యెషయా 51:1-23

  • సీయోను మళ్లీ ఏదెను తోటలా అవ్వడం (1-8)

  • సీయోనును చేసిన శక్తిమంతుడి నుండి ఓదార్పు (9-16)

  • యెహోవా ఉగ్రతపాత్ర (17-23)

51  “నీతిని వెంటాడుతున్న ప్రజలారా,యెహోవాను వెతుకుతున్న ప్రజలారా, నేను చెప్పేది వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో ఆ బండ వైపు,ఏ గని నుండి తవ్వి తీయబడ్డారో ఆ గని వైపు చూడండి.  2  మీ తండ్రైన అబ్రాహాము వైపు,పురిటినొప్పులతో మిమ్మల్ని కన్న శారా+ వైపు చూడండి. నేను అతన్ని పిలిచినప్పుడు అతను ఒక్కడే,+నేనే అతన్ని దీవించి, అతను చాలామంది అయ్యేలా చేశాను.+  3  ఎందుకంటే, యెహోవా సీయోనుకు ఊరటనిస్తాడు.+ దాని శిథిలాలన్నిటికీ ఆయన ఊరట దయచేస్తాడు,+ఆయన దాని ఎడారిని ఏదెనులా,+దాని ఎడారి మైదానాన్ని యెహోవా తోటలా చేస్తాడు.+ ఉల్లాసం, సంతోషం దానిలో ఉంటాయి,కృతజ్ఞతా స్తుతులు, శ్రావ్యమైన గీతాలు అందులో వినిపిస్తాయి.+  4  నా ప్రజలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి,నా జనమా,+ చెవిపెట్టి వినండి. ఎందుకంటే నా దగ్గర నుండి ఒక చట్టం బయల్దేరుతుంది,+నా న్యాయాన్ని జనాలకు వెలుగుగా స్థాపిస్తాను.+  5  నా నీతి సమీపిస్తోంది.+ నా రక్షణ బయల్దేరుతుంది,+నా బాహువులు జనాలకు తీర్పు తీరుస్తాయి.+ ద్వీపాలు నా మీద ఆశపెట్టుకుంటాయి,+నా బాహువు* కోసం అవి వేచి ఉంటాయి.  6  ఆకాశం వైపు మీ తలలు ఎత్తి చూడండి,కిందున్న భూమిని చూడండి. ఎందుకంటే ఆకాశం ముక్కలైపోయి పొగలా చెదిరిపోతుంది;భూమి వస్త్రంలా పాతబడుతుంది,దానిలో నివసించేవాళ్లు దోమల్లా చనిపోతారు. కానీ నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది,+నా నీతికి అంతం అనేదే ఉండదు.*+  7  నీతి తెలిసిన ప్రజలారా,హృదయంలో నా ధర్మశాస్త్రం* ఉన్న ప్రజలారా,+ నేను చెప్పేది వినండి. నశించిపోయే మనుషుల బెదిరింపులకు భయపడకండి,వాళ్ల దూషణలకు హడలిపోకండి.  8  ఎందుకంటే వస్త్రాన్ని తినేసినట్టు చిమ్మెట వాళ్లను తినేస్తుంది,బట్టల చిమ్మెట* ఉన్నిని మింగేసినట్టు వాళ్లను మింగేస్తుంది.+ కానీ నా నీతి ఎప్పటికీ ఉంటుంది,నా రక్షణ తరతరాలపాటు ఉంటుంది.”+  9  యెహోవా బాహువా,+లే! లేచి బలాన్ని వస్త్రంలా తొడుక్కో! ఒకప్పటి రోజుల్లో, ముందటి తరాల్లో లేచినట్టు లే. రాహాబును*+ ముక్కలుముక్కలు చేసింది,భారీ సముద్రప్రాణిని చీల్చేసింది నువ్వు కాదా?+ 10  సముద్రాన్ని, అగాధ జలాల్ని ఎండిపోజేసింది,+ తిరిగి కొనబడినవాళ్లు దాటివెళ్లేలా సముద్ర గర్భంలో దారిని ఏర్పాటు చేసింది+ నువ్వు కాదా? 11  విడిపించబడిన యెహోవా ప్రజలు తిరిగొస్తారు.+ వాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ సీయోనుకు వస్తారు,+వాళ్ల తలల మీద శాశ్వత ఆనందం అనే కిరీటం ఉంటుంది.+ ఉల్లాసం, సంతోషం వాళ్ల సొంతమౌతాయి, వేదన, నిట్టూర్పు ఎగిరిపోతాయి.+ 12  “స్వయంగా నేనే నిన్ను ఓదారుస్తాను.+ చనిపోయి నశించిపోయే మనిషికి,పచ్చగడ్డిలా వాడిపోయే మనిషికి నువ్వెందుకు భయపడాలి?+ 13  నిన్ను తయారుచేసిన యెహోవాను,+ఆకాశాన్ని విస్తరింపజేసి,+ భూమికి పునాది వేసిన దేవుణ్ణి నువ్వెందుకు మర్చిపోతున్నావు? అణచివేసే* వ్యక్తి కోపాన్ని బట్టి నువ్వు రోజంతా అదేపనిగా భయపడుతున్నావు,అతనేదో నిన్ను నాశనం చేసే స్థానంలో ఉన్నట్టు బెదిరిపోతున్నావు. అణచివేసే వ్యక్తి కోపం ఇప్పుడు ఏమైంది? 14  సంకెళ్ల వల్ల వంగిపోయిన వాళ్లు త్వరలోనే విడుదల చేయబడతారు;+వాళ్లు చనిపోరు, గోతిలోకి వెళ్లరు,వాళ్లకు ఆహారం ఉండకుండా పోదు. 15  అయితే నేను నీ దేవుడైన యెహోవాను,నేను సముద్రంలో అలజడి రేపి, దాని అలలు ఎగసిపడేలా చేస్తాను,+సైన్యాలకు అధిపతైన యెహోవా నా పేరు.+ 16  ఆకాశాన్ని దాని స్థానంలో పెట్టడానికి, భూమికి పునాది వేయడానికి,+సీయోనుతో, ‘నువ్వు నా జనం’+ అని చెప్పడానికినేను నా మాటల్ని నీ నోట ఉంచుతాను,నా చేతి నీడతో నిన్ను కప్పుతాను.+ 17  యెహోవా చేతిలోని ఉగ్రతపాత్రలో ఉన్నదాన్ని తాగినయెరూషలేమా, లే! లేచి నిలబడు.+ నువ్వు ఆ గిన్నెలో ఉన్నదంతా తాగావు;తూలేలా చేసే గిన్నెలోది నువ్వు పూర్తిగా తాగేశావు.+ 18  ఆమె కన్న కుమారులందరిలో ఆమెకు దారి చూపించేవాళ్లు ఒక్కరూ లేరు,ఆమె పెంచిన కుమారులందరిలో ఒక్కరు కూడా ఆమె చేతిని పట్టుకోలేదు. 19  నాశనం-వినాశనం, ఆకలి-ఖడ్గం! ఈ రెండూ నీ మీదికి వచ్చాయి.+ ఎవరు నీ మీద సానుభూతి చూపిస్తారు? ఎవరు నిన్ను ఓదారుస్తారు?+ 20  నీ కుమారులు స్పృహ తప్పి పడిపోయారు.+ వలలో చిక్కుకున్న అడవి గొర్రెల్లావాళ్లు ప్రతీ వీధి మూల దగ్గర పడివున్నారు. యెహోవా ఉగ్రత, నీ దేవుని గద్దింపు వాళ్ల మీద పూర్తిగా విరుచుకుపడ్డాయి.” 21  కాబట్టి కష్టాల్లో ఉన్న ఓ స్త్రీ, దయచేసి ఈ మాట విను,నువ్వు మత్తుగా ఉన్నావు, కానీ ద్రాక్షారసం వల్ల కాదు. 22  నీ ప్రభువూ, తన ప్రజల్ని రక్షించే నీ దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో! తూలేలా చేసే గిన్నెను,+అంటే ఆ పాత్రను, నా ఉగ్రతపాత్రను నేను నీ చేతిలో నుండి తీసేసుకుంటాను.దానిలో ఉన్నది నువ్వు మళ్లీ ఎప్పుడూ తాగవు.+ 23  నిన్ను హింసలు పెట్టినవాళ్ల చేతిలో నేను దాన్ని పెడతాను,+వాళ్లు నీతో, ‘మేము నీ మీద నడిచివెళ్లేలా నేలకు వంగు!’ అన్నారు. కాబట్టి నువ్వు నీ వీపును నేలగా చేశావు,వాళ్లు నడిచివెళ్లడానికి దాన్నొక వీధిలా చేశావు.”

అధస్సూచీలు

లేదా “శక్తి.”
లేదా “చెదిరిపోదు.”
లేదా “ఉపదేశం.”
లేదా “ఆ పురుగు” అయ్యుంటుంది.
పదకోశం చూడండి.
లేదా “చుట్టుముట్టే.”