యెహెజ్కేలు 16:1-63

 • యెరూషలేము పట్ల దేవుని ప్రేమ (1-63)

  • విడువబడిన బిడ్డగా దొరకడం (1-7)

  • దేవుడు ఆమెను అలంకరించి, వివాహ ఒప్పందం చేసుకోవడం (8-14)

  • ఆమె నమ్మకద్రోహి అవ్వడం (15-34)

  • వ్యభిచారిగా శిక్ష అనుభవించడం (35-43)

  • సమరయతో, సొదొమతో పోల్చడం (44-58)

  • దేవుడు తన ఒప్పందాన్ని గుర్తుచేసు​కోవడం (59-63)

16  యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది:  “మానవ కుమారుడా, యెరూషలేముకు దాని అసహ్యమైన పనుల గురించి తెలియజేయి.+  నువ్వు ఇలా చెప్పాలి: ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా యెరూషలేముతో ఇలా అంటున్నాడు: “నువ్వు కనానీయుల దేశంలో పుట్టావు, అక్కడే మొదలయ్యావు. నీ తండ్రి అమోరీయుడు,+ నీ తల్లి హిత్తీయురాలు.+  నీ పుట్టుక విషయానికొస్తే, నువ్వు పుట్టిన రోజున ఎవరూ నీ బొడ్డుతాడు కోయలేదు, నిన్ను నీళ్లతో శుభ్రంగా కడగలేదు, నీకు ఉప్పు రాయలేదు, నిన్ను పొత్తి​గుడ్డల్లో చుట్టలేదు.  వీటిలో ఏ ఒక్కటైనా నీకు చేసేంతగా ఎవరూ నీ మీద జాలి పడలేదు, ఎవరికీ నీ మీద కనికరం కలగ​లేదు. నువ్వు పుట్టిన రోజున నువ్వు ద్వేషించబడ్డావు కాబట్టి నిన్ను బయట పొలంలో పారేశారు.  “ ‘ “నేను ఆ దారిలో వెళ్తూ, రక్తంలో తన్నుకుంటున్న నిన్ను చూశాను; రక్తంలో ​పడివున్న నిన్ను చూసి, ‘బ్రతుకు!’ అని అన్నాను. అవును, రక్తంలో పడివున్న నిన్ను చూసి, ‘బ్రతుకు!’ అన్నాను.  పొలంలో మొలకెత్తే మొక్కల్లా నేను నిన్ను ఒక గొప్ప సమూహంగా చేశాను; నువ్వు పెరిగి పెద్దదానివై, శ్రేష్ఠమైన నగలు ​ధరించావు. నీ స్తనాలు దృఢంగా తయారయ్యాయి, నీ తలవెంట్రుకలు పెరిగాయి; కానీ అప్పటికీ నువ్వు బట్టలు లేకుండా, దిగంబరంగా ఉన్నావు.” ’  “ ‘నేను అటుగా వెళ్తూ నిన్ను చూసి, నీకు ప్రేమించే వయసు వచ్చిందని గమనిం​చాను. కాబట్టి నేను నా వస్త్రాన్ని* నీ మీద పరిచి,+ నీ మానాన్ని కప్పి, ప్రమాణపూర్వకంగా నీతో ఒక ఒప్పందం* చేసుకున్నాను, నువ్వు నా దానివి అయ్యావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.  ‘అంతేకాదు నేను నిన్ను నీళ్లతో కడిగి, నీ మీదున్న రక్తాన్ని శుభ్రం చేసి, నీకు నూనె రాశాను.+ 10  తర్వాత నీకు బుట్టాపని* చేసిన వస్త్రాన్ని, నాణ్యమైన తోలు* చెప్పుల్ని తొడిగాను, నీకు సన్నని నారవస్త్రం చుట్టి, ఖరీదైన బట్టలు వేశాను. 11  నిన్ను నగలతో అలంకరించాను, నీ చేతులకు గాజులు తొడిగి, నీ మెడకు హారం పెట్టాను. 12  నీకు ముక్కుపోగును, చెవిపోగుల్ని, నీ తల మీద అందమైన కిరీటాన్ని పెట్టాను. 13  నువ్వు వెండిబంగారాలతో నిన్ను అలంకరించుకుంటూ, సన్నని నారవస్త్రాన్ని, ఖరీదైన బట్టల్ని, బుట్టాపని చేసిన బట్టల్ని వేసుకుంటూ వచ్చావు. మెత్తని పిండి, తేనె, నూనె నీకు ఆహారంగా ఉండేవి; నువ్వు ఎంతో సౌందర్యవతిగా,+ రాజరికానికి తగినట్టుగా* తయారయ్యావు.’ ” 14  “ ‘నేను నా వైభవాన్ని నీ మీద ఉంచడం వల్ల నువ్వు పరిపూర్ణ సౌందర్యవతివి అయ్యావు;+ నీ సౌందర్యాన్ని బట్టి నీ ఖ్యాతి* ​దేశదేశాలకు వ్యాపిస్తూ వచ్చింది’+ అని సర్వో​న్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” 15  “ ‘కానీ నువ్వు నీ అందాన్ని నమ్ముకోవడం మొదలుపెట్టావు,+ నీ ఖ్యాతి వల్ల వేశ్యవి అయ్యావు.+ దారినపోయే ప్రతీ ఒక్కరితో విచ్చ​లవిడిగా వ్యభిచారం చేస్తూ,+ నీ అందాన్ని వాళ్లకు సమర్పించుకున్నావు. 16  నువ్వు నీ రంగురంగుల బట్టల్లో కొన్ని తీసుకొని, వాటితో నీ ఉన్నత స్థలాల్ని అలంకరించి అక్కడ వ్యభిచారం చేశావు;+ అలాంటివి జరగకూడదు, ​ఎప్పటికీ జరగకూడదు. 17  నేను నీకు ఇచ్చిన అందమైన వెండిబంగారు నగల్ని తీసుకొని, వాటితో పురుష రూప విగ్రహాలు* చేసుకొని వాటితో వ్యభిచారం చేశావు.+ 18  బుట్టాపని చేసిన నీ బట్టలు తీసి వాటిమీద కప్పావు, నా తైలాన్ని, నా ధూపాన్ని వాటికి అర్పించావు.+ 19  నువ్వు తినడానికి నేను నీకు ఇచ్చిన రొట్టెను, అంటే మెత్తని పిండితో, నూనెతో, తేనెతో చేసిన రొట్టెను ఇంపైన* సువాసనగా వాటికి అర్పించావు.+ నువ్వు సరిగ్గా అలాగే చేశావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” 20  “ ‘నువ్వు నాకు కన్న నీ కుమారుల్ని, కూతుళ్లను+ తీసుకుని విగ్రహాలకు బలి ఇచ్చావు.+ నువ్వు చేసిన వ్యభిచార క్రియలు సరిపోలేదా? 21  నువ్వు నా పిల్లల్ని వధించి, వాళ్లను అగ్నిలో వేసి కాల్చావు.*+ 22  నువ్వు నీ హేయమైన పనులన్నిటినీ, వ్యభిచార క్రియలన్నిటినీ చేస్తున్నప్పుడు, నువ్వు నీ ​చిన్ననాటి రోజుల్ని, అంటే నువ్వు బట్టలు లేకుండా, దిగంబరంగా ఉండి రక్తంలో తన్నుకుంటున్న రోజుల్ని గుర్తుచేసుకోలేదు. 23  నువ్వు ఈ చెడ్డపనులన్నీ చేశావు కాబట్టి నీకు శ్రమ, నీకు శ్రమ’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటు​న్నాడు. 24  ‘నువ్వు పూజా స్థలాన్ని కట్టి, ప్రతీ సంతవీధిలో నీ కోసం ఒక ఉన్నత స్థలాన్ని నిర్మించుకున్నావు. 25  నువ్వు ప్రతీ వీధి మలుపు దగ్గర ఉన్నత స్థలాలు కట్టుకున్నావు, దారినపోయే ప్రతి ఒక్కరికీ నిన్ను నువ్వు అర్పించుకుంటూ+ నీ అందాన్ని అసహ్యించుకునేలా చేసుకున్నావు, నీ వ్యభిచార క్రియలు ఎక్కువౌతూ వచ్చాయి.+ 26  కామంతో నిండిన నీ పొరుగువాళ్లతో అంటే ఐగుప్తీయులతో నువ్వు వ్యభిచారం చేశావు,+ నీ లెక్కలేనన్ని వ్యభిచార క్రియలతో నాకు కోపం తెప్పించావు. 27  ఇప్పుడు నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి నీకు ఆహారం తక్కువయ్యేలా చేస్తాను;+ నిన్ను ద్వేషించే స్త్రీల ఇష్టానికి అంటే నీ అశ్లీల ప్రవర్తనను+ బట్టి ​సిగ్గుపడ్డ ఫిలిష్తియ స్త్రీల ​ఇష్టానికి నిన్ను ​అప్పగిస్తాను.+ 28  “ ‘అప్పటికీ నువ్వు తృప్తి పడకుండా, అష్షూరీయులతో వ్యభిచారం చేశావు;+ వాళ్లతో వ్యభిచారం చేసినా నీకు తృప్తి అనిపించలేదు. 29  కాబట్టి నువ్వు వర్తకుల* దేశంలో, అలాగే కల్దీయులతో విపరీతంగా వ్యభిచారం చేస్తూ వచ్చావు,+ కానీ అప్పటికీ నీకు తృప్తి అని​పించలేదు. 30  నువ్వు సిగ్గుమాలిన వేశ్యలా ప్రవర్తిస్తూ+ ఈ పనులన్నీ చేసినప్పుడు నీ హృదయం ఎంత బలహీనంగా ఉంది!’* అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 31  ‘నువ్వు ప్రతీ వీధి మలుపు దగ్గర పూజా స్థలాన్ని, ప్రతీ సంతవీధిలో ఉన్నత స్థలాన్ని కట్టినప్పుడు నువ్వు వేశ్యలా ప్రవర్తించలేదు, ఎందుకంటే నువ్వు డబ్బులు తీసుకోలేదు. 32  నువ్వు భర్తతో కాకుండా వేరేవాళ్లతో తిరిగే తిరుగు​బోతు భార్యవి.+ 33  సాధారణంగా ప్రజలు వేశ్యలకు కానుకలిస్తారు,+ కానీ నువ్వు అలా కాదు; కామంతో నీ వెంటపడ్డ ​వాళ్లందరికీ నువ్వే కానుకలు ఇచ్చావు;+ నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచారం చేయడా​నికి నువ్వు వాళ్లకు డబ్బులిస్తావు.+ 34  నువ్వు మిగతా వేశ్యల్లాంటి దానివి కాదు, నీలా ఎవరూ వ్యభిచారం చేయరు! ఎందుకంటే వాళ్లు నీకు ​డబ్బులివ్వరు, నువ్వే వాళ్లకు డబ్బులిస్తావు. నీ పద్ధతే వేరు.’ 35  “కాబట్టి, ఓ వేశ్యా,+ యెహోవా చెప్పేది విను. 36  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు విపరీతమైన వాంఛతో ప్రవర్తించావు; నీ ప్రియులతో, నువ్వు నీ కుమారుల రక్తాన్ని కూడా అర్పించిన నీ హేయమైన, అసహ్యమైన విగ్రహాలన్నిటితో*+ వ్యభిచారం చేసి+ నీ మానాన్ని వెల్లడిచేసుకున్నావు, 37  కాబట్టి, నువ్వు సుఖం అందించిన నీ ప్రియులందర్నీ, అంటే నువ్వు ప్రేమించిన వాళ్లందర్నీ నువ్వు ద్వేషించిన వాళ్లందర్నీ నేను పోగు​చేస్తాను. నేను వాళ్లందర్నీ అన్నివైపుల నుండి నీకు వ్యతిరేకంగా పోగుచేసి నీ మానాన్ని వాళ్లకు ​కనబరుస్తాను, వాళ్లు నిన్ను పూర్తిగా దిగంబరంగా చూస్తారు.+ 38  “ ‘వ్యభిచారులకు, రక్తం చిందించే స్త్రీలకు విధించే శిక్ష+ నీకు విధిస్తాను;+ ఆగ్ర​హంతో, రోషంతో నీ రక్తం చిందించబడుతుంది.+ 39  నేను నిన్ను వాళ్ల చేతికి అప్పగిస్తాను, వాళ్లు నీ పూజా స్థలాల్ని పడ​గొడతారు, నీ ఉన్నత స్థలాల్ని కూలగొడతారు;+ నీ బట్టల్ని తీసేసి,+ నీ అందమైన నగల్ని లాక్కొని,+ నిన్ను బట్టలు లేకుండా, దిగంబరంగా వదిలేస్తారు. 40  వాళ్లు నీ మీదికి ఒక సమూహాన్ని తీసుకొస్తారు,+ వాళ్లు నిన్ను రాళ్లతో కొట్టి,+ ఖడ్గాలతో వధిస్తారు.+ 41  నీ ఇళ్లను అగ్నితో కాల్చేస్తారు,+ చాలా​మంది స్త్రీలు చూస్తుండగా నీకు తీర్పు విధిస్తారు; నేను నీ వ్యభిచారాన్ని అంతం చేస్తాను, నువ్వు ఇక డబ్బులు ఇవ్వవు. 42  అప్పుడు నీ మీద నా కోపం చల్లారుతుంది, నా ఆగ్రహం నీ మీది నుండి పక్కకు మళ్లు​తుంది;+ నేను ఇక కోపం లేకుండా ప్రశాంతంగా ఉంటాను.’ 43  “ ‘నువ్వు నీ చిన్ననాటి రోజుల్ని గుర్తు​చేసుకోకుండా,+ ఇవన్నీ చేస్తూ నాకు కోపం ​పుట్టించావు కాబట్టి, ఇప్పుడు నేను నీ మార్గాల పర్యవసానాల్ని నీ తల మీదికి రప్పిస్తాను; నువ్వు నీ అశ్లీల ప్రవర్తనను, నీ హేయమైన పనుల్ని మానేస్తావు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 44  “ ‘ఇదిగో సామెతల్ని చెప్పుకునే ప్రతీ ఒక్కరు నీ గురించి, “తల్లిలాగే బిడ్డ!” అనే సామెత చెప్పుకుంటారు.+ 45  నువ్వు తన భర్తను, పిల్లల్ని నీచంగా చూసిన మీ అమ్మలా; తమ భర్తల్ని, పిల్లల్ని నీచంగా చూసిన నీ ​అక్కాచెల్లెళ్లలా ఉన్నావు. మీ అమ్మ హిత్తీయురాలు, మీ నాన్న అమోరీయుడు.’ ”+ 46  “ ‘నీ అక్క, నీకు ఉత్తరాన* తన కూతుళ్లతో* పాటు నివసిస్తున్న+ సమరయ.+ నీ చెల్లి, నీకు దక్షిణాన* తన కూతుళ్లతో పాటు నివసిస్తున్న+ సొదొమ.+ 47  నువ్వు వాళ్ల మార్గాల్లో నడవడం, వాళ్ల హేయమైన పనుల్ని అనుసరించడమే కాదు, కొద్దికాలంలోనే నీ ప్రవ​ర్తనంతట్లో వాళ్లకన్నా ఘోరంగా తయారయ్యావు.+ 48  నా జీవం తోడు, నువ్వూ నీ కూతుళ్లూ చేసినట్టు నీ చెల్లెలు సొదొమ, ఆమె కూతుళ్లు చేయలేదు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 49  ‘నీ చెల్లెలు సొదొమ చేసిన తప్పేమిటంటే: ఆమె, ఆమె కూతుళ్లు+ గర్విష్ఠులు;+ వాళ్లకు సమృద్ధిగా ఆహారం ఉండేది,+ వాళ్లు నిశ్చింతగా ​ప్రశాంతంగా ఉండేవాళ్లు;+ అయినా వాళ్లు కష్టాల్లో ఉన్నవాళ్లకు, పేదవాళ్లకు సహాయం చేయలేదు.+ 50  వాళ్ల అహంకారం+ ఎప్పుడూ తగ్గలేదు, వాళ్లు నా దృష్టిలో హేయమైన పనులు చేశారు,+ అందుకే వాళ్లను తొలగించడం అవసరమని నాకు అనిపించింది.+ 51  “ ‘సమరయ+ కూడా నువ్వు చేసిన పాపాల్లో సగమైనా చేయలేదు. నువ్వు వాళ్లకన్నా ఎంత ఎక్కువగా హేయమైన పనులు చేస్తూ వచ్చావంటే, నీ హేయమైన పనులన్నిటి వల్ల నీ అక్కాచెల్లెళ్లు నీతిమంతుల్లా కనిపిం​చారు.+ 52  నువ్వు ఇప్పుడు నీ అవమానాన్ని భరించాలి, ఎందుకంటే నువ్వు నీ అక్కాచెల్లెళ్ల ప్రవర్తనను సమర్థించావు. నువ్వు వాళ్లకన్నా అసహ్యంగా ప్రవర్తించి పాపం చేశావు కాబట్టి, వాళ్లు నీ కన్నా నీతిమంతులుగా ఉన్నారు. నీ అక్కాచెల్లెళ్లను నీతిమంతులుగా కనిపించేలా చేసినందుకు సిగ్గుపడు, అవమానం భరించు.’ 53  “ ‘నేను వాళ్ల బందీలను అంటే సొదొమ బందీలను, ఆమె కూతుళ్ల బందీలను, సమరయ బందీలను, ఆమె కూతుళ్ల బందీలను సమకూరుస్తాను; వాళ్లతోపాటు నీ బందీలను కూడా సమకూరుస్తాను.+ 54  అలా నువ్వు నీ అవమానాన్ని భరిస్తావు; వాళ్లను ఓదార్చినందుకు సిగ్గుపడతావు. 55  నీ అక్కాచెల్లెళ్లు అంటే సొదొమ, సమరయ, వాళ్ల కూతుళ్లతో పాటు తమ పూర్వస్థితికి వస్తారు. నువ్వు, నీ కూతుళ్లు మీ పూర్వస్థితికి వస్తారు.+ 56  నువ్వు పొగరుబోతుగా తయారైన రోజున, నీ చెల్లెలు సొదొమ పేరును ఎత్తడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. 57  అప్పటికింకా నీ దుష్టత్వం వెల్లడి చేయబడలేదు.+ ఇప్పుడు సిరియా కూతుళ్లు, ఆమె పొరుగువాళ్లు, అలాగే ఫిలిష్తీయుల కూతుళ్లు+ నిన్ను నిందిస్తున్నారు; నీ చుట్టూ ఉన్న వాళ్లంతా నిన్ను హేళన చేస్తున్నారు. 58  నువ్వు నీ అశ్లీల ప్రవర్తన పర్యవసానాల్ని, నీ హేయమైన పనుల పర్యవసానాల్ని భరిస్తావు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” 59  “ఎందుకంటే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నేనిప్పుడు నువ్వు చేసినట్టే నీకు చేస్తాను,+ ఎందుకంటే నువ్వు నా ఒప్పందాన్ని మీరి నా ప్రమాణాన్ని నీచంగా చూశావు.+ 60  అయితే నేను, నీ యౌవనకాలంలో నీతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను, నేను నీతో ఒక శాశ్వత ఒప్పందం చేస్తాను.+ 61  నువ్వు నీ అక్కాచెల్లెళ్లను ఆహ్వానించేటప్పుడు నీ ప్రవర్తనను గుర్తుచేసుకొని సిగ్గుపడతావు;+ నేను వాళ్లను నీకు కూతుళ్లుగా ఇస్తాను, అయితే నీతో ఒప్పందం చేసినందు​వల్ల కాదు.’ 62  “ ‘నేను నీతో నా ఒప్పందాన్ని స్థిరపరుస్తాను; అప్పుడు నేను యెహోవానని నువ్వు తెలుసుకుంటావు. 63  నువ్వు ఇంత చేసినా నేను నీ కోసం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు,+ నువ్వు చేసింది గుర్తుచేసుకొని, నీ అవమానం వల్ల సిగ్గుతో నోరు కూడా తెరవవు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”

అధస్సూచీలు

లేదా “చెంగును.”
లేదా “నిబంధన.”
అంటే, ఎంబ్రాయిడరీ.
లేదా “సముద్రవత్సల (సీల్‌) చర్మం.”
లేదా “రాణిలా.”
అక్ష., “పేరు.”
లేదా “పురుషాంగాల్ని” అయ్యుంటుంది.
లేదా “శాంతపర్చే.”
అక్ష., “అగ్ని గుండా దాటించావు.”
అక్ష., “కనాను.”
లేదా “నేను నీమీద ఎంత ఆగ్రహంతో నిండిపోయానో” అయ్యుంటుంది.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
అక్ష., “నీ ఎడమపక్కన.”
బహుశా చుట్టుపక్కల పట్టణాల్ని సూచిస్తుంది.
అక్ష., “నీ కుడిపక్కన.”