లేవీయకాండం 26:1-46

  • విగ్రహపూజకు దూరంగా ఉండండి (1, 2)

  • లోబడితే దీవెనలు (3-13)

  • లోబడకపోతే శిక్ష (14-46)

26  “ ‘మీరు వ్యర్థమైన దేవుళ్లను చేసుకోకూడదు,+ చెక్కిన విగ్రహాన్ని గానీ పూజా స్తంభాన్ని గానీ నిలబెట్టుకోకూడదు,+ వంగి నమస్కరించడం కోసం+ మీ దేశంలో ఒక చెక్కిన రాయిని పెట్టుకోకూడదు;+ ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను.  మీరు నా విశ్రాంతి రోజుల్ని ఆచరించాలి, నా పవిత్రమైన స్థలం పట్ల భయభక్తులు చూపించాలి. నేను యెహోవాను.  “ ‘మీరు నా శాసనాల ప్రకారం నడుచుకుంటూ, నా ఆజ్ఞల్ని పాటిస్తూ, వాటి ప్రకారం జీవిస్తూ ఉంటే,+  నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను,+ భూమి దాని పంటనిస్తుంది,+ పొలంలోని చెట్లు వాటి ఫలాల్ని ఇస్తాయి.  మీ పంట నూర్చే కాలం ద్రాక్షల కోత వరకు ​కొనసాగుతుంది; మీ ద్రాక్షల కోత, విత్తే కాలం వరకు కొనసాగుతుంది; మీరు కడుపునిండా ఆహారం తింటారు, మీ దేశంలో సురక్షితంగా నివసిస్తారు.  నేను దేశంలో శాంతిని దయచేస్తాను,+ మీరు హాయిగా నిద్రపోతారు, మిమ్మల్ని ఎవ్వరూ భయపెట్టరు;+ దేశంలో క్రూరమైన అడవి జంతువులు లేకుండా చేస్తాను; కత్తులు పట్టుకొని ఎవ్వరూ మీ దేశం మీదికి యుద్ధానికి రారు.  మీరు ఖచ్చితంగా మీ శత్రువుల్ని తరుముతారు, వాళ్లు ఖడ్గం చేత మీ ముందు కూలతారు.  మీలో ఐదుగురు 100 మందిని తరుముతారు, 100 మంది 10,000 మందిని తరుముతారు; మీ శత్రువులు ఖడ్గం చేత మీ ముందు కూలతారు.+  “ ‘నేను మీ మీద నా అనుగ్రహం చూపిస్తాను,* మీరు పిల్లల్ని కని ఎక్కువమంది అయ్యేలా చేస్తాను, నేను మీతో చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాను. 10  మీరు ముందటి సంవత్సరంలోని పాత పంటను ఇంకా తింటుండగానే కొత్త పంట చేతికి వస్తుంది, దానికోసం మీరు పాత పంటను ఖాళీ చేయాల్సి ఉంటుంది. 11  నేను నా గుడారాన్ని మీ మధ్య ఉంచుతాను,+ నేను మిమ్మల్ని తిరస్కరించను. 12  నేను మీ మధ్య నడుస్తూ మీకు దేవునిగా ఉంటాను,+ మీరు నాకు ప్రజలుగా ఉంటారు.+ 13  నేను మీ దేవుడైన యెహోవాను. మీరు ఐగుప్తీయులకు బానిసలుగా ఉండకుండా ఆ దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించింది నేనే; మీ మీదున్న కాడిని నేను విరగ్గొట్టాను, మీరు తలలు ఎత్తుకొని* నడిచేలా చేశాను. 14  “ ‘కానీ మీరు నా మాట ​వినకపోతే లేదా ఈ ఆజ్ఞలన్నీ పాటించకపోతే, 15  నా శాసనాల్ని తిరస్కరిస్తే,+ నా న్యాయనిర్ణయాల్ని అసహ్యించుకొని నా ఆజ్ఞలన్నీ పాటించకుండా ఉంటే, నా ఒప్పందాన్ని మీరితే,+ 16  నేను మీకు ఇలా చేస్తాను: నేను మిమ్మల్ని దుఃఖంతో, క్షయతో, ఒళ్లు కాలిపోయే జ్వరంతో శిక్షిస్తాను; మీ కళ్లు మసకబారిపోయేలా, మీ బలం పూర్తిగా క్షీణించిపోయేలా చేస్తాను. మీరు విత్తనాలు విత్తుతారు కానీ ఆ పంట తినరు, మీ శత్రువులు దాన్ని తింటారు.+ 17  నేను మిమ్మల్ని తిరస్కరిస్తాను, మీరు శత్రువుల చేతుల్లో ఓడిపోతారు;+ మిమ్మల్ని ద్వేషించేవాళ్లు మిమ్మల్ని అణగదొక్కుతారు,+ ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు. 18  “ ‘అప్పటికీ మీరు నా మాట వినకపోతే, మీ పాపాల్ని బట్టి నేను మిమ్మల్ని ఏడంతలు శిక్షించాల్సి ఉంటుంది. 19  మీ మొండి గర్వాన్ని అణచివేస్తాను; మీ ఆకాశాన్ని ఇనుములా,+ మీ భూమిని రాగిలా చేస్తాను. 20  మీరు వృథాగా ప్రయాసపడతారు, మీ భూమి దాని పంటను ఇవ్వదు,+ మీ పొలంలోని చెట్లు ఫలాల్ని ఇవ్వవు. 21  “ ‘అయినా మీరు నాకు వ్యతిరేకంగా ​నడుచుకుంటూ, నా మాట వినకపోతే, మీ పాపాల్ని బట్టి మిమ్మల్ని ఏడంతలు శిక్షిస్తాను. 22  నేను మీ మధ్యకు అడవి జంతువుల్ని పంపిస్తాను,+ అవి మీ పిల్లల్ని చంపేస్తాయి,+ మీ సాధు జంతువుల్ని తినేస్తాయి, మీ సంఖ్యను తగ్గిస్తాయి, మీ దారులు నిర్మానుష్యం అయి​పోతాయి.+ 23  “ ‘ఇంత జరిగినా మీరు నా దిద్దుబాటును స్వీకరించకుండా,+ నాకు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే, 24  అప్పుడు నేను కూడా మీకు వ్యతిరేకంగా నడుస్తాను, మీ పాపాల్ని బట్టి నేనే మిమ్మల్ని ఏడంతలు శిక్షిస్తాను. 25  మీరు నా ఒప్పందాన్ని మీరినందుకు మీ మీద పగతీర్చుకోవడానికి ఖడ్గాన్ని రప్పిస్తాను. ఒకవేళ మీరు మీ నగరాల్లోకి పారిపోతే, మీ మధ్యకు వ్యాధిని పంపిస్తాను;+ మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాను.+ 26  నేను మీ ఆహార నిల్వల్ని* నాశనం చేసినప్పుడు,+ మీ రొట్టె కాల్చడానికి పదిమంది స్త్రీలకు ఒక్క పొయ్యి సరిపోతుంది, మీ రొట్టెను తూచి ఇస్తారు;+ మీరు తింటారు కానీ మీ కడుపు నిండదు.+ 27  “ ‘అప్పటికీ మీరు నా మాట వినకుండా, నాకు వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే, 28  నేను ఇంకా ఎక్కువగా మిమ్మల్ని వ్యతిరేకిస్తాను,+ మీ పాపాల్ని బట్టి నేనే మిమ్మల్ని ఏడంతలు శిక్షించాల్సి ఉంటుంది. 29  దానివల్ల మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కూతుళ్ల మాంసాన్ని తినాల్సి వస్తుంది.+ 30  నేను మీ పవిత్రమైన ఉన్నత స్థలాల్ని నాశనం చేస్తాను, మీ ధూపస్తంభాల్ని పగలగొడతాను, మీ కళేబరాల్ని మీ అసహ్యమైన విగ్రహాల* కళేబరాల మీద పోగుచేస్తాను,+ నేను మిమ్మల్ని అసహ్యించుకొని పక్కకు తిరుగుతాను. 31  నేను మీ నగరాల్ని ఖడ్గానికి అప్పగిస్తాను,+ మీ పవిత్రమైన స్థలాల్ని నిర్మానుష్యం చేస్తాను, మీ బలుల ఇంపైన* ​సువాసనను నేను పీల్చుకోను. 32  నేనే మీ దేశాన్ని నిర్మానుష్యం చేస్తాను,+ అందులో నివసించే మీ శత్రువులు దాన్ని చూసి నివ్వెరపోతారు.+ 33  నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొడతాను. నేను ఒరలో నుండి కత్తి తీస్తాను, అది మిమ్మల్ని వెంటాడుతుంది;+ మీ దేశం నిర్జనమైపోతుంది,+ మీ నగరాలు సర్వనాశనమౌతాయి. 34  “ ‘మీరు మీ శత్రువుల దేశంలో ఉన్న సమయంలో, మీ దేశం నిర్జనంగా ఉన్న రోజుల్లో, అప్పటివరకు మీరు ఆచరించని విశ్రాంతి సంవ​త్సరాల్ని అది ఆచరిస్తుంది. ఆ సమయంలో దేశానికి విశ్రాంతి దొరుకుతుంది.* ఎందుకంటే అప్పటివరకు ఆచరించని విశ్రాంతి సంవత్సరాల్ని అది ఆచరించాలి.+ 35  అది నిర్జనంగా ఉన్నన్ని రోజులు దానికి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే మీరు అందులో ఉన్నప్పుడు మీ విశ్రాంతి సంవత్సరాల్లో దానికి విశ్రాంతి దొరకలేదు. 36  “ ‘వాటి నుండి బ్రతికి బయటపడేవాళ్ల విషయానికొస్తే, తమ శత్రువుల దేశంలో వాళ్ల హృదయాల్ని నేను నిరాశతో నింపుతాను; గాలికి కొట్టుకుపోయే ఆకు శబ్దానికి వాళ్లు పారిపో​తారు, వాళ్లు ఖడ్గాన్ని చూసి పారిపోతున్నట్టు ​పారిపోతారు, ఎవరూ తరమకుండానే వాళ్లు కూలతారు.+ 37  వాళ్లను ఎవరూ తరమక​పోయినా, ఖడ్గాన్ని చూసి పారిపోతున్నట్టు వాళ్లు ఒకరి​మీద ఒకరు పడిపోతారు. మీరు మీ శత్రువుల్ని ఎదిరించలేకపోతారు.+ 38  మీరు వేరే దేశాల మధ్య నాశనమౌతారు,+ శత్రువుల దేశం మిమ్మల్ని మింగేస్తుంది. 39  మీలో మిగిలినవాళ్లు, మీ తప్పుల్ని బట్టి మీ శత్రువుల దేశాల్లో క్షీణించిపోతారు. అవును, వాళ్లు తమ తండ్రుల తప్పుల్ని బట్టి క్షీణించిపోతారు.+ 40  అప్పుడు వాళ్లు తమ సొంత తప్పుల్ని, తమ తండ్రుల తప్పుల్ని, నమ్మకద్రోహ ప్రవర్తనను ఒప్పుకుంటారు;+ అంతేకాదు నాకు వ్యతిరేకంగా నడుస్తూ నమ్మకద్రోహుల్లా ప్రవర్తించామని వాళ్లు అంగీకరిస్తారు. 41  వాళ్ల ప్రవర్తనను బట్టే నేను కూడా వాళ్లను వ్యతిరేకించి,+ వాళ్లను శత్రువుల దేశా​నికి తీసుకొచ్చాను.+ “ ‘బహుశా అప్పటికైనా వాళ్లు తమ హృదయాల్లో ఉన్న మొండితనాన్ని వదిలేసి తమను తాము తగ్గించుకొని,*+ తమ తప్పుకు పరిహారం చెల్లిస్తారేమో. 42  నేను యాకోబుతో చేసిన నా ఒప్పందాన్ని,+ ఇస్సాకుతో చేసిన నా ఒప్పందాన్ని+ గుర్తుచేసుకుంటాను; నేను అబ్రాహాముతో చేసిన నా ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను;+ నేను ఆ దేశాన్ని గుర్తుచేసుకుంటాను. 43  వాళ్లు ఆ దేశాన్ని విడిచిపెట్టినప్పుడు, అది అప్పటివరకు ఆచరించని విశ్రాంతి సంవత్సరాల్ని ఆచరిస్తుంది,+ వాళ్లు లేకుండా అది నిర్జనంగా ఉండిపోతుంది, వాళ్లు తమ తప్పుకు పరిహారం చెల్లిస్తారు. ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల్ని అసహ్యించుకున్నారు.+ 44  అయినాసరే, వాళ్లు తమ శత్రువుల దేశంలో ఉండగా నేను వాళ్లను ఎన్నడూ పూర్తిగా తిరస్కరించను,+ సమూలంగా తుడిచిపెట్టేంతగా వాళ్లను అసహ్యించుకోను. అలా చేసి నేను వాళ్లతో చేసిన ఒప్పందాన్ని మీరలేను,+ ఎందుకంటే నేను వాళ్ల దేవుడైన యెహోవాను. 45  వాళ్లకోసం, నేను వాళ్ల పూర్వీకులతో చేసిన ఒప్పందాన్ని గుర్తుచేసుకుంటాను.+ వాళ్లకు దేవునిగా ఉండడం కోసం, దేశాలు చూస్తుండగా నేనే వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాను.+ నేను యెహోవాను.’ ” 46  ఇవి సీనాయి పర్వతం మీద యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలు, న్యాయనిర్ణయాలు, నియమాలు.+

అధస్సూచీలు

అక్ష., “నేను మీవైపు తిరుగుతాను.”
అక్ష., “మీరు నిటారుగా.”
అక్ష., “కర్రల్ని.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.
ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.
లేదా “శాంతపర్చే.”
లేదా “దేశం సబ్బాతును ఆచరిస్తుంది.”
లేదా “సున్నతిలేని హృదయాల్ని తగ్గించుకొని.”