ద్వితీయోపదేశకాండం 6:1-25

  • నిండు హృదయంతో యెహోవాను ప్రేమించాలి (1-9)

    • “ఓ ఇశ్రాయేలూ, విను” (4)

    • తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశించాలి (6, 7)

  • యెహోవాను మర్చిపోవద్దు (10-15)

  • యెహోవాను పరీక్షించకూడదు (16-19)

  • తర్వాతి తరానికి చెప్పాలి (20-25)

6  “మీకు నేర్పించడానికి మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు, న్యాయనిర్ణయాలు ఇవే. మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో అడుగుపెట్టినప్పుడు వీటిని పాటించాలి.  నువ్వు నీ జీవితకాలమంతా నీ దేవుడైన యెహోవాకు భయపడుతూ, నేను నీకు, అంటే నీకూ నీ కుమారుడికీ నీ మనవడికీ ఆజ్ఞాపిస్తున్న ఆయన శాసనాలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.+ అప్పుడు నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు.  ఓ ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీకు ప్రమాణం చేసినట్టే నువ్వు పాలుతేనెలు ప్రవహించే దేశంలో వర్ధిల్లేలా, మీ సంఖ్య ఎక్కువయ్యేలా నువ్వు వీటిని విని, జాగ్రత్తగా పాటించాలి.  “ఓ ఇశ్రాయేలూ, విను: మన దేవుడైన యెహోవా ఒకేఒక్క యెహోవా.+  నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో,* నీ పూర్తి బలంతో* ప్రేమించాలి.+  నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి.  నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి;*+ నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.+  జ్ఞాపికగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి; అవి నీ నుదుటి మీద* బాసికంలా ఉండాలి.+  వాటిని నీ ఇంటి గుమ్మాల మీద, నీ నగర ద్వారాల మీద రాయాలి. 10  “నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తానని నీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశంలోకి నిన్ను తీసుకొచ్చినప్పుడు, అంటే నువ్వు నిర్మించని శ్రేష్ఠమైన గొప్ప నగరాలూ, 11  నువ్వు కష్టపడి సంపాదించని అన్నిరకాల మంచి వస్తువులతో నిండివున్న ఇళ్లూ, నువ్వు తవ్వని బావులూ, నువ్వు నాటని ద్రాక్షతోటలూ ఒలీవ చెట్లూ ఉన్న దేశంలోకి నిన్ను తీసుకొచ్చినప్పుడు, నువ్వు తిని, తృప్తి పొందిన తర్వాత 12  దాస్య గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన యెహోవాను మర్చిపోకుండా జాగ్రత్తపడు.+ 13  నువ్వు నీ దేవుడైన యెహోవాకు భయపడాలి,+ ఆయన్నే సేవించాలి,+ ఆయన పేరు మీదే ప్రమాణం చేయాలి.+ 14  నువ్వు వేరే దేవుళ్లను, అంటే నీ చుట్టూ ఉన్న జనాలు పూజించే ఏ దేవుళ్లనూ అనుసరించకూడదు.+ 15  ఎందుకంటే నీ మధ్య ఉన్న నీ దేవుడైన యెహోవా సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు.+ ఒకవేళ నువ్వు వేరే దేవుళ్లను అనుసరిస్తే, నీ దేవుడైన యెహోవా కోపం నీమీద రగులుకుంటుంది,+ ఆయన నిన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాడు.+ 16  “మీరు మస్సా దగ్గర పరీక్షించినట్టు+ మీ దేవుడైన యెహోవాను పరీక్షించకూడదు.+ 17  మీరు పాటించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని, జ్ఞాపికల్ని, నియమాల్ని మీరు శ్రద్ధగా పాటించాలి. 18  నువ్వు యెహోవా దృష్టిలో సరైనదాన్ని, మంచిదాన్ని చేయాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, అలాగే యెహోవా నీ పూర్వీకులకు ప్రమాణం చేసిన మంచి దేశంలోకి అడుగుపెట్టి, దాన్ని స్వాధీనం చేసుకుంటావు.+ 19  యెహోవా ప్రమాణం చేసినట్టే నువ్వు నీ శత్రువులందర్నీ నీ ముందు నుండి వెళ్లగొడతావు.+ 20  “భవిష్యత్తులో నీ కుమారుడు నిన్ను, ‘మన దేవుడైన యెహోవా మీకు ఈ జ్ఞాపికల్ని, నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని ఎందుకు ఇచ్చాడు?’ అని అడిగినప్పుడు, 21  నువ్వు నీ కుమారుడికి ఇలా చెప్పాలి: ‘ఐగుప్తులో మేము ఫరోకు బానిసలుగా ఉండేవాళ్లం, కానీ యెహోవా మమ్మల్ని తన బలమైన చేతితో ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు. 22  అప్పుడు యెహోవా మా కళ్లముందు ఐగుప్తు మీదికి,+ ఫరో మీదికి, అతని ఇంటివాళ్లందరి మీదికి నాశనకరమైన గొప్ప సూచనల్ని, అద్భుతాల్ని పంపిస్తూ వచ్చాడు.+ 23  ఆయన మన పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేలా మనల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఆయన మనల్ని అక్కడి నుండి బయటికి తెచ్చాడు.+ 24  తర్వాత, మనకు ఎప్పుడూ మంచి జరిగేలా, నేడు ఉన్నట్టు మనం సజీవంగా ఉండేలా ఈ నియమాలన్నిటినీ పాటించమని, మన దేవుడైన యెహోవాకు భయపడమని+ యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. 25  మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్టే మనం ఆయనకు లోబడుతూ* ఈ ఆజ్ఞలన్నిటినీ జాగ్రత్తగా పాటిస్తే మనం నీతిమంతులుగా ఎంచబడతాం.’+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “శక్తితో; వనరులతో.”
లేదా “వాటిని మళ్లీమళ్లీ చెప్పాలి; వాళ్ల హృదయాలపై ముద్రవేయాలి.”
అక్ష., “నీ కళ్ల మధ్య.”
అక్ష., “ఆయన ముందు.”