కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా హస్తము కురుచ కాలేదు

యెహోవా హస్తము కురుచ కాలేదు

ఇరవైయవ అధ్యాయం

యెహోవా హస్తము కురుచ కాలేదు

యెషయా 59:​1-21

1. యూదాలో ఎలాంటి పరిస్థితి ఉంది, చాలామంది ఏమనుకుంటున్నారు?

 యూదా జనము తాను యెహోవాతో నిబంధన సంబంధాన్ని కలిగి ఉన్నట్లు చెప్పుకుంటుంది. అయినప్పటికీ, ఎక్కడ చూసినా శ్రమలే. న్యాయం కొరవడింది, నేరమూ అణచివేతా పెచ్చుపెరిగిపోయాయి, పరిస్థితి మెరుగవుతుందనే ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఏదో ఘోరమైన లోపం ఉంది. యెహోవా అసలు ఎప్పటికైనా విషయాలను సరిచేస్తాడా అని అనేకులు అనుకుంటున్నారు. యెషయా కాలంలో పరిస్థితి అలా ఉంది. కానీ ఈ కాలానికి సంబంధించి యెషయా వ్రాసిన వృత్తాంతం, కేవలం ప్రాచీన చరిత్ర మాత్రమే కాదు. ఆయన మాటల్లో, దేవుడ్ని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన కట్టడలను అలక్ష్యం చేసేవారి కోసం ప్రవచనార్థక హెచ్చరికలు కూడా ఉన్నాయి. యెషయా 59 వ అధ్యాయంలో వ్రాయబడివున్న ప్రేరేపిత ప్రవచనం, కష్టతరమైన ప్రమాదకరమైన కాలాల్లో జీవిస్తున్నప్పటికీ యెహోవా సేవ చేయడానికి కృషి చేసేవారందరికీ దయాపూర్వకమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

సత్య దేవుని నుండి దూరమయ్యారు

2, 3. యెహోవా యూదాను ఎందుకు కాపాడడం లేదు?

2 ఒక్కసారి ఆలోచించండి​—⁠యెహోవా నిబంధన ప్రజలు మతభ్రష్టులైపోయారు! వారు తమ సృష్టికర్తను తిరస్కరించి, కాపుదలనిచ్చే ఆయన హస్తము నుండి తమను తాము దూరం చేసుకున్నారు. దీని మూలంగా, వారు తీవ్రమైన విపత్తును అనుభవిస్తున్నారు. తమ కష్టకాలాలను బట్టి వారు ఒకవేళ యెహోవాను నిందిస్తారా? యెషయా వారికిలా చెబుతున్నాడు: “రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.”​—యెషయా 59: 1, 2.

3 ఈ మాటలు నిర్మొహమాటమైనవే కానీ సత్యమైనవి. యెహోవా ఇప్పటికీ రక్షణనిచ్చే దేవుడే. ‘ప్రార్థన ఆలకించువానిగా’ ఆయన తన నమ్మకమైన సేవకుల ప్రార్థనలను వింటాడు. (కీర్తన 65: 2) అయితే, ఆయన తప్పిదస్థులను దీవించడు. ప్రజలు యెహోవా నుండి దూరమైపోవడానికి వారే బాధ్యులు. ఆయన వారి నుండి తన ముఖమును త్రిప్పుకోవడానికి వారి దుష్టత్వమే కారణం.

4. యూదాపై ఏ ఆరోపణలు వేయబడ్డాయి?

4 వాస్తవానికి, యూదాకు చాలా ఘోరమైన చరిత్ర ఉంది. వారికి వ్యతిరేకంగా ఉన్న ఆరోపణల్లో కొన్నింటిని యెషయా ప్రవచనం తెలియజేస్తోంది: “మీ చేతులు రక్తముచేతను మీ వ్రేళ్లు దోషముచేతను అపవిత్రపరచబడియున్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడునుబట్టి మాటలాడుచున్నది.” (యిషయా 59: 3) ప్రజలు అబద్ధాలు చెబుతూ కీడుచేసే విషయాలు మాట్లాడతారు. ‘రక్తముతో అపవిత్రపరచబడిన చేతులు’ అన్న పదబంధం, కొందరు చివరికి హత్య కూడా చేశారని సూచిస్తోంది. హత్య చేయడాన్ని నిషేధించడమే గాక ‘నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు’ అని కూడా చెప్పే ధర్మశాస్త్రమునిచ్చిన దేవునికది ఎంత అగౌరవం! (లేవీయకాండము 19:​17) యూదా నివాసుల విశృంఖలమైన పాపము, దాని వల్ల అనివార్యంగా వచ్చిన పర్యవసానము, మనం పాపభరితమైన తలంపులను, భావాలను అదుపు చేసుకోవలసిన అవసరం ఉందని నేడు మనలో ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి. లేకపోతే, దేవుని నుండి మనల్ని దూరం చేసే దుష్టకార్యాలను మనం చేసేస్తాము.​—⁠రోమీయులు 12: 9; గలతీయులు 5:​15; యాకోబు 1:​14, 15.

5. యూదా భ్రష్టత్వం ఎంతవరకు వెళ్ళింది?

5 మొత్తం జనాంగానికి పాపపు వ్యాధి సోకింది. ప్రవచనం ఇలా చెబుతోంది: “నీతినిబట్టి యెవడును సాక్ష్యము పలుకడు, సత్యమునుబట్టి యెవడును వ్యాజ్యెమాడడు. అందరు వ్యర్థమైనదాని నమ్ముకొని, మోసపుమాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి, పాపమును కందురు.” (యెషయా 59: 4) ఎవరూ నీతిని పలుకడం లేదు. న్యాయస్థానాల్లో సహితం, విశ్వసనీయులను లేదా నమ్మకమైనవారిని కనుగొనడం అరుదు. యూదా యెహోవాను నిరాకరించి, ఇతర రాజ్యములతో కుదుర్చుకొన్న ఒప్పందాలను, చివరికి నిర్జీవమైన విగ్రహాలను నమ్ముకుంది. ఇవన్నీ “మాయ” వంటివి, అంటే ఏ విధమైన విలువా లేనివి. (యెషయా 40:​17, 23; యెషయా 41:​29) ఫలితంగా, ఎన్నో చర్చలు జరుగుతున్నాయి, కానీ అన్నీ వ్యర్థమైనవే. పథకాలు వేయబడుతున్నాయి, కానీ వాటి ఫలితం కష్టమూ, కీడూ మాత్రమే.

6. క్రైస్తవమత సామ్రాజ్యపు చరిత్ర ఎలా యూదా చరిత్రను పోలి ఉంది?

6 సరిగ్గా యూదాలో ఉన్నట్లుగానే క్రైస్తవమత సామ్రాజ్యంలో కీడు, హింస ప్రబలిపోయాయి. (294 వ పేజీలో ఉన్న “మతభ్రష్ట యెరూషలేము​—⁠క్రైస్తవమత సామ్రాజ్యానికి సాదృశ్యము” చూడండి.) భయంకరమైన రెండు ప్రపంచ యుద్ధాలూ క్రైస్తవ దేశాలని పిలువబడుతున్న వాటి మధ్యనే జరిగాయి. నేటి వరకు, క్రైస్తవమత సామ్రాజ్యం అవలంబిస్తున్న మత విధానం, దాని సొంత సభ్యుల్లోని తెగల మధ్య జరుగుతున్న వధను, జాతి ప్రక్షాళనను ఆపడంలో విఫలమైంది. (2 తిమోతి 3: 5) దేవుని రాజ్యంపట్ల విశ్వాసం ఉంచమని యేసు తన అనుచరులకు బోధించినప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్య దేశాలు భద్రత కోసం సైనిక ఆయుధాలపై, రాజకీయ ఒప్పందాలపై ఆధారపడడం కొనసాగిస్తున్నాయి. (మత్తయి 6:​9, 10) వాస్తవానికి, ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను ఉత్పన్నం చేస్తున్నది క్రైస్తవమత సామ్రాజ్య దేశాలే! అవును, క్రైస్తవమత సామ్రాజ్యం సురక్షితమైన భవిష్యత్తు కోసం మానవ ప్రయాసలను, సంస్థలను నమ్ముకుంటే, అది కూడా “మాయ”ను నమ్ముకున్నట్లే.

చేదు పర్యవసానాలను అనుభవించడం

7. యూదా పథకాలు కేవలం కీడును మాత్రమే ఎందుకు ఉత్పన్నం చేస్తాయి?

7 విగ్రహారాధన, వంచన ఆరోగ్యదాయకమైన సమాజాన్ని రూపొందించలేవు. అలాంటి చర్యలు తీసుకున్నందుకు, నమ్మకద్రోహులైన యూదులు ఇప్పుడు తమకై తాము తెచ్చుకున్న శ్రమలను అనుభవిస్తున్నారు. మనమిలా చదువుతాము: “వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వల నేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును, వాటిలో ఒకదానిని ఎవడైన త్రొక్కినయెడల విష సర్పము పుట్టును.” (యెషయా 59: 5) తలంపు పుట్టినప్పటి నుండి అది సఫలమయ్యే వరకు యూదా పథకాలు ఉపయోగకరమైన దేన్నీ ఉత్పన్నం చేయవు. విషపూరితమైన పాము గ్రుడ్లు విషపూరితమైన పాములనే ఉత్పన్నం చేసినట్టుగా, వారి తప్పుడు ఆలోచనా విధాన ఫలితం కేవలం కీడు మాత్రమే. యూదా జనము బాధననుభవిస్తుంది.

8. యూదా ఆలోచనా విధానం లోపంగలదని ఏమి చూపిస్తుంది?

8 కొంతమంది యూదా నివాసులు తమను తాము కాపాడుకోవడానికి హింసను ఆశ్రయించవచ్చు, కాని వారు సఫలం కాలేరు. సాలె పురుగు నేసిన పట్టు, నిజమైన వస్త్రాల్లా ఎలాగైతే వాతావరణ మార్పుల నుండి కాపుదలనివ్వలేదో అలాగే, యెహోవాపై నమ్మకమూ నీతియుక్తమైన కార్యములూ రక్షణనిచ్చినట్లుగా భౌతికపరమైన శక్తి రక్షణనివ్వలేదు. యెషయా ఇలా ప్రకటిస్తున్నాడు: “వారి పట్టు బట్టనేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే. వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు; పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి.” (యిషయా 59:​6, 7) యూదా ఆలోచనా విధానం లోపంగలది. అది తన సమస్యలను పరిష్కరించుకోవడానికి హింసకు పాల్పడడం ద్వారా, దైవభక్తిరహితమైన దృక్పథాన్ని కనబరుస్తుంది. తనకు బలయ్యేవారిలో చాలామంది నిర్దోషులే అయినా, వారిలో కొంతమంది నిజంగా దేవుని సేవకులే అయినా దానికి ఏమాత్రం పట్టింపు లేదు.

9. క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు నిజమైన శాంతిని ఎప్పటికీ ఎందుకు పొందలేరు?

9 ఈ ప్రేరేపిత పలుకులు, క్రైస్తవమత సామ్రాజ్యానికున్న రక్తపంకిలమైన చరిత్రను మనకు గుర్తు చేస్తున్నాయి. విచారకరంగా అది క్రైస్తవత్వానికి తప్పుగా ప్రాతినిధ్యం వహించినందుకు, యెహోవా దాన్ని ఖచ్చితంగా బాధ్యురాలిగా ఎంచుతాడు! యెషయా కాలంనాటి యూదుల్లా, క్రైస్తవమత సామ్రాజ్యం నైతికంగా వక్రీకరించబడిన విధానాన్ని అవలంబించింది ఎందుకంటే దాని నాయకులు అది మాత్రమే ఆచరణాత్మకమైన మార్గమని నమ్ముతున్నారు. వారు సమాధానం గురించి మాట్లాడతారు గానీ అన్యాయంగా వ్యవహరిస్తారు. ఎంత కపటం! క్రైస్తవమత సామ్రాజ్య నాయకులు ఈ యుక్తిని ఉపయోగించడం కొనసాగిస్తున్నారు గనుక, వాళ్ళు నిజమైన శాంతిని ఎప్పటికీ పొందలేరు. ఇది ప్రవచనం చెబుతున్నట్లుగా ఇలా ఉంది: “శాంతవర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమకొరకు వంకరత్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడచువాడెవడును శాంతి నొందడు.”​—యెషయా 59: 8.

ఆధ్యాత్మిక అంధకారంలో తడవులాడడం

10. యూదా తరపున యెషయా ఏమి ఒప్పుకుంటున్నాడు?

10 యెహోవా యూదా యొక్క వక్రమైన, నాశనకరమైన విధానాలను ఆశీర్వదించలేడు. (కీర్తన 11: 5) కాబట్టి మొత్తం జనాంగం తరపున మాట్లాడుతూ, యెషయా యూదా అపరాధాన్ని ఇలా ఒప్పుకుంటున్నాడు: “న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలిసికొనుటలేదు. వెలుగుకొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, గాని చీకటియే ప్రాప్తించును; ప్రకాశముకొరకు ఎదురుచూచుచున్నాము గాని అంధకారములోనే నడచుచున్నాము. గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులాడుచున్నాము, కన్నులు లేనివారివలె తడవులాడుచున్నాము. సంధ్యచీకటియందువలెనే మధ్యాహ్నకాలమున కాలుజారి పడుచున్నాము; బాగుగ బ్రతుకుచున్న వారిలోనుండియు చచ్చినవారివలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము; గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము.” (యెషయా 59:​9-11ఎ) యూదులు దేవుని వాక్యము తమ పాదములకు దీపముగా, తమ త్రోవకు వెలుగుగా ఉండడానికి అనుమతించలేదు. (కీర్తన 119:​105) తత్ఫలితంగా, పరిస్థితులు నిరాశాజనకంగా కనిపిస్తాయి. మిట్టమధ్యాహ్నం వేళ కూడా వారు, రాత్రివేళ తడవులాడుకున్నట్లుగా తడవులాడుకుంటారు. వారు చచ్చినవారివలె ఉన్నారు. ఉపశమనం కోసం ఆశిస్తూ వారు ఆకలిగొన్న లేదా గాయపడిన ఎలుగుబంట్లలా బిగ్గరగా బొబ్బరిస్తారు. కొందరు ఒంటరి గువ్వల్లా జాలిగొలిపేలా దుఃఖరవము చేస్తారు.

11. న్యాయం కోసం, రక్షణ కోసం యూదా పెట్టుకున్న ఆశలు ఎందుకు వమ్ము అవుతాయి?

11 యూదాకు ఏర్పడిన ఈ దుస్థితికి కారణం అది దేవునిపై తిరుగుబాటు చేయడమేనని యెషయాకు బాగా తెలుసు. ఆయనిలా అంటున్నాడు: “న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు; రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటుక్రియలు నీ యెదుట విస్తరించియున్నవి; మా పాపములు మామీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటుక్రియలు మాకు కనబడుచున్నవి; మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపుమాటలు పలకుటయు, ఇవియే మావలన జరుగుచున్నవి.” (యెషయా 59: 11బి-13) యూదా నివాసులు పశ్చాత్తాపపడలేదు గనుక వారి పాపాలు ఇంకా క్షమించబడలేదు. ప్రజలు యెహోవాను విడనాడారు గనుక దేశంలో న్యాయం లేకుండాపోయింది. వారు తమ సహోదరులను అణచివేయడం కూడా చేస్తూ పూర్తిగా అబద్ధికులని నిరూపించబడ్డారు. నేటి క్రైస్తవమత సామ్రాజ్యాన్ని ఎంతగా పోలి ఉన్నారో కదా! అనేకులు న్యాయమును అలక్ష్యం చేయడమే కాదు, వారు దేవుని చిత్తాన్ని చేయడానికి కృషి చేసే యెహోవా నమ్మకమైన సాక్షులను తీవ్రంగా హింసిస్తారు కూడా.

యెహోవా తీర్పును అమలుచేస్తాడు

12. యూదాలో న్యాయము ఉండేలా చూసే బాధ్యతగల వారి దృక్పథం ఎలావుంది?

12 యూదాలో న్యాయముగానీ, నీతిగానీ లేదా సత్యముగానీ అసలు లేనట్లు అనిపిస్తుంది. “న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది. సత్యము సంతవీధిలో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు.” (యిషయా 59:​14) యూదా నగర ద్వారముల వెనుక సంత వీధులు ఉండేవి, అక్కడ న్యాయ విచారణ చేయడానికి పెద్దలు సమకూడేవారు. (రూతు 4:​1, 2, 11) అలాంటి వ్యక్తులు న్యాయమును అనుసరించి, నీతిగా తీర్పు తీర్చాలి, లంచములు తీసుకోకూడదు. (ద్వితీయోపదేశకాండము 16:​18-20) బదులుగా, వారు తమ స్వార్థపూరిత తలంపులకు అనుగుణంగా తీర్పు తీరుస్తున్నారు. అంతకంటే ఘోరమేమిటంటే, మంచి చేయడానికి యథార్థంగా ప్రయత్నించే ఎవరినైనా వారు సులభంగా దొరికే ఎరగా దృష్టిస్తారు. మనమిలా చదువుతాము: “సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు.”​—యెషయా 59:15ఎ.

13. యూదా న్యాయాధిపతులు తమ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు గనుక, యెహోవా ఏమి చేస్తాడు?

13 నైతిక వక్రమార్గానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి విఫలమయ్యేవారు, దేవుడు అంధుడు కాదనీ, జ్ఞానంలేనివాడు కాదనీ లేదా శక్తిహీనుడు కాదనీ మరచిపోతారు. యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమైయుండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను.” (యిషయా 59:​15బి, 16) నియమిత న్యాయాధిపతులు తమ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తున్నారు గనుక, యెహోవా జోక్యం చేసుకుంటాడు. అలా ఆయన జోక్యం చేసుకున్నప్పుడు, ఆయన నీతితో, శక్తితో చర్య తీసుకుంటాడు.

14. (ఎ) నేడు అనేకులకు ఏ దృక్పథం ఉంది? (బి) యెహోవా చర్య తీసుకోవడానికి తనను తాను ఎలా సిద్ధం చేసుకుంటాడు?

14 నేడు అటువంటి పరిస్థితే ఉంది. అనేకులు “సిగ్గులేనివారై” ఉన్న లోకంలో మనం జీవిస్తున్నాము. (ఎఫెసీయులు 4:​19) భూమిపై ఉన్న దుష్టత్వాన్ని నిర్మూలించడానికి యెహోవా ఎప్పుడైనా జోక్యం చేసుకుంటాడనేదాన్ని చాలా కొద్దిమంది విశ్వసిస్తున్నారు. కానీ యెహోవా మానవుల వ్యవహారాలను చాలా సన్నిహితంగా గమనిస్తున్నాడని యెషయా ప్రవచనం చూపిస్తోంది. ఆయన తీర్పులు తీరుస్తాడు, ఆయన తన సొంత సమయంలో ఆ తీర్పులకు అనుగుణంగా చర్య తీసుకుంటాడు. ఆయన తీర్చే తీర్పులు న్యాయమైనవేనా? అవి న్యాయమైనవేనని యెషయా చూపిస్తున్నాడు. యూదా జనముకు సంబంధించి, ఆయనిలా వ్రాస్తున్నాడు: ‘నీతిని కవచముగా [యెహోవా] ధరించుకొనెను, రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను.’ (యెషయా 59:​17, 18ఎ) ఈ ప్రవచనార్థక మాటలు యెహోవాను, యుద్ధం కోసం నడుం బిగిస్తున్న యోధునిగా చిత్రీకరిస్తున్నాయి. ఆయన తన సంకల్పం విజయవంతంగా ముగింపుకు వచ్చేలా చూస్తాడనే భావంలో, ఆయన ‘రక్షణను’ ఇవ్వాలని ఉద్దేశించాడు. ఆయనకు తన స్వంత సమగ్రమైన, ప్రతిఘటింపజాలని నీతి గురించి నిశ్చయత ఉంది. ఆయన తన తీర్పు చర్యల్లో నిర్భయమైన ఆసక్తి కలిగి ఉంటాడు. నీతి విజయం సాధిస్తుందన్నదానిలో సందేహం లేదు.

15. (ఎ) యెహోవా తన తీర్పులు అమలు చేసినప్పుడు నిజ క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తారు? (బి) యెహోవా తీర్పుల గురించి ఏమి చెప్పవచ్చు?

15 నేడు కొన్ని దేశాల్లో, అబద్ధాలు, అపనిందలు ప్రచారం చేయడం ద్వారా యెహోవా సేవకుల పనిని ఆటంకపరచడానికి సత్య శత్రువులు ప్రయత్నిస్తున్నారు. నిజ క్రైస్తవులు సత్యం పక్షాన నిలబడడానికి వెనుకాడరు, అయితే వారు ఎన్నడూ వ్యక్తిగతంగా పగతీర్చుకోవడానికి ప్రయత్నించరు. (రోమీయులు 12:​19) యెహోవా, మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యాన్ని జవాబు చెప్పమని అడిగే సమయంలో కూడా, భూమిపైనున్న ఆయన ఆరాధకులు మాత్రం దానిని నాశనం చేయడంలో భాగం వహించరు. పగతీర్చుకునే పనిని యెహోవా తనకే ఉంచుకున్నాడనీ, సమయం వచ్చినప్పుడు ఆయన తగిన చర్య తీసుకుంటాడనీ వారికి తెలుసు. ప్రవచనం మనకిలా హామీ ఇస్తోంది: “వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులకు రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతికారము చేయును. ద్వీపస్థులకు ప్రతికారము చేయును.” (యిషయా 59:​18) యెషయా కాలంలోలాగే, దేవుని తీర్పులు న్యాయమైనవిగానే కాదుగానీ అవి సంపూర్ణమైనవై కూడా ఉంటాయి. అవి ‘ద్వీపములకు’ అంటే సుదూర ప్రాంతాలకు కూడా చేరుకుంటాయి. యెహోవా తీర్పు చర్యలు చేరలేనంత మారుమూల ప్రాంతంలో ఎవరూ ఉండరు.

16. యెహోవా తీర్పు చర్యలను ఎవరు తప్పించుకుని జీవించగలరు, తాము తప్పించుకొని జీవించగలగడం నుండి వారేమి నేర్చుకుంటారు?

16 సరైనది చేయడానికి కృషి చేసేవారికి యెహోవా నీతియుక్తంగా తీర్పు తీరుస్తాడు. అలాంటివారు, భూమి ఈ కొన నుండి ఆ కొన వరకు అంటే భూమి యందంతటా ఎక్కడ ఉన్నా తప్పించుకొని జీవిస్తారని యెషయా ప్రవచిస్తున్నాడు. వారు యెహోవా కాపుదలను అనుభవించడం, వారికి ఆయన పట్ల ఉన్న భక్తిని, గౌరవాన్ని ప్రగాఢంగా బలపరుస్తుంది. (మలాకీ 1:​11) మనమిలా చదువుతాము: ‘పడమటి దిక్కుననున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కుననున్నవారు ఆయన మహిమకు భయపడుదురు, యెహోవా పుట్టించు గాలికి [“ఆత్మకు,” NW] కొట్టుకొనిపోవు ప్రవాహ జలమువలె ఆయన వచ్చును.’ (యెషయా 59:​19) శక్తివంతమైన తుపాను తన ఎదుట ఉన్న నాశనకరమైన వరద నీటి రాశిని తోసేస్తూ, తన మార్గంలో ఉన్నవన్నీ కొట్టుకుపోయేలా చేసినట్లుగానే, యెహోవా ఆత్మ ఆయన చిత్తం నెరవేరడానికున్న ఆటంకాలన్నిటినీ నిర్మూలిస్తుంది. మానవుని వద్ద ఉన్న శక్తులన్నింటికన్నా ఆయన ఆత్మ బలమైనది. ఆయన దాన్ని మనుష్యులపై, జనములపై తీర్పు అమలు చేయడానికి ఉపయోగించినప్పుడు, ఆయనకు ఖచ్చితమైన, సంపూర్ణమైన విజయం లభిస్తుంది.

పశ్చాత్తప్తులకు నిరీక్షణ, ఆశీర్వాదం

17. సీయోను విమోచకుడు ఎవరు, ఆయన సీయోనును ఎప్పుడు విమోచిస్తాడు?

17 మోషే ధర్మశాస్త్రం క్రింద, తనను తాను దాసత్వంలోకి అమ్ముకున్న ఒక ఇశ్రాయేలీయుడ్ని ఒక విమోచకుడు దాసత్వంలో నుండి విడిపించవచ్చు. మునుపు యెషయా ప్రవచన గ్రంథంలో, యెహోవా పశ్చాత్తాపపడే వ్యక్తుల విమోచకునిగా వర్ణించబడ్డాడు. (యెషయా 48:​17) ఇప్పుడు మళ్ళీ ఆయన పశ్చాత్తాపపడేవారి విమోచకునిగా వర్ణించబడుతున్నాడు. యెహోవా వాగ్దానాన్ని యెషయా ఇలా వ్రాస్తున్నాడు: “సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు.” (యెషయా 59:​20) ధైర్యాన్నిచ్చే ఈ వాగ్దానం సా.శ.పూ. 537 లో నెరవేరింది. కానీ దానికి మరో నెరవేర్పు కూడా ఉంది. అపొస్తలుడైన పౌలు ఈ మాటలను సెప్టాజింట్‌ వర్షన్‌ నుండి ఎత్తివ్రాస్తూ, వాటిని క్రైస్తవులకు అన్వయించాడు. ఆయనిలా వ్రాశాడు: “విమోచకుడు సీయోనులోనుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును; నేను వారి పాపములను పరిహరించినప్పుడు నావలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరును రక్షింపబడుదురు.” (రోమీయులు 11:​26, 27) వాస్తవానికి, యెషయా ప్రవచనానికి ఎంతో విస్తృతమైన అన్వయింపు అంటే మన కాలం వరకూ అలాగే భవిష్యత్తుకూ వర్తించే అన్వయింపు ఉంది. అదెలా?

18. “దేవుని ఇశ్రాయేలు”ను యెహోవా ఎప్పుడు, ఎలా ఉనికిలోకి తీసుకువచ్చాడు?

18 మొదటి శతాబ్దంలో, ఇశ్రాయేలు జనాంగంలోని ఒక చిన్న శేషము యేసును మెస్సీయగా అంగీకరించింది. (రోమీయులు 9:​27; 11: 5) సా.శ. 33 పెంతెకొస్తు దినాన, ఆ విశ్వాసుల్లో దాదాపు 120 మందిపై యెహోవా తన పరిశుద్ధాత్మను కుమ్మరించి, యేసుక్రీస్తు మధ్యవర్తిత్వం నెరిపిన తన క్రొత్త నిబంధనలోకి వారిని తీసుకువచ్చాడు. (యిర్మీయా 31:31-33; హెబ్రీయులు 9:​15) ఆ దినాన “దేవుని ఇశ్రాయేలు” అంటే ఒక క్రొత్త జనము ఉనికిలోకి వచ్చింది, దాని సభ్యులు అబ్రాహాము వంశీకులు కాదు గానీ దేవుని ఆత్మ మూలంగా జన్మించినవారు. (గలతీయులు 6:​16) కొర్నేలితో ప్రారంభమై, క్రొత్త జనములో సున్నతి పొందని అన్యులు కూడా భాగమయ్యారు. (అపొస్తలుల కార్యములు 10:​24-48; ప్రకటన 5:​9, 10) అలా యెహోవా దేవుడు వారిని దత్తత తీసుకోవడంతో వారు ఆయనకు ఆధ్యాత్మిక పిల్లలయ్యారు, అంటే యేసు తోడి వారసులయ్యారు.​—⁠రోమీయులు 8:​16, 17.

19. దేవుని ఇశ్రాయేలుతో యెహోవా ఏ నిబంధన చేస్తున్నాడు?

19 యెహోవా ఇప్పుడు దేవుని ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేస్తున్నాడు. మనమిలా చదువుతాము: “నేను వారితో చేయు నిబంధన యిది​—⁠నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా 59:​21) ఈ మాటలు యెషయాకు అన్వయించబడ్డాయో లేదో గానీ, అవి యేసు విషయంలో మాత్రం ఖచ్చితంగా నెరవేరాయి, ‘అతడు తన సంతానమును చూచును’ అని ఆయనకు హామీ ఇవ్వబడింది. (యెషయా 53:​10, NW) యేసు యెహోవా నుండి తాను నేర్చుకొనిన మాటలను మాట్లాడాడు, యెహోవా ఆత్మ ఆయనపై కుమ్మరింపబడింది. (యోహాను 1:​18; 7:​16) తగిన విధంగానే, ఆయన సహోదరులు, తోటి వారసులు, దేవుని ఇశ్రాయేలు సభ్యులు కూడా యెహోవా పరిశుద్ధాత్మను పొంది, తాము తమ పరలోక తండ్రి నుండి నేర్చుకొనిన సందేశాన్ని ప్రకటిస్తారు. వారందరూ ‘యెహోవాచేత ఉపదేశము నొందినవారు.’ (యెషయా 54:​13; లూకా 12:​12; అపొస్తలుల కార్యములు 2:​38) వారిని తన సాక్షులుగా ఉండకుండా ఎన్నడూ కొట్టివేయను గానీ వారిని నిరంతరం ఉపయోగించుకుంటానని యెహోవా ఇప్పుడు యెషయా ద్వారా లేదా యెషయా ఎవరికైతే ప్రవచనార్థక చిత్రణగా ఉన్నాడో ఆ యేసు ద్వారా నిబంధన చేస్తున్నాడు. (యెషయా 43:​10) అయితే వారి ‘పిల్లలు,’ అంటే ఈ నిబంధన నుండి తాము కూడా ప్రయోజనం పొందేవారు ఎవరు?

20. యెహోవా అబ్రాహాముకు చేసిన వాగ్దానం మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?

20 ప్రాచీన కాలాల్లో యెహోవా అబ్రాహాముకు ఇలా వాగ్దానం చేశాడు: “భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:​18) దీనికి అనుగుణంగా, మెస్సీయను అంగీకరించిన సహజ ఇశ్రాయేలీయుల్లోని ఒక చిన్న శేషము క్రీస్తును గురించిన సువార్తను ప్రకటిస్తూ, అనేక జనముల వద్దకు వెళ్ళింది. కొర్నేలి మొదలుకొని, సున్నతి పొందని అన్యులు అనేకులు, అబ్రాహాము సంతానమైన యేసు ద్వారా ‘ఆశీర్వదించబడ్డారు.’ వారు దేవుని ఇశ్రాయేలులో భాగమయ్యారు, అబ్రాహాము సంతానములో ద్వితీయ భాగమయ్యారు. వారు యెహోవా “పరిశుద్ధజనము”లో భాగం, వారికి ‘చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తమను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేసే’ నియామకం ఇవ్వబడింది.​—⁠1 పేతురు 2: 9; గలతీయులు 3:​7-9, 14, 26-29.

21. (ఎ) ఆధునిక కాలాల్లో దేవుని ఇశ్రాయేలు ఏ ‘పిల్లలకు’ జన్మనిచ్చింది? (బి) దేవుని ఇశ్రాయేలుతో యెహోవా చేసిన నిబంధనను బట్టి లేదా ఒప్పందాన్ని బట్టి ‘పిల్లలు’ ఎలా ఓదార్పు పొందుతారు?

21 నేడు దేవుని ఇశ్రాయేలులోని సభ్యులందరూ సమకూర్చబడినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ జనములు ఇంకా, గొప్ప స్థాయిలో ఆశీర్వదించబడుతూనే ఉన్నాయి. ఎలా? ఎలాగంటే, దేవుని ఇశ్రాయేలుకు ‘పిల్లలు’ కలిగారు, వాళ్ళెవరంటే పరదైసు భూమిపై నిత్య జీవమును పొందే నిరీక్షణ గల యేసు శిష్యులు. (కీర్తన 37:​11, 29) ఈ ‘పిల్లలు’ కూడా యెహోవాచే బోధించబడి, ఆయన మార్గాల్లో ఉపదేశించబడ్డారు. (యెషయా 2:​2-4) వీరు పరిశుద్ధాత్మచే అభిషేకించబడక పోయినప్పటికీ లేదా క్రొత్త నిబంధనలో పాల్గొనేవారిగా పరిగణింపబడకపోయినప్పటికీ, తమ ప్రకటనా పనిలో సాతాను కలిగించే ఆటంకాలనన్నింటినీ అధిగమించడానికి యెహోవా పరిశుద్ధాత్మ వీరిని బలపరుస్తుంది. (యెషయా 40:​28-31) వారి సంఖ్య ఇప్పుడు లక్షలకు చేరుకుంటోంది, వారు తమ సొంత పిల్లలను ఉత్పన్నం చేస్తుండగా ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. అభిషిక్తులతో యెహోవా చేసిన నిబంధన లేక ఒప్పందం, ఆయన తమను కూడా నిరంతరం తన ప్రతినిధులుగా ఉపయోగించుకోవడాన్ని కొనసాగిస్తాడన్న నమ్మకాన్ని ఈ ‘పిల్లలకు’ ఇస్తుంది.​—⁠ప్రకటన 21:​3, 4, 7.

22. యెహోవాపై మనం ఏ విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు, ఇది మనల్ని ఎలా ప్రభావితం చేయాలి?

22 కాబట్టి మనమందరం యెహోవాపై మనకున్న విశ్వాసాన్ని కాపాడుకుందాము. ఆయనకు మనలను రక్షించాలనే ఇష్టమూ, సామర్థ్యమూ ఉన్నాయి! ఆయన హస్తము ఎన్నడూ కురుచ కాదు; ఆయన తన నమ్మకమైన ప్రజలను ఎల్లప్పుడూ విమోచిస్తాడు. ఆయన మంచి మాటలు “ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడు” ఆయనను నమ్ముకునే వారందరి నోట ఉంటాయి.

[అధ్యయన ప్రశ్నలు]

[294 వ పేజీలోని బాక్సు]

మతభ్రష్ట యెరూషలేము క్రైస్తవమత సామ్రాజ్యానికి సాదృశ్యము

దేవుడు ఏర్పరచుకున్న రాజ్యానికి రాజధాని నగరమైన యెరూషలేము, దేవుని ఆత్మ ప్రాణుల పరలోక సంస్థను, క్రీస్తు పెండ్లి కుమార్తెగా పరలోకానికి పునరుత్థానం చేయబడిన అభిషిక్త క్రైస్తవుల సంఘాన్ని కూడా సూచిస్తుంది. (గలతీయులు 4:​25, 26; ప్రకటన 21: 2) అయితే యెరూషలేము నివాసులు యెహోవాపట్ల తరచూ నమ్మక ద్రోహం చేశారు. ఆ నగరం వేశ్యగా, జారిణిగా వర్ణించబడింది. (యెహెజ్కేలు 16:​3, 15, 30-42) ఆ స్థితిలో, యెరూషలేము మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యానికి తగిన నమూనాగా ఉంది.

యేసు యెరూషలేమును, ‘ప్రవక్తలను చంపుచు, తనయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండేదని’ పిలిచాడు. (లూకా 13:​34; మత్తయి 16:​21) నమ్మకద్రోహియైన యెరూషలేము వలే, క్రైస్తవమత సామ్రాజ్యం సత్య దేవుడి సేవ చేస్తున్నానని చెప్పుకుంటూ, ఆయన నీతియుక్తమైన మార్గాల నుండి ఎంతో దూరంగా వెళ్ళిపోతోంది. యెహోవా మతభ్రష్ట యెరూషలేముకు ఏ నీతియుక్తమైన ప్రమాణాలతో తీర్పు తీర్చాడో అవే ప్రమాణాలతో క్రైస్తవమత సామ్రాజ్యానికి తీర్పు తీరుస్తాడని మనం నమ్మకం కలిగి ఉండవచ్చు.

[296 వ పేజీలోని చిత్రం]

న్యాయాధిపతి న్యాయాన్ని అనుసరించి, నీతిగా తీర్పుతీరుస్తూ, లంచములు తీసుకోకూడదు

[298 వ పేజీలోని చిత్రం]

వరదలు వచ్చిన నదిలా, యెహోవా తీర్పులు ఆయన చిత్తాన్ని చేయడంలో వచ్చే ఆటంకాలన్నిటినీ నిర్మూలిస్తాయి

[302 వ పేజీలోని చిత్రం]

తన ప్రజలు తన సాక్షులుగా ఉండే ఆధిక్యతను ఎన్నడూ పోగొట్టుకోరని యెహోవా నిబంధన చేస్తున్నాడు