జెకర్యా 7:1-14

  • బూటకపు ఉపవాసాల్ని యెహోవా ఖండించడం (1-14)

    • “మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా?” (5)

    • ‘న్యాయంగా, విశ్వసనీయ ప్రేమతో, ​కరుణతో ప్రవర్తించండి’ (9)

7  దర్యావేషు రాజు పరిపాలన నాలుగో సంవత్సరం, కిస్లేవు* అనే తొమ్మిదో నెల, నాలుగో రోజు యెహోవా వాక్యం జెకర్యా దగ్గరికి వచ్చింది.+  బేతేలులోని ప్రజలు యెహోవా అనుగ్రహం పొందడానికి షెరెజెరును, రెగెమ్మెలెకునూ అతని మనుషుల్నీ పంపించి,  సైన్యాలకు అధిపతైన యెహోవా మందిరంలోని యాజకుల్ని, అలాగే ప్రవక్తల్ని ఇలా అడిగారు: “ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నట్టే, ఈ సంవత్సరం కూడా ఐదో నెలలో+ మేము* ఉపవాసం ఉంటూ దుఃఖించాలా?”  సైన్యాలకు అధిపతైన యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “దేశంలోని ప్రజలందరితో, యాజకులతో ఇలా చెప్పు: ‘మీరు 70 ఏళ్లు+ ఐదో నెలలో, ఏడో నెలలో+ ఉపవాసం ఉండి, గట్టిగా ఏడ్చినప్పుడు, మీరు నిజంగా నా కోసమే ఉపవాసం ఉన్నారా?  మీరు తిన్నప్పుడు, తాగినప్పుడు మీరు తిన్నది, తాగింది మీ కోసం కాదా?  యెరూషలేము, దాని చుట్టుపక్కల నగరాల్లో ప్రజలు నివసించినప్పుడు, వాళ్లు ప్రశాంతంగా జీవించినప్పుడు; నెగెబులో, షెఫేలాలో ప్రజలు నివసించినప్పుడు, యెహోవా అప్పటి ప్రవక్తల ద్వారా ప్రకటించిన మాటలకు మీరు లోబడాలి కదా?’ ”+  యెహోవా వాక్యం మళ్లీ జెకర్యా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీరు తీర్పు తీరుస్తున్నప్పుడు న్యాయంగా తీర్పుతీర్చండి,+ ఒకరితో ఒకరు విశ్వసనీయ ప్రేమతో,+ కరుణతో ప్రవర్తించండి. 10  విధవరాళ్లను, తండ్రిలేని పిల్లల్ని,*+ పరదేశుల్ని,+ పేదవాళ్లను+ దగా చేయకండి; హాని చేయడానికి మీ హృదయాల్లో ఒకరి మీద ఒకరు కుట్ర పన్నకండి.’+ 11  అయితే వాళ్లు ఎప్పుడూ ఆ మాటల్ని పట్టించుకోలేదు,+ వాళ్లు మొండిగా తయారయ్యారు,+ వాటిని వినకూడదని తమ చెవులు మూసుకున్నారు.+ 12  వాళ్లు తమ హృదయాల్ని వజ్రంలా* కఠినపర్చుకున్నారు,+ సైన్యాలకు అధిపతైన యెహోవా తన పవిత్రశక్తి ద్వారా అప్పటి ప్రవక్తలతో చెప్పించిన ధర్మశాస్త్రానికి,* మాటలకు లోబడలేదు.+ కాబట్టి సైన్యాలకు అధిపతైన యెహోవా నుండి గొప్ప ఉగ్రత వాళ్ల మీదికి వచ్చింది.”+ 13  “ ‘నేను* పిలిచినప్పుడు వాళ్లు విననట్టే, వాళ్లు పిలిచినప్పుడు నేను కూడా వినను’+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్తున్నాడు. 14  ‘నేను వాళ్లను తుఫాను గాలితో వాళ్లకు తెలియని దేశాలన్నిటికీ చెదరగొట్టాను;+ ఆ దేశం గుండా రాకపోకలు లేనందువల్ల అది నిర్మానుష్యం అయిపోయింది;+ ఎందుకంటే, వాళ్లు అందమైన దేశాన్ని భయంకరమైన దేశంగా మార్చారు.’ ”

అధస్సూచీలు

అనుబంధం B15 చూడండి.
అక్ష., “నేను.”
లేదా “అనాథల్ని.”
లేదా “ఏదైనా ఒక గట్టి రాయిలా” అయ్యుంటుంది.
లేదా “ఉపదేశానికి.”
అక్ష., “ఆయన.”