యెషయా 44:1-28

  • దేవుడు ఎంచుకున్న ప్రజల మీద దీవెనలు (1-5)

  • యెహోవా తప్ప ఏ దేవుడూ లేడు (6-8)

  • మనుషులు చెక్కిన విగ్రహాలు వ్యర్థమైనవి (9-20)

  • యెహోవా ఇశ్రాయేలు విమోచకుడు (21-23)

  • కోరెషు ద్వారా పునరుద్ధరించడం (24-28)

44  “నా సేవకుడివైన యాకోబూ,నేను ఎంచుకున్న ఇశ్రాయేలూ,+ విను.   నిన్ను రూపొందించి, తయారుచేసి,గర్భంలో ఉన్నప్పటి* నుండి నీకు సహాయం చేసిన+యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా సేవకుడివైన యాకోబూ,నేను ఎంచుకున్న యెషూరూనూ*+ భయపడకు.+   ఎందుకంటే నేను దాహంగా ఉన్న వాళ్ల* మీద నీళ్లను,ఎండిన నేల మీద నీటి ప్రవాహాల్ని కుమ్మరిస్తాను.+ నీ సంతానం* మీద నా పవిత్రశక్తిని,నీ వంశస్థుల మీద నా దీవెనను కుమ్మరిస్తాను.+   వాళ్లు పచ్చగడ్డి మధ్య నాటబడిన మొక్కల్లా,నీటి కాలువల పక్కన నాటబడిన నిరవంజి చెట్లలా ఎదుగుతారు.+   ఒకతను, “నేను యెహోవాకు చెందినవాణ్ణి” అంటాడు.+ ఇంకొకతను యాకోబు పేరు పెట్టుకుంటాడు,మరొకతను “నేను యెహోవాకు చెందినవాణ్ణి” అని తన చేతిమీద రాసుకుంటాడు. అతను ఇశ్రాయేలు అనే మారుపేరు పెట్టుకుంటాడు.’   ఇశ్రాయేలు రాజైన యెహోవా,+అతని విమోచకుడూ,+ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేనే మొదటివాణ్ణి, నేనే చివరివాణ్ణి.+ నేను తప్ప వేరే దేవుడు లేడు.+   నాలాంటి వాళ్లు ఎవరున్నారు?+ ఉంటే, అతను బిగ్గరగా మాట్లాడాలి, దాన్ని నాకు నిరూపించాలి!+ పురాతన కాలంలోని ప్రజల్ని స్థాపించినప్పటి నుండి నేను చేసినట్టు,జరగబోతున్న సంగతుల్ని,అలాగే ఇంకా జరగనివాటిని వాళ్లు చెప్పాలి.   భయపడకండి,భయంతో చచ్చుబడిపోకండి.+ మీలో ప్రతీ ఒక్కరికి నేను దాని గురించి ముందే చెప్పలేదా, ముందే ప్రకటించలేదా? మీరే నా సాక్షులు.+ నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా? లేడు, నేను తప్ప వేరే ఆశ్రయదుర్గం* లేడు;+ ఉన్నట్టు నాకు తెలీదు.’ ”   చెక్కిన విగ్రహాలు తయారుచేసేవాళ్లు పనికిరానివాళ్లు,వాళ్ల ప్రియమైన వస్తువుల వల్ల ఏ ప్రయోజనం ఉండదు.+ అవి* సాక్ష్యం చెప్పలేవు, ఎందుకంటే అవి ఏమీ చూడలేవు, వాటికి ఏమీ తెలీదు,+కాబట్టి వాటిని తయారుచేసిన వాళ్లు అవమానాలపాలు అవుతారు.+ 10  ఏ ప్రయోజనం చేకూర్చనిదేవుణ్ణి లేదా పోత* విగ్రహాన్ని+ ఎవరు తయారుచేస్తారు? 11  ఇదిగో! అతని సహవాసులంతా అవమానాలపాలు అవుతారు!+ చేతిపనివాళ్లు కేవలం మనుషులు. వాళ్లందర్నీ వచ్చి నిలబడమనండి. వాళ్లు భయపడతారు, అంతా కలిసి అవమానాలపాలు అవుతారు. 12  కమ్మరి తన పనిముట్టుతో* నిప్పుల మీద ఇనుప వస్తువును తయారుచేస్తాడు. తన శక్తివంతమైన బాహువు ఉపయోగించిసుత్తితో దాన్ని మలుస్తాడు.+ తర్వాత అతనికి ఆకలేస్తుంది, అతని బలం క్షీణిస్తుంది;నీళ్లు తాగకపోవడం వల్ల అతను నీరసించిపోతాడు. 13  వడ్రంగి కొలనూలు చాపి ఎర్రని సుద్ద ముక్కతో ఆకారం గీస్తాడు. ఉలితో దాన్ని చెక్కి, వృత్తలేఖినితో దాన్ని సరిచూస్తూ ఉంటాడు. దాన్ని గుడిలో కూర్చోబెట్టడానికిమనిషి ఆకారంలో,+మనిషి లాంటి సౌందర్యంతో దాన్ని చేస్తాడు.+ 14  ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పని దేవదారు చెట్లను నరకడం. అతను ఒక రకమైన చెట్టును, అంటే సింధూర చెట్టును ఎంచుకుంటాడు,తర్వాత అడవిలోని చెట్ల+ మధ్య దాన్ని బలంగా ఎదగనిస్తాడు. అతనొక తమాల వృక్షాన్ని నాటుతాడు, వర్షం దాన్ని పెంచుతుంది. 15  తర్వాత అది పొయ్యిలో పెట్టే కట్టెలుగా మారుతుంది. కొన్ని కట్టెలతో అతను చలికాచుకుంటాడు;మంట వెలిగించి, రొట్టె కాల్చుకుంటాడు. అయితే అతను ఒక దేవుణ్ణి కూడా తయారుచేసుకొని, దాన్ని పూజిస్తాడు. దానితో చెక్కుడు విగ్రహం తయారుచేసి, దానికి వంగి నమస్కారం చేస్తాడు.+ 16  వాటిలో సగం కట్టెల్ని అతను అగ్నిలో కాలుస్తాడు;ఆ సగం కట్టెలతో అతను మాంసాన్ని కాల్చుకొని తిని తృప్తి చెందుతాడు. అంతేకాదు అతను చలికాచుకొని, “ఆహా! ఈ మంటను చూస్తే వెచ్చగా ఉంది” అంటాడు. 17  మిగతావాటితో అతను ఒక దేవుణ్ణి, అంటే తన చెక్కుడు విగ్రహాన్ని తయారుచేసుకుంటాడు. దానికి వంగి నమస్కారం చేసి, దాన్ని పూజిస్తాడు. దానికి ప్రార్థిస్తూ, “నన్ను కాపాడు, ఎందుకంటే నువ్వే నా దేవుడివి”+ అంటాడు. 18  వాళ్లకు ఏమీ తెలీదు, ఏమీ అర్థంకాదు,+ఎందుకంటే వాళ్ల కళ్లు గట్టిగా మూయబడ్డాయి, వాళ్లు చూడలేరు,వాళ్ల హృదయానికి లోతైన అవగాహన లేదు. 19  ఎవరూ తమ హృదయాల్లో ఆలోచించట్లేదు;“సగం కట్టెల్ని మంటల్లో కాల్చాను, దాని నిప్పుల్లో రొట్టెను, మాంసాన్ని కాల్చుకొని తిన్నాను.అలాంటిది, మిగతా కట్టెలతో నేను అసహ్యమైన దాన్ని చేయడం ఏంటి?+ చెట్టు నుండి తీయబడిన చెక్కముక్కకు* మొక్కడం ఏంటి?” అని ఆలోచించడానికి ఎవరికీ జ్ఞానం గానీ అవగాహన గానీ లేదు. 20  అతను బూడిద తింటాడు. మోసపోయిన అతని హృదయమే అతన్ని తప్పుదారి పట్టించింది. అతను తనను తాను కాపాడుకోలేడు, “నా కుడిచేతిలో ఉన్నది అబద్ధం కదా?” అని అనుకోడు. 21  “యాకోబూ, ఇశ్రాయేలూ, ఈ సంగతులు గుర్తుంచుకో,ఎందుకంటే నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను తయారుచేశాను, నువ్వు నా సేవకుడివి.+ ఇశ్రాయేలూ, నేను నిన్ను మర్చిపోను.+ 22  మేఘంతో కప్పేసినట్టు నీ దోషాల్ని,దట్టమైన మేఘంతో కప్పేసినట్టు నీ పాపాల్ని నేను తుడిచేస్తాను.+ నా దగ్గరికి తిరిగి రా, ఎందుకంటే నేను నిన్ను తిరిగి కొంటాను.+ 23  ఆకాశమా, సంతోషంతో కేకలు వేయి,ఎందుకంటే యెహోవా చర్య తీసుకున్నాడు! భూమి అగాధ స్థలాల్లారా, విజయోత్సాహంతో కేకలు వేయండి! పర్వతాల్లారా, సంతోషంతో కేకలు వేయండి!+అడవీ! నువ్వూ, నీలోని వృక్షాలన్నీ సంతోషంతో కేకలు వేయాలి! ఎందుకంటే, యెహోవా యాకోబును తిరిగి కొన్నాడు,ఇశ్రాయేలు మీద తన వైభవాన్ని కనబరుస్తున్నాడు.”+ 24  తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నిన్ను రూపొందించిననీ విమోచకుడైన యెహోవా+ ఇలా అంటున్నాడు: “నేను యెహోవాను, సమస్తాన్ని సృష్టించింది నేనే. నేనే స్వయంగా ఆకాశాన్ని విస్తరింపజేశాను,+నేనే భూమిని పరిచాను.+ అప్పుడు నాతో ఎవరున్నారు? 25  వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ల* సూచనల్ని నేను వమ్ము చేస్తున్నాను,సోదె చెప్పేవాళ్లు మూర్ఖుల్లా ప్రవర్తించేట్టు చేస్తున్నది నేనే;+తెలివిగలవాళ్లను గందరగోళంలో పడేసివాళ్ల జ్ఞానాన్ని మూర్ఖత్వంగా మారుస్తున్నది నేనే;+ 26  తన సేవకుని మాటను నిజమయ్యేలా చేస్తున్నదితన సందేశకుల ప్రవచనాల్ని పూర్తిగా నెరవేరుస్తున్నది నేనే;+యెరూషలేము గురించి, ‘అది నివాస స్థలమౌతుంది’ అని చెప్తున్నది,+ యూదా నగరాల గురించి, ‘అవి తిరిగి కట్టబడతాయి,+దాని శిథిలాల్ని నేను బాగుచేస్తాను’+ అని చెప్తున్నది నేనే; 27  అగాధ జలాలతో ‘ఆవిరైపోండి,నేను మీ నదులన్నిటినీ ఎండిపోజేస్తాను’+ అని చెప్తున్నది నేనే; 28  కోరెషు+ గురించి, ‘ఇతను నా మంద కాపరి,ఇతను నా ఇష్టాన్నంతా పూర్తిగా నెరవేరుస్తాడు’+ అని చెప్తున్నది నేనే;యెరూషలేము గురించి, ‘అది తిరిగి కట్టబడుతుంది’ అనీ, దాని ఆలయం గురించి, ‘నీ పునాది వేయబడుతుంది’ అనీ చెప్తున్నది నేనే.”+

అధస్సూచీలు

లేదా “పుట్టినప్పటి.”
“నిజాయితీపరుడు” అని అర్థం. ఇది ఇశ్రాయేలుకు ఉపయోగించిన గౌరవపూర్వక బిరుదు.
లేదా “దేశం.”
అక్ష., “విత్తనం.”
అక్ష., “బండరాయి.”
అంటే, ఆ విగ్రహాలు.
లేదా “లోహపు.”
అంటే, పెద్దవంపు కత్తి.
లేదా “ఎండిన చెక్కముక్కకు.”
లేదా “అబద్ధ ప్రవక్తల.”