యెషయా 39:1-8
-
బబులోను నుండి సందేశకులు (1-8)
39 ఆ సమయంలో బబులోను రాజూ బలదాను కుమారుడూ అయిన మెరోదక్బలదాను హిజ్కియా జబ్బుపడి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాల్ని, కానుకను పంపాడు.+
2 హిజ్కియా సంతోషంగా వాళ్లను ఆహ్వానించి* తన ధనాగారాన్ని+ చూపించాడు. అతను వాళ్లకు వెండిబంగారాల్ని, సాంబ్రాణి తైలాన్ని, ప్రశస్తమైన వేరే తైలాన్ని, తన ఆయుధశాల అంతటినీ, తన ఖజానాల్లో ఉన్నవన్నీ చూపించాడు. తన రాజభవనంలో, తన రాజ్యమంతటిలో హిజ్కియా వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు.
3 తర్వాత యెషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి, “ఆ మనుషులు నీతో ఏం మాట్లాడారు? వాళ్లు ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని చెప్పాడు.+
4 యెషయా అతన్ని, “వాళ్లు నీ రాజభవనంలో ఏమి చూశారు?” అని అడిగాడు. దానికి హిజ్కియా, “వాళ్లు నా రాజభవనంలో ఉన్న ప్రతీది చూశారు. నా ఖజానాల్లో నేను వాళ్లకు చూపించనిదంటూ ఏదీ లేదు” అన్నాడు.
5 అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు: “సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్న ఈ మాట విను.
6 ‘ఇదిగో! నీ రాజభవనంలో ఉన్నవన్నీ, ఈ రోజు వరకు నీ పూర్వీకులు కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్లబడే రోజులు రాబోతున్నాయి. ఏదీ మిగలదు’+ అని యెహోవా అంటున్నాడు.+
7 ‘వాళ్లు నీ సొంత కుమారుల్ని, అంటే నీకు పుట్టబోయే కుమారుల్లో కొందర్ని తీసుకెళ్లిపోతారు; వాళ్లు బబులోను రాజభవనంలో ఆస్థాన అధికారులు అవుతారు.’ ”+
8 దానికి హిజ్కియా యెషయాతో, “నువ్వు చెప్పిన యెహోవా మాట మంచిదే” అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు: “ఎందుకంటే నేను బ్రతికినంత కాలం* శాంతి, భద్రత* ఉంటాయి.”+