యోహానుకు ఇచ్చిన ప్రకటన 3:1-22

  • సార్దీస్‌ (1-6), ఫిలదెల్ఫియ (7-13), ​లవొదికయ (14-22) సంఘాలకు సందేశాలు

3  “సార్దీస్‌లో ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: దేవుని ఏడు శక్తులు,+ ఏడు నక్షత్రాలు ఉన్నవాడు ఈ మాటలు చెప్తున్నాడు: ‘నీ పనులు నాకు తెలుసు, నువ్వు పేరుకే బ్రతికున్నావు గానీ నిజానికి నువ్వు చచ్చిపోయావు.+  కాబట్టి మేలుకో.+ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మిగతావాళ్లను* బలపర్చు. ఎందుకంటే, నువ్వు ఏ పని చేయాలని నా దేవుడు కోరుతున్నాడో దాన్ని నువ్వు పూర్తిచేయలేదు.*  కాబట్టి నువ్వు వేటిని పొందావో, వేటిని విన్నావో వాటిని గుర్తుచేసుకుంటూ పాటిస్తూ ఉండు, పశ్చాత్తాపపడు.+ ఒకవేళ నువ్వు మేలుకోకపోతే, నేను దొంగలా వస్తాను. నేను ఏ గంటలో నీ మీదికి వస్తానో నువ్వు అస్సలు తెలుసుకోలేవు.+  “ ‘అయితే, తమ వస్త్రాలు మురికి చేసుకోని కొందరు* సార్దీస్‌లో నీ మధ్య ఉన్నారు.+ వాళ్లు తెల్లని వస్త్రాలు వేసుకుని నాతో నడుస్తారు.+ ఈ గౌరవానికి వాళ్లు అర్హులు.  జయించే వ్యక్తి+ అలా తెల్లని వస్త్రాలు వేసుకుంటాడు.+ అతని పేరును నేను జీవగ్రంథంలో నుండి అస్సలు తుడిచేయను.+ బదులుగా, నా తండ్రి ముందు, ఆయన దూతల ముందు అతను నాకు తెలుసని* ఒప్పుకుంటాను.  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’  “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: పవిత్రుడు,+ ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు,+ దావీదు తాళంచెవి ఉన్నవాడు,+ ఎవరూ మూయకుండా తెరిచేవాడూ ఎవరూ తెరవకుండా మూసేవాడూ ఈ మాటలు చెప్తున్నాడు:  ‘నీ పనులు నాకు తెలుసు. ఇదిగో! నీ ముందు తలుపు తెరిచి ఉంచాను,+ దాన్ని ఎవరూ మూయలేరు. నీకు కనీసం కొంచెం బలం ఉందని, నువ్వు నా ఆజ్ఞల్ని పాటించావని, నాకు* నమ్మకంగా ఉన్నావని నాకు తెలుసు.  ఇదిగో! యూదులు కాకపోయినా యూదులమని చెప్పుకుంటూ అబద్ధాలాడే సాతాను గుంపుకు* చెందినవాళ్లు+ వచ్చి నీ కాళ్ల ముందు వంగి నమస్కరించేలా* చేస్తాను. నేను నిన్ను ప్రేమించానని వాళ్లు తెలుసుకునేలా చేస్తాను. 10  నా సహనం గురించి నువ్వు విన్నదాన్ని పాటించావు*+ కాబట్టి, భూమ్మీద ఉన్నవాళ్లను పరీక్షించడానికి భూమంతటి మీదికి రాబోతున్న పరీక్షా సమయంలో* నేను నిన్ను కాపాడతాను. 11  నేను త్వరగా వస్తున్నాను.+ నీ దగ్గర ఉన్నదాన్ని ఎప్పుడూ గట్టిగా పట్టుకో, అప్పుడు నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోరు.+ 12  “ ‘జయించే వ్యక్తిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తాను. అతను ఇక ఎప్పటికీ అక్కడి నుండి బయటికి వెళ్లడు. నేను అతని మీద నా దేవుని పేరును,+ నా దేవుని నగరం పేరును, అంటే పరలోకంలో నుండి నా దేవుని దగ్గర నుండి దిగివచ్చే కొత్త యెరూషలేము+ పేరును, అలాగే నా కొత్త పేరును రాస్తాను.+ 13  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’ 14  “లవొదికయలో+ ఉన్న సంఘ దూతకు ఇలా రాయి: ఆమేన్‌ అనే పేరున్నవాడు,+ నమ్మకమైన సత్యసాక్షి,+ దేవుని మొట్టమొదటి సృష్టి అయినవాడు+ ఈ మాటలు చెప్తున్నాడు: 15  ‘నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా లేవు. నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉంటే బావుండేది. 16  నువ్వు వేడిగా+ గానీ చల్లగా+ గానీ లేకుండా గోరువెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోట్లో నుండి ఊసివేయబోతున్నాను. 17  నువ్వు, “నేను ధనవంతుణ్ణి,+ ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు” అని చెప్పుకుంటున్నావు. కానీ నువ్వు దుర్భరమైన, దయనీయమైన స్థితిలో ఉన్నావని, పేదవాడివని, గుడ్డివాడివని, దిగంబరంగా ఉన్నావని నీకు తెలీదు. 18  కాబట్టి నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే, అగ్నిలో శుద్ధి చేసిన బంగారం నా దగ్గర కొనుక్కో; అప్పుడు నువ్వు ధనవంతుడివి అవుతావు. వేసుకోవడానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో; అప్పుడు, దిగంబరంగా ఉండడంవల్ల ఇతరుల ముందు సిగ్గుపడే పరిస్థితి నీకు రాదు. అలాగే నీ కళ్లకు రాసుకోవడానికి నా దగ్గర కాటుక కొనుక్కో;+ అప్పుడు నువ్వు చూడగలుగుతావు.+ 19  “ ‘నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను, వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను. కాబట్టి దేవుని సేవలో నీకు ఉత్సాహం ఉందని చూపించు, పశ్చాత్తాపపడు.+ 20  ఇదిగో! నేను తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే, నేను అతని ఇంట్లోకి వెళ్లి అతనితో కలిసి రాత్రి భోజనం చేస్తాను; అతను నాతో కలిసి భోజనం చేస్తాడు. 21  నేను జయించి, నా తండ్రితోపాటు ఆయన సింహాసనం మీద కూర్చున్నట్టే,+ జయించిన వ్యక్తిని+ నాతోపాటు నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.+ 22  సంఘాలకు పవిత్రశక్తి చెప్తున్న మాటల్ని చెవులు ఉన్నవాడు వినాలి.’ ”

అధస్సూచీలు

అక్ష., “మిగతావాటిని.”
లేదా “నా దేవుని ముందు నీ పనులు సంపూర్ణంగా లేవు.”
అక్ష., “కొన్ని పేర్లు.”
అక్ష., “అతని పేరును.”
అక్ష., “నా పేరుకు.”
లేదా “సాష్టాంగ నమస్కారం చేసేలా.”
అక్ష., “సమాజమందిరానికి.”
లేదా “సహనం విషయంలో నా ఆదర్శాన్ని పాటించావు” అయ్యుంటుంది.
అక్ష., “గంటలో.”