కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

1వ అధ్యాయం

దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

దేవుని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది

“దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.

1, 2. మీరు యెహోవా దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తున్నారు?

 మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఆయన మీద ప్రేమతో మీరు ఇప్పటికే ఆయనకు సమర్పించుకొని ఉండవచ్చు. మీరు ఆయన్ని సన్నిహిత స్నేహితునిలా చూడడం మొదలుపెట్టి ఉండవచ్చు. అయితే మీరు యెహోవాను ప్రేమించడం కంటే ముందే ఆయన మిమ్మల్ని ప్రేమించాడు. బైబిలు ఇలా చెప్తుంది: “దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం.”—1 యోహాను 4:19.

2 యెహోవా మన మీద ఎన్ని విధాలుగా ప్రేమ చూపించాడో ఆలోచించండి. మనం ఉండడానికి అందమైన భూమిని ఇచ్చాడు, ఆనందంగా జీవించడానికి కావల్సినవన్నీ ఇచ్చాడు. (మత్తయి 5:45; ప్రకటన 4:11) మనం తనతో స్నేహం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే మనం తన గురించి తెలుసుకునేలా కొన్ని ఏర్పాట్లు చేశాడు. బైబిలు ద్వారా మనం యెహోవా చెప్పేది వింటాం, ప్రార్థన ద్వారా మనం చెప్పేది ఆయన వింటాడు. (కీర్తన 65:2) శక్తివంతమైన తన పవిత్రశక్తి ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు. (లూకా 11:13) అంతేకాదు మనల్ని పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి తనకు ఎంతో ఇష్టమైన కుమారుణ్ణి కూడా పంపించాడు.—యోహాను 3:16; రోమీయులు 5:8 చదవండి.

3. దేవునితో మన స్నేహాన్ని ఎలా బలంగా ఉంచుకోవచ్చు?

3 మీ కష్టసుఖాల్లో పాలుపంచుకున్న స్నేహితుడు ఎవరైనా మీకు ఉన్నారా? అతనితో మీకున్న స్నేహాన్ని బలంగా ఉంచుకోవడానికి మీరు ఎంతో కృషి చేసివుంటారు. అదేవిధంగా యెహోవాతో మన స్నేహం బలంగా ఉండాలంటే కూడా కృషి అవసరం. ఆయనే మనకు అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఆయనతో మన స్నేహం శాశ్వతకాలం ఉండగలదు. అందుకే బైబిలు మనకు ఇలా చెప్తుంది: ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి.’ (యూదా 21, అధస్సూచి) ఎలా నిలిచివుండవచ్చు? బైబిలు ఇలా జవాబిస్తుంది: “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.

“దేవుణ్ణి ప్రేమించడమంటే”

4, 5. మీరు యెహోవాను ప్రేమించడం ఎలా మొదలుపెట్టారు?

4 యెహోవా మన మీద ఎన్నో విధాలుగా ప్రేమ చూపించాడు, కాబట్టి మనం ఆయన మీద ఎలా ప్రేమ చూపించవచ్చో పరిశీలిద్దాం. మీరు యెహోవాను ప్రేమించడం ఎప్పుడు మొదలుపెట్టారు?

సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు యెహోవాను ప్రేమిస్తున్నారని, ఆయనకు ఎప్పుడూ లోబడాలని కోరుకుంటున్నారని చూపిస్తారు

5 మీరు కొత్తలోకంలో శాశ్వతకాలం జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడని మీరు తెలుసుకున్నారు. అందుకోసం ఆయన ఏమేం చేశాడో కూడా మీరు తెలుసుకున్నారు. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి భూమ్మీదికి పంపించి ఎంత గొప్ప బహుమానాన్ని ఇచ్చాడో మీరు అర్థం చేసుకున్నారు. (మత్తయి 20:28; యోహాను 8:29; రోమీయులు 5:12, 18) అలా యెహోవా చూపించిన అపారమైన ప్రేమ మీ హృదయాన్ని కదిలించింది, దాంతో మీరు కూడా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టారు.—1 యోహాను 4:9, 10 చదవండి.

6. మనం ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తాం? దేవుని మీదున్న ప్రేమ వల్ల మీరు ఏం చేయాలని కోరుకున్నారు?

6 అయితే మీరు దేవుణ్ణి ప్రేమించడం అనేది మొదటి మెట్టు మాత్రమే. ఉదాహరణకు మీరు ఎవరినైనా ప్రేమిస్తే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడమే కాదుగానీ, వాళ్లను సంతోషపెట్టే పనులు కూడా చేయాలనుకుంటారు. అదేవిధంగా, యెహోవా మీదున్న ప్రేమతో మీరు ఆయన్ని సంతోషపెట్టేలా జీవించాలని కోరుకున్నారు. ఆయన మీద ప్రేమ ఎక్కువవ్వడం వల్ల మీరు ఆయనకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకుని ఉండవచ్చు. అలా, మీరు యెహోవాను ఎప్పటికీ సేవిస్తానని మాటిచ్చారు. (రోమీయులు 14:7, 8 చదవండి.) మరి ఆ మాటను ఎలా నిలబెట్టుకోవచ్చు?

“ఆయన ఆజ్ఞల్ని పాటించడం”

7. యెహోవాను ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన ఇచ్చిన కొన్ని ఆజ్ఞలు ఏంటి?

7 మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ‘ఆయన ఆజ్ఞల్ని పాటిస్తాం.’ అంటే ఆయనకు లోబడతాం. మనం ఎలా జీవించాలని యెహోవా కోరుకుంటున్నాడో బైబిలు చెప్తుంది. ఉదాహరణకు అతిగా తాగడం, దొంగతనం చేయడం, అబద్ధాలాడడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, యెహోవాను కాకుండా వేరేవాళ్లను లేదా వేరేవాటిని ఆరాధించడం తప్పు అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు.—1 కొరింథీయులు 5:11; 6:18; 10:14; ఎఫెసీయులు 4:28; కొలొస్సయులు 3:9.

8, 9. ఒక పరిస్థితికి సంబంధించి సూటైన నియమం లేనప్పుడు యెహోవా అభిప్రాయం ఏంటో ఎలా తెలుసుకోవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

8 కానీ యెహోవాను సంతోషపెట్టాలంటే కేవలం ఆయన ఆజ్ఞలు పాటిస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతీ విషయానికి సంబంధించిన నియమాల పట్టిక ఆయన ఇవ్వలేదు. కాబట్టి కొన్ని విషయాలకు సంబంధించి బైబిల్లో సూటైన నియమం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సరైన నిర్ణయం ఎలా తీసుకోవచ్చు? (ఎఫెసీయులు 5:17) బైబిల్లో ఉన్న సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. ఒక విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటో తెలియజేసే ప్రాథమిక సత్యాల్ని సూత్రాలు అంటారు. బైబిలు చదివినప్పుడు యెహోవాను ఒక నిజమైన వ్యక్తిగా తెలుసుకుంటాం. ఆయన ఎలా ఆలోచిస్తాడో, వేటిని ప్రేమిస్తాడో, వేటిని ద్వేషిస్తాడో తెలుసుకుంటాం.—కీర్తన 97:10 చదవండి; సామెతలు 6:16-19; “సూత్రాలు” చూడండి.

9 ఉదాహరణకు, టీవీలో లేదా ఇంటర్నెట్‌లో వేటిని చూడాలో ఎలా నిర్ణయించుకోవచ్చు? ఖచ్చితంగా ఇలాంటివే చూడాలి అనే నియమాలు యెహోవా ఇవ్వలేదు. కానీ ఆయన ఇచ్చిన సూత్రాలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాయి. ఈ రోజుల్లో హింస, అశ్లీలత ఉన్న వినోదమే ఎక్కువగా కనిపిస్తోంది. “హింసను ప్రేమించేవాళ్లంటే” యెహోవాకు అసహ్యమని, “లైంగిక పాపం చేసేవాళ్లకు” ఆయన తీర్పుతీరుస్తాడని బైబిలు చెప్తుంది. (కీర్తన 11:5; హెబ్రీయులు 13:4) ఈ రెండు సూత్రాలు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా సహాయం చేస్తాయి? యెహోవా దృష్టిలో ఏవి అసహ్యమైనవో అర్థం చేసుకుని, వాటికి దూరంగా ఉండడానికి సూత్రాలు సహాయం చేస్తాయి.

10, 11. మనం యెహోవాకు ఎందుకు లోబడతాం?

10 మనం యెహోవాకు ఎందుకు లోబడతాం? లోబడకపోతే ఆయన శిక్షిస్తాడనో, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు వస్తాయనో కాదు. (గలతీయులు 6:7) బదులుగా, మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టే ఆయనకు లోబడతాం. పిల్లలు తమ తండ్రిని సంతోషపెట్టాలని కోరుకున్నట్టే మనం కూడా మన పరలోక తండ్రిని సంతోషపెట్టాలని కోరుకుంటాం. ఆయన్ని సంతోషపెడుతున్నామని తెలుసుకోవడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు!—కీర్తన 5:12; సామెతలు 12:2; “లోబడడం” చూడండి.

11 మనకు సులభంగా అనిపించినప్పుడు, ఇక తప్పదు అనిపించినప్పుడు మాత్రమే యెహోవాకు లోబడతామా? ఆయన నియమాల్లో, ప్రమాణాల్లో వేటిని పాటించాలో, వేటిని పాటించకూడదో మనం ఎంపిక చేసుకుంటామా? లేదు. (ద్వితీయోపదేశకాండం 12:32) బదులుగా, “నీ ఆజ్ఞలు నాకు ప్రియం, అవంటే నాకు ఎంతో ఇష్టం” అని చెప్పిన కీర్తనకర్తలాగే మనం యెహోవాకు పూర్తిగా లోబడతాం. (కీర్తన 119:47; రోమీయులు 6:17) మనం నోవహులా ఉండాలనుకుంటాం. అతను యెహోవా ఆజ్ఞాపించిన ప్రతీది చేసి తనకున్న ప్రేమను నిరూపించుకున్నాడు. నోవహు “దేవుడు చెప్పినట్టే చేశాడు” అని బైబిలు అంటోంది. (ఆదికాండం 6:22) యెహోవా మీ గురించి కూడా అలా చెప్పాలని మీరు అనుకోరా?

12. మనం యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు?

12 మనం యెహోవాకు లోబడినప్పుడు ఆయనకెలా అనిపిస్తుంది? ఆయన ‘హృదయం సంతోషిస్తుంది.’ (సామెతలు 11:20; 27:11) ఒక్కసారి ఆలోచించండి! మనం లోబడడం ద్వారా, ఈ విశ్వాన్ని చేసిన సృష్టికర్తను సంతోషపెడతాం. తనకు లోబడమని ఆయన ఎప్పుడూ మనల్ని బలవంతపెట్టడు. బదులుగా ఆయన మనకు స్వేచ్ఛా చిత్తాన్ని అంటే మంచి చేయాలో, చెడు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. మనం తన మీద ప్రేమతో సరైన నిర్ణయాలు తీసుకుని, మంచి జీవితం గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు.—ద్వితీయోపదేశకాండం 30:15, 16, 19, 20; “స్వేచ్ఛా చిత్తం” చూడండి.

“ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు”

13, 14. దేవుని ఆజ్ఞలు కష్టమైనవి కావని మనకెలా తెలుసు? ఉదాహరణ చెప్పండి.

13 యెహోవా ఆజ్ఞలు పాటించడానికి చాలా కష్టంగా ఉన్నాయని, లేదా అవి మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నాయని అనిపిస్తే అప్పుడేంటి? బైబిలు స్పష్టంగా ఇలా చెప్తుంది: “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) “భారమైనవి” అని అనువదించిన గ్రీకు పదానికి “బరువైనవి” అని అర్థం. ఆ పదాన్ని వేరే లేఖనాల్లో, కఠినమైన నియమాల్ని వర్ణించడానికి లేదా ఇతరుల మీద అధికారం చెలాయిస్తూ బాధపెట్టేవాళ్లను వర్ణించడానికి ఉపయోగించారు. (మత్తయి 23:4; అపొస్తలుల కార్యాలు 20:29, 30) పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌లో దాన్ని ఇలా అనువదించారు: “ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు.” అవును, యెహోవా ఆజ్ఞలు పాటించడానికి మరీ కష్టంగా ఉండవు. నిజానికి ఆయన మన నుండి ఎక్కువ ఆశించడు.

14 ఉదాహరణకు, మీ స్నేహితుడు ఇల్లు మారుతున్నాడు అనుకోండి. మీరు అతనికి సాయం చేయడానికి వెళ్లారు. అతను సామాన్లన్నీ పెట్టెల్లోకి సర్దాడు. కొన్ని పెట్టెలు తేలిగ్గా ఉన్నాయి, కొన్ని మాత్రం బరువుగా ఉన్నాయి. అతను చాలా బరువున్న ఒక పెట్టెను మీ ఒక్కరితోనే మోయిస్తాడా? లేదు. ఎందుకంటే అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోడు. ఆ స్నేహితుడిలాగే యెహోవా కూడా కష్టమైనదాన్ని చేయమని మనకు చెప్పడు. (ద్వితీయోపదేశకాండం 30:11-14) మన గురించి యెహోవాకు తెలుసు. “మనం ఎలా తయారుచేయబడ్డామో ఆయనకు బాగా తెలుసు, మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు.”—కీర్తన 103:14.

15. యెహోవా ఆజ్ఞలు మన మంచి కోసమే అని ఎందుకు నమ్మవచ్చు?

15 యెహోవా ఆజ్ఞలకు లోబడితే “ఎప్పుడూ మంచి” జరుగుతుందని, “సజీవంగా” ఉంటారని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండం 5:28-33; 6:24) మన విషయంలో కూడా అది నిజం. యెహోవా ఏం చెప్పినా మన మంచి కోసమే, మనం బాగుండాలనే చెప్తాడు. (యెషయా 48:17 చదవండి.) మనకు ఏది మంచిదో మన తండ్రైన యెహోవాకు బాగా తెలుసు. (రోమీయులు 11:33) “దేవుడు ప్రేమ” అని బైబిలు చెప్తుంది. (1 యోహాను 4:8) అంటే యెహోవా చెప్పే ప్రతీ మాటలో, చేసే ప్రతీ పనిలో ప్రేమ కనిపిస్తుంది.

16. మనం అపరిపూర్ణులమైనా, చెడ్డ లోకంలో జీవిస్తున్నా దేవునికి లోబడగలమని ఎందుకు చెప్పవచ్చు?

16 దేవునికి లోబడడం అన్నిసార్లూ అంత తేలిక కాదు. ఎందుకంటే మనం అపవాది గుప్పిట్లో ఉన్న చెడ్డ లోకంలో జీవిస్తున్నాం. చెడు చేసేలా అతను ప్రజల్ని తప్పుదారి పట్టిస్తాడు. (1 యోహాను 5:19) అంతేకాదు మన అపరిపూర్ణ ఆలోచనలతో, భావాలతో కూడా మనం పోరాడాలి. ఎందుకంటే అవి మనల్ని దేవునికి లోబడకుండా చేస్తాయి. (రోమీయులు 7:21-25) కానీ యెహోవా మీద మనకున్న ప్రేమ సరైనది చేయడానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. తనకు లోబడడానికి మనం చేసే కృషిని ఆయన గమనిస్తాడు, తన శక్తివంతమైన పవిత్రశక్తిని ఇచ్చి సహాయం చేస్తాడు. (1 సమూయేలు 15:22, 23; అపొస్తలుల కార్యాలు 5:32) పవిత్రశక్తి మనలో పుట్టించే లక్షణాల వల్ల దేవునికి లోబడడం మనకు తేలికౌతుంది.—గలతీయులు 5:22, 23.

17, 18. (ఎ) ఈ పుస్తకంలో ఏం తెలుసుకుంటాం? (బి) తర్వాతి అధ్యాయంలో ఏం పరిశీలిస్తాం?

17 ఈ పుస్తకంలో మనం యెహోవాను సంతోషపెట్టే విధంగా ఎలా జీవించాలో తెలుసుకుంటాం. ఆయన సూత్రాల్ని, నైతిక ప్రమాణాల్ని మన జీవితంలో ఎలా పాటించాలో పరిశీలిస్తాం. తనకు లోబడమని యెహోవా ఎన్నడూ మనల్ని బలవంతపెట్టడని గుర్తుంచుకోండి. మనం ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడితే మన జీవితం బాగుంటుంది, అద్భుతమైన భవిష్యత్తు సొంతమౌతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, లోబడడం ద్వారా దేవుని మీద మనకెంత ప్రేమ ఉందో చూపిస్తాం.—“నైతిక ప్రమాణాలు” చూడండి.

18 ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవడానికి యెహోవా మనలో ప్రతీ ఒక్కరికి మనస్సాక్షిని ఇచ్చాడు. మన మనస్సాక్షికి శిక్షణ ఇస్తే, ‘దేవుని ఆజ్ఞల్ని పాటించేలా’ అది మనకు సహాయం చేస్తుంది. ఇంతకీ మనస్సాక్షి అంటే ఏంటి? దానికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చు? తర్వాతి అధ్యాయంలో పరిశీలిద్దాం.