కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం ఆరంభమైంది!

దేవుని రాజ్యం ఆరంభమైంది!

అధ్యాయం 27

దేవుని రాజ్యం ఆరంభమైంది!

దర్శనము 7—ప్రకటన 12:1-17

అంశం: పరలోకపు స్త్రీ ప్రసవిస్తుంది, మిఖాయేలు సాతానుతో యుద్ధంచేసి అతన్ని భూమికి పడద్రోస్తాడు

నెరవేర్పు కాలం: క్రీస్తు యేసు 1914 లో సింహాసనమధిష్టించి నప్పటినుండి మహాశ్రమలవరకు

1. ప్రకటన 12 నుండి 14 అధ్యాయాలలో వర్ణించబడిన సూచనలను అర్థంచేసికొనుట మనకెలాగు సహాయపడుతుంది?

దేవుని పరిశుద్ధ మర్మం విప్పబడింది. (ప్రకటన 10:7) తన మెస్సీయ ద్వారా పాలించే యెహోవా రాజ్యం యిప్పుడు బలమైన వాస్తవం. అది పరిపాలిస్తుంది! దాని ప్రత్యక్షత సాతానుకు అతని సంతానానికి నాశనాన్ని తెస్తుంది, దేవుని పరలోక సంస్థయొక్క సంతానానికి మహిమాన్విత విజయాన్నిస్తుంది. అయినా, ఏడవ దూత తన బూర ఊదడాన్నింకా ముగించలేదు, ఎందుకంటే, ఆయన మనకు మూడవ శ్రమను గూర్చి బయల్పర్చ వలసింది యింకెంతో ఉంది. (ప్రకటన 11:14) ప్రకటన 12 నుండి 14 వరకున్న అధ్యాయాలు ఆ శ్రమలో యిమిడియున్న దానియంతటి యెడల మనకున్న అభినందనను పెంచుకోవడానికి, దేవుని పరిశుద్ధ మర్మమును సంపూర్తి చేయడానికి మనకు సహాయపడతాయి.

2. (ఎ) యోహాను ఏ గొప్ప సూచనను చూస్తున్నాడు? (బి) ఆ గొప్ప సూచన అర్థమెప్పుడు బయలుపర్చబడింది?

2 యోహాను ఒక గొప్ప సూచనను—దేవుని ప్రజలకు విశేషాసక్తిని కల్గించేదాన్ని చూస్తున్నాడు. అది పులకరింపజేసే ప్రవచనార్థక దర్శనాన్ని పరిచయం చేస్తుంది, దీని భావాన్నిగూర్చి మొదట ది వాచ్‌టవర్‌, మార్చి 1, 1925 సంచికలో “బర్త్‌ ఆఫ్‌ ది నేషన్‌” అనే శీర్షికలోను, ఆ పిదప 1926 లో డెలివరెన్స్‌ అనే పుస్తకంలోను ప్రచురించబడింది. బైబిలు అర్థాలను గూర్చిన గ్రహింపుకు సంబంధించిన తేజస్సు, యెహోవా సేవాభివృద్ధికి చారిత్రాత్మక గుర్తింపు నిచ్చింది. గనుక అది బయల్పరచ బడుతుండగా దాన్నిగూర్చి యోహానును వివరించనీయండి: “అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలువేయుచుండెను.”—ప్రకటన 12:1, 2.

3. పరలోకమందు చూసిన స్త్రీ గుర్తింపేమిటి?

3 యోహాను మొదటిసారిగా పరలోకములో ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆమె నిజమైన స్త్రీ మాత్రం కాదు. అయితే ఆమె ఒక అలంకారిక లేక సూచనార్థకమైన స్త్రీ. (ప్రకటన 1:1) ఆమె దేనిని సూచిస్తుంది? ప్రేరేపిత ప్రవచనాలలో, స్త్రీలు కొన్నిసార్లు ప్రముఖులను “వివాహమాడిన” సంస్థలను సూచిస్తారు. హెబ్రీలేఖనాల్లో ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని భార్యగా సంబోధించబడ్డారు. (యిర్మీయా 3:14) గ్రీకు లేఖనాలలో, అభిషక్త క్రైస్తవసంఘం క్రీస్తుకు భార్యగా తెలుపబడింది. (ప్రకటన 21:9-14) యోహాను యిక్కడ చూసే స్త్రీ కూడ ఎవరికో వివాహం చేయబడిందే, ఆమె ప్రసవించనైయున్నది. ఆమె భర్త ఎవరు? తర్వాత ఆమె శిశువు “దేవుని యొద్దకును, ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.” (ప్రకటన 12:5) ఆలాగు యెహోవా ఆ శిశువును తన కుమారునిగా స్వీకరిస్తాడు. గనుక, యోహాను చూస్తున్న ఆ స్త్రీ యెహోవా సాదృశ్యమైన భార్యయై ఉంటుంది.

4. దేవుని సాదృశ్యమైన భార్య కుమారులెవరు, మరి అపొస్తలుడైన పౌలు యోహాను చూసిన స్త్రీని ఏమని పిలుస్తున్నాడు?

4 సుమారు ఎనిమిది శతాబ్దాలముందు, యెహోవా యీ సాదృశ్యమైన స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ యిలా అన్నాడు: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు.” (యెషయా 54:5, 13) యేసు యీ ప్రవచనాన్ని ఎత్తిచెబుతూ, యీ కుమారులంటే అభిషక్త క్రైస్తవ సంఘంగా పిదప తయారైన వీరే తన నమ్మకమైన అనుచరులని తెలిపాడు. (యోహాను 6:44, 45) కాబట్టి దేవుని కుమారులని పిలువబడుతున్న యీ సంఘ సభ్యులు, దేవుని అలంకారిక భార్యయొక్క సంతానం కూడ. (రోమీయులు 8:14) అపొస్తలుడైన పౌలు యిలా చెబుతూ తన చివరి సమాచారాన్ని జోడిస్తున్నాడు: “పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకు తల్లి.” (గలతీయులు 4:26) కావున, యోహాను చూసిన స్త్రీ “పైనున్న యెరూషలేము.”

5. యెహోవా యొక్క సాదృశ్యమైన భార్య 12 నక్షత్రాలను ధరించుకొని యున్నందువలన, పైనున్న యెరూషలేము వాస్తవానికి ఏమైయున్నది?

5 అయినా, అసలు పైనున్న యెరూషలేమంటే ఏమిటి? పౌలు దానిని “పైనున్న”దని అన్నందువల్లను, యోహాను దానిని పరలోకంలో ఉన్నట్లు చూస్తున్నందుననూ, అది స్పష్టంగా భూసంబంధమైంది కాదు; “నూతన యెరూషలేము” వంటిది కాదు, ఎందుకంటే ఆ సంస్థ క్రీస్తుకు పెండ్లికుమార్తే గాని యెహోవా భార్యకాదు. (ప్రకటన 21:2) ఆమె 12 నక్షత్రాలను ధరించుకొని వుందని గమనించండి. మరి 12 అనే సంఖ్య సంస్థీకరణా ఏర్పాటులో సంపూర్ణతను సూచిస్తుంది. * గనుక, పూర్వం యెరూషలేము భూమ్మీద ఎలా ఉండెనో అలాగే ఆమె పరలోకంలో ఒక సంస్థాపరమైన ఏర్పాటైవుందని యీ నక్షత్రాలు సూచిస్తున్నట్లున్నాయి. పైనున్న యెరూషలేము ఆయనను సేవించడంలోను సంతానోత్పత్తి చేయడంలోను ఆయన భార్యవంటి స్థానమందున్న ఆత్మీయప్రాణులతో కూడిన యెహోవా సార్వత్రిక సంస్థయైయున్నది.

6. (ఎ) యోహాను చూసిన స్త్రీ సూర్యున్ని ధరించుకొని, తన పాదములయొద్ద చంద్రున్ని కల్గి, నక్షత్రాల కిరీటం ధరించుకున్నదనే విషయం దేన్ని సూచిస్తుంది? (బి) ఆ గర్భిణీ స్త్రీ ప్రసవవేదనలు దేనికి సూచన?

6 ఈ స్త్రీ సూర్యున్ని ధరించుకొని తన పాదములదగ్గర చంద్రున్ని కల్గియుందని యోహాను చూస్తున్నాడు. ఆమెకున్న నక్షత్రాల కిరీటాన్ని కలిపిచూస్తే యిక ఆమె పూర్తిగా పరలోక జ్యోతులమధ్యనే ఉన్నట్లుంటుంది. యెహోవా మహిమాన్విత పరలోక సంస్థకు ఎంతచక్కని సూచనయైయున్నదో! ఆమె ప్రసవవేదన భరిస్తూ ఉన్న గర్భిణీ కూడ. బైబిల్లో, ప్రసవవేదనలు తరచూ ఒక ముఖ్యమైన ఫలితాన్ని సాధించడానికి చేసే కష్టాన్ని సూచిస్తాయి. (కీర్తన 90:2; సామెతలు 25:23; యెషయా 66:7, 8 పోల్చండి.) యెహోవా పరలోక సంస్థ యీ చారిత్రాత్మక పుట్టుకకు ఏర్పాటుచేస్తున్నప్పుడు నిశ్చయంగా యీ ప్రసవవేదనలు అనుభవించి యుండవచ్చును.

ఎఱ్ఱని మహాఘటసర్పం

7. యోహాను పరలోకంలో చూసే మరో సూచనేమిటి?

7 యోహాను తదుపరి ఏమి చూస్తున్నాడు? “అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పదికొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మ్రింగి వేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.”—ప్రకటన 12:3, 4.

8. (ఎ) ఎఱ్ఱని మహాఘటసర్పం గుర్తు ఏమిటి? (బి) ఆ ఘటసర్పానికి ఏడుతలలు, పదికొమ్ములు, ప్రతితలమీదనున్న కిరీటం దేన్ని సూచిస్తున్నాయి?

8 ఈ ఘటసర్పమే “ఆది సర్పమైన” సాతాను. (ప్రకటన 12:9; ఆదికాండము 3:15) అతడు క్రూరమైన వినాశకారి—ఏడుతలలుగల ఘటసర్పం, లేక తన ఎరను ఏమియు మిగల్చకుండా కబళించే విధ్వంసకుడు. అతడెంత వికృతంగా కనబడుతున్నాడోగదా! ఆ ఏడు తలలు పదికొమ్ములు యిక ప్రకటన 13వ అధ్యాయంలో వర్ణించబడనైయున్న రాజకీయ క్రూరమృగానికి అతడే నిర్మాణకుడని సూచిస్తున్నాయి. ఈ మృగానికి కూడ ఏడు తలలు పదికొమ్ములున్నాయి. సాతానుకు ప్రతిశిరస్సుపై ఒక కిరీటం—మొత్తం ఏడు—కల్గివున్నందున ఆ క్రూరమృగం ద్వారా సూచించబడుతున్న ప్రపంచ ఆధిపత్యాలు అతని అధీనమందున్నాయని మనం నిశ్చయత కల్గివుండగలం. (యోహాను 16:11) ఆ పదికొమ్ములు, అతడు యీ లోకంపై కల్గివున్న సంపూర్ణాధికారాన్ని సరిగ్గా సూచిస్తున్నాయి.

9. ఆ ఘటసర్పం తోక “ఆకాశనక్షత్రములలో మూడవభాగము నీడ్చి” భూమ్మీద పడవేసాడనే విషయం దేన్ని సూచిస్తుంది?

9 ఆ ఘటసర్పానికి ఆత్మీయ సామ్రాజ్యంలో కూడ అధికారముంది. అతడు తన తోకతో “నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి” వేస్తున్నాడు. నక్షత్రాలు దూతలకు సూచనగా చెప్పవచ్చు. (యోబు 38:7) “మూడవ భాగము” అనే సంఖ్య సాతాను చాలామంది దూతలను మోసగించాడని నొక్కితెల్పుతుంది. వీరొకసారి అతని అధీనం క్రిందకువచ్చారు గనుక వారిక తప్పించుకునే మార్గమేలేదు. వారు దేవుని పరిశుద్ధ సంస్థలోనికి వెళ్లలేకపోయారు. వారు వారి రాజు లేక పాలకుడైన సాతానుచేత యీడ్వబడినట్లుగా, దయ్యాలయ్యారు. (మత్తయి 12:24) సాతాను వారిని భూమ్మీదకు కూడ పడద్రోశాడు. ఇది జలప్రళయానికి ముందు అవిధేయులైన దేవుని కుమారులు భూమ్మీదకువచ్చి, మానవ కుమార్తెలతో సహజీవనం చేసేలా సాతాను వారిని పురికొల్పిన విషయాన్ని నిశ్చయంగా సూచిస్తుంది. దీనికి శిక్షగా యీ పాపము చేసిన ‘దూతలను’ దేవుడు టార్టారస్‌ అనే జైలులాంటి స్థితిలోనికి త్రోసివేశాడు.—ఆదికాండము 6:4; 2 పేతురు 2:4; యూదా 6.

10. ఏ పరస్పర విరుద్ధమైన సంస్థలు కనబడుతున్నాయి, మరి ఆ స్త్రీ ప్రసవించగానే ఘటసర్పం ఆ శిశువును మ్రింగాలని ఎందుకు ప్రయత్నిస్తాడు?

10 అలా, పరస్పర విరుద్ధమైన రెండుసంస్థలు—స్త్రీ సూచించే యెహోవా పరలోక సంస్థ, దేవుని సర్వాధిపత్యాన్ని సవాలుచేసే సాతాను దయ్యాలతోకూడిన సంస్థ రెండును స్పష్టపరచబడ్డాయి. సర్వాధిపత్యాన్ని గూర్చిన వివాదాంశము పరిష్కరించబడాలి. కానీ ఎలా? ఒక క్రూరమృగం తనకు ఎరకాబోయే దానికొరకు తీక్షణంగా దృష్టిసారించే విధంగానే, సాతాను యింకనూ దూతలను తనవైపుకు లాక్కుంటున్నాడు. ఆ స్త్రీ ప్రసవించాలని అతడెదురు చూస్తున్నాడు. పుట్టబోయే ఆ శిశువును మ్రింగివేయాలని అతడాశిస్తున్నాడు, ఎందుకంటే తన జీవితానికి, తాను పరిపాలించే ప్రపంచానికి తీరని ముప్పువస్తుందని అతనికి తెలుసు.—యోహాను 14:30.

కుమారుడు, మగశిశువు

11. ఆ స్త్రీ శిశువును ప్రసవించే విషయాన్ని యోహాను ఎలా వర్ణిస్తున్నాడు, మరి ఆ శిశువెందుకు ‘కుమారుడు, మగశిశువు’ అని పిలువబడ్డాడు?

11 దేవుని జోక్యం లేకుండ పరిపాలించే అన్యరాజుల పాలన 1914 లో అంతమైంది. (లూకా 21:24) ఇక ఆ స్త్రీ సరిగ్గా సమయానికి తన శిశువును ప్రసవిస్తుంది: “సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును (కుమారుని, ఒక మగశిశువును, NW.) ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.” (ప్రకటన 12:5, 6) ఆ శిశువు ‘ఒక కుమారుడు, మగశిశువు’ అని యోహాను ఎందుకు రెండు పదాలను ఉపయోగిస్తున్నాడు? శిశువు తగిన అధికారంతో జనములను పాలించే యోగ్యతను సామర్థ్యతను చూపించడానికే ఆయనలా అంటున్నాడు. ఈ పుట్టుక ఎంతటి ఆనందాన్ని, మధుర క్షణాల్ని తెస్తుందోకూడ అది నొక్కితెల్పుతుంది! దేవుని పరిశుద్ధ మర్మాన్ని సంపూర్తి గావించడంలో కూడ అది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇంతెందుకు, యీ మగశిశువు “జనములను ఇనుపదండముతో ఏలును”!

12. (ఎ) కీర్తనల్లో యెహోవా యేసునుగూర్చి ఏమని ప్రవచనార్థకంగా వాగ్దానం చేశాడు? (బి) “సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న” ఒక కుమారుని ఆమె కనడం దేన్ని సూచిస్తుంది?

12 మరైతే, అది పరిచయమున్న పదమేనా? అవును, యెహోవా యేసునుగూర్చి ప్రవచనార్థకంగా యిలా వాగ్దానం చేశాడు: “ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగులగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు.” (కీర్తన 2:9) ఆయనను గూర్చి యింకనూ యిలా ప్రవచింపబడింది: “యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.” (కీర్తన 110:2) గనుక, యోహాను చూచిన పుట్టుక యేసుక్రీస్తుకు సన్నిహిత సంబంధముంది. అది మన శకంలోని మొదటి శతాబ్దానికి ముందు యేసుక్రీస్తు మరియకు జన్మించిన విషయానికి సంబంధించింది కాదు; లేక సా.శ. 33 లో యేసు ఆత్మీయప్రాణిగా మరలా లేచిన దానికి సంబంధించింది కాదు. అంతేగాక, అది దేహాంతరం పొందేదికాదు. అది 1914 లో దేవుని రాజ్యారంభానికి సంబంధించిన వాస్తవమై ఉంది, యేసు ఇప్పటికే 19 శతాబ్దాలుగా పరలోకమందుంటూ, యిప్పుడు రాజుగా సింహాసనాసీనుడయ్యాడు.—ప్రకటన 12:10.

13.ఆ మగశిశువు “దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడడం” దేనిని తెలియజేస్తుంది?

13 యెహోవా తన భార్యనుగాని లేదా క్రొత్తగా జన్మించిన తన కుమారునిగాని సాతాను మ్రింగడానికి అనుమతించడు! జన్మించగానే, ఆ శిశువు “దేవునియొద్దకును ఆయన సింహాసనము నొద్దకును కొనిపోబడెను.” అలా ఆ శిశువు సంపూర్తిగా యెహోవా సంరక్షణ క్రిందికి వస్తున్నాడు, ఆయన క్రొత్తగా జన్మించిన యీ శిశువును, ఆయన పరిశుద్ధ నామమును పరిశుద్ధ పరచడంలో ఆయనకున్న ఉపకరణాన్ని, అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాడు. అదే సమయములో, ఆ స్త్రీ దేవుడామెకు ఏర్పాటు చేసిన అరణ్యంలోనున్న స్థలానికి వెళ్తుంది. దాన్ని గూర్చిన వివరాలు తర్వాత తెలుసుకుందాం! సాతాను విషయంలోనైతే, పరలోకమందున్న రాజ్యాన్ని అతడెన్నటికిని బెదిరించకుండా పూర్తిగా అసాధ్యమయ్యేలా చేసే ప్రాముఖ్యమైన సంఘటన ఒకటి జరగడానికి రంగం యిప్పుడు సిద్ధం చేయబడింది. ఏమిటా సంఘటన?

పరలోకంలో యుద్ధం!

14. (ఎ) యోహాను తెల్పుతున్న ప్రకారం, ఏ సంఘటన యిక సాతాను ఎన్నటికి రాజ్యాన్ని బెదిరించకుండా చేస్తుంది? (బి) సాతాను అతని దయ్యాలు ఏ ప్రాంతంవరకే పరిమితం చేయబడ్డారు?

14 యోహాను మనకిలా తెల్పుతున్నాడు: “అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేక పోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాది యనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.” (ప్రకటన 12:7-9) కావున దేవుని పరిశుద్ధ మర్మమును సంపూర్తి చేయడంలో ఒక ముఖ్యభాగముగానే సాతాను బయటకి వెళ్లగొట్టబడ్డాడు, పరలోకంనుండి పడద్రోయబడ్డాడు, అతని దూతలుకూడ అతనితోపాటు భూమ్మీదకు త్రోసివేయబడ్డారు. సర్వభూమికి దేవునిగా తయారయ్యేంతగా దాన్ని మోసగించిన వాడు చివరకు తన తిరుగుబాటు మొదట ప్రారంభమైన యీ భూగోళంవరకే పరిమితం చేయబడ్డాడు.—2 కొరింథీయులు 4:3, 4.

15, 16. (ఎ) మిఖాయేలు ఎవరు, మరి అది మనకెలా తెలుసు? (బి) మిఖాయేలు మాత్రమే సాతానును పరలోకంనుండి పడద్రోస్తాడనేది ఎందుకు తగియున్నది?

15 యెహోవా నామం పేరిట యింతటి విజయాన్నెవరు సాధిస్తారు? మిఖాయేలును అతని దూతలును అలా చేయగలరని బైబిలు చెబుతుంది. మరైతే యీ మిఖాయేలు ఎవరు? “మిఖాయేలు” అంటే “దేవుని వంటి వాడెవడు?” అని అర్థం. గనుక ఇతరులెవరు తనకు సాటిరారు అనే రుజువునిస్తూ మిఖాయేలు యెహోవా సర్వాధిపత్యాన్ని నిరూపించడంలో ఆసక్తి కల్గియుండవచ్చును. యూదా 9వ వచనంలో ఆయన “ప్రధాన దూతయైన మిఖాయేలు” అని పిలువబడ్డాడు. ఆసక్తికరమైన విషయమేమంటే, బైబిల్లో ఇతరచోట్ల “మిఖాయేలు” అనే బిరుదు ఒకే ఒక వ్యక్తిని గూర్చి వాడబడింది: ఆయనే యేసుక్రీస్తు. * పౌలు ఆయనను గూర్చి యిలా అంటున్నాడు: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును.” (1 థెస్సలొనీకయులు 4:16) “ప్రధానదూత” అనే బిరుదుకు “దూతలలో ప్రముఖుడు” అని అర్థం. గనుక ప్రకటన గ్రంథం “మిఖాయేలు అతని దూతలు” అని పిలవడంలో ఆశ్చర్యంలేదు. దూతలు దేవుని నీతిమంతుడైన సేవకునికి విధేయులైనట్లు బైబిల్లో చెప్పబడిన యితరస్థలాల్లో అవి యేసును సూచిస్తున్నాయి. అందుకే పౌలు “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి . . . ప్రత్యక్షమై,” అని అంటున్నాడు.—2 థెస్సలొనీకయులు 1:7; మరియు మత్తయి 24:30, 31; 25:31 కూడ చూడండి.

16 ఇవి మరితర లేఖనాలు మనల్ని పరలోకస్థానమందున్న ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవరు ఆ మిఖాయేలు కాదనే తప్పనిసరి నిర్ణయానికి నడిపిస్తాయి. ఇప్పుడు, ప్రభువుదినములో, ఆయన సాతానుతో “ప్రభువు నిన్ను గద్దించునుగాక” అని మామూలు ధోరణిలో అనడు. ఇది తీర్పుకాలం గనుక మిఖాయేలుగా యేసు, దుష్టుడైన సాతానును అతని దయ్యాలగు దూతలను పరలోకంనుండి పడద్రోస్తాడు. (యూదా 9; ప్రకటన 1:10) ఆయనే క్రొత్తగా రాజుగా నియమించ బడినందున, యీ పనిచేయడానికి సరిగ్గా ఆయనే తగినవాడు. యేసు ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానంకూడ, ఆయన తుదకు ఆదిసర్పము తలను చితకగొడతాడు, అలా అతన్ని శాశ్వతంగా ఉనికిలోలేకుండ చేస్తాడు. (ఆదికాండము 3:15) సాతానును పరలోకంనుండి త్రోసివేయడంద్వారా, యేసు చితుకగొట్టే ఆ చివరి పనివైపే వెళ్తున్నాడు.

“పరలోకమా, ఉత్సహించుడి”

17, 18. (ఎ) సాతాను పరలోకంనుండి పడద్రోయబడినప్పుడు పరలోకంలో వచ్చిన ఎటువంటి ప్రతిస్పందనను యోహాను తెల్పుతున్నాడు? (బి) యోహాను వింటున్న పెద్దస్వరం బహుశ ఎక్కడనుండి వస్తుండవచ్చును?

17 పరలోకంనుండి సాతాను పడద్రోయబడిన ఆ బ్రహ్మాండమైన పాటుకు పరలోకంలో కల్గిన ఆనంద ప్రతిస్పందనను యోహాను యిలా తెల్పుతున్నాడు: “మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని—రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి.”—ప్రకటన 12:10-12ఎ.

18 ఎవరి పెద్ద స్వరాన్ని యోహాను వింటున్నాడు? బైబిలు ఏమీ చెప్పడంలేదు. అయితే ప్రస్తుతం 1,44,000 మంది పరిశుద్ధులను సూచించగల పునరుత్థానులైన 24 మంది పెద్దలనుండి అటువంటి స్వరమొకటి వచ్చినట్లు ప్రకటన 11:17 లో తెలుపబడింది. (ప్రకటన 11:18) మరి భూమ్మీద యింకనూ ఉన్న హింసింపబడిన అభిషక్త క్రైస్తవులు యిక్కడ “మన సహోదరులు” అని పిలువబడుతూ ఉన్నందున, యీ మాటలు అదేమూలంనుండి వచ్చియుండొచ్చు. నిశ్చయంగా నమ్మకమైన వీరు వారి స్వరాన్ని కలిపివుండొచ్చు, ఎందుకంటే వారి పునరుత్థానం సాతాను అతని దయ్యాల సమూహం పరలోకంనుండి పడద్రోయబడిన తర్వాతనే జరుగుతుంది.

19. (ఎ) దేవునిమర్మమును సంపూర్తిచేయడం మూలంగా యేసు ఏ పని చేయడానికి మార్గం సుగమం అవుతుంది? (బి) సాతాను “మన సహోదరులమీద నేరము మోపువాడు” అని పిలవబడడం దేన్ని సూచిస్తుంది?

19 దేవుని పరిశుద్ధ మర్మమును సంపూర్తి గావించడానికి యేసు యెహోవా రాజ్యాధికారాన్ని పొందాల్సి ఉంటుంది. అలా నమ్మకస్థులైన మానవులను విడిపించాలనే దేవుని గొప్పసంకల్పం నెరవేరడానికి మార్గం సుగమమైంది. యేసు యిప్పుడు దైవభయంగల శిష్యులకు మాత్రమే రక్షణ ననుగ్రహించడంలేదు గాని, దేవుని జ్ఞాపకములోనున్న లక్షలాది మృతులకు కూడ అనుగ్రహిస్తాడు. (లూకా 21:27, 28) సాతాను “మన సహోదరులమీద నేరముమోపువాడు” అని పిలువబడడం చూపించేదేమంటే, అతడు యోబుపై మోపిన నిందలు తప్పని రుజువైననూ, దేవుని భూలోక సేవకుల యథార్థతను అతడింకనూ సవాలు చేస్తున్నాడు. స్పష్టంగా, మానవుడు తన ప్రాణంకొరకు దేనినైనా త్యాగం చేస్తాడని అతడనేక మారులు నిందవేశాడు. సాతానెంత ఘోర పరాజయం పొందాడో!—యోబు 1:9-11; 2:4, 5.

20. నమ్మకమైన క్రైస్తవులు ఎలా సాతానును జయించి యున్నారు?

20 “గొఱ్ఱెపిల్ల రక్తము వలన” నీతిమంతులని పరిగణించబడుతున్న అభిషక్త క్రైస్తవులు హింసలున్ననూ దేవున్ని, యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తూనే ఉన్నారు. వంద సంవత్సరాలకంటే ఎక్కువగా, యీ యోహాను తరగతి 1914 లో అంతమయ్యే అన్యరాజుల కాలములకు సంబంధించిన పెద్ద వివాదాంశాలను గూర్చి సూచిస్తూనే వచ్చారు. (లూకా 21:24) మరిప్పుడు గొప్పసమూహము వారితోపాటు నమ్మకంగా సేవచేస్తున్నారు. ఈ 20వ శతాబ్దంలో యెహోవాసాక్షుల నిజజీవిత అనుభవాలు పలుమారులు చూపించినట్లు, వీరిలో ఎవ్వరూ “ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడరు.” మాటద్వారాను, సరియైన క్రైస్తవ ప్రవర్తన ద్వారాను, వారు సాతానును జయించియున్నారు, అతడబద్ధికుడని కచ్చితంగా నిరూపించియున్నారు. (మత్తయి 10:28; సామెతలు 27:11; ప్రకటన 7:9) పరలోకమునకు పునరుత్థానులైన అభిషక్త క్రైస్తవులు అక్కడ వారి సహోదరులమీద నేరముమోపే సాతాను లేనందుకు ఎంత సంతోషిస్తారో గదా! నిశ్చయంగా యిది దేవదూతల సమూహమంతా యీ పిలుపుకు సంతోషించి స్పందించే సమయమే: “పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి!”

పోటీ శ్రమ!

21. సాతాను భూమికి సముద్రానికి ఎలా శ్రమను తెచ్చాడు?

21 మూడో శ్రమనుబట్టి ఆగ్రహించిన సాతాను యిప్పుడు తనదైన ఒక ప్రత్యేకతరహా శ్రమతో మానవజాతిని వేధించాలను కుంటున్నాడు. అదేమంటే: “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను.” (ప్రకటన 12:12బి) సాతాను పరలోకంనుండి పడద్రోయబడడం నిజంగా సాతాను స్వాధీనంలోవున్న మానవులవల్ల నాశనమౌతున్న యీ భూమికి శ్రమయనే అర్థం. (ద్వితీయోపదేశకాండము 32:5) అంతకంటే దారుణమేమంటే, ‘పాలించు లేదా నాశనంచెయ్యి’ అనే సాతాను పద్ధతి మానవనిర్మాణమైన సాదృశ్యమగు భూమికి, అలజడితోనిండిన మానవజాతియైన సాదృశ్యమగు సముద్రానికి శ్రమను తెస్తుంది. రెండు ప్రపంచ యుద్ధాలలో, సాతాను ఆగ్రహము, అతనికి లోబడియున్న జనాంగాలు చూపిన మహోగ్రతలో ప్రతిబింబించింది, మరి అటువంటివే యినాటివరకు—దీర్ఘకాలం కాకపోయినను—అంటే దయ్యాల కోపాగ్ని జ్వాలలు రేగుతూనేవున్నాయి. (మార్కు 13:7, 8) అపవాది తంత్రాలెంత భయంకరమైనవైననూ, సాతాను దృశ్యమైన సంస్థమీదకు—దేవుని రాజ్యం గైకొననైయున్న చర్యకు—మూడో శ్రమవల్ల కలిగేబాధ ఏమాత్రం సాటిరాదు!

22, 23. (ఎ) ఘటసర్పం భూమ్మీదికి పడద్రోయబడిన తర్వాత జరిగే విషయాన్ని గూర్చి యోహాను ఏమని చెబుతున్నాడు? (బి) “మగశిశువును కనిన ఆ స్త్రీని” హింసించడం ఘటసర్పానికెలా సాధ్యమౌతుంది?

22 సాతాను వినాశకరరీతి బహిష్కరణ మొదలుకొని, క్రీస్తు సహోదరులు భూమ్మీద యింకనూ అతని కోపాగ్నిజ్వాలల్ని భరిస్తూనేవున్నారు. యోహాను యిలా నివేదిస్తున్నాడు: “ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుటచూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసించెను; అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషింపబడును.”—ప్రకటన 12:13, 14.

23 ఇక్కడ దర్శనం 6వ వచనంలో పరిచయం చేయబడిన తలంపునే వ్యక్తపరుస్తుంది, అదేమంటే, శిశువును కనిన తర్వాత ఆ స్త్రీ ఘటసర్పానికి దూరంగా అరణ్యంలోనికి పారిపోతుందని మనకది చెబుతుంది. అయితే ఆ స్త్రీ పరలోకంలో ఉన్నందువల్ల, ఘటసర్పమిప్పుడు భూమ్మీదకు పడద్రోయబడినందున ఆ ఘటసర్పమెలా స్త్రీని హింసించగలదని మనమాశ్చర్యపడవచ్చు. జ్ఞాపకముంచుకోండి, ఆ స్త్రీకి భూమ్మీద పిల్లలు, తన సంతానమునకు చెందిన పిల్లలున్నారు. ఈ దర్శనంలో ఆ తర్వాత, సాతాను ఆమె సంతానాన్ని హింసించడంద్వారా తనకోపాన్ని వెళ్లగ్రక్కుతుందని మనకు చెప్పబడింది. (ప్రకటన 12:17) ఈ భూమ్మీద ఆమె సంతానానికి జరిగేది ఆమెకు జరిగినట్లే అనుకోవచ్చు. (మత్తయి 25:40 పోల్చండి.) ఈ భూమ్మీద పెరుగుతున్న ఆ స్త్రీ సంతానపు సహచరులు కూడ యిటువంటి హింసల్ని అనుభవిస్తారు.

ఒక క్రొత్త జనాంగం

24. ఐగుప్తునుండి ఇశ్రాయేలీయులు విడుదలైనప్పుడు పొందిన అనుభవం లాంటి ఏ అనుభవాన్ని బైబిలు విద్యార్థులు కల్గివుండిరి?

24 మొదటి ప్రపంచయుద్ధం జరుగుతున్నప్పుడు, యేసు సహోదరులు సాధ్యమైనంతవరకు నమ్మకంగా సాక్ష్యమిస్తూనే యున్నారు. సాతాను, క్రూరులైన వాని తొత్తులు పెట్టిన తీవ్రహింసల్లో యిలా సాక్ష్యమిచ్చారు. చివరకు బైబిలు విద్యార్థుల బహిరంగ సాక్ష్యం దాదాపుగా నిలిచిపోయింది. (ప్రకటన 11:7-10) ఐగుప్తులో ఇశ్రాయేలీయులు కూడ సహించిన గొప్ప హింసవంటి దానినే వీరు అనుభవించారు. అప్పుడే యెహోవా వారిని, గద్ద రెక్కలమీద అన్నట్లుగా, సీనాయి పర్వతారణ్యంలోని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. (నిర్గమకాండము 19:1-4) అలాగే, 1918-19 లలో వచ్చిన తీవ్రహింస తర్వాత, యెహోవా తన స్త్రీకి ప్రతినిధులైన, తనసాక్షులను విడుదల చేసి, ఇశ్రాయేలీయులకు అరణ్యమెలా సురక్షితంగా ఉండెనో, అటువంటి ఆత్మీయ పరిస్థితిలోనికి తెచ్చాడు. ఇది వారి ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా జరిగింది.—కీర్తన 55:6-9 పోల్చండి.

25. (ఎ) అరణ్యంలో ఇశ్రాయేలీయులకు చేసినట్లే యెహోవా 1919 లో ఏమి చేశాడు? (బి) ఎవరు యీ జనాంగంలో చేరియున్నారు, మరి వారు దేనిలోనికి తీసుకురాబడ్డారు?

25 అరణ్యంలో యెహోవా ఇశ్రాయేలీయులను ఆత్మీయ, భౌతికాహారాన్నిస్తూ వారినొక జనాంగముగా ఏర్పాటుచేశాడు. అలాగే, 1919 నుండి యెహోవా, స్త్రీ సంతానాన్ని ఆత్మీయ జనాంగముగా చేశాడు. దీన్ని, 1914 నుండి పరిపాలిస్తున్న మెస్సీయ రాజ్యంతోకలిపి గందరగోళం చేయకూడదు.ఈ ఆత్మీయ క్రొత్త జనాంగము అంటే 1919 లో మహిమాన్విత ఆత్మీయ స్థితిలోనికి తీసుకురాబడిన అభిషక్తులైన సాక్షులలో శేషమునకు సంబంధించిన సభ్యులతోకూడినదే. అప్పుడు “తగిన కాలమున ప్రతివానికి ఆహారము” ఏర్పాటు చేయబడుతున్నందున, వారెదుటవున్న పనిని చేయడానికి వారు బలపర్చబడ్డారు.—లూకా 12:42; యెషయా 66:8.

26. (ఎ) ప్రకటన 12:6, 14 లో చెప్పబడిన కాలం ఎంతకాలం? (బి) మూడున్నర కాలముల ఉద్దేశమేమై యుండెను, అదెప్పుడు ఆరంభమైంది, ఎప్పుడు అంతమయ్యింది?

26 దేవుని స్త్రీ సంతానానికి ఎంతకాలం యీ విశ్రాంతి లభించింది? ప్రకటన 12:6 ఆ కాలం 1,260 దినములని చెబుతుంది. ప్రకటన 12:14 ఆ కాలాన్ని ఒక కాలం, కాలములు, అర్ధకాలమని అంటే, మూడున్నర కాలములని అంటోంది. వాస్తవానికి, ఆ రెండు మాటలును, 1919 లోని ఉత్తరాయణపు వసంత కాలం నుండి 1922 లోని హేమంత రుతువు వరకున్న మూడున్నర సంవత్సరాలకు సూచనగా ఉన్నాయి. పునరుద్ధరింపబడిన యోహాను తరగతికి యీ కాలం సేదదీర్చుకోవడానికి, పునరారోగ్య ప్రాప్తికి, పునః సంస్థీకరణకు సమయమై యుండెను.

27. (ఎ) యోహాను తెల్పిన ప్రకారం, 1922 తర్వాత నుండి ఘటసర్పం ఏం చేసింది? (బి) సాక్షులమీదికి హింసా ప్రవాహాన్ని వదలడంలో సాతాను ఉద్దేశమేమై యుండెను?

27 ఘటసర్పం మానుకోలేదు! “కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొనిపోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెను.” (ప్రకటన 12:15) “నీళ్లు నదీప్రవాహమువలె,” లేక “నీటి ప్రవాహము” అంటే ఏమిటి? (ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) పూర్వము దావీదు రాజు తనను ఎదిరించిన దుష్టులను ‘పనికిమాలినవారు వరదపొంగువలె’ [నిరుపయోగమైన కాలువలు, యంగ్‌] ఉన్నారన్నాడు. (కీర్తన 18:4, 5; 16, 17) ఇప్పుడు సాతాను వదిలేదికూడ అటువంటి ‘పనికిమాలిన వారివలన,’ లేక నిరుపయోగులవలన వచ్చే హింసయే. సాతాను 1922 తర్వాత సాక్షులమీద హింసా ప్రవాహాన్ని వదిలాడు. (మత్తయి 24:9-13) కొట్టడం, “కట్టడవలన కీడుకల్పించ”డం, జైల్లోవేయడం, మరియు ఉరితీయడం, కాల్చివేయడం, శిరచ్ఛేదనం వంటి శిక్షలు అమలుపర్చడం ఇందులో యిమిడివున్నాయి. (కీర్తన 94:20) పడద్రోయబడిన సాతాను, దేవుని స్త్రీయొద్దకు నేరుగా వెళ్లే అనుమతి లేనందువల్ల, భూమ్మీద మిగిలియున్న ఆమె సంతానముమీద ఆగ్రహంతో ముట్టడించడానికి సిద్ధపడి, వారు వారి యథార్థతను కోల్పోవడంద్వారా దేవుని కృపను పోగొట్టుకునేలా చేయడానికి లేక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారిని నాశనం చేయడానికి బయల్దేరాడు. అయితే వారి తీర్మానం యోబువంటిదని రుజువైంది: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.”—యోబు 27:5.

28. హింసా ప్రవాహం 2వ ప్రపంచ యుద్ధకాలంలో ఎలా తీవ్రస్థాయికి చేరింది?

28 ఈ క్రూరమైన హింస 2వ ప్రపంచ యుద్ధకాలంలో తీవ్రస్థాయికి చేరింది. ఐరోపాలో సుమారు పదివేలమంది యెహోవాసాక్షులు నాజీ కాన్‌సెన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో చిత్రహింసలకు గురయ్యారు, మరి వేలాదిమంది చనిపోయారు. ఇటలీ, జపాన్‌, కొరియా, తైవాన్‌లను పాలించిన సైన్యాధిపతుల క్రింద నమ్మకస్థులైన సాక్షులు అదే ప్రకారం క్రూరమైన బాధననుభవించారు. ప్రజాస్వామ్య దేశాలని పిలువబడే వాటిల్లోకూడ, సాక్షులపై కాథోలిక్‌ దుండగులు దాడిచేసి, ఒంటిమీద తారుపూసి ఈకలు కప్పి, వారిని ఊళ్లోనుండి వెళ్లగొట్టారు. క్రైస్తవ సమావేశాలకు భంగం కల్గించారు మరియు సాక్షుల పిల్లలను పాఠశాలనుండి బహిష్కరించారు.

29. (ఎ) అనుకోని మూలంనుండి వస్తున్న సహాయాన్నిగూర్చి యోహాను ఎలా వర్ణిస్తున్నాడు? (బి) ఎలా “భూమి ఆ స్త్రీకి సహాయకారియై”నది? (సి) ఘటసర్పం ఏమి చేస్తూనేవుంది?

29 అనుకోని మూలంనుండి సహాయం లభించింది. “భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మ్రింగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహముతెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.” (ప్రకటన 12:16, 17) “భూమి”—సాతాను విధానంలోనున్న ఉపకరణాలే, ‘ఆ నీళ్ల ప్రవాహమును’ లేక ‘వరదను’ మ్రింగివేయడాని కారంభించాయి. సాక్షులు 1940వ దశాబ్దంలో అమెరికా ఉన్నత న్యాయస్థానంలోను, ఆరాధనా స్వేచ్ఛనిచ్చిన ఇతర దేశాల్లోని పరిపాలనాధికారాలనుండి అనేక అనుకూల తీర్పులను పొందారు. చివరకు, క్రూరమైన నియంతల క్రింద బాధింపబడిన సాక్షుల ఉపశమనము కొరకు సంయుక్త దేశాలు నాజీ-ఫాసిస్ట్‌ మహాసైన్యాన్ని మ్రింగివేశాయి. హింసలు యింకా తీరిపోలేదు, ఎందుకంటే ఘటసర్పం యొక్క ఆగ్రహం యీనాటివరకు కొనసాగుతునే వుంది, అతడు “యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారితో” యుద్ధం చేస్తునేవున్నాడు. అనేక దేశాలలో యథార్థవంతులైన సాక్షులు యింకా జైళ్లలో ఉన్నారు, కొందరింకనూ వారి యథార్థతనుబట్టి చనిపోతున్నారు. అయితే వీటిలోకొన్ని దేశాల్లో, అధికారులు అప్పుడప్పుడు ఒత్తిళ్లను సడలిస్తున్నారు, అందుచేత సాక్షులు ఎంతో స్వేచ్ఛననుభవిస్తున్నారు. * అలా, బైబిలు ప్రవచన నెరవేర్పుగా, భూమి హింసయనే నదిని మ్రింగివేస్తూనే వుంది.

30. (ఎ) ఏది జరగడానికి భూమి తగినంత సహాయం అందించింది? (బి) దేవుని ప్రజల యథార్థత ఏ ఫలితాన్ని తెస్తుంది?

30 ఈ విధంగా, భూమి దానిలో, దేవుని సేవ 200 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించి, నలభైలక్షలకంటె ఎక్కువమంది నమ్మకస్థులైన సువార్తికులను తయారుచేయడానికి తగినంత సహాయాన్ని అందించింది. స్త్రీ సంతానంలోని శేషముతోపాటు క్రొత్తవిశ్వాసుల గొప్ప అంతర్జాతీయ గుంపొకటి లోకానికివేరై ఉండడంలో, పరిశుభ్రమైన నైతికవిలువలు, సహోదరప్రేమ కల్గివుండడంలో దేవుని ఆజ్ఞలు పాటిస్తుంది, మరియు వారు మెస్సీయ రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. వారి యథార్థత సాతాను అవమానకరమగు సవాలుకు జవాబిస్తుంది, అందువల్ల సాతానుకు అతని విధానానికి మరణపాశము చుట్టుకుంటుంది.—సామెతలు 27:11.

[అధస్సూచీలు]

^ పేరా 5 భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, 12 మంది అపొస్తలులు, 12 ఆత్మీయ ఇశ్రాయేలీయుల గోత్రాలు, 12 గుమ్మములు, 12 మంది దూతలు, మరియు నూతన యెరూషలేము 12 పునాదులను పోల్చండి.—ప్రకటన 21:12-14.

^ పేరా 15 అయితే గమనించండి, ప్రకటన 12:9 “మహాఘట సర్పము . . . దాని దూతలు” అని పిలుస్తోంది. కావున అపవాది తననుతానే ఒక పోటీ దేవునిగా చేసుకోవడమే గాక ప్రధాన దూత కావాలనుకుంటున్నాడు, కానీ బైబిలు ఎన్నడూ అతన్ని అలా పిలువలేదు.

^ పేరా 29 అనేక దేశాల్లో ఉన్నత న్యాయస్థానాలు యెహోవాసాక్షులకు ఉపశమనమును అనుమతించాయి; వీటిలో కొన్ని తీర్మానాలు 92వ పేజీలో ఎత్తివ్రాయబడినవి.

[అధ్యయన ప్రశ్నలు]

[185వ పేజీలోని బాక్సు]

“భూమి తన నోరు తెరచింది”

సాతాను వరదపొంగు అనే హింస అనేకదేశాల్లో అభిషక్త క్రైస్తవులు వారి సహచరులమీదకు పొంగివచ్చింది. అయిననూ, తరచూ సాతాను విధానంలోని మార్పులు ఆ వరదపొంగును మ్రింగివేసేలా చేశాయి.

అల్లరిమూకల అలజడి వరద జైళ్లలో వేయడంవంటివి 1940వ దశాబ్దంలో అమెరికాలోని ఉన్నత న్యాయస్థాన మిచ్చిన అనేక అనుకూల తీర్పులమూలంగా మ్రింగివేయబడ్డాయి.

1945: క్రూరమైన హింస చెలరేగిన జర్మనీ, జపాన్‌ దేశాల్లో 2వ ప్రపంచ యుద్ధంలో జయించిన సంయుక్త దేశాలవలన నిలిపివేయబడింది.

నిషేధించబడిన యెహోవాసాక్షులను డొమినికన్‌ రిపబ్లిక్‌లో జైల్లోవేశారు, కొరడాలతో కొట్టారు, తుపాకి మడిమలతో పొడిచారు. నియంత రఫెల్‌ ట్రూజిల్లోకు రోమన్‌ కాథోలిక్‌ చర్చికి 1960 లో చీలికవచ్చినప్పుడు యెహోవాసాక్షుల మీదనున్న నిషేధం ఎత్తివేశారు.

కాల్చడం, తగులబెట్టడం, మానభంగం చేయడం, కొట్టడం, చిత్రహింసలు పెట్టడం, చంపడం మొదలైనవి నైజీరియాలో ఒక ప్రజాయుద్ధంలో సాక్షులపై జరిగాయి, చీలిపోయిన ప్రాంతాన్ని, యివి జరిగిన ప్రాంతాన్ని ప్రభుత్వదళాలు స్వాధీనం చేసుకున్నప్పుడు 1970 లో నిలిచిపోయాయి.

స్పెయిన్‌లో గృహాలపై దాడిజరిగింది, క్రైస్తవులు దేవున్నిగూర్చి మాట్లాడిన “నేరానికి,” క్రైస్తవకూటములు జరుపుకున్నందుకు జరిమానా విధించబడి జైల్లోవేయబడ్డారు. ప్రభుత్వం మారి, యెహోవా సాక్షులమీద నిషేధం ఎత్తివేయబడినప్పుడు యీ హింస చివరకు 1970 లో నిలిచిపోయింది.

పోర్చుగల్‌నందు ఏ వారంటు లేకుండానే ఇండ్లను సోదాచేశారు. సాక్షులను కొట్టారు, జైల్లోవేశారు, యింకనూ వారి బైబిళ్లను జప్తుచేశారు. సైనిక తిరుగుబాటు మూలంగా ప్రభుత్వంలో మార్పువచ్చి, సమావేశ మయ్యేందుకు స్వేచ్ఛనిచ్చే చట్టం అమలు చేసినపుడు 1974 లో యీ ఉగ్రవాదం “మ్రింగివేయబడింది.”

అర్జెంటీనాలో, సైనిక ప్రభుత్వంలో యెహోవాసాక్షుల పిల్లలను పాఠశాలనుండి బహిష్కరించారు, సువార్త ప్రకటించినందుకు దేశవ్యాప్తంగా సాక్షులు నిర్భందించబడ్డారు. చివరికి యీ హింస 1984 లో అంతమైంది, అప్పుడు పరిపాలించే ప్రభుత్వం యెహోవాసాక్షుల సంఘాన్ని చట్టబద్ధంగా గుర్తించినందుకు అలా జరిగింది.

[183వ పేజీలోని చిత్రం]

1914 రాజ్యస్థాపన

1919 క్రొత్త జనాంగము ఏర్పడుట

1919-1922 పునరారోగ్యప్రాప్తి కాలం

1922- హింసా ప్రవాహం

[182వ పేజీలోని చిత్రం]

భూమికి శ్రమ