లేవీయకాండం 22:1-33

  • యాజకుల పవిత్రత, పవిత్రమైన వాటిని తినడం (1-16)

  • ఏ లోపం లేనివే అంగీకరించబడతాయి (17-33)

22  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “ఇశ్రాయేలీయులు తెచ్చే పవిత్రమైన అర్పణలతో వ్యవహరిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని,* వాళ్లు నాకు ప్రతిష్ఠించే* వాటి విషయంలో నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చకూడదని+ నువ్వు అహరోనుకు, అతని కుమారులకు చెప్పు.+ నేను యెహోవాను.  వాళ్లకు ఇలా చెప్పు: ‘తరతరాలపాటు మీ సంతానంలో అపవిత్రంగా ఉన్న ఏ వ్యక్తయినా ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్రమైన అర్పణల దగ్గరికి వస్తే, అతను నా కళ్లముందు నుండి కొట్టివేయబడతాడు.*+ నేను యెహోవాను.  అహరోను సంతానంలో ఎవరికైనా కుష్ఠు+ గానీ, స్రావం+ గానీ ఉంటే అతను పవిత్రుడయ్యే వరకు పవిత్రమైన అర్పణల్లో దేన్నీ తినకూడదు.+ అంతేకాదు చనిపోయిన వ్యక్తిని* ముట్టుకోవడం వల్ల అప​విత్రుడైన వ్యక్తిని ముట్టుకున్నవాడు+ గానీ, వీర్యస్ఖలనం వల్ల అపవిత్రుడైన వ్యక్తి+ గానీ,  అపవిత్రమైన పాకే ప్రాణిని ముట్టుకున్నవాడు+ గానీ, దేనివల్లనైనా అపవిత్రుడైన వ్యక్తిని ముట్టుకున్నవాడు+ గానీ పవిత్రమైన అర్పణల్లో దేన్నీ తినకూడదు.  వాటిలో దేన్నైనా ముట్టుకునే వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు, పవిత్రమైన అర్పణల్లో దేన్నీ అతను తినకూడదు. అతను నీళ్లతో స్నానం చేయాలి.+  సూర్యుడు అస్తమించినప్పుడు అతను పవిత్రుడౌతాడు. తర్వాత అతను పవిత్రమైన అర్పణలు తినొచ్చు, ఎందుకంటే అది అతని ఆహారం.+  అంతేకాదు అతను చచ్చిన జంతువును గానీ క్రూరమృగాలు చీల్చేసిన జంతువును గానీ తిని అపవిత్రుడు కాకూడదు.+ నేను యెహోవాను.  “ ‘వాళ్లు నా ఆజ్ఞను పాటించాలి, ఎందుకంటే వాళ్లు దాన్ని అతిక్రమించి, పవిత్రమైన అర్పణల్ని అపవిత్రపరిస్తే పాపులౌతారు, దానివల్ల వాళ్లు చనిపోవాల్సి వస్తుంది. నేను వాళ్లను పవిత్రపరుస్తున్న యెహోవాను. 10  “ ‘వేరేవాళ్లు* ఎవరూ పవిత్రమైన దేన్నీ తినకూడదు.+ యాజకుని ఇంటికి అతిథిగా వచ్చిన ఏ పరదేశి గానీ కూలివాడు గానీ పవిత్రమైన దేన్నీ తినకూడదు. 11  కానీ యాజకుడు తన సొంత డబ్బుతో కొనుక్కున్న వ్యక్తి దాన్ని తినొచ్చు. అంతేకాదు, యాజకుని ఇంట్లో పుట్టిన దాసులు కూడా అతను తినే ఆహారాన్ని తినొచ్చు.+ 12  ఒకవేళ యాజకుని కూతురు యాజకుడుకాని* వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, ప్రజలు కానుకగా తెచ్చిన పవిత్రమైన అర్పణల్ని ఆమె తినకూడదు. 13  కానీ యాజకుని కూతురు విధవరాలై లేదా ఆమెకు విడాకులై, ఆమెకు పిల్లలు లేకపోతే, ఆమె తన యౌవనంలో ఉన్నప్పుడు నివసించిన తన తండ్రి ఇంటికి ​తిరిగొస్తే, ఆమె తన తండ్రి తినే ఆహారాన్ని తినొచ్చు;+ కానీ వేరేవాళ్లు* ఎవరూ దాన్ని తినకూడదు. 14  “ ‘ఒకవేళ ఎవరైనా పొరపాటున పవిత్రమైన దాన్ని తింటే, అతను దాని విలువలో ఐదోవంతును దానికి కలిపి ఆ పవిత్రమైన అర్పణను యాజకునికి ఇవ్వాలి.+ 15  ఇశ్రాయేలీయులు యెహోవాకు కానుకగా తెచ్చే ​పవిత్రమైన వాటిని యాజకులు అపవిత్రపర్చ​కూడదు.+ 16  యాజకులు ప్రజల్ని ఆ పవిత్రమైన వాటిని తిననిస్తే, ఆ ప్రజలు దోషులై తమ మీదికి శిక్ష తెచ్చుకుంటారు; నేను వాళ్లను పవి​త్రపరుస్తున్న యెహోవాను.’ ” 17  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 18  “నువ్వు అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలీయులందరితో ఇలా చెప్పు: ‘ఒక ఇశ్రాయేలీయుడు గానీ ఇశ్రాయేలులో నివసి​స్తున్న పరదేశి గానీ తన మొక్కుబడులు తీర్చు​కోవడానికి లేదా స్వేచ్ఛార్పణ+ అర్పించడానికి యెహోవాకు దహనబలిని+ తీసుకురావాలనుకుంటే, 19  అతను దేవుని ఆమోదం పొందడానికి తన పశువుల్లో నుండి గానీ, గొర్రెల్లో నుండి గానీ, మేకల్లో నుండి గానీ ఏ లోపంలేని ఒక మగదాన్ని తీసుకురావాలి.+ 20  లోపం ఉన్న దేన్నీ మీరు తీసుకురాకూడదు,+ ఎందుకంటే దానివల్ల మీరు దేవుని ఆమోదాన్ని పొందలేరు. 21  “ ‘ఒక వ్యక్తి తన మొక్కుబడి తీర్చుకోవడానికి లేదా స్వేచ్ఛార్పణ అర్పించడానికి యెహోవాకు సమాధానబలిని+ తీసుకురావాలనుకుంటే, అతను దేవుని ఆమోదం పొందడానికి తన పశువుల్లో నుండి గానీ మందలో నుండి గానీ ఏ లోపంలేని జంతువును తీసుకురావాలి. దానిలో అసలు ఏ లోపమూ ఉండకూడదు. 22  బలి ఇచ్చే ఏ జంతువూ గుడ్డిది గానీ, ఎముకలు విరిగినది గానీ అయ్యుండకూడదు; దానికి గాటు గానీ, గడ్డ గానీ, గజ్జి గానీ, తామర గానీ ఉండకూడదు; మీరు వాటిలో దేన్నీ యెహోవా దగ్గరికి తీసుకురాకూడదు, అలాంటివాటిని యెహోవా కోసం బలిపీఠం మీద అర్పించకూడదు. 23  ఒక కాలు చాలా పొడవుగా లేదా చాలా పొట్టిగా ఉన్న ఎద్దును గానీ, గొర్రెను గానీ మీరు స్వేచ్ఛార్పణగా అర్పించవచ్చు. కానీ అలాంటి దాన్ని మొక్కుబడి అర్పణగా అర్పించకూడదు, దాన్ని దేవుడు ఆమోదించడు. 24  వృషణాలు పాడైన, చితికిపోయిన, పీకేసిన, కోసేసిన జంతువును మీరు యెహోవా దగ్గరికి తీసుకురాకూడదు, మీ దేశంలో అలాంటి జంతువుల్ని బలిగా అర్పించకూడదు. 25  మీ మధ్య ఉండే పరదేశి వాటిలో దేన్నైనా తీసుకొస్తే వాటిని మీరు దేవునికి ఆహారంగా అర్పించకూడదు, ఎందుకంటే అవి చెడిపోయినవి, లోపమున్నవి. దేవుడు వాటిని అంగీకరించడు, ఆమోదించడు.’ ” 26  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 27  “ఒక దూడ గానీ, గొర్రెపిల్ల గానీ, మేకపిల్ల గానీ పుట్టినప్పుడు ఏడురోజుల పాటు అది దాని తల్లితో ఉంటుంది.+ అయితే ఎనిమిదో రోజు నుండి దాన్ని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా అర్పించవచ్చు, ఆయన దాన్ని అంగీకరిస్తాడు, ఆమోదిస్తాడు. 28  ఆవును,* దాని పిల్లను; గొర్రెను, దాని పిల్లను ఒకే రోజున వధించకూడదు.+ 29  “మీరు యెహోవాకు కృతజ్ఞతార్పణను అర్పిస్తుంటే,+ దేవుని ఆమోదం పొందే విధంగా దాన్ని అర్పించాలి. 30  మీరు దాన్ని అదే రోజున తినాలి. మరుసటి రోజు ఉదయం వరకు దానిలో ఏమీ మిగల్చకూడదు.+ నేను యెహోవాను. 31  “మీరు నా ఆజ్ఞల్ని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి.+ నేను యెహోవాను. 32  మీరు నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చకూడదు,+ నేను ఇశ్రాయేలీయుల మధ్య పవిత్రపర్చబడాలి.+ నేను మిమ్మల్ని పవిత్రపరుస్తున్న యెహోవాను.+ 33  మీకు దేవునిగా ఉండడానికి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నది నేనే.+ నేను యెహోవాను.”

అధస్సూచీలు

అక్ష., “తమను తాము వేరుగా ఉంచుకోవా​లని.”
లేదా “పవిత్రపర్చే.”
లేదా “చంప​బడతాడు.”
లేదా “ప్రాణిని.”
లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.
లేదా “అపరిచి​తుడైన.”
లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.
అక్ష., “ఎద్దును.”