యోహానుకు ఇచ్చిన ప్రకటన 10:1-11

  • బలంగా ఉన్న దేవదూత చేతిలో చిన్న గ్రంథపు చుట్ట (1-7)

    • “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు” (6)

    • పవిత్ర రహస్యం ముగింపుకు వస్తుంది (7)

  • యోహాను చిన్న గ్రంథపు చుట్టను తినడం (8-11)

10  అప్పుడు, బలంగా ఉన్న ఇంకో దేవదూత పరలోకం నుండి దిగిరావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని ధరించి ఉన్నాడు; ఆయన తలమీద ఇంద్రధనుస్సు ఉంది; ఆయన ముఖం సూర్యునిలా ఉంది;+ ఆయన కాళ్లు* అగ్నిస్తంభాల్లా ఉన్నాయి;  ఆయన చేతిలో తెరిచివున్న చిన్న గ్రంథపు చుట్ట ఉంది. ఆయన తన కుడి పాదాన్ని సముద్రంమీద, ఎడమ పాదాన్ని భూమ్మీద పెట్టి,  సింహం గర్జించినట్టు పెద్ద స్వరంతో అరిచాడు.+ ఆయన అరిచినప్పుడు, ఏడు ఉరుములు+ మాట్లాడాయి.  ఆ ఏడు ఉరుములు మాట్లాడినప్పుడు నేను ఆ మాటలు రాయబోయాను. అయితే పరలోకం నుండి ఒక స్వరం+ ఇలా చెప్పడం విన్నాను: “ఆ ఏడు ఉరుములు చెప్పిన వాటిని రహస్యంగా ఉంచు, వాటిని రాయొద్దు.”  సముద్రంమీద, భూమ్మీద నిలబడివున్నట్టు నేను చూసిన ఆ దేవదూత తన కుడిచేతిని పరలోకం వైపు ఎత్తి,  యుగయుగాలు జీవించే దేవుని+ పేరున అంటే ఆకాశాన్ని, అందులో ఉన్నవాటిని; భూమిని, అందులో ఉన్నవాటిని; సముద్రాన్ని, అందులో ఉన్నవాటిని సృష్టించిన దేవుని+ పేరున ఒట్టేసి ఇలా అన్నాడు: “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు.  దేవుడు తన దాసులైన ప్రవక్తలకు మంచివార్తగా ప్రకటించిన+ పవిత్ర రహస్యం,+ ఏడో దేవదూత+ తన బాకా ఊదబోతున్న+ రోజుల్లో తప్పకుండా ముగింపుకు వస్తుంది.”  పరలోకం నుండి వచ్చిన ఆ స్వరం+ మళ్లీ నాతో మాట్లాడుతూ ఇలా చెప్పడం విన్నాను: “నువ్వు వెళ్లి సముద్రంమీద, భూమ్మీద నిలబడిన దేవదూత చేతిలోని తెరిచివున్న గ్రంథపు చుట్టను తీసుకో.”+  నేను ఆ దేవదూత దగ్గరికి వెళ్లి, ఆ చిన్న గ్రంథపు చుట్టను నాకు ఇవ్వమని అడిగాను. అప్పుడు ఆ దేవదూత నాతో ఇలా అన్నాడు: “దీన్ని తీసుకొని తిను,+ ఇది నీ కడుపుకు చేదుగా ఉంటుంది, కానీ నీ నోటికి మాత్రం తేనెలా తియ్యగా ఉంటుంది.” 10  నేను ఆ దేవదూత చేతిలో నుండి ఆ చిన్న గ్రంథపు చుట్టను తీసుకొని తిన్నాను.+ అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది,+ కానీ దాన్ని తిన్నప్పుడు నా కడుపు చేదు అయింది. 11  తర్వాత నేను ఈ మాటలు విన్నాను: “నువ్వు జాతుల గురించి, దేశాల గురించి, భాషల గురించి, చాలామంది రాజుల గురించి మళ్లీ ప్రవచించాలి.”

అధస్సూచీలు

అక్ష., “పాదాలు.”