రోమీయులు 14:1-23

  • ఒకరికొకరు తీర్పు తీర్చుకోకండి (1-12)

  • వేరేవాళ్లను విశ్వాసంలో తడబడేలా చేయకండి (13-18)

  • శాంతి, ఐక్యతల కోసం కృషిచేయండి (19-23)

14  విశ్వాసంలో బలహీనంగా ఉన్న వ్యక్తిని స్వీకరించండి,+ అయితే వ్యక్తిగత అభిప్రాయాల్ని* బట్టి అతనికి తీర్పు తీర్చకండి.  ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని బట్టి అన్నీ తింటాడు, విశ్వాసంలో బలహీనంగా ఉన్న వ్యక్తి కూరగాయలు మాత్రమే తింటాడు.  అన్నీ తినే వ్యక్తి, అన్నీ తినని వ్యక్తిని చిన్నచూపు చూడకూడదు. అన్నీ తినని వ్యక్తి, అన్నీ తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు.+ ఎందుకంటే దేవుడు అతన్ని స్వీకరించాడు.  ఇంకొకరి సేవకునికి తీర్పుతీర్చడానికి నువ్వు ఎవరు?+ అతను చేసేది తప్పో కాదో అతని యజమాని నిర్ణయిస్తాడు.+ యెహోవా* అతనికి సహాయం చేయగలడు, అతను ఆయన ముందు మంచి స్థానం కలిగివుండవచ్చు.  ఒకతను, ఒక రోజు కన్నా ఇంకో రోజు మంచిదని అనుకుంటాడు; ఇంకొకతను అన్ని రోజులూ ఒకటే అనుకుంటాడు;+ అయితే తాను నమ్మేది సరైనది అనే పూర్తి నమ్మకం ప్రతీ ఒక్కరికి ఉండాలి.  ఒక రోజును ప్రత్యేకంగా ఎంచే వ్యక్తి యెహోవా* కోసం అలా చేస్తున్నాడు. అన్నీ తినే వ్యక్తి యెహోవా* కోసం తింటున్నాడు, ఎందుకంటే అతను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు;+ అలాగే అన్నీ తినని వ్యక్తి యెహోవా* కోసం అలా తినకుండా ఉంటున్నాడు, అయినా అతను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.+  మనలో ఏ ఒక్కరం మనకోసమే బ్రతకం,+ మనకోసమే చనిపోం.  మనం బ్రతికినా యెహోవా* కోసం బ్రతుకుతాం,+ చనిపోయినా యెహోవా* కోసం చనిపోతాం. కాబట్టి మనం బ్రతికినా, చనిపోయినా యెహోవాకు* చెందినవాళ్లం.+  క్రీస్తు ఇందుకోసమే, అంటే చనిపోయినవాళ్ల మీద, బ్రతికున్నవాళ్ల మీద ప్రభువుగా ఉండడం కోసం చనిపోయి తిరిగి బ్రతికాడు.+ 10  అలాంటప్పుడు, నువ్వు ఎందుకు నీ సహోదరునికి తీర్పు తీరుస్తున్నావు?+ లేదా ఎందుకు నీ సహోదరుణ్ణి చిన్నచూపు చూస్తున్నావు? మనమందరం దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాం.+ 11  ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “యెహోవా* ఏమంటున్నాడంటే, ‘నా జీవం తోడు’+ ‘ప్రతీ మోకాలు నా ముందు వంగుతుంది, ప్రతీ నాలుక నేను దేవుణ్ణని బహిరంగంగా ఒప్పుకుంటుంది.’ ”+ 12  అందుకే, మనలో ప్రతీ ఒక్కరు తన గురించి దేవునికి లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.+ 13  కాబట్టి, ఇకమీదట మనం ఒకరికొకరం తీర్పు తీర్చుకోకుండా ఉందాం.+ బదులుగా, సహోదరుని ముందు అడ్డురాయి గానీ, అడ్డంకి గానీ పెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుందాం.+ 14  సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని ప్రభువైన యేసు శిష్యునిగా నాకు తెలుసు, నేను దీన్ని బలంగా నమ్ముతున్నాను;+ అయితే ఒక వ్యక్తి దేన్నైనా అపవిత్రమని ఎంచితే, అప్పుడది అతనికి అపవిత్రమైనది అవుతుంది. 15  నువ్వు తినే ఆహారం వల్ల నీ సహోదరుడు నొచ్చుకుంటే, నువ్వు ఇక ప్రేమతో నడుచుకోవట్లేదని అర్థం.+ ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో అతన్ని నీ ఆహారంతో నాశనం చేయకు.+ 16  కాబట్టి మీకు మంచివని అనిపించినా, ఇతరులు మీ గురించి చెడుగా మాట్లాడుకునేట్టు చేసే వాటిని చేయకండి. 17  ఎందుకంటే దేవుని రాజ్యం అంటే తినడం, తాగడం కాదుగానీ+ నీతి, శాంతి, పవిత్రశక్తి ద్వారా కలిగే సంతోషం. 18  ఈ విధంగా క్రీస్తుకు దాసులుగా ఉండేవాళ్లు దేవుని అంగీకారాన్ని, మనుషుల ఆమోదాన్ని పొందుతారు. 19  కాబట్టి ఇతరులతో శాంతిగా ఉండడానికి,+ ఒకరినొకరం బలపర్చుకోవడానికి+ చేయగలిగినదంతా చేద్దాం. 20  కేవలం ఆహారం కోసం దేవుని పనిని పాడుచేయడం ఆపేయి.+ నిజమే, అన్నీ పవిత్రమైనవే; అయితే ఇతరుల్ని విశ్వాసంలో తడబడేలా చేసే వాటిని తినడం తప్పు.*+ 21  మాంసం తినడమైనా, ద్రాక్షారసం తాగడమైనా, నీ సహోదరుణ్ణి విశ్వాసంలో తడబడేలా చేసే ఏ పనైనా చేయకపోవడమే మంచిది.+ 22  నీకున్న విశ్వాసాన్ని నీకూ దేవునికీ మధ్యే ఉంచుకో. తాను ఆమోదించే వాటిని బట్టి తనకు తాను తీర్పు తీర్చుకోని వ్యక్తి సంతోషంగా ఉంటాడు. 23  కానీ అతనికి అనుమానాలు ఉండి దేన్నైనా తింటే, అతను అప్పటికే తనకు తాను శిక్ష విధించుకున్నాడు. ఎందుకంటే అతను విశ్వాసంతో తినలేదు. నిజానికి, విశ్వాసంతో చేయని ప్రతీది పాపమే.

అధస్సూచీలు

లేదా “మనసులో మెదిలే ప్రశ్నల్ని” అయ్యుంటుంది.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “హానికరం.”