యోబు 2:1-13

  • యోబు ఉద్దేశాల్ని సాతాను మళ్లీ ​ప్రశ్నించాడు (1-5)

  • యోబు శరీరాన్ని మొత్తడానికి సాతానును అనుమతించడం (6-8)

  • యోబు భార్య, “దేవుణ్ణి దూషించి చచ్చిపో!” అంది (9, 10)

  • యోబు ముగ్గురు సహచరులు రావడం (11-13)

2  తర్వాత సత్యదేవుని కుమారులు*+ యెహోవా సన్నిధిలో నిలబడే+ ఇంకో రోజు వచ్చింది. అప్పుడు సాతాను కూడా వాళ్లతోపాటు వచ్చి యెహోవా ముందు నిలబడ్డాడు.+ 2  యెహోవా సాతానును, “నువ్వు ఎక్కడి నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు సాతాను యెహోవాతో, “నేను భూమ్మీద అటూఇటూ తిరుగుతూ అంతటా సంచరించి వచ్చాను”+ అన్నాడు. 3  అప్పుడు యెహోవా సాతానుతో ఇలా అన్నాడు: “నువ్వు నా సేవకుడైన యోబును గమనించావా? భూమ్మీద అతని లాంటివాళ్లు ఎవరూ లేరు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉన్నాడు. ఏ కారణం లేకుండా అతన్ని నాశనం చేసేలా నువ్వు అతనికి వ్యతిరేకంగా నన్ను ప్రేరేపించినా,+ అతను ఇంకా తన యథార్థతను విడిచిపెట్టలేదు.”+ 4  అయితే సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: “చర్మానికి బదులుగా చర్మాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ మనిషి ఇచ్చేస్తాడు. 5  ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతని శరీరాన్ని* బాధిస్తే, అతను ఖచ్చితంగా నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు.”+ 6  అప్పుడు యెహోవా సాతానుతో, “ఇదిగో! అతను నీ వశంలో* ఉన్నాడు! అయితే అతని ప్రాణం మాత్రం తీయకు!” అన్నాడు. 7  దాంతో సాతాను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయి, యోబును అరికాలి నుండి నడినెత్తి వరకు బాధాకరమైన పుండ్లతో+ మొత్తాడు. 8  యోబు గోక్కోవడానికి ఒక మట్టి పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు.+ 9  చివరికి అతని భార్య అతనితో, “నువ్వు ఇంకా యథార్థతను విడిచిపెట్టవా? దేవుణ్ణి దూషించి చచ్చిపో!” అంది. 10  అయితే అతను ఆమెతో, “నువ్వు తెలివితక్కువదానిలా మాట్లాడుతున్నావు. మనం సత్యదేవుని నుండి మేలును మాత్రమే స్వీకరించాలా? కీడును స్వీకరించకూడదా?”+ అన్నాడు. ఈ విషయాలన్నిటిలో యోబు తన పెదాలతో ఏ పాపమూ చేయలేదు.+ 11  యోబు మీదికి వచ్చిన విపత్తులన్నిటి గురించి విని అతని ముగ్గురు సహచరులు* వాళ్లవాళ్ల ఊళ్ల నుండి వచ్చారు. వాళ్లెవరంటే: తేమానీయుడైన ఎలీఫజు,+ షూహీయుడైన+ బిల్దదు,+ నయమాతీయుడైన జోఫరు.+ వాళ్లు ముగ్గురూ ముందే అనుకున్నట్టు ఒకచోట కలుసుకుని యోబు మీద సానుభూతి చూపించడానికి, అతన్ని ఓదార్చడానికి వచ్చారు. 12  వాళ్లు దూరం నుండి అతన్ని చూసి గుర్తుపట్టలేకపోయారు. వాళ్లు గట్టిగట్టిగా ఏడుస్తూ బట్టలు చింపుకొని, గాల్లోకి దుమ్ము ఎగజల్లుతూ, తలల మీద దుమ్ము పోసుకున్నారు.+ 13  వాళ్లు ఏడురోజుల పాటు పగలూరాత్రీ అతనితో కలిసి నేల మీద కూర్చున్నారు. అతను తీవ్రంగా వేదన పడుతుండడం+ చూసి ఎవ్వరూ అతనితో ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

అధస్సూచీలు

లేదా “దేవదూతలు.”
లేదా “నిజాయితీగా నడుచుకునే యథార్థవంతుడు.”
అక్ష., “ఎముకను, మాంసాన్ని.”
అక్ష., “చేతిలో.”
లేదా “పరిచయస్థులు.”