సమూయేలు మొదటి గ్రంథం 5:1-12
5 ఫిలిష్తీయులు సత్యదేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు,+ వాళ్లు దాన్ని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకొచ్చారు.
2 ఫిలిష్తీయులు సత్యదేవుని మందసాన్ని దాగోను గుడిలోకి తీసుకొచ్చి దాగోను విగ్రహం పక్కన పెట్టారు.+
3 తర్వాతి రోజు ఉదయాన్నే అష్డోదీయులు లేచి చూసినప్పుడు, దాగోను విగ్రహం యెహోవా మందసం ఎదుట నేలమీద బోర్లా పడివుంది.+ దాంతో వాళ్లు ఆ విగ్రహాన్ని లేపి మళ్లీ దాని స్థానంలో పెట్టారు.+
4 వాళ్లు ఆ తర్వాతి రోజు ఉదయాన్నే లేచి చూసినప్పుడు, దాగోను విగ్రహం మళ్లీ యెహోవా మందసం ఎదుట నేలమీద బోర్లా పడివుంది. ఆ విగ్రహం తల, రెండు అరచేతులు నరికేయబడి గుడి గడప దగ్గర పడివున్నాయి. దాని మొండెం* మాత్రమే మిగిలివుంది.
5 అందుకే ఈ రోజు వరకు దాగోను యాజకులు, అలాగే దాగోను గుడిలోకి వెళ్లే వాళ్లందరూ అష్డోదులోని దాగోను గుడి గడప మీద కాలుపెట్టరు.
6 యెహోవా* అష్డోదీయుల్ని శిక్షించాడు. ఆయన అష్డోదులో, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్లను మొలలతో మొత్తి వాళ్లను తీవ్రంగా బాధించాడు.+
7 జరుగుతున్న సంఘటనలు చూసి అష్డోదువాళ్లు, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మనతో ఉండనివ్వొద్దు; ఎందుకంటే ఆయన మనల్ని, మన దేవుడైన దాగోనును శిక్షించాడు” అన్నారు.
8 దాంతో వాళ్లు ఫిలిష్తీయుల పాలకులందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, “ఇశ్రాయేలు దేవుని మందసం విషయంలో ఏమి చేద్దాం?” అని అడిగారు. దానికి వాళ్లు, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని గాతుకు+ పంపిద్దాం” అన్నారు. అప్పుడు వాళ్లు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని అక్కడికి తీసుకెళ్లారు.
9 వాళ్లు ఆ మందసాన్ని అక్కడికి తీసుకెళ్లాక, యెహోవా* ఆ నగరంలోని వాళ్లను శిక్షించి వాళ్లలో ఎంతో భయం పుట్టించాడు. ఆయన చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆ నగరంలోని వాళ్లందర్నీ మొత్తాడు, దాంతో వాళ్లకు మొలలు వచ్చాయి.+
10 అప్పుడు వాళ్లు సత్యదేవుని మందసాన్ని ఎక్రోనుకు+ పంపించారు. కానీ సత్యదేవుని మందసం ఎక్రోనుకు రాగానే ఎక్రోనీయులు, “మనల్ని, మన ప్రజల్ని చంపడానికే వాళ్లు ఇశ్రాయేలు దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు!”+ అని కేకలు వేయడం మొదలుపెట్టారు.
11 అప్పుడు వాళ్లు ఫిలిష్తీయుల పాలకులందర్నీ ఒక దగ్గరికి పిలిపించి, “ఇశ్రాయేలు దేవుని మందసాన్ని పంపించేయండి. మనం, మన ప్రజలు చంపబడకుండా ఆ మందసాన్ని దాని స్థలానికి పంపించండి” అని చెప్పారు. ఎందుకంటే మరణభయం ఆ నగరమంతా వ్యాపించింది; అక్కడ సత్యదేవుడు వాళ్లను శిక్షిస్తూ ఉన్నాడు,+
12 చనిపోకుండా మిగిలినవాళ్లు మొలలతో బాధించబడ్డారు. ఆ నగర ప్రజలు సహాయం కోసం పెట్టిన కేకలు ఆకాశాన్నంటాయి.

