కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మహాపట్టణం నిర్మూలం చేయబడింది

మహాపట్టణం నిర్మూలం చేయబడింది

అధ్యాయం 36

మహాపట్టణం నిర్మూలం చేయబడింది

దర్శనము 12—ప్రకటన 18:1–19:10

అంశం: మహాబబులోను కూలిపోవడం నాశనం కావడం; గొఱ్ఱెపిల్ల వివాహం ప్రకటించబడింది

నెరవేర్పు కాలం: 1919నుండి మహాశ్రమలు ముగిసేంతవరకు

1. మహాశ్రమల ప్రారంభానికి గుర్తేమిటి?

ఆకస్మికం, ఆశ్చర్యం, నిర్మూలనం—అలాంటిది మహాబబులోను నాశనం! అది చరిత్రంతటిలోకెల్లా అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటైన, “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అనే సంఘటనకు నాంది పలుకుతుంది.—మత్తయి 24:21.

2. రాజకీయ సామ్రాజ్యాలు ఏలి కూలినప్పటికిని, ఏ రకమైన సామ్రాజ్యం నిలిచింది?

2 అబద్ధమతం దీర్ఘకాలంగా చుట్టూవున్నది. అది యెహోవాకు వ్యతిరేకంగా బాబేలు గోపురాన్ని నిర్మించడానికి మనుష్యులను పురమాయించిన రక్తపిపాసియగు నిమ్రోదు కాలంనుండి నిరాటంకంగా కొనసాగుతుంది. యెహోవా ఆ తిరుగుబాటుదారుల భాషను తారుమారు చేసి వారిని చెదరగొట్టినప్పుడు బబులోను అబద్ధమతం వారివెంట పయనించింది. (ఆదికాండము 10:8-10: 11:4-9) అప్పటినుండి, రాజకీయ సామ్రాజ్యాలు ఏలి కూలిపోయాయి, గానీ బబులోను మతం నిల్చింది. అది అనేక ఆకారాలు రూపురేఖలు దిద్దుకొని ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం, అంటే ప్రవచింపబడిన మహాబబులోను అయ్యింది. దాని అత్యంత ప్రాముఖ్యమైన భాగం క్రైస్తవమత సామ్రాజ్యం, ఇది మతభ్రష్టమైన “క్రైస్తవ” సిద్ధాంతంతో మిళితమైన తొలి బబులోను మతబోధలనుండి ఉత్పన్నమైంది. మహాబబులోనుకున్న సుదీర్ఘ చరిత్రనుబట్టి, అది నాశనమౌతుందనే విషయాన్ని నమ్మడం అనేకులకు కష్టంగావుంటుంది.

3. ప్రకటన అబద్ధమతముయొక్క నాశనాన్ని ఎలా స్థిరపరుస్తుంది?

3 గనుక, అది కూలిపోవడం, తర్వాత సమూల నాశనం కావడాన్ని గూర్చిన రెండు వివరాలద్వారా అబద్ధమత సామ్రాజ్య నాశనానికి నడిపే పరిస్థితులను గూర్చి ప్రకటన గ్రంథం వివరించి దాని నాశనాన్ని స్థిరపరచడం యుక్తమే. అది చివరకు తన మాజీరాజకీయ ప్రియులచే నాశనం చేయబడనైయున్న ఒక “మహావేశ్య”గా దాన్ని మనమిప్పటికే చూశాము. (ప్రకటన 17:1, 15, 16) ఇప్పుడు మనం మరో దర్శనంలో, దాన్ని ఒక పట్టణంగా మనం చూడాల్సి వుంటుంది, అంటే మతసంబంధమైన పురాతన బబులోనుకు సాదృశ్యమైన దానిగా పరిగణించాలి.

మహాబబులోను పడిపోవడం

4. (ఎ) యోహాను తదుపరి ఏ దర్శనం చూస్తాడు? (బి) మనం దూతనెలా గుర్తించగలం, మరియు మహాబబులోను కూలిపోవడాన్నిగూర్చి ఆయనే ప్రకటించడమెందుకు యుక్తము?

4 యోహాను యింకా ఆ వృత్తాంతాన్నిలా చెబుతూనే ఉన్నాడు: “అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి యిట్లనెను—మహాబబులోను కూలిపోయెను కూలిపోయెను.” (ప్రకటన 18:1, 2ఎ) ఆ దూతచేసే ప్రకటనను వినడం యోహానుకిది రెండోసారి. (ప్రకటన 14:8 చూడండి.) అయిననూ యీ సారి ఆ ప్రకటనయొక్క ప్రాముఖ్యత దూత మహిమచేత నొక్కితెల్పబడింది, ఎందుకంటె, ఆ దూత మహిమ భూమియంతటా ప్రకాశించింది! ఆయన ఎవరైవుండొచ్చు? శతాబ్దాల క్రితం ప్రవక్తయైన యెహెజ్కేలు పరలోక దర్శనాన్ని గూర్చి నివేదిస్తూ, “ఆయన [యెహోవా] ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను” అని చెప్పాడు. (యెహెజ్కేలు 43:2) యెహోవా మహిమతో పోల్చగల్గిన మహిమను పొందగల్గిన ఏకైక దూత ప్రభువైన యేసు అయ్యుంటాడు, ఆయన “దేవుని మహిమయొక్క తేజస్సును ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” యున్నాడు. (హెబ్రీయులు 1:3) మరి 1914 లో ‘మనుష్యకుమారుడు తన మహిమతో వచ్చాడు’ అప్పటినుండి యేసు పరలోకంలో “తన మహిమగల సింహాసనము మీద” ఆసీనుడయ్యాడు, యెహోవాకు సహరాజుగాను న్యాయాధిపతిగాను భూమిపై అధికారం నిర్వహిస్తున్నాడు. గనుక ఆయన మహాబబులోను కూలిపోవడాన్ని గూర్చి ప్రకటించడం యుక్తమే.—మత్తయి 25:31, 32.

5. (ఎ) మహాబబులోను కూలిపోయే విషయాన్ని ప్రకటించడానికి దూత ఎవరిని ఉపయోగించుకున్నాడు? (బి) “దేవుని ఇంటి”వారని చెప్పుకునే వారికి తీర్పు ఆరంభమైనప్పుడు క్రైస్తవమత సామ్రాజ్యానికి ఏం జరిగింది?

5 మహాధికారంగల యీ దూత మానవులకు అటువంటి ఆశ్చర్యకరమైన సమాచారాన్ని ప్రకటించడానికి ఎవరిని ఉపయోగించుకుంటాడు? అది కూలిపోవడం మూలంగా విడుదలైన వారిని అంటే భూమ్మీద శేషించబడిన అభిషక్తులను, అనగా యోహాను తరగతిని నిశ్చయంగా ఉపయోగించుకుంటాడు. వీరు 1914 నుండి 1918 వరకు మహాబబులోను చేతిలో గొప్ప శ్రమలనుభవించారు, గానీ 1918 లో ప్రభువైన యెహోవా, ఆయన “నిబంధన [అబ్రాహాముతో చేసింది] దూత”యైన యేసుక్రీస్తు, క్రైస్తవులని చెప్పుకొనెడి “దేవుని ఇంటి” వారికి తీర్పుతీర్చడానికి ఆరంభించారు. అలా మతభ్రష్ట క్రైస్తవమత సామ్రాజ్యం తీర్పులోనికి తేబడింది. (మలాకీ 3:1; 1 పేతురు 4:17) మొదటి ప్రపంచ యుద్ధకాలంలో అది ఒడిగట్టుకున్న మహా రక్తాపరాధం, యెహోవాయొక్క నమ్మకమైన సాక్షులను హింసించడంలో అది చేసిన దుష్కృత్యం, బబులోనుకు సంబంధించిన దాని శాఖలు తీర్పు సమయంలో దానికి సహాయం చేయలేదు; లేక మహాబబులోను యొక్క యితర ఏ భాగంకూడ దేవుని అనుగ్రహాన్ని పొందలేదు.—యెషయా 13:1-9 పోల్చండి.

6. మహాబబులోను 1919 లో కూలిపోయిందని ఎందుకు చెప్పవచ్చును?

6 గనుక 1919 నాటికి మహాబబులోను కూలిపోయింది, అలా దేవుని ప్రజలు, ఒక్క రోజులోనే అన్నట్లు, విడుదలై వారి ఆత్మీయ సమృద్ధికి తిరిగి పునరుద్ధరించ బడడానికి మార్గం సుగమమైంది. (యెషయా 66:8) ఆ సంవత్సరానికి, మహాదర్యావేషు, మహాకోరేషు అయిన యెహోవా దేవుడు మరియు యేసుక్రీస్తు అబద్ధమతం యెహోవా ప్రజలపై యిక ప్రభావం చూపకుండా ఉండేలాగున చేశారు. వారు యెహోవాను సేవించకుండాను, ఆ వేశ్యవంటి మహాబబులోను నాశనం కానైయున్నదని, యెహోవా సర్వాధిపత్యం నిరూపించబడబోవు సమయమాసన్నమైందని తెలియజేయకుండా అది వారిని ఆపలేదు!—యెషయా 45:1-4: దానియేలు 5:30, 31.

7. (ఎ) మహాబబులోను 1919 లో నాశనం చేయబడక పోయినప్పటికీ, యెహోవా దాన్నెలా దృష్టిస్తున్నాడు? (బి) మహాబబులోను 1919 లో కూలిపోయినప్పుడు యెహోవా ప్రజలకు ఏమి సంభవించింది?

7 నిజమే, సా.శ.పూ. 539 లో ప్రాచీన బబులోను పారసీక రాజైన కోరేషు సైన్యం చేతిలో పడినప్పుడు నాశనం చేయబడనట్లే, 1919 లో మహాబబులోను నాశనం చేయబడలేదు. అయితే యెహోవా దృష్టిలో ఆ సంస్థ కూలిపోయినట్లే. అది న్యాయబద్ధంగా ఖండించబడింది, నాశనానికి ఎదురు చూస్తుంది; గనుకనే అబద్ధమతం యెహోవా ప్రజల్ని యిక బందీలుగా ఉంచుకోలేదు. (లూకా 9:59, 60 పోల్చండి.) వీరు తగినకాలంలో ఆత్మీయాహారాన్ని పంచిపెట్టేందుకై యజమానుని నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసునిగా సేవచేయడానికి విడుదల చేయబడ్డారు. వారు “భళా మంచిదాసుడా” అనే మెప్పుకోలును పొందారు, యెహోవా సేవలో మరల నిమగ్నమవ్వడానికి ఆజ్ఞాపించబడ్డారు.—మత్తయి 24:45-47; 25:21, 23; అపొస్తలుల కార్యములు 1:8.

8. యెషయా 21:8, 9 నందలి కావలివాడు ఏ సంఘటననుగూర్చి ప్రకటిస్తున్నాడు, ఆ కావలివాడు యీనాడు ఎవరిని సూచిస్తున్నాడు?

8 వేలసంవత్సరాల క్రితమే యెహోవా యీ గొప్ప సంఘటనను గూర్చి ప్రవచించడానికి యితర ప్రవక్తల్ని ఉపయోగించుకున్నాడు. “సింహము గర్జించునట్టు కేకలు వేసి—నా యేలినవాడా, పగటివేళ నేను నిత్యమును కావలి బురుజుమీద నిలుచుచున్నాను. రాత్రి అంతయు కావలి కాయుచున్నాను” అని ఒక కావలివాన్ని గూర్చి యెషయా మాట్లాడుతున్నాడు. మరి ఆ కావలివాడు ఏ సంఘటనను గ్రహించి సింహంవలె ధైర్యంగా ప్రకటిస్తాడు? దీన్ని: “బబులోను కూలెను కూలెను. దాని దేవతల విగ్రహములన్నిటిని ఆయన [యెహోవా] నేలను పడవేసియున్నాడు.” (యెషయా 21:8, 9) ఈ కావలివాడు యీనాడు ఎంతో మెలకువగానున్న యోహాను తరగతిని నిశ్చయంగా సూచిస్తున్నాడు, ఎందుకంటే అది బబులోను కూలిపోయిందని లోకమంతా ప్రకటించడానికి కావలికోట పత్రికను మరితర దైవసంబంధిత సాహిత్యాలను ఉపయోగిస్తుంది.

మహాబబులోను క్షీణించిపోవడం

9, 10. (ఎ) బబులోనుకు సంబంధించిన మతప్రభావం మొదటి ప్రపంచయుద్ధం నుండి ఏ విధంగా సన్నగిల్లిపోయింది? (బి) మహాబబులోను కూలిపోయిన స్థితిని గూర్చి బలిష్టుడైనదూత ఎలా వర్ణించాడు?

9 సా.శ.పూ. 539 లో ప్రాచీన బబులోను కూలిపోవడమనేది దాని నాశనానికి ముందు అది దీర్ఘకాలంగా క్షీణించడానికి నాందిపలికింది. అలాగే, మొదటి ప్రపంచ యుద్ధంనుండి ప్రపంచవ్యాప్తంగా బబులోనుకు సంబంధించిన మత ప్రభావం గణనీయంగా క్షీణించింది. రెండోప్రపంచ యుద్ధానంతరం జపాన్‌లో షింటో చక్రవర్తి ఆరాధన నిషేధించబడింది. చైనాలో కమ్యూనిష్టు ప్రభుత్వం మతసంబంధమైన నియామకాలను కార్యకలాపాలను అదుపుచేస్తుంది. ప్రొటెస్టెంట్‌లున్న ఉత్తర ఐరోపాలో అనేకమంది మతం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. రోమన్‌ కాథోలిక్‌ చర్చి ప్రపంచవ్యాప్తంగా యిటీవలి కాలంలో అంతర్గత చీలికలతో విభేదాలతో తన అధికారం విషయంలో బలహీనపడింది.—మార్కు 3:24-26 పోల్చండి.

10 ఈ సూచనలన్నీ మహాబబులోనుపై చేయబోయే సైనిక దాడిని సిద్ధపర్చేందుకు నిశ్చయంగా ‘యూఫ్రటీసు నది ఎండిపోయేలా చేయడంలో’ ఒక భాగమే. ఇలా ఎండిపోజేయడం—అనగా పెద్ద లోటు మూలంగా చర్చి “మరల భిక్షమెత్తాలి” అని పోప్‌ 1986 అక్టోబరులో చెప్పిన దానిలోకూడ ప్రతిబింబించింది. (ప్రకటన 16:12) బలిష్ఠుడైన దూత యిక్కడ ప్రకటిస్తున్నట్లు, మహాబబులోను ఆత్మీయ వ్యర్థస్థలమని ముఖ్యంగా 1919 నుండి బహిరంగంగా తెలియబడేలా బయల్పర్చబడింది: “అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టును ఆయెను.” (ప్రకటన 18:2బి) త్వరలో అది నిజంగా అటువంటి వ్యర్థస్థలమౌతుంది, అంటే 20వ శతాబ్దపు ఇరాక్‌లోని బబులోను శిథిలాలవలె పాడవుతుంది.—యిర్మీయా 50:25-28 కూడ చూడండి.

11. మహాబబులోను ఏ భావంలో “దయ్యములకు నివాసస్థలమును” ‘అపవిత్రమైన ప్రతివాటికి, అపవిత్రమైన ప్రతిపక్షికి ఉనికిపట్టు’ అయ్యింది?

11 ఇక్కడ చెప్పబడిన “దయ్యములు,” కూలిపోయిన బబులోనును గూర్చి యెషయా చెప్పిన వర్ణనలో కనబడే ‘మేకల ఆకారమున్న దయ్యములు’ (సైరిమ్‌) అనే పదాన్ని బహుశ పోలియుండవచ్చును: “నక్కలు అక్కడ పండుకొనును. గురుపోతులు వారి యిండ్లలో ఉండును. నిప్పుకోళ్లు అక్కడ నివసించును. కొండమేకలు (మేకల ఆకారమున్న దయ్యములు NW) అక్కడ గంతులు వేయును.” (యెషయా 13:21) అది నిజమైన దయ్యాలను సూచించక పోవచ్చు, గానీ చూసేవారికి దయ్యములేమోనని అనిపించేలా అవి చింపిరి రోమములుకల్గి ఎడారులలో జీవించే జంతువులను సూచించి ఉండొచ్చును. మహాబబులోనులోని శిథిలాల్లో, అటువంటి జంతువులు, నిల్వవున్న విషపూరిత వాయువు (‘అపరిశుభ్రమైన పీల్చుకునే గాలి’) అపవిత్రమైన పక్షులకు సాదృశ్యమైన ఉనికిపట్టు, మరణకరమగు దాని ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. మానవజాతికి ఎటువంటి భవిష్యత్‌ నిరీక్షణను అది అందివ్వలేదు.—ఎఫెసీయులు 2:1, 2 పోల్చండి.

12. మహాబబులోను పరిస్థితి యిర్మీయా 50వ అధ్యాయంలోని ప్రవచనానికి ఎలా సరిపోతుంది?

12 దాని పరిస్థితి యిర్మీయా ప్రవచనంతోకూడ సరిపోతుంది: “యెహోవా మాట యిదే. కల్దీయులును బబులోను నివాసులును దాని అధిపతులును జ్ఞానులును కత్తిపాలగుదురు . . . నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములుగల దేశము. జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవిపిల్లులును నక్కలును అక్కడ నివసించును. నిప్పుకోళ్లును దానిలో నివాసము చేయును. ఇకమీదట అది ఎన్నడును నివాసస్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరును కాపురముండరు.” దేవుడు సొదొమ గొమొర్రాలకు చేసిన నాశనాన్ని పోలిన ప్రతిదండననుండి మహాబబులోనును దాని విగ్రహారాధన మరియు మాటిమాటికి చేసే ప్రార్థనలు రక్షించలేవు.—యిర్మీయా 50:35-40.

మోహోద్రేకముతో నిండిన ద్రాక్షారసం

13. (ఎ) బలిష్టుడైన దూత మహాబబులోను యొక్క విస్తారమైన వేశ్యాతనం వైపు ఎలా అవధానాన్ని మళ్లిస్తున్నాడు? (బి) ప్రాచీన బబులోనులో విస్తారంగా ఉన్న ఏ అవినీతి యీనాడు మహాబబులోనులో కనబడుతుంది?

13 బలిష్ఠుడైన దూత తదుపరి మహాబబులోను యొక్క విస్తారమైన వేశ్యాతనంవైపు అవధానాన్ని మళ్లిస్తూ యిలా ప్రకటిస్తున్నాడు: “ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును * త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.” (ప్రకటన 18:3) అది తన అపవిత్రమగు మతపరమైన బోధలతో మానవజాతిలోని సమస్త జనులను ముంచేసింది. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్‌ ప్రకారం ప్రాచీన బబులోనులో ప్రతి కన్య దేవాలయపు ఆరాధనలో వేశ్యగా తన కన్యాత్వమును ధారపోయవలసి వుండేది. కంఫూచియాలోని ఆంగ్‌కొర్‌ వాట్‌లోని యుద్ధంవల్ల దెబ్బతిన్న చెక్కడపు విగ్రహాలలో యీనాటివరకు అసహ్యమైన లైంగిక అవినీతి ప్రదర్శింపబడుతోంది, ఇండియాలోని ఖజురాహోనందలి దేవాలయాలమీద అసభ్యకరమగు శృంగార దృశ్యాలమధ్య హిందువుల దేవుడైన విష్ణువు ఉన్నట్లు చూపించబడుతోంది. అమెరికా దేశంలో 1987 లోను మరల 1988 లోను టివి సువార్తికులను కుదిపేసిన అవినీతికరమైన సంఘటనలు, వాటితోపాటు మతనాయకుల్లో విస్తరించియున్న పురుషసంయోగ క్రియలను బహిర్గతం చేయడం వంటివి, క్రైస్తవమత సామ్రాజ్యం కూడ అక్షరార్థమైన వ్యభిచారాన్ని విస్మయం కల్గించేంత విచ్చలవిడిగా అనుమతిస్తుందని వివరిస్తున్నాయి. అయిననూ, యీ 20వ శతాబ్దంలో సమస్త జనములు అంతకంటె తీవ్రమైన వ్యభిచారానికి బలైపోయాయి.

14-16. (ఎ) ఫాసిస్ట్‌ ఇటలీలో ఏ ఆత్మీయమైన అవినీతికరమగు మత-రాజకీయ సంబంధం వృద్ధియైంది? (బి) ఇటలీ అబీస్సీనియాపై దండెత్తినప్పుడు, రోమన్‌ కాథోలిక్‌ చర్చి బిషప్‌ ఎటువంటి వ్యాఖ్యానాలు చేశాడు?

14 నాజీ జర్మనీలో హిట్లర్‌ అధికారానికి రావడానికి దోహదపడిన రాజకీయ-మతపరమైన అక్రమసంబంధాన్ని గూర్చి మనం ముందే పునఃపరిశీలించాం. మతం రాజకీయాల్లో జోక్యం కల్గించుకున్నందువల్ల ఇతర దేశాలు కూడ నష్టపోయాయి. ఉదాహరణకు, ఫాసిస్టు ఇటలీలో 1929, ఫిబ్రవరి 11న వాటికన్‌ను ఒక సర్వాధిపత్య రాజ్యంగా చేస్తూ ముస్సోలిని మరియు కార్డినల్‌ గాస్పర్రి కలిసి లేటరన్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు. “ఇటలీని తిరిగి దేవునికి దేవున్ని తిరిగి ఇటలీకి అప్పగించాను,” అని పోప్‌ పాయస్‌ XI అన్నాడు. అది వాస్తవమేనా? ఆరు సంవత్సరాల తర్వాత ఏమి జరిగిందో గమనించండి. అక్టోబర్‌ 3, 1935న ఇటలీ అబీస్సీనియాను ఆక్రమించి “అది యింకా దాసత్వాన్ని అమలుపరుస్తున్న క్రూరమైన దేశం” అని పేర్కొన్నది. నిజానికి క్రూరమైనదేది? ముస్సోలిని క్రూరత్వాన్ని కాథోలిక్‌ చర్చి ఖండించిందా? పోప్‌ సందిగ్ధమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని బిషప్పులు వారి “స్వదేశ”మగు ఇటలీ సైన్యాన్ని బాహాటంగా ఆశీర్వదించారు. ది వాటికన్‌ ఇన్‌ ది ఏజ్‌ ఆఫ్‌ ది డిక్టేటర్స్‌ అనే పుస్తకంలో ఆంథోనీ రోడ్స్‌ యిలా నివేదిస్తున్నాడు:

15 “అక్టోబర్‌ 19న [1935] బిషప్‌ యుడైని [ఇటలీ] వ్రాసిన తన ఉపదేశోత్తరంలో యిలా అన్నాడు: ‘తప్పొప్పులు పట్టడానికి మనకిది సమయంకాదు, సమంజసంకాదు. ఇటలీవారిగా, మరి ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా మన సైన్యాల విజయానికి తోడ్పడటమే మన కర్తవ్యం.’ పాడువాకు చెందిన బిషప్‌ అక్టోబర్‌ 21న వ్రాసిందేమంటే, ‘మనం జీవిస్తున్న యీ విపత్కర ఘడియల్లో, మన రాజకీయ వ్యక్తులమీద, సైనిక శక్తులమీద విశ్వాసం కల్గివుండండని మేం కోరుతున్నాం.’ క్రెమోనాకు చెందిన బిషప్‌ అక్టోబర్‌ 24న అనేక యుద్ధ పతాకాలను పవిత్రపరచి యిలా అన్నాడు: ‘ఇటలీ వారికొరకు ఆఫ్రికా గడ్డపై క్రొత్త, సారవంతమైన ప్రాంతాలను జయించి, అందుమూలంగా వారికి రోమా, క్రైస్తవ నాగరికతను తెచ్చిపెట్టే యీ సైన్యాలను దేవుడు దీవించును గాక. మరో పర్యాయం ఇటలీ ప్రపంచమంతటికీ ఒక క్రైస్తవ ఉపదేశకుడుగా ఉండును గాక.’”

16 రోమన్‌ కాథోలిక్‌ మతగురువుల దీవెనతో అబీస్సీనియా చిన్నాభిన్నం చేయబడింది. వీరిలో ఎవరైనా, ఏవిధంగానైనా, అపొస్తలుడైన పౌలువలె తాము ‘అందరి రక్తము విషయమై నిర్దోషులని’ చెప్పగలరా?—అపొస్తలుల కార్యములు 20:26.

17. స్పెయిన్‌ మతగురువులు ‘తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టడంలో’ విఫలులైనందున అదెలా బాధననుభవించింది?

17 జర్మనీ, ఇటలీ, మరియు అబీస్సీనియా రాజ్యాలతోపాటు మహాబబులోను వ్యభిచారానికి బలైన మరోరాజ్యం—స్పెయిన్‌. ఆ దేశంలో 1936-39 వరకు జరిగిన ప్రజాపోరాటం, రోమన్‌ కాథోలిక్‌ చర్చికున్న విశేషాధికారాన్ని తగ్గించే ఉద్దేశ్యముతో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తీసుకున్న చర్యలలో ఒక భాగమే. యుద్ధం జరుగుతుండగా, కాథోలిక్‌ ఫాసిస్ట్‌వాడైన తిరుగుబాటు సైన్యాధినేత ఫ్రాంకో తనను తాను “పరిశుద్ధ దండయాత్రకు క్రైస్తవ సైన్యాధికారి”యని వర్ణించుకున్నాడు, తర్వాత ఆయన ఆ బిరుదును వదలుకున్నాడు. ఆ పోరాటంలో వేలాదిమంది స్పెయిన్‌ దేశస్థులు మరణించారు. ఇదే కాకుండ, ఒక కచ్చితమైన అంచనా ప్రకారం, ఫ్రాంకో యొక్క దేశీయులు 40,000 మంది పాపులర్‌ ఫ్రంట్‌ సభ్యులను హతమార్చితే, వీరు 8,000 మంది సన్యాసులను, గురువులను, సన్యాసినులను, మరియు క్రొత్తశిష్యులను చంపారు. ప్రజాపోరాటం యొక్క భయానక దృశ్యం, దుఃఖం అలావుంటుంది, యేసు మాటల్లోని జ్ఞానాన్నిలా వివరిస్తుంది: “నీ కత్తి వరలో పెట్టుము; కత్తిపట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.” (మత్తయి 26:52) క్రైస్తవమత సామ్రాజ్యం అటువంటి మహా రక్తాపరాధానికి పాల్పడటం ఎంత ఘోరమోగదా! దాని గురువులు ‘తమ ఖడ్గములను నాగటినక్కులుగా సాగగొట్టుట’లో నిజంగానే ఘోరంగా విఫలమయ్యారు గదా!—యెషయా 2:4.

సంచార వర్తకులు

18. “లోకములోని వర్తకులు” ఎవరు?

18 “లోకములోని వర్తకులు“ ఎవరు? నిశ్చయంగా మనమీనాడు వారిని వ్యాపారస్థులు, వాణిజ్యవేత్తలు, పెద్దవ్యాపార అఖండులని చెప్పవచ్చును. న్యాయసమ్మతమైన వ్యాపారం చేయడం తప్పని దీనర్థంకాదు. బైబిలు వ్యాపారస్థులకు జ్ఞానయుక్తమైన సలహానిస్తూ, అవినీతి, పేరాశ మొదలగు వాటివిషయంలో హెచ్చరిస్తుంది. (సామెతలు 11:1; జెకర్యా 7:9, 10; యాకోబు 5:1-5) “సంతుష్టి సహితమైన దైవభక్తి” గొప్పలాభ సాధనమైయున్నది. (1 తిమోతి 6:6, 17-19) అయిననూ, సాతాను లోకం నీతిసూత్రాలను పాటించదు. అవినీతి విస్తరిస్తోంది. అది మతంలోను, రాజకీయాల్లోను, మరియు పెద్దవ్యాపారంలోనూ ఉంది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల అవినీతి, ఆయుధాల అక్రమరవాణా మొదలైన మోసాలను గూర్చి అప్పుడప్పుడూ వార్తావాహిని బహిర్గతం చేస్తూంటుంది.

19. ప్రపంచ ఆర్థిక పరిస్థితినిగూర్చిన ఏ వాస్తవం, ప్రకటన గ్రంథంలో లోకములోని వర్తకుల ప్రస్తావన వచ్చిందని వివరించడానికి తోడ్పడుతుంది?

19 లక్షలాదిమంది మానవులు నిత్యావసర వస్తువుల్లేక అల్లాడుతుంటే ప్రతిసంవత్సరం అంతర్జాతీయంగా జరిగే ఆయుధాల సరఫరా వ్యాపారం 100,000,00,00,000 డాలర్లు దాటిపోతుంది. అది విపరీతం. అయితే ఆయుధాలు ప్రపంచ ఆర్థికవ్యవస్థకు ముఖ్యసాధనంగా కనబడుతున్నాయి. లండన్‌లోని స్పెక్టేటర్‌ అనే వార్తాపత్రిక ఏప్రిల్‌ 11, 1987 లో యిలా నివేదించింది: “ఇందులో నేరుగా సంబంధం కల్గివున్న పరిశ్రమలను మాత్రమే లెక్కిస్తే, దీనిమూలంగా అమెరికాలో సుమారు 4,00,000 ఐరోపాలో 7,50,000 ఉద్యోగాలేర్పడ్డాయి. కానీ ఆసక్తికరమైన విషయమేమంటే, ఆయుధ నిర్మాణమందలి సామాజిక ఆర్థికావసరత పెరుగుతూంటే, ఉత్పత్తిదారులు సురక్షితంగా ఉన్నారా అనే ప్రశ్న తెరమరుగైంది.” కాబోయే శత్రువులతోసహా, భూలోకమంతా బాంబులు ఇతర ఆయుధాల లావాదేవీలు జోరుగా జరుగుతున్నందువల్ల గొప్పలాభాలు ఒనగూడుతున్నాయి. ఏదో ఒకనాడు వాటిని తయారుచేస్తున్న వారినే అవి నాశనం చేయడానికి తీక్షణమైన విపత్తుతో తిరిగి వారిమీదనే పడతాయి. ఎంతటి పరస్పర విరుద్ధత! దీనికి తోడు ఆయుధ పరిశ్రమను చుట్టుముట్టియున్న అక్రమార్జన. స్పెక్టేటర్‌ పత్రికతెల్పిన ప్రకారం ఒక్క అమెరికాలోనే, “ప్రతిసంవత్సరం పెంటగాన్‌ కారణం తెలియకుండానే 900 మిలియన్‌ డాలర్లు విలువజేసే ఆయుధాలు, వాటికి సంబంధించిన సామాగ్రిని నష్టపోతుంది.” ప్రకటన భూలోక వర్తకులనుగూర్చి ప్రతికూల దృష్టితో తెల్పడంలో ఆశ్చర్యమేలేదు!

20. మతం అవినీతికర వ్యాపార అలవాట్లలో భాగం కల్గివుందని ఏ ఉదాహరణ చూపుతుంది?

20 మహిమగల దూత ప్రవచించినట్లు, మతం అటువంటి అవినీతికరమైన వ్యాపార అలవాట్లలో బాగా తలదూర్చింది. ఉదాహరణకు, 1982 లో ఇటలీయొక్క బాంకో ఆంబ్రోసియానొ పతనానికి వాటికన్‌కు సంబంధం ఉంది. ఆ కేసు 1980వ దశాబ్దమంతా కొనసాగింది, మరి సమాధానం లేని ప్రశ్నయేమంటే: ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఫిబ్రవరి 1987 లో మిలన్‌ మేజిస్ట్రేట్‌, ఆ బ్యాంక్‌ మోసపూరితంగా దివాళాతీయడానికి ఒక అమెరికా ఆర్చిబిషప్‌తోపాటు ముగ్గురు వాటికన్‌ మతగురువులు కారకులయ్యారని వారికి అరెస్టు వారంట్లనిచ్చాడు, గానీ వాటికన్‌ వారిని తొలగించే వినతిని తిరస్కరించింది. జూలై 1987 లో, తీవ్ర ప్రతిఘటనల మధ్య వాటికన్‌కు ఇటలీ ప్రభుత్వానికి మధ్య జరిగిన పాత ఒప్పందం ప్రకారం ఇటలీ ఉన్నత అప్పీలు కోర్టు ఆ వారంట్లను కొట్టివేసింది.

21. యేసు తన కాలంలోని మోసపూరిత వ్యాపారంలో ఎటువంటి సంబంధం కల్గివుండలేదని మనకెలా తెలుసు, కానీ మహాబబులోను మతం విషయంలో మనమీనాడు ఏం చూస్తున్నాము?

21 యేసు తనకాలంనాటి మోసపూరిత వ్యాపారంతో సంబంధం కల్గివుండెనా? లేదు. కనీసం ఆయన సంపన్నవంతుడు కూడా కాదు, ఎందుకంటే ఆయనకు “తలవాల్చుకొనుటకైనను స్థలములేదు.” యేసు ఒక యౌవనస్థుడైన పరిపాలకునికి యిలా సలహా యిచ్చాడు: “నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవువచ్చి నన్ను వెంబడింపుము.” అది శ్రేష్టమైన సలహా, ఎందుకంటే అది అతనికున్న వ్యాపార చింతలన్నిటిని తీసివేసుకోవడానికి తోడ్పడివుండేది. (లూకా 9:58; 18:22) దీనికి భిన్నంగా, బబులోను మతం తరచూ పెద్దవ్యాపారంతో ఇష్టంలేని సంబంధం కల్గివుంది. ఉదాహరణకు, అమెరికాలోని ఫ్లోరిడానందలి మియామీ కాథోలిక్‌ ఆర్చిడీకన్‌ ఆర్థిక సలహాదారుడు అణ్వాయుధాలు, హింసాయుత సినిమాలు, సిగరెట్లు తయారుచేసే కంపెనీల నిల్వలు చర్చీకున్నాయని అంగీకరించినట్లు 1987 లో ఆల్బెనీ టైమ్స్‌ యూనియన్‌ నివేదించింది.

“నా ప్రజలారా, దానిని విడిచిరండి”

22. (ఎ) పరలోకమునుండి ఒక స్వరము ఏమని చెబుతోంది? (బి) సా.శ.పూ. 537 లోను 1919 లోను దేవుని ప్రజలు సంతోషించడానికి నడిపించిదేమిటి?

22 యోహాను తర్వాత చెప్పేమాటలు ప్రవచనార్థక పద్ధతియొక్క నెరవేర్పునింకా సూచిస్తున్నాయి: “మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటిని—నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.” (ప్రకటన 18:4) బబులోను కూలిపోవడాన్ని గూర్చి హెబ్రీ లేఖనాల్లోవున్న ప్రవచనాల్లో యెహోవా తన ప్రజలకిచ్చిన ఈ ఆజ్ఞకూడ యిమిడివుంది: “బబులోనులోనుండి పారిపోవుడి.” (యిర్మీయా 50:8, 13) అలాగే, బబులోనుకు రాబోవు నాశనం దృష్ట్యా, దేవుని ప్రజలిప్పుడు దానినుండి బయటకు రావాలని కోరబడుతున్నారు. సా.శ.పూ. 537 లో నమ్మకమైన ఇశ్రాయేలీయులు బబులోనునుండి బయటకి రావడం వారికెంతో ఆనందాన్ని కల్గించింది. అదేమాదిరి, 1919 లో దేవుని ప్రజలు బబులోను బందకమునుండి విడుదల పొందడం వారికి ఆనందం కల్గించింది. (ప్రకటన 11:11, 12) అప్పటినుండి లక్షలాదిమంది దాన్ని విడిచిరండి అనే ఆజ్ఞకు విధేయులౌతున్నారు.—మత్తయి 24:15, 16 పోల్చండి.

23. పరలోకంనుండి వచ్చేస్వరం మహాబబులోనును విడిచి బయటకి వెళ్లే అత్యవసరతనుగూర్చి ఎలా నొక్కి తెల్పుతోంది?

23 మహాబబులోను నుండి బయటికి రావడం, ప్రపంచమతాల సభ్యత్వాన్ని ఉపసంహరించు కోవడం, పూర్తిగా వేరవ్వడం నిజంగా అత్యవసరమా? అవును, ఎందుకంటే యీ ప్రాచీన మతసంబంధిత మహాగొప్ప బబులోను విషయంలో దేవుని దృష్టిని మనం కలిగివుండాల్సిన అవసరముంది. దాన్ని మహావేశ్యయని పిలవడంలో ఆయన మాటల్ని మింగలేదు. గనుక యిప్పుడు పరలోకంనుండి వచ్చే స్వరం యీ వేశ్యనుగూర్చి యోహానుకు యింకా యిలా వివరిస్తున్నాడు: “దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసికొనియున్నాడు. అది యిచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియలచొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది—నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్ప చేసికొని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును. దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు (యెహోవా, NW) బలిష్టుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును.”—ప్రకటన 18:5-8.

24. (ఎ) దేవుని ప్రజలు దేనిని తప్పించుకోవడానికి మహాబబులోనును విడిచి బయటికి రావాలి? (బి) మహాబబులోను నుండి పారిపోనివారు దానితో ఏ పాపములలో పాలివారౌతారు?

24 కఠిన పదజాలం గదా! అందుకే చర్యతీసుకోవడం అవసరం. యిర్మీయా తనకాలంలోని ఇశ్రాయేలీయులు యిలాచేయాలని చెప్పాడు: “బబులోనునుండి పారిపోవుడి . . . ఇది యెహోవాకు ప్రతికారకాలము. అది చేసిన క్రియలనుబట్టి ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడు. నా జనులారా, మీరు దానిలోనుండి బయటకు వెళ్లుడి. యెహోవా కోపాగ్నినుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి.” (యిర్మీయా 51:6, 45) అదేమాదిరి, పరలోకంనుండివచ్చే స్వరం బబులోను తెగుళ్లలో ఏదీ తన ప్రజలకు ప్రాప్తింపకుండునట్లు వారీనాడు బయటికి పారిపోవలెనని వారిని హెచ్చరిస్తున్నాడు. బబులోనుతోసహా ఈ లోకం మీదికి రాబోయే యెహోవా తెగులువంటి తీర్పులు యిప్పుడు ప్రకటింపబడుతున్నాయి. (ప్రకటన 8:1–9:21; 16:1-21) దేవుని ప్రజలు యీ తెగుళ్లను తప్పించుకొని దానితో పాటు మరణించకుండా ఉండాలని కోరుకుంటే వారు అబద్ధమతంనుండి బయటికి రావాల్సిన అవసరముంది. అంతేగాక, వారా సంస్థలోనే ఉంటే దాని పాపాల్లో పాలివారైనట్లే అవుతుంది. అది ఆత్మీయ వ్యభిచారం మరియు “భూమిమీద వధింపబడిన వారందరియొక్క” రక్తము విషయములో దోషియైనట్లే వీరు దోషులౌతారు.—ప్రకటన 18:24; ఎఫెసీయులు 5:11; 1 తిమోతి 5:22 పోల్చండి.

25. దేవుని ప్రజలు ఏ యే మార్గాల్లో ప్రాచీన బబులోను నుండి బయటికి వచ్చారు?

25 అయితే, దేవుని ప్రజలెలా బబులోనునుండి బయటికి వస్తారు? ప్రాచీన బబులోను విషయంలోనైతే, యూదులు బబులోను పట్టణంనుండి వాగ్దానదేశం వరకు నిజంగా ప్రయాణించి వచ్చారు. అయితే అంతకంటె ఎక్కువే యిమిడివుంది. యెషయా ఇశ్రాయేలీయులతో ప్రవచనార్థకంగా యిలా చెప్పాడు: “పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి. అపవిత్రమైన దేనిని ముట్టకుడి. దానియొద్దనుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి.” (యెషయా 52:11) అవును, యెహోవాకు వారు చేసే ఆరాధనను అపవిత్రపరచే బబులోను సంబంధమైన మత అలవాట్లన్నింటిని వారు విసర్జించవలసి యుండిరి.

26. ‘వారిమధ్యనుండి బయలు వెళ్లుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి’ అనే మాటలకు కొరింథులోని క్రైస్తవులెలా విధేయులయ్యారు?

26 అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికలో యెషయా మాటలను ఎత్తివ్రాస్తూ యిలా చెబుతున్నాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? . . . కావున మీరు వారిమధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.” కొరింథులోని క్రైస్తవులా ఆజ్ఞకు విధేయులు కావడానికి వారు కొరింథును విడిచిపెట్టాల్సిన పనిలేదు. అయిననూ, వారు అబద్దమతాలయాలకు దూరంగా ఉండాలి, ఆ విగ్రహారాధికుల అపవిత్రమైన క్రియలనుండి ఆత్మీయంగా వేరైవుండాలి. దేవుని ప్రజలు 1919నుండి మహాబబులోనును విడిచి పారిపోవడాని కారంభించారు, ఏదైనా అపవిత్రమైన బోధలు, అలవాట్లు మిగిలివుంటే వాటినుండి తమనుతాము పవిత్రపరచుకొన్నారు. అలా, పవిత్ర ప్రజలుగా వారు ఆయన్ను సేవించగలిగారు.—2 కొరింథీయులు 6:14-17; 1 యోహాను 3:3.

27. ప్రాచీన బబులోను తీర్పులకు మహాబబులోను తీర్పులకు ఎటువంటి సారూప్యాలున్నాయి?

27 ప్రాచీన బబులోను కూలిపోవడం చివరకది నిర్మూలం కావడం దాని పాపాలకు తగిన శిక్షే. “దాని శిక్ష ఆకాశమంత యెత్తుగా సాగుచున్నది.” (యిర్మీయా 51:9) అదేవిధంగా, మహాబబులోను పాపాలు యెహోవా దృష్టికి వచ్చేంత రీతిగా “ఆకాశమునంటుచున్నవి.” అది అన్యాయం, విగ్రహారాధన, అవినీతి, దౌర్జన్యం, దోపిడి హత్యలు మొదలైన వాటి విషయంలో దోషియై ఉన్నది. ప్రాచీన బబులోను కూలిపోవడం ఒక విధంగా అది యెహోవా ఆలయానికి ఆయన సత్యారాధికులకు చేసినదానికి ప్రతీకారమే. (యిర్మీయా 50:8, 14; 51:11, 35, 36) అలాగే మహాబబులోను కూలిపోయి చివరికి దానికి కలుగబోయే నాశనం కూడ అది శతాబ్దాలుగా సత్యారాధికులకు చేసిన దానికి ప్రతీకారం వ్యక్తంచేయడమే. నిజానికి, దాని అంతిమ నాశనం, “మన దేవుని ప్రతిదండన దినము”నకు ప్రారంభము.—యెషయా 34:8-10; 61:2; యిర్మీయా 50:28.

28. యెహోవా మహాబబులోనుకు ఏ న్యాయనియమాన్ని అమలుచేస్తాడు, ఎందుకు?

28 మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయుడు ఒకవేళ దొంగిలించితే, అతడు దానికి రెట్టింపు చెల్లించవలసి వుంటుంది. (నిర్గమకాండము 22:1, 4, 7, 9) మహాబబులోనుకు రాబోవు నాశనంలో యెహోవా అటువంటి న్యాయ నియమాన్నే అమలుపరుస్తాడు. అది చేసినదానికి రెట్టింపు పొందాలి. మహాబబులోను దాని వశములోనున్న వారియెడల ఎటువంటి కనికరం చూపలేదు గనుక యీ న్యాయాన్ని తగ్గించే ఎటువంటి కనికరమైనా దానియెడల చూపబడదు. అది “సుఖాసక్తురాలై” ఉండడానికి భూలోక ప్రజలపై ఆధారపడి జీవించింది. ఇప్పుడది బాధను దుఃఖమును చవిచూడాలి. ప్రాచీన బబులోను తాను సురక్షితంగా ఉన్నాననుకొని, “నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని” గర్వించింది. (యెషయా 47:8, 9, 11) మహాబబులోను కూడ తాను సురక్షితంగా ఉన్నాననుకుంటుంది. కానీ, “బలవంతుడైన” యెహోవా ఆజ్ఞనుబట్టి, దాని నాశనం త్వరలోనే, “ఒక్కదినములోనే” అన్నట్లు సంభవిస్తుంది!

[అధస్సూచీలు]

^ పేరా 13 న్యూవరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రెఫరెన్స్‌ బైబిల్‌, అథఃస్సూచి.

[అధ్యయన ప్రశ్నలు]

[263వ పేజీలోని బాక్సు]

“రాజులు . . . దానితో వ్యభిచరించిరి”

వర్తకులు 1800వ దశాబ్దపు తొలిభాగంలో చైనాకు అధిక మొత్తంలో నల్లమందును దొంగరవాణా చేసేవారు. చైనా అధికారులు 1839 లో బ్రిటిష్‌ వర్తకులనుండి 20,000 పెట్టెల్లోని మత్తుపదార్థాన్ని పట్టుకొనుటద్వారా ఆ అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని ప్రయత్నించారు. దీనివల్ల బ్రిటన్‌ చైనాలమధ్య భేదం పొడచూపింది. ఇరుదేశాలమధ్య సంబంధాలు బెడిసికొట్టడంతో కొందరు ప్రొటెస్టెంట్‌ మిషనరీలు యీ క్రిందివ్వబడిన మాటలద్వారా యుద్ధంచేయమని బ్రిటన్‌ను అర్థించారు:

“ఈ కష్టాలు నన్ను ఆనందభరితున్ని చేస్తున్నాయి, ఎందుకంటే, బ్రిటిష్‌ ప్రభుత్వం విస్తరించవచ్చును, దేవుడు తనశక్తితో చైనాలో సువార్త ప్రవేశించకుండా నిరోధించే ఆటంకాలను తొలగించవచ్చును.”—హెన్రిట్టా షుక్‌, సథరన్‌ బాప్టిస్ట్‌ మిషనరీ.

చివరకు యుద్ధం ఆరంభమైంది—ఆ యుద్ధం యీనాడు నల్లమందు యుద్ధంగా పేరుపొందింది. మిషనరీలు యీక్రింద యివ్వబడిన వ్యాఖ్యలద్వారా బ్రిటన్‌ను హృదయపూర్వకంగా పురికొల్పారు:

“అది నల్లమందు సమస్యనికాదు లేక ఇంగ్లీష్‌ సమస్యనికాదు, చైనాను బహిష్కరించడమనే గోడను పడగొట్టడంలో ఆయన కరుణా సంకల్పాలకు మానవుని దుష్టత్వం సహాయపడేలా చేయడానికున్న గొప్ప ఏర్పాటు పథకమన్నట్లుగా, ప్రస్తుత పరిస్థితులను నేను తప్పనిసరిగా వెనుదిరిగి తలపోయవలసి వస్తుంది.”—పీటర్‌ పార్కర్‌, కాంగ్రిగేషనలిస్ట్‌ మిషనరీ.

మరో కాంగ్రిగేషనలిస్ట్‌ మిషనరీ, సామ్యేల్‌ డబ్ల్యు. విలియమ్స్‌, యింకా యిలా అన్నాడు: “అన్ని సంభవములలో దేవుని హస్తం అద్భుతరీతిలో స్పష్టంగా కనబడుతోంది, భూమిమీదికి ఖడ్గమును రప్పింతునని చెప్పినవాడు తన శత్రువులను త్వరితగతిని నాశనం చేయడానికి, తన రాజ్యాన్ని స్థాపించడానికి యిక్కడికి వచ్చాడన్న విషయాన్ని మనం సంశయించకూడదు. ఆయన సమాధానకర్తను స్థాపించేంతవరకు ఆయన దాన్ని పడద్రోస్తాడు పడద్రోస్తాడు.”

చైనా జాతీయులను అమానుషంగా హత్యచేయడాన్ని గూర్చి మిషనరీ జె. లూయిస్‌ షుక్‌ యిలా రాశాడు: “అటువంటి దృశ్యాలను నేను . . . దైవసత్యాన్ని అడ్డగించే చెత్తను తీసివేయడానికి ప్రభువు నేరుగా ఉపయోగించే ఉపకరణాలుగా పరిగణిస్తాను.”

కాంగ్రిగేషనలిస్ట్‌ మిషనరీ ఎలైజా సి. బ్రిడ్జిమ్యాన్‌ యింకా యిలా అన్నాడు: “దేవుడు తన రాజ్యానికి మార్గం సిద్ధపరచడానికి ఆయన తరచూ ప్రజాశక్తియొక్క బలమైన హస్తాన్ని ఉపయోగిస్తునే ఉన్నాడు . . . ఈ మహాగొప్ప క్షణాల్లో ఉపయోగించబడేది మానవుడు; నడిపించే శక్తి దైవం. సమస్త జనముల ఉన్నతాధికారి చైనాను దండించి, తగ్గించడానికి బ్రిటన్‌ను ఉపయోగించుకున్నాడు.”—ది మిషనరీ ఎన్‌టర్‌ప్రైజ్‌ ఇన్‌ చైనా అండ్‌ అమెరికా (జాన్‌ కె. ఫెయిర్‌బ్యాంక్‌ సంపాదకీయం చేసిన హార్‌వార్డ్‌ అధ్యయనం) లో ప్రచురితమైన స్టార్ట్‌ క్రేగ్‌టన్‌ మిల్లర్‌ 1974 లో రచించిన “ఎండ్స్‌ అండ్‌ మీన్స్‌” అనే వ్యాసంనుండి పైన తెలుపబడినవి తీసుకొనబడ్డాయి.

[264వ పేజీలోని బాక్సు]

“వర్తకులు . . . ధనవంతులైరి”

“పందొమ్మిది వందల ఇరవైతొమ్మిదికి రెండో ప్రపంచ యుద్ధకాలానికి మధ్యలో [బర్నాడినో] నొగార [వాటికన్‌ ఆర్థికశాఖాధిపతి] వాటికన్‌ ధనాన్ని, వాటికన్‌ ప్రతినిధులను ఇటలీయొక్క ఆర్థికరంగం కొరకు—ముఖ్యంగా విద్యుత్‌శక్తి, టెలిఫోన్‌ సమాచారాలు, రుణము, బ్యాంకింగ్‌ వ్యవస్థ, చిన్న రైలుమార్గాలు, వ్యవసాయరంగానికి సంబంధించిన పనిముట్ల తయారీని, సిమెంటు మరియు వస్త్రాలకుపయోగించే కృత్రిమ దారాన్ని తయారు చేయడానికి కృషిచేయాలన్నాడు. ఈ పథకాలలో అనేకం విఫలమయ్యాయి.

“నొగార లా సొసైట ఇటాలియానా టెల్లా విస్కోసా, లా సూపర్‌ టెస్సిలి, లా సొసైట మెరిడియోనలె ఇండస్ట్రి టెస్సిలి, మరియు లా సిసారియాన్‌తో సహా అనేక కంపెనీలను హస్తగతం చేసుకున్నాడు. వీటన్నిటిని కలిపి ఒకే కంపెనీగాచేసి దానికాయన సిసా-విస్కోసా అనే పేరుపెట్టి, దాన్ని వాటికన్‌లోని సామాన్యుడు, అత్యంత విశ్వాసపాత్రులలో ఒకరైన బేరన్‌ ఫ్రాన్‌సిస్కో మేరియా ఒడాస్సో ఆధ్వర్యాన ఉంచాడు. తర్వాత నొగార యీ క్రొత్త కంపెనీని ఇటలీలోని యస్‌యన్‌ఐఎ-విస్కోసా అనే అత్యంత పెద్ద వస్త్రాల తయారీ కంపెనీలో విలీనం చేశాడు. చివరకు యస్‌యన్‌ఐఎ-విస్కోసా లో వాటికన్‌ ఆసక్తి పెరిగి పెరిగి, సకాలంలో వాటికన్‌ దాన్ని స్వాధీనం చేసుకుంది—దీనికి సాక్ష్యమేమంటే బేరన్‌ ఒడాస్సో దానికి ఉపాధ్యక్షుడయ్యాడు.

“ఆవిధంగా నొగార జౌళి వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఇతర పరిశ్రమలను యితర విధాలుగా విస్తరించాడు, ఎందుకంటే నొగార ఎంతో యుక్తిపరుడు. ఈ నిస్వార్థపరుడు . . . ఏ యితర వ్యక్తికన్నా బహుశ యితడే ఇటలీ చరిత్రలో ఏ ఒక్క వ్యాపారికన్నా ఎక్కువ ఇటలీ ఆర్థికరంగానికి జీవంపోయడంలో కృషిచేశాడు . . . బెనిటో ముస్సోలినీ తాను కలలుగన్న సామ్రాజ్యం విషయంలో ఏమీ సాధించలేక పోయాడు, గానీ మరో రకమైన అధికారాన్ని సృష్టించడానికి వాటికన్‌కు బెర్నాడినోకు వీలుకల్పించాడు.”—వాటికన్‌ అంపైర్‌, బై నినో లో బెల్లో, పుటలు 71-3.

ఈలోక వర్తకులకు మహాబబులోనుకు మధ్యగల సన్నిహిత సంబంధానికి యిదొక ఉదాహరణ మాత్రమే. ఈ వర్తకులు తమ భాగస్వామి లేనప్పుడు దాన్నిగూర్చి దుఃఖించడంలో ఆశ్చర్యంలేదు!

[259వ పేజీలోని చిత్రం]

మానవులు భూమియంతటా చెదరిపోయినప్పుడు వారు తమవెంట బబులోను సంబంధమైన మతాన్ని తీసుకొని వెళ్లారు

[261వ పేజీలోని చిత్రం]

యోహాను తరగతి, కావలివానివలె, మహాబబులోను కూలిపోయిందని ప్రకటిస్తున్నారు

[266వ పేజీలోని చిత్రం]

ప్రాచీన బబులోను శిథిలాలు మహాబబులోనుకు రాబోయే నాశనానికి సూచనగా ఉన్నాయి