యెషయా 53:1-12
53 మేము మాట్లాడిన* దానిమీద ఎవరు విశ్వాసం ఉంచారు?+
యెహోవా బాహువు ఎవరికి వెల్లడైంది?+
2 చిగురులా,+ ఎండిన దేశంలో వేరులా ఆయన అతని* ముందు పైకివస్తాడు.
ఆయనకు చూడచక్కని రూపం గానీ, వైభవం గానీ లేవు;+ఆయన్ని చూసినప్పుడు, ఆయన రూపం మనల్ని ఆకట్టుకోదు.*
3 ప్రజలు ఆయన్ని చీదరించుకున్నారు, దూరం పెట్టారు,+నొప్పులు, రోగాలు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు.
ఆయన ముఖం మనకు దాచబడినట్టే ఉంది.*
ప్రజలు ఆయన్ని నీచంగా చూశారు, మనం ఆయన్ని లెక్కచేయలేదు.+
4 నిజంగా, ఆయన మన రోగాల్ని మోశాడు,+మన నొప్పుల్ని భరించాడు,+
మనం మాత్రం ఆయన్ని అంటువ్యాధి వచ్చినవాడిలా, దేవుడు శిక్షించి బాధపెట్టిన వ్యక్తిలా చూశాం.
5 నిజానికి ఆయన మన దోషాల వల్ల+ పొడవబడ్డాడు;+మన తప్పుల్ని బట్టి నలగ్గొట్టబడ్డాడు.+
మనం నెమ్మదితో ఉండాలని ఆయన శిక్ష అనుభవించాడు,+ఆయన గాయాల వల్ల మనం బాగయ్యాం.+
6 మనందరం గొర్రెల్లా దారితప్పి తిరిగాం,+ప్రతీ ఒక్కరం నచ్చిన దారిలో వెళ్లిపోయాం,అయితే యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాడు.+
7 ఆయన అణచివేయబడ్డాడు,+ కష్టాలన్నీ భరించాడు,+అయినా ఆయన నోరు తెరవలేదు.
వధించడానికి గొర్రెను తీసుకొచ్చినట్టు ఆయన్ని తీసుకొచ్చారు,+బొచ్చు కత్తిరించే వాళ్లముందు ఆడగొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు,ఆయన నోరు తెరవలేదు.+
8 అన్యాయపు తీర్పు తీర్చి* ఆయన్ని తీసుకెళ్లిపోయారు;ఆయన తరానికి* సంబంధించిన వివరాల గురించి ఎవరు ఆలోచిస్తారు?
ఎందుకంటే సజీవుల దేశం నుండి ఆయన కొట్టివేయబడ్డాడు;+నా ప్రజల దోషం వల్ల ఆయన కొట్టబడ్డాడు.*+
9 ఆయన ఏ తప్పూ* చేయకపోయినా,ఆయన నోట ఎలాంటి మోసం లేకపోయినా,+ఆయన చనిపోయినప్పుడు దుష్టులతో పాటు ఆయన్ని సమాధి చేశారు,*+ఆయన ధనవంతుల* దగ్గర సమాధి చేయబడ్డాడు.+
10 అయితే ఆయన నలగ్గొట్టబడడం, బాధలుపడడం యెహోవాకు ఇష్టమైంది.*
నువ్వు ఆయన ప్రాణాన్ని అపరాధ పరిహారార్థ బలిగా అర్పిస్తే,+ఆయన తన సంతానాన్ని* చూస్తాడు, ఆయన ఆయుష్షు పెరుగుతుంది,+ఆయన ద్వారా యెహోవా ఇష్టం* నెరవేరుతుంది.+
11 ఆయన తాను అనుభవించిన వేదన వల్ల, తాను చూసినదాన్ని బట్టి సంతృప్తి పొందుతాడు.
నీతిమంతుడు, అంటే నా సేవకుడు తన జ్ఞానం వల్ల,చాలామంది నీతిమంతులయ్యేలా సహాయం చేస్తాడు,+వాళ్ల తప్పుల్ని భరిస్తాడు.+
12 అందుకే, చాలామందితో పాటు నేను ఆయనకు భాగం నియమిస్తాను,బలశాలులతో పాటు ఆయన దోపుడుసొమ్ము పంచుకుంటాడు;ఎందుకంటే, ఆయన తన ప్రాణాన్ని ధారపోసి, చివరికి చనిపోయాడు,+దోషుల్లో ఒకడిగా లెక్కించబడ్డాడు;+ఆయన అనేకమంది పాపాల్ని మోశాడు,+
దోషుల తరఫున వేడుకున్నాడు.+
అధస్సూచీలు
^ లేదా “మేము విన్న” అయ్యుంటుంది.
^ “అతను” అనే పదం, చూసే వ్యక్తిని గానీ దేవుణ్ణి గానీ సూచించవచ్చు.
^ లేదా “మనం ఇష్టపడేలా ఆయన రూపంలో ప్రత్యేకమైందేదీ లేదు.”
^ లేదా “ప్రజలు చూసి ముఖం పక్కకు తిప్పుకునే వ్యక్తిలా ఆయన ఉన్నాడు” అయ్యుంటుంది.
^ అక్ష., “అణచివేత వల్ల, తీర్పు వల్ల.”
^ లేదా “ఆయన జీవనశైలికి.”
^ లేదా “చనిపోయేలా కొట్టబడ్డాడు.”
^ అక్ష., “ఒక ధనవంతుడి.”
^ లేదా “ఆయనకు సమాధి స్థలం కేటాయిస్తారు.”
^ లేదా “దౌర్జన్యం.”
^ లేదా “బట్టి యెహోవా సంతోషించాడు.”
^ అక్ష., “విత్తనాన్ని.”
^ లేదా “సంతోషం.”