కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన మరియు మీరు

ప్రకటన మరియు మీరు

అధ్యాయం 44

ప్రకటన మరియు మీరు

1. (ఎ) ప్రకటనలోని గొప్ప వాగ్దానాలన్నింటిని గూర్చి దూత యోహానుకు ఏ అభయమిస్తున్నాడు? (బి) “నేను త్వరగా వచ్చుచున్నాను” అని చెబుతున్న దెవరు, ఈ “వచ్చుచున్నాను” అనేది ఎప్పుడొస్తుంది?

నూతన యెరూషలేమును గూర్చిన ఆహ్లాదకరమైన వర్ణన చదువుతూవుంటే, మీరిలా అడగడానికి పురికొల్పబడవచ్చు: ‘అలాంటి ఆశ్చర్యకరమైనదేదో ఒకటి నిజంగా సంభవించగలదా?’ దూత చెప్పిన తదుపరి మాటల్ని తెలియజేస్తూ యోహాను ఆ ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు: “మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను—ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, (యెహోవా NW) త్వరలో సంభవింపవలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు.” (ప్రకటన 22:6, 7) ప్రకటనలోని అద్భుతమైన వాగ్దానాలన్నీ నిజంగా నెరవేరుతాయి. యేసు పేరున మాట్లాడుతూ దూత, యేసు “త్వరలో” వస్తున్నాడని చెబుతున్నాడు. ఇది యెహోవా విరోధులను నాశనం చేయడానికి, ప్రకటనకు మహత్తరమైన, సంతోషకరమగు ముగింపును తేవడానికి యేసు “దొంగవలె” వచ్చేదై వుంటుంది. (ప్రకటన 16:15, 16) గనుక మనమా సమయంలో ధన్యులమని పిలువబడునట్లు, మనం యీ ప్రకటన “గ్రంథము”లోని వాక్యముల కనుగుణంగా మన జీవితాలను మలుచుకుందాము.

2. (ఎ) ప్రకటన యొక్క ఔన్నత్యానికి యోహాను ఎలా స్పందించాడు, దూత ఆయనకు ఏమని చెబుతున్నాడు? (బి) “వద్దు సుమీ”, “దేవునికే నమస్కారము చేయుమని” దూత చెప్పిన మాటలనుండి మనమేమి నేర్చుకుంటాము?

2 అటువంటి ప్రకటన ఔన్నత్యాన్నిబట్టి, యోహాను అత్యానందభరితుడై యుండొచ్చుననుట గ్రహించదగిందే: “యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు—వద్దుసుమీ. నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.” (ప్రకటన 22:8, 9; ప్రకటన 19:10 పోల్చండి.) నిజానికి కొందరు దూతల నారాధించడమో లేక దూతలనుండి ప్రత్యేక ప్రకటనలను పొందుతున్నట్లు చెప్పుకోవడమో జరుగుతున్న ఆనాడు, దూతలను ఆరాధించకూడదని రెండు పర్యాయాలు చెప్పడం యోహాను కాలంలో యుక్తమే. (1 కొరింథీయులు 13:1; గలతీయులు 1:8; కొలొస్సయులు 2:18) మనం దేవున్ని మాత్రమే ఆరాధించాలనే వాస్తవాన్ని యీనాడది నొక్కితెల్పుతుంది. (మత్తయి 4:10) మనం ఏ యితర వ్యక్తి లేక మరిదేని ఆరాధనతోనైనా, పవిత్రారాధనను అపవిత్రం చేయకూడదు.—యెషయా 42:5, 8.

3, 4. దూత యోహానుకు ఏమి చెబుతూనే ఉన్నాడు, అభిషక్త శేషము ఆయన మాటలనెలా లక్ష్యపెట్టియున్నారు?

3 యోహాను యిలా కొనసాగిస్తున్నాడు: “మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను—ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది; అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగానే యుండనిమ్ము.”—ప్రకటన 22:10, 11.

4 ఈనాడున్న అభిషక్తశేషము దూత మాటలకు విధేయులైయున్నారు. వారు ప్రవచన వాక్యములకు ముద్రవేయలేదు. అవును, జాయన్స్‌ వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెజెన్స్‌ దాని ప్రథమ సంచికలోనే (జూలై 1879) ప్రకటనలోని అనేక వచనాలపై వ్యాఖ్యానాలను ప్రచురించింది. మనం మొదటి అధ్యాయంలో గమనించిన రీతిగా, వాచ్‌టవర్‌ సొసైటి గత కొద్దిసంవత్సరాలుగా ప్రకటనపై వివరణలతో కూడిన యితర పుస్తకాలను ప్రచురించింది. మరల యిప్పుడు సత్యాన్ని ప్రేమించేవారంతా ప్రకటనలోని శక్తివంతమైన ప్రవచనాలవైపు మరియు వాటి నెరవేర్పువైపు వారి అవధానాన్ని మేము మళ్లిస్తున్నాము.

5. (ఎ) ప్రజలు ప్రకటనలోని హెచ్చరికలను సలహాలను లక్ష్యపెట్టకపోతే ఏమౌతుంది? (బి) సాత్వీకులు, నీతిమంతుల స్పందనెలా ఉండాలి?

5 ప్రజలొకవేళ ప్రకటనలోని హెచ్చరికలను సలహాను లక్ష్యపెట్టకపోతే పోనివ్వండి! “అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము.” అదే వారిష్టమైతే, యీ అవినీతి లోకంలోని బురదగుంటలో పొర్లాడే వారు అందులోనే చస్తారు. త్వరలో మహాబబులోనును నాశనం చేయడంతో ప్రారంభమై యెహోవా తీర్పులు సంపూర్తిచేయబడతాయి. సాత్వికులు ప్రవక్త పలికిన యీ మాటల్ని లక్ష్యపెట్టడంలో పట్టుదల చూపనివ్వండి: “యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.” (జెఫన్యా 2:3) ఇప్పటికే యెహోవాకు సమర్పించుకున్న వారి విషయమైతే, “నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము.” పాపంవల్లకలిగే తాత్కాలిక సుఖాన్ని నీతిని పరిశుద్ధతను పాటించే వారనుభవించే శాశ్వత దీవెనలతో పోల్చలేమని జ్ఞానులకు తెలుసు. బైబిలిలా చెబుతోంది: “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.” (2 కొరింథీయులు 13:5) మీరు ఎంచుకొని నిలిచియుండే మీ ప్రవర్తనపై ఆధారపడే మీకు బహుమానం లభిస్తుంది.—కీర్తన 19:9-11; 58:10, 11.

6. యెహోవా ప్రవచనంలో చివరిసారిగా, ప్రకటన పాఠకుల నుద్దేశించి ఏమని చెబుతున్నాడు?

6 యుగాలకు రాజైన యెహోవా, ప్రవచనంలో చివరిసారిగా ప్రకటన పాఠకులనుద్దేశించి యిలా చెబుతున్నాడు: “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై యున్నాను. జీవవృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు, తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.”—ప్రకటన 22:12-15.

7. (ఎ) యెహోవా ఎందుకు “త్వరలో” వస్తున్నాడు? (బి) క్రైస్తవమత సామ్రాజ్య మతగురువులకు నూతన యెరూషలేములో ఎందుకు భాగం ఉండదు?

7 యెహోవా తన సర్వాధిపత్యాన్ని, తాను ఆరంభించిన దాన్ని తుదకు తానే నెరవేరుస్తాడనే వాస్తవాన్ని మరల నొక్కితెల్పుతున్నాడు. తీర్పుతీర్చడానికి, ఆయనను వెదకే వారికి తగిన ప్రతిఫలమివ్వడానికి ఆయన “త్వరలో” వస్తున్నాడు. (హెబ్రీయులు 11:6) ఎవరు తగిన ప్రతిఫలం పొందుతారు, ఎవరు తిరస్కరించబడతారనే విషయాన్ని ఆయన నియమాలే నిర్ణయిస్తాయి. యెహోవా యిక్కడ వర్ణిస్తున్న అవినీతి క్రియలను క్రైస్తవమత సామ్రాజ్యపు మతగురువులు హేళన చేస్తూ “మూగకుక్కల” మాదిరి ప్రవర్తించారు. (యెషయా 56:10-12; ద్వితీయోపదేశకాండము 23:18 న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ రిఫరెన్సు బైబిలు అథఃస్సూచి కూడ చూడండి.) నిశ్చయంగా వారు అబద్ధ సిద్ధాంతాలను, సూత్రాలను ‘యిష్టపడుతూ అనుసరిస్తూ’ ఉన్నారు, మరియు యేసు యేడు సంఘాలకిచ్చిన సలహాను పూర్తిగా తిరస్కరించారు. అందుచేత వారికి నూతన యెరూషలేములో భాగంలేదు.

8. (ఎ) ఎవరు మాత్రమే “జీవవృక్షముల” దగ్గరికి పోతారు, దీనర్థమేమిటి? (బి) గొప్ప సమూహము ఎలా “తమ వస్త్రములను ఉదుకుకొనియున్నారు,” మరియు వారెలా పరిశుభ్రమైన స్థానాన్ని కాపాడుకోగలరు?

8 యెహోవా దృష్టిలో నీతిమంతులుగా కనబడు నిమిత్తం నిజంగా “తమ వస్త్రములను ఉదుకుకొనిన” అభిషక్త క్రైస్తవులు మాత్రమే “జీవవృక్షముల” దరిచేరే ఆధిక్యతను కల్గివుంటారు. అంటే వారు పరలోకంలో అమర్త్యమైన జీవపు హక్కును, అర్హతను పొందుతారు. (ఆదికాండము 3:22-24; ప్రకటన 2:7; 3:4, 5 పోల్చండి.) వారు మానవులుగా మరణించిన తర్వాత పునరుత్థానం ద్వారా నూతన యెరూషలేములో ప్రవేశిస్తారు. ఆ 12 మంది దూతలు వారిని అనుమతిస్తారు, గాని పరలోక నిరీక్షణ వుందని చెప్పుకుంటూ అబద్ధాలాడుతూ అపవిత్ర క్రియలు చేసేవారిని బయటనే ఉంచుతారు. భూమ్మీదనున్న గొప్పసమూహము కూడ “గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసికొనిరి” మరి వారు తమ పవిత్రమైన స్థానాన్ని కాపాడుకోవాలి. యెహోవా యిక్కడ హెచ్చరించిన అవినీతి క్రియలను వారు విసర్జించి, యేసు యేడు సంఘాలకిచ్చిన సలహానుకూడ హృదయంలోనికి తీసుకొనడం ద్వారా వారలా కాపాడుకోగలరు.—ప్రకటన 7:14; 2, 3, అధ్యాయాలు.

9. యేసు ఏ మాటలు చెబుతున్నాడు, ఆయన వర్తమానము, ప్రకటనంతా ప్రథమంగా ఎవరినుద్దేశించి తెల్పబడింది?

9 యెహోవా తర్వాత యేసు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకటనను చదివే సహృదయులను ప్రోత్సహించడానికి యిలా చెబుతున్నాడు: “సంఘములకోసరము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను.” (ప్రకటన 22:16) అవును, ఈ మాటలు ప్రాముఖ్యంగా “సంఘముల కోసరము” యివ్వబడ్డాయి. ప్రథమంగా ఈ సమాచారం భూమ్మీదనున్న అభిషక్త క్రైస్తవుల సంఘం కొరకే యివ్వబడింది. ప్రకటనలోని ప్రతీది ప్రధానంగా నూతన యెరూషలేమును స్వతంత్రించుకునే అభిషక్త క్రైస్తవులనుద్దేశించి వ్రాయబడింది. ఆ సంఘంద్వారా గొప్పసమూహము యీ ప్రశస్తమైన ప్రవచనార్థక సత్యాలను గ్రహించే ఆధిక్యతనుకూడ పొందుతున్నది.—యోహాను 17:18-21.

10. యేసు తనను తాను (ఎ) “దావీదు వేరు, చిగురు” అని (బి) “ప్రకాశమానమైన వేకువ చుక్క” అని ఎందుకు చెప్పుకున్నాడు?

10 యోహానుకు ఆయన ద్వారా సంఘాలకు ప్రకటనను అందించే బాధ్యత యేసుక్రీస్తుకు అప్పగించబడింది. యేసు “దావీదు వేరు, చిగురు” రెండును అయివున్నాడు. ఆయన శరీరమునుబట్టి దావీదు వంశంలోనుండి వచ్చాడు గనుక యెహోవా రాజ్యానికి రాజయ్యే అర్హతపొందాడు. ఆయన దావీదుకు “నిత్యుడగు తండ్రి” కూడ అవుతాడు, ఆవిధంగా దావీదు “వేరు” అవుతాడు. (యెషయా 9:6; 11:1, 10) యెహోవా దావీదుకు చేసిన ప్రమాణం నెరవేర్పు ప్రకారం, ఆయన దావీదు వంశంలో శాశ్వతమైన అమర్త్యమగు రాజు, మరియు మోషే కాలంలో ప్రవచింపబడిన ‘ప్రకాశమానమైన వేకువ చుక్కయై’యున్నాడు. (సంఖ్యాకాండము 24:17; కీర్తన 89:34-37) ఆయన పగటిని కలుగజేయడానికి తెల్లవారేవేళవచ్చే “వేకువచుక్క.” (2 పేతురు 1:19) గొప్ప విరోధియగు మహాబబులోను దుష్క్రియలన్నీ యీ మహనీయమైన అరుణోదయాన్ని ఆపలేకపోయాయి.

“రమ్ము!” అని చెప్పవలెను

11. యోహానిప్పుడు ఏ బహిరంగ ఆహ్వానాన్నిస్తున్నాడు, మరి దానికెవరు స్పందిస్తారు?

11 ఇప్పుడు యోహాను మాట్లాడే తరుణం వచ్చింది. తాను వినిన, కనిన సంగతుల యెడల హృదయపూర్వక అభినందనతో పొంగిపోతూ ఆయన యిలా అంటున్నాడు: “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) యేసు విమోచనా బలి విలువలు 1,44,000 మందికే పరిమితంకాదు, ఎందుకంటే యిక్కడే బహిరంగ ఆహ్వానమున్నది. సమాచారం ఎంతో స్పష్టంగా యిలా ప్రకటించబడేలా యెహోవా ఆత్మ పెండ్లికుమార్తె తరగతి ద్వారా పనిచేస్తుంది: “జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (యెషయా 55:1; 59:21 కూడ చూడండి.) నీతికొరకు దప్పికగొనువారెవరైనా “రమ్ము” అనే ఆహ్వానాన్ని పొందుతున్నారు, దాన్ని యెహోవానుండి సమృద్ధిగా పొందుతున్నారు. (మత్తయి 5:3, 6) అభిషక్త యోహాను తరగతి యిచ్చే యీ ఆహ్వానానికి ప్రతిస్పందించే బావి భూతరగతి వారందరూ ఎంతటి ఆధిక్యతను కల్గియున్నారోగదా!

12. ప్రకటన 22:17 లోని ఆహ్వానానికి గొప్పసమూహము ఎలా స్పందిస్తుంది?

12 పెరుగుతున్న గొప్పసమూహము 1930వ దశాబ్దంనుండి ఆ ఆహ్వానాన్ని “విను”చూ—అవధానమిస్తున్నారు. వారి తోటి అభిషక్త దాసులవలెనే, వారు యెహోవా యెదుట నిర్మలమైన స్థానాన్ని కల్గియున్నారు. నూతన యెరూషలేము మానవజాతికి దీవెన లందించడానికి దివినుండి భువికి దిగివచ్చే సమయంకొరకు వారెదురు చూస్తున్నారు. ప్రకటన యొక్క ప్రభావశీలమైన వర్తమానాన్ని వినిన గొప్పసమూహము “రమ్ము” అని చెప్పడమేగాక, యితరులను యెహోవా సంస్థకు నడిపిస్తూ, వారుకూడ, “దప్పిగొనిన వానిని రానిమ్ము” అని చెప్పునట్లు వారికి తర్ఫీదునిస్తున్నారు. అందుకే గొప్పసమూహపు సంఖ్య పెరుగుతూ వస్తూంది, అభిషక్తులైన 8,700 కంటె కొంచెం తక్కువగానున్న పెండ్లికుమార్తె తరగతితో కలిసి లోకమంతటా 230 కంటె ఎక్కువ దేశాల్లో 44 లక్షలకంటె ఎక్కువమంది “జీవజలములను ఉచితముగా పుచ్చుకొను”డనే ఆహ్వానాన్ని అందిస్తున్నారు.

13. యేసు ఏ హెచ్చరిక చేస్తున్నాడు?

13 తర్వాత, మరల యేసు మాట్లాడుతూ యిలా చెబుతున్నాడు: “ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా—ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములోవ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలులేకుండ చేయును.”—ప్రకటన 22:18, 19.

14. యోహాను తరగతి ప్రకటనలోని “ప్రవచన వాక్యములను” ఎలా దృష్టిస్తుంది?

14 యోహాను తరగతి ప్రకటనయొక్క “ప్రవచనవాక్యముల” వైపు అవధానాన్ని మళ్లించాలి. వారు దాన్ని దాచకూడదు లేక దానికి కలుపకూడదు. దాని వర్తమానాన్ని బహిరంగంగాను, “మేడలమీదను” ప్రకటించాలి. (మత్తయి 10:27) ప్రకటన దైవప్రేరేపితం. దేవుడే స్వయంగా చెప్పినదాన్ని, యిప్పుడు రాజ్యపాలనచేస్తున్న రాజైన యేసుక్రీస్తు ద్వారా యిచ్చిన వాక్యాన్ని మార్చగల ధైర్యమెవరికున్నది? అలా మార్చేవాడు జీవాన్వేషణను జారవిడుచుకొని, మహాబబులోను, మరియు ప్రపంచమంతటికి రాబోయే తెగుళ్లను అనుభవిస్తాడు.

15. ఆయన “ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు” మరియు “నేను త్వరగా వచ్చుచున్నాను” అని యేసు పలికిన మాటల ప్రాముఖ్యతేమిటి?

15 యేసు యిప్పుడు ప్రోత్సాహకరమైన చివరి మాటను చేర్చుతున్నాడు: “ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు—అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు.” (ప్రకటన 22:20ఎ) యేసు “నమ్మకమైన సత్యసాక్షి.” (ప్రకటన 3:14) ఆయన ప్రకటనలోని దర్శనాలకు సాక్షియైతే అవి తప్పక సత్యమైనవై యుండాలి. ఆయన, యెహోవా దేవుడు, వీరిద్దరూ తాము “త్వరగా” లేక వెంటనే వస్తున్నామన్న వాస్తవాన్ని నొక్కిచెబుతున్నారు, యిక్కడ యేసు ఐదోసారి అలా అంటున్నాడు. (ప్రకటన 2:16; 3:11; 22:7, 12, 20) మహావేశ్యకు, రాజకీయ “రాజులకు” మరియు “మన ప్రభువు [యెహోవా] రాజ్యమును ఆయన క్రీస్తురాజ్యమును” ఎదిరించే వారందరికి తీర్పుతీర్చడానికి “వచ్చుచున్నారు”—ప్రకటన 11:15; 16:14, 16; 17:1, 12-14.

16. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు త్వరగా వస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నవారై మీరెలాంటి గట్టిచర్య గైకొనాలి?

16 యెహోవా దేవుడు, యేసుక్రీస్తు త్వరగా వస్తున్నారని మీరు తెలుసుకున్న విషయం మీరు ‘యెహోవా దినపు రాకడకొరకు కనిపెట్టులాగున’ అది మిమ్మల్ని పురికొల్పాలి. (2 పేతురు 3:12) భూమియనే సాతాను విధానము స్థిరంగా ఉన్నట్లు కనబడడం కల్పనయే. సాతాను క్రిందనున్న ఆకాశమనబడే లోకపరిపాలకులు సాధించే విజయమేదైనా ఉంటే అది మాయే. ఇవన్నీ గతించిపోతున్నాయి. (ప్రకటన 21:1) శాశ్వతమైనవేవైనా యెహోవాయందు, యేసుక్రీస్తు పాలించే ఆయన రాజ్యంలో, ఆయన వాగ్దానం చేసిన నూతనలోకంలో మాత్రమే లభిస్తాయి. ఆ నిరీక్షణను ఎన్నటికీ జారవిడుచుకోకండి!—1 యోహాను 2:15-17.

17. యెహోవా పరిశుద్ధత యెడల మీకున్న అభినందన మీపై ఎలా ప్రభావం చూపాలి?

17 గనుక, మీరు ప్రకటన గ్రంథంనుండి నేర్చుకున్నదానిని మీ జీవితంపై గట్టి ప్రభావం చూపనివ్వండి. మీరు చూచిన యెహోవా పరలోక ప్రత్యక్షతయొక్క ఊహాచిత్రం, మన సృష్టికర్త అమోఘమైన మహిమ, పరిశుద్ధత విషయంలో మీమీద ప్రభావం చూపలేదా? (ప్రకటన 4:1–5:14) అటువంటి దేవున్ని ఆరాధించడమెంత ఆధిక్యత! ఆయన పరిశుద్ధత యెడల మీకున్న మెప్పు యేసు యేడు సంఘాలకిచ్చిన సలహాను గంభీరంగా తీసుకొనేలా చేయనివ్వండి, మరియు ధనాపేక్ష, విగ్రహారాధన, అవినీతి, నులివెచ్చనితనం, మతభ్రష్టత్వపు విమతములను లేక మీ సేవ యెహోవాకు అనంగీకారమగునట్లు చేసేదేనినైనా విసర్జించండి. (ప్రకటన 2:1–3:22) అపొస్తలుడైన పేతురు యోహాను తరగతికి చెప్పిన మాటలు సూత్రప్రాయంగా గొప్పసమూహానికి కూడ వర్తిస్తాయి: “మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.”—1 పేతురు 1:15, 16.

18. మీరు దేనిలో వీలైనంతవరకు భాగం వహించాలి, ఈ పని యీనాడెందుకంత అత్యవసరమై యున్నది?

18 అంతేగాక, మీరు “యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును” ప్రకటించునపుడు మీకు సరికొత్త ఉత్తేజం రావాలి. (యెషయా 35:4; 61:2) మీరు చిన్నమందకు చెందినా, గొప్పసమూహానికి చెందినా, యెహోవా కోపమనే ఏడు ఉగ్రతాపాత్రలను కుమ్మరించడంలోనూ, సాతాను లోకానికి దేవుని తీర్పులను ప్రకటించడంలోనూ వీలైనంతవరకు మీరు పూర్తిభాగాన్ని కల్గియుండాలి. అదే సమయంలో స్థాపించబడిన యెహోవా మరియు యేసుక్రీస్తుయొక్క రాజ్యాన్నిగూర్చిన నిత్యసువార్తను ఆనందంగా ప్రకటించడంలో మీ గళమెత్తండి. (ప్రకటన 11:15; 14:6, 7) దీన్ని అత్యవసరంగా ప్రకటించండి. మనం ప్రభువు దినములో ఉన్నామనే విషయం, యింకా యెహోవాను ఆరాధించనివారు సువార్త ప్రకటించే పనిలో పాల్గొనేలా అనేకులను కదలించనివ్వండి. వీరుకూడ బాప్తిస్మమును దృష్టియందుంచుకొని వారి జీవితాలను దేవునికి సమర్పించుకొనేలా అభివృద్ధి చెందనివ్వండి. జ్ఞాపకముంచుకొనండి, “సమయము సమీపించినది”!—ప్రకటన 1:3.

19. వృద్ధుడైన అపొస్తలుడగు యోహాను ముగింపు మాటలేమిటి, మీరు వాటికెలా స్పందిస్తారు?

19 అలా యోహానుతో కలిసి మనమిలా అమితాసక్తితో ప్రార్థిస్తాం: “ఆమెన్‌ ప్రభువైన యేసూ, రమ్ము.” మరియు వృద్ధ అపొస్తలుడైన యోహాను యింకనూ యిలా చెబుతున్నాడు: “ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్‌.” (ప్రకటన 22:20బి, 21) ఈ పుస్తకాన్ని చదివే మీ విషయంలోనూ అదే సత్యమౌనుగాక. మీరు మాతోకలిసి హృదయపూర్వకంగా “ఆమేన్‌!” అని చెప్పేలాగున, ప్రకటన దివ్యమైన ముగింపు సమీపించింది, అనే విశ్వాసం మీరు కల్గియుండండి.

[అధ్యయన ప్రశ్నలు]

[314వ పేజీలోని చిత్రం]

“కుక్కలు  . . .  వెలుపటనుందురు”

[315వ పేజీలోని చిత్రం]

“గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించు  . . . వారు ధన్యులు”