యెహెజ్కేలు 9:1-11

  • ఆరుగురు హతం చేసేవాళ్లు, సిరాబుడ్డి ఉన్న వ్యక్తి (1-11)

    • తీర్పు పవిత్రమైన స్థలం దగ్గర మొదలౌతుంది (6)

9  తర్వాత ఆయన బిగ్గరగా ఇలా అన్నాడు: “నగరాన్ని శిక్షించేవాళ్లను పిలిపించండి, వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ చేతిలో నాశనం చేసే ఆయుధం తీసుకొని రావాలి!” 2  అప్పుడు ఆరుగురు మనుషులు ఉత్తర దిక్కున ఉన్న పైద్వారం+ వైపు నుండి రావడం నేను చూశాను, ప్రతీ ఒక్కరి చేతిలో నలగ్గొట్టే ఆయుధం ఉంది; వాళ్ల మధ్య నారవస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని నడుముకు కార్యదర్శి* సిరాబుడ్డి* ఉంది; వాళ్లు లోపలికి వచ్చి, రాగి బలిపీఠం+ దగ్గర నిలబడ్డారు. 3  అప్పుడు ఇశ్రాయేలు దేవుని మహిమ+ కెరూబుల పైనుండి లేచి, మందిర గడప దగ్గరికి వచ్చింది;+ ఆయన, నారవస్త్రాలు ధరించి నడుముకు కార్యదర్శి సిరాబుడ్డి కట్టుకున్న వ్యక్తిని పిలిచాడు. 4  యెహోవా ఆ వ్యక్తికి ఇలా చెప్పాడు: “నువ్వు యెరూషలేము నగరమంతటా తిరిగి, నగరంలో జరుగుతున్న అసహ్యమైన పనులన్నిటిని బట్టి+ ఎవరైతే నిట్టూరుస్తూ, మూల్గుతూ ఉన్నారో+ వాళ్ల నొసళ్ల మీద గుర్తు వేయి.” 5  మిగతావాళ్లకు ఆయన ఇలా చెప్పాడు: “మీరు అతని వెంట నగరంలోకి వెళ్లి ప్రజల్ని హతం చేయండి. మీ కన్ను జాలిపడకూడదు, మీరు కనికరపడకూడదు.+ 6  వృద్ధుల్ని, యౌవనుల్ని, కన్యల్ని, చిన్నపిల్లల్ని, స్త్రీలను అందర్నీ చంపేయండి.+ అయితే ఆ గుర్తు ఉన్న వాళ్ల జోలికి వెళ్లకండి.+ మీరు నా పవిత్రమైన స్థలం నుండి మొదలుపెట్టాలి.”+ దాంతో వాళ్లు మందిరం ఎదుట ఉన్న పెద్దలతో+ మొదలుపెట్టారు. 7  అప్పుడు ఆయన వాళ్లతో, “మందిరాన్ని అపవిత్రపర్చండి, ప్రాంగణాల్ని చనిపోయినవాళ్లతో నింపండి.+ వెళ్లండి!” అన్నాడు. కాబట్టి వాళ్లు వెళ్లి నగరంలోని ప్రజల్ని చంపేశారు. 8  వాళ్లు ప్రజల్ని చంపుతున్నప్పుడు, నేనొక్కడినే మిగిలిపోయాను, అప్పుడు నేను సాష్టాంగపడి, “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! నువ్వు యెరూషలేము మీద నీ కోపాన్ని కుమ్మరిస్తూ, ఇశ్రాయేలులో మిగిలిన వాళ్లందర్నీ నాశనం చేస్తావా?”+ అని అరిచాను. 9  అప్పుడు ఆయన నాతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా ఇంటివాళ్ల దోషం చాలాచాలా ఎక్కువగా ఉంది.+ దేశం రక్తపాతంతో నిండిపోయింది,+ నగరం అవినీతితో నిండిపోయింది. వాళ్లు, ‘యెహోవా దేశాన్ని విడిచిపెట్టేశాడు, యెహోవా చూడట్లేదు’ అని చెప్పుకుంటున్నారు.+ 10  అయితే నా కన్ను జాలిపడదు, నేను కనికరం చూపించను.+ వాళ్ల మార్గాల పర్యవసానాల్ని నేను వాళ్ల తలల మీదికి తీసుకొస్తాను.” 11  అప్పుడు, నారవస్త్రాలు ధరించి నడుముకు సిరాబుడ్డి కట్టుకున్న వ్యక్తి తిరిగొచ్చి, “నువ్వు నాకు ఆజ్ఞాపించినట్టే చేశాను” అని చెప్పాడు.

అధస్సూచీలు

లేదా “లేఖికుడి.”
అక్ష., “సిరా కొమ్ము.”