సమూయేలు మొదటి గ్రంథం 15:1-35
15 తర్వాత సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నిన్ను రాజుగా అభిషేకించడానికి+ యెహోవా నన్ను పంపాడు. ఇప్పుడు యెహోవా చెప్పేది విను.+
2 సైన్యాలకు అధిపతైన యెహోవా చెప్పేదేమిటంటే: ‘ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తుండగా అమాలేకీయులు వాళ్లకు వ్యతిరేకంగా లేచినందుకు+ నేను అమాలేకీయుల మీద పగతీర్చుకుంటాను.
3 ఇప్పుడు వెళ్లి అమాలేకీయుల్ని చంపు.+ వాళ్ల దగ్గర ఉన్నవాటన్నిటితో పాటు వాళ్లను నాశనం చేయి.+ నువ్వు వాళ్లను విడిచిపెట్టకూడదు;* నువ్వు వాళ్లను, అంటే మగవాళ్లనూ ఆడవాళ్లనూ పిల్లల్నీ చంటిబిడ్డల్నీ అందర్నీ చంపాలి;+ అలాగే ఎద్దుల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని, గాడిదల్ని కూడా నాశనం చేయాలి.’ ”+
4 అప్పుడు సౌలు ప్రజల్ని పిలిపించి, తెలెయీములో వాళ్లను లెక్కపెట్టాడు: 2,00,000 మంది సైనికులు, 10,000 మంది యూదావాళ్లు ఉన్నారు.+
5 సౌలు అమాలేకు నగరం వరకు వెళ్లి, లోయ* దగ్గర మాటు వేయించాడు.
6 అప్పుడు సౌలు కేనీయులతో+ ఇలా చెప్పాడు: “నేను అమాలేకీయులతో పాటు మిమ్మల్ని తుడిచిపెట్టకుండా వాళ్ల మధ్య నుండి వెళ్లిపోండి.+ ఎందుకంటే ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులందరి మీద మీరు విశ్వసనీయ ప్రేమ చూపించారు.”+ దాంతో కేనీయులు అమాలేకీయుల మధ్య నుండి వెళ్లిపోయారు.
7 తర్వాత సౌలు హవీలా+ నుండి ఐగుప్తు పక్కనున్న షూరు+ వరకు అమాలేకీయుల్ని చంపాడు.+
8 అతను అమాలేకు రాజైన అగగును+ ప్రాణాలతో పట్టుకున్నాడు, కానీ మిగతా ప్రజలందర్నీ కత్తితో చంపాడు.+
9 అయితే సౌలు, అలాగే ప్రజలు అగగుతోపాటు మందలో, పశువుల్లో శ్రేష్ఠమైనవాటిని, కొవ్విన జంతువుల్ని, పొట్టేళ్లను, మంచి వాటన్నిటినీ చంపకుండా వదిలేశారు.*+ వాళ్లు వాటిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. కానీ పనికిరాని, అనవసరమైన వాటన్నిటినీ వాళ్లు నాశనం చేశారు.
10 అప్పుడు యెహోవా వాక్యం సమూయేలు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:
11 “నేను సౌలును రాజుగా చేసినందుకు విచారపడుతున్నాను,* ఎందుకంటే అతను నన్ను అనుసరించకుండా పక్కకు మళ్లాడు; అతను నా మాటల్ని పాటించలేదు.”+ అప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు, రాత్రంతా అతను యెహోవాకు మొరపెడుతూనే ఉన్నాడు.+
12 సమూయేలు సౌలును కలవడానికి ఉదయాన్నే లేచినప్పుడు, “సౌలు కర్మెలుకు+ వెళ్లాడు, అతను అక్కడ తన కోసం ఒక స్థూపాన్ని నిలబెట్టించుకున్నాడు.+ ఆ తర్వాత అక్కడి నుండి గిల్గాలుకు వెళ్లాడు” అని అతనికి తెలిసింది.
13 చివరికి సమూయేలు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు సమూయేలుతో, “యెహోవా నిన్ను ఆశీర్వదించాలి. నేను యెహోవా చెప్పిన మాటను పాటించాను” అన్నాడు.
14 కానీ సమూయేలు, “మరి నా చెవులకు వినబడుతున్న ఈ మంద శబ్దం, పశువుల శబ్దం ఏంటి?”+ అన్నాడు.
15 దానికి సౌలు ఇలా చెప్పాడు: “వాటిని అమాలేకీయుల దగ్గర నుండి తీసుకొచ్చారు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వడానికి ప్రజలు మందలో, పశువుల్లో శ్రేష్ఠమైన వాటిని ఉండనిచ్చారు.* కానీ మిగిలిన వాటన్నిటినీ మేము నాశనం చేశాం.”
16 అప్పుడు సమూయేలు సౌలుతో, “మాట్లాడకు! నిన్న రాత్రి యెహోవా నాకు ఏమి చెప్పాడో నీకు చెప్తాను”+ అన్నాడు. దానికి సౌలు, “చెప్పు” అన్నాడు.
17 సమూయేలు ఇలా చెప్పాడు: “నువ్వు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకుడిగా చేయబడినప్పుడు, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించినప్పుడు+ నువ్వు చాలా తక్కువవాడివని నువ్వు అనుకోలేదా?+
18 యెహోవా ఆ తర్వాత నిన్ను ఒక పని మీద పంపిస్తూ, ‘వెళ్లి పాపులైన అమాలేకీయుల్ని నాశనం చేయి.+ వాళ్లను పూర్తిగా నిర్మూలించే వరకు+ వాళ్లతో పోరాడు’ అని చెప్పాడు.
19 మరి నువ్వు యెహోవా స్వరానికి ఎందుకు లోబడలేదు? దానికి బదులు నువ్వు దోపుడుసొమ్ము మీదికి ఆత్రంగా ఎగబడ్డావు,+ యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించావు!”
20 అయితే సౌలు సమూయేలుతో ఇలా అన్నాడు: “కానీ నేను యెహోవా స్వరానికి లోబడ్డాను! యెహోవా నన్ను పంపించిన పనిమీద వెళ్లాను; అమాలేకు రాజైన అగగును తీసుకొచ్చాను, అమాలేకీయుల్ని నాశనం చేశాను.+
21 అయితే ప్రజలు, గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి దోపుడుసొమ్ములో నుండి గొర్రెల్ని, పశువుల్ని అంటే నాశనం చేయాల్సిన వాటిలో నుండి శ్రేష్ఠమైనవి తీసుకున్నారు.”+
22 అప్పుడు సమూయేలు ఇలా అన్నాడు: “యెహోవాను ఏది ఎక్కువ సంతోషపెడుతుంది? జంతువుల్ని దహనబలులుగా అర్పించడమా+ లేక యెహోవా మాటకు* లోబడడమా? చూడు! బలి అర్పించడం కన్నా లోబడడం మంచిది,+ పొట్టేళ్ల కొవ్వును+ అర్పించడం కన్నా మాట వినడం మంచిది.
23 ఎందుకంటే, తిరుగుబాటు చేయడం+ సోదె చెప్పడమనే పాపంతో+ సమానం, అహంకారంగా ప్రవర్తించడం మంత్రశక్తుల్ని ఉపయోగించడంతో, విగ్రహాల్ని పూజించడంతో* సమానం. నువ్వు యెహోవా మాటను+ తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు.”+
24 అప్పుడు సౌలు సమూయేలుతో ఇలా అన్నాడు: “నేను పాపం చేశాను; నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటల్ని మీరాను. ఎందుకంటే నేను ప్రజలకు భయపడి వాళ్ల మాట విన్నాను.
25 దయచేసి ఇప్పుడు నా పాపాన్ని క్షమించు, నేను యెహోవా ఎదుట సాష్టాంగపడడానికి తిరిగి నాతోపాటు రా.”+
26 కానీ సమూయేలు సౌలుతో, “నేను నీతోపాటు రాను, ఎందుకంటే నువ్వు యెహోవా మాటను తిరస్కరించావు, నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా కొనసాగకుండా యెహోవా నిన్ను తిరస్కరించాడు”+ అన్నాడు.
27 సమూయేలు వెళ్లిపోవడానికి తిరుగుతుండగా, సౌలు సమూయేలు వేసుకున్న చేతుల్లేని నిలువుటంగీ అంచును పట్టుకున్నాడు. అయితే అది చిరిగిపోయింది.
28 అప్పుడు సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు: “ఇదేవిధంగా యెహోవా ఈ రోజు ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ నుండి తీసేశాడు, దాన్ని ఆయన నీకన్నా ఉత్తముడైన నీ తోటివాడికి ఇస్తాడు.+
29 ఇశ్రాయేలు మహోన్నతుడు+ అబద్ధమాడడు,+ మనసు మార్చుకోడు;* మనసు మార్చుకోవడానికి* ఆయన మనిషి కాదు.”+
30 అప్పుడు సౌలు ఇలా అన్నాడు: “నేను పాపం చేశాను, కానీ దయచేసి నా ప్రజల పెద్దల ముందు, ఇశ్రాయేలీయుల ముందు నన్ను ఘనపర్చు. నాతోపాటు రా, నేను నీ దేవుడైన యెహోవా ఎదుట సాష్టాంగపడతాను.”+
31 దాంతో సమూయేలు సౌలు వెనకాల వెళ్లాడు, సౌలు యెహోవా ఎదుట సాష్టాంగపడ్డాడు.
32 సమూయేలు, “అమాలేకు రాజైన అగగును నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు. అప్పుడు అగగు అయిష్టంగా* సమూయేలు దగ్గరికి వెళ్లాడు; ఎందుకంటే అప్పటివరకు అతను, ‘ప్రాణాపాయం ఖచ్చితంగా తప్పిపోయింది’ అని అనుకుంటూ ఉన్నాడు.
33 అయితే సమూయేలు, “నీ కత్తి వల్ల స్త్రీలు పిల్లల్ని కోల్పోయి దుఃఖిస్తున్నట్టే, నీ తల్లి కూడా పిల్లలు లేనిదౌతుంది” అన్నాడు. ఆ మాట అని సమూయేలు గిల్గాలులో యెహోవా ఎదుట అగగును ముక్కలుముక్కలుగా నరికాడు.+
34 తర్వాత సమూయేలు రామాకు వెళ్లిపోయాడు, సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయాడు.
35 సమూయేలు తాను చనిపోయే రోజు వరకు మళ్లీ సౌలును చూడలేదు, సమూయేలు సౌలు విషయంలో దుఃఖిస్తూ ఉన్నాడు.+ సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు యెహోవా విచారపడ్డాడు.+
అధస్సూచీలు
^ లేదా “వాళ్లమీద కనికరం చూపించకూడదు.”
^ లేదా “వాగు.”
^ లేదా “కనికరం చూపించారు.”
^ లేదా “దుఃఖపడుతున్నాను.”
^ లేదా “వాటిమీద కనికరం చూపించారు.”
^ అక్ష., “స్వరానికి.”
^ అక్ష., “గృహదేవతల విగ్రహాలతో.”
^ లేదా “విచారపడడు.”
^ లేదా “విచారపడడానికి.”
^ లేదా “ధైర్యంగా” అయ్యుంటుంది.