఇశ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చినప్పుడు, ఆలయాన్ని, యెరూషలేము గోడలను పునర్నిర్మించకుండా ఆపేందుకు ప్రయత్నించే శత్రువులపై ఆమె విజయం సాధిస్తుంది. (ఎజ్రా 6:​12; నెహెమ్యా 6:​16) అయితే, “దేవుని ఇశ్రాయేలు” విషయంలో యెహోవా మాటలు భారీ ఎత్తున నెరవేరుతాయి. (గలతీయులు 6:​16) యేసు అభిషిక్త క్రైస్తవులకు ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు.” (ప్రకటన 2:​26, 27) పరలోక మహిమకు పునరుత్థానం చేయబడిన క్రీస్తు సహోదరులు యెహోవా దేవుని శత్రువులను నిర్మూలించడంలో భాగం వహించే సమయం తప్పకుండా వస్తుంది.​—⁠2 థెస్సలొనీకయులు 1:​6-8; ప్రకటన 20: 4, 6.

19, 20. ఇశ్రాయేలును సుందరమైన స్థలంలో పునఃస్థాపించడం గురించి యెషయా ఏమి వ్రాశాడు, అది ఎలా నెరవేరింది?

19 సూచనార్థక భాషలో, తన ప్రజలకు ఉపశమనం తీసుకువస్తాననే తన వాగ్దానాన్ని యెహోవా ఇప్పుడు మరింత బలపరుస్తున్నాడు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు. నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసెననియు తెలిసికొని మనస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు చెట్లులేని మెట్టలమీద నేను నదులను పారజేసెదను, లోయలమధ్యను ఊటలను ఉబుకజేసెదను, అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటిబుగ్గలుగాను చేసెదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజిచెట్లను తైలవృక్షమును నాటించెదను. అడవిలో తమాలవృక్షములను సరళవృక్షములను నేరెడి వృక్షములను నాటెదను.”​—యెషయా 41:​17-20.

20 చెరగా కొనిపోబడిన ఇశ్రాయేలీయులు సంపన్నమైన ప్రపంచ ఆధిపత్యపు రాజధాని నగరంలో నివసించినప్పటికీ, అది వారికి నీళ్ళులేని ఎడారి వంటిదే. దావీదు సౌలు రాజుకు దొరకకుండా దాక్కుంటున్నప్పుడు ఎలా భావించాడో, వారలా భావిస్తారు. సా.శ.పూ. 537 లో, వారు యూదాకు తిరిగి వచ్చి, యెరూషలేములో ఆయన ఆలయాన్ని పునర్నిర్మించి, తద్వారా స్వచ్ఛారాధనను పునఃస్థాపించేందుకు యెహోవా వారి కోసం మార్గాన్ని తెరుస్తాడు. తత్ఫలితంగా యెహోవా వారిని ఆశీర్వదిస్తాడు. తర్వాత ఒక ప్రవచనంలో, యెషయా ఇలా తెలియజేస్తాడు: “యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు, దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు.” (యెషయా 51: 3) యూదులు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇది నిజంగా సంభవిస్తుంది.

21. ఆధునిక కాలాల్లో ఏ పునఃస్థాపన జరిగింది, భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

21 స్వచ్ఛారాధనను పునఃస్థాపించేందుకు కృషి చేసేలా గొప్ప కోరెషు అయిన యేసుక్రీస్తు తన అభిషిక్త అనుచరులను ఆధ్యాత్మిక చెర నుండి విడిపించినప్పుడు ఆధునిక కాలాల్లో అటువంటిదే జరిగింది. ఆ నమ్మకమైనవారు సంపన్నమైన ఆధ్యాత్మిక పరదైసుతో, సూచనార్థకమైన ఏదెను తోటతో ఆశీర్వదించబడ్డారు. (యెషయా 11:​6-9; 35:​1-7) త్వరలోనే, దేవుడు తన శత్రువులను నాశనం చేసినప్పుడు, తన ప్రక్కనే వేలాడదీయబడిన నేరస్థునికి యేసు వాగ్దానం చేసినట్లుగానే యావత్‌ భూమీ భౌతిక పరదైసుగా మారుతుంది.​—⁠లూకా 23:​43.

ఇశ్రాయేలు శత్రువులకు ఒక సవాలు

22. యెహోవా మళ్ళీ ఏ మాటలతో జనములను సవాలు చేస్తున్నాడు?

22 యెహోవా ఇప్పుడు, తనకు జనములతోనూ, వాటి విగ్రహ దేవుళ్ళతోనూ ఉన్న వివాదం వైపుకు తిరుగుతున్నాడు: ‘వ్యాజ్యెమాడుడని యెహోవా అనుచున్నాడు. మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు. జరుగబోవువాటిని విశదపరచి మాయెదుట తెలియజెప్పుడి. పూర్వమైనవాటిని విశదపరచుడి మేమాలోచించి వాటి ఫలమును తెలిసికొనునట్లు వాటిని మాకు తెలియజెప్పుడి, లేనియెడల రాగలవాటిని మాకు తెలియజెప్పుడి. ఇకమీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటిచేసికొని కనుగొనునట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయాసంతానము, [“మీరు లేనట్టున్నారు,” పవిత్రగ్రంథం, వ్యాఖ్యాన సహితం] మీ కార్యము శూన్యము. మిమ్మును కోరుకొనువారు హేయులు.’ (యెషయా 41:​21-24) జనముల దేవుళ్ళు ఖచ్చితంగా ప్రవచించి, తమకు సహజాతీతమైన పరిజ్ఞానం ఉందని నిరూపించుకోగలరా? నిరూపించగలిగితే, వారి ఆరోపణలకు మద్ధతునిచ్చేందుకు మేలేగానీ, కీడేగానీ ఏవైనా ఫలితాలు తప్పకుండా ఉండాలి. అయితే, వాస్తవానికి, విగ్రహ దేవుళ్ళు ఏమీ సాధించలేకపోతున్నారు కాబట్టి వారు లేనట్టే.

23. యెహోవా తన ప్రవక్తల ద్వారా విగ్రహాలను అంత ఎడతెగక ఎందుకు ఖండించాడు?

23 యెహోవా యెషయా ద్వారా, ఆయన తోటి ప్రవక్తల ద్వారా విగ్రహారాధన అనే బుద్ధిహీనతను ఖండిస్తూ అంత సమయాన్ని ఎందుకు గడిపాడా అని మన కాలంలో కొందరు ఆశ్చర్యపోవచ్చు. నేడు అనేకులకు, మానవ నిర్మిత విగ్రహాల నిరుపయోగం స్పష్టంగా తెలుస్తుండవచ్చు. అయితే, నమ్మకానికి సంబంధించిన ఒక అబద్ధ విధానం స్థాపించబడి, విస్తృతంగా అంగీకరించబడితే, దాన్ని నమ్మేవారి మనసుల్లో నుండి దాన్ని పెరికివేయడం కష్టం. జీవంలేని విగ్రహాలు నిజంగా దేవుళ్ళనే నమ్మకం ఎంత మూర్ఖమైనదో ప్రస్తుత కాలానికి చెందిన అనేక నమ్మకాలు అంతే మూర్ఖమైనవి. అయినప్పటికీ, వాటికి వ్యతిరేకంగా ఎంత ఒప్పించే వాదనలు జరిపినా ప్రజలు అలాంటి నమ్మకాలనే అంటిపెట్టుకుని ఉంటారు. సత్యాన్ని పదే పదే వినడం ద్వారానే కొందరు యెహోవాయందు నమ్మకం ఉంచడంలోని విజ్ఞతను చూసేందుకు కదిలించబడ్డారు.

24, 25. యెహోవా కోరెషు గురించి మళ్ళీ ఎలా ప్రస్తావించాడు, ఇది మనకు మరే ఇతర ప్రవచనాన్ని గుర్తు చేస్తుంది?

24 యెహోవా మళ్ళీ కోరెషు గురించి ప్రస్తావిస్తున్నాడు: “ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.” (యెషయా 41:​25) d జనముల దేవుళ్ళకు భిన్నంగా, యెహోవా విషయాలను సాధించగలడు. ఆయన కోరెషును తూర్పు దిక్కు నుండి, “సూర్యోదయ దిక్కునుండి” రప్పించినప్పుడు, దేవుడు తనకున్న ప్రవచించే సామర్థ్యాన్ని, తాను ప్రవచించినదాన్ని నెరవేర్చడానికి భవిష్యత్తును మలచగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు.

25 ఈ మాటలు, మన కాలంలో చర్య తీసుకోవడానికి రేపబడే రాజుల గురించి అపొస్తలుడైన యోహాను ఇచ్చిన ప్రవచనార్థక వివరణను మనకు గుర్తుచేస్తాయి. “తూర్పునుండి వచ్చు రాజుల” కోసం మార్గం సిద్ధం చేయబడుతుందని మనం ప్రకటన 16:12 లో చదువుతాము. ఈ రాజులు మరెవరో కాదు యెహోవా దేవుడు, యేసు క్రీస్తే. చాలాకాలం క్రితం కోరెషు దేవుని ప్రజలను విడుదల చేసినట్లుగా, అంతకంటే ఎంతో శక్తివంతులైన ఈ రాజులు యెహోవా శత్రువులను నిర్మూలించి, ఆయన ప్రజలు మహాశ్రమల గుండా నీతియుక్తమైన నూతన లోకంలోకి ప్రవేశించేలా వారిని నడిపిస్తారు.​—⁠కీర్తన 2:​8, 9; 2 పేతురు 3:​13; ప్రకటన 7:​14-17.

యెహోవా సర్వోన్నతుడు!

26. ఇప్పుడు యెహోవా ఏ ప్రశ్న వేస్తున్నాడు, దానికి సమాధానం ఇవ్వబడిందా?

26 తాను మాత్రమే సత్య దేవుడిననే సత్యాన్ని యెహోవా మళ్ళీ ప్రకటిస్తాడు. ఆయనిలా అడుగుతాడు: “మేము ఒప్పుకొనునట్లు జరిగినదానిని ఆదినుండియు తెలియజెప్పినవాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పినవాడెవడు? దాని తెలియజెప్పువాడెవడును లేడు. వినుపించు వాడెవడును లేడు. మీ మాటలు వినువాడెవడును లేడు.” (యెషయా 41:​26) తనను నమ్ముకునే వారిని విడిపించడానికి ఏ విగ్రహ దేవుడూ రాబోయే వీరుని గురించి ప్రకటించలేదు. అలాంటి దేవుళ్ళందరూ జీవంలేనివారు, మూగవారు. వాళ్ళు అసలు దేవుళ్ళే కాదు.

27, 28. యెషయా 41 వ అధ్యాయం, చివరి వచనాల్లో నొక్కిచెప్పబడిన ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి, దాన్ని ప్రకటిస్తున్న ఏకైక జనము ఎవరు?

27 యెహోవా యొక్క ఈ ప్రేరణాత్మకమైన ప్రవచనార్థక మాటల గురించి చెప్పిన తర్వాత, యెషయా ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నొక్కి చెబుతున్నాడు: “ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడును లేకపోయెను; నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమియ్యగల ఆలోచనకర్త యెవడును లేకపోయెను. వారందరు మాయాస్వరూపులు. వారి క్రియలు మాయ. వారి పోతవిగ్రహములు శూన్యములు అవి వట్టిగాలియై యున్నవి.”​—యెషయా 41:​27-29.

28 యెహోవాయే మొదటి వాడు. ఆయన సర్వోన్నతుడు! తన ప్రజలకు విడుదలను ప్రకటిస్తూ, వారికి సువార్తను తెచ్చే సత్య దేవుడు ఆయనే. ఆయన సాక్షులు మాత్రమే ఆయన ఔన్నత్యాన్ని జనములకు ప్రకటిస్తారు. యెహోవా తృణీకారంగా, విగ్రహారాధనలో నమ్మకం ఉంచేవారి విగ్రహాలను ‘శూన్యములు, వట్టిగాలి’ అని కొట్టిపారేస్తూ, వారిని తిరస్కరిస్తున్నాడు. సత్యదేవుడ్ని అంటిపెట్టుకుని ఉండడానికి ఎంత బలమైన కారణమో కదా! యెహోవా మాత్రమే మన నిశ్చయమైన నమ్మకాన్ని పొందడానికి అర్హుడు.

[అధస్సూచీలు]

c “దేవుని ఇశ్రాయేలు”ను 1919 లో ఆధ్యాత్మిక చెర నుండి విడుదల చేసిన గొప్ప కోరెషు మరెవరో కాదు యేసు క్రీస్తే, ఆయన 1914 నుండి దేవుని పరలోక రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడై ఉన్నాడు.​—⁠గలతీయులు 6:​16.

d కోరెషు స్వదేశం బబులోనుకు తూర్పున ఉన్నప్పటికీ, ఆయన ఆ నగరంపై తుది దాడి చేసినప్పుడు, ఉత్తర దిక్కు నుండి అంటే ఆసియా మైనర్‌ నుండి వచ్చాడు.

[అధ్యయన ప్రశ్నలు]

[19 వ పేజీలోని చిత్రం]

కోరెషు అన్యుడే అయినప్పటికీ దేవుని పని చేయడానికి ఎంచుకోబడ్డాడు

[21 వ పేజీలోని చిత్రం]

జనములు నిర్జీవమైన విగ్రహాలను నమ్ముకుంటారు

[27 వ పేజీలోని చిత్రాలు]

ఇశ్రాయేలు, “నురిపిడి మ్రాను”లా ‘పర్వతములను పొడి చేస్తుంది’