రోమీయులు 6:1-23
6 మరైతే ఏమనాలి? దేవుడు ఎక్కువ అపారదయ చూపించాలని మనం పాపం చేస్తూనే ఉండాలా?
2 కానేకాదు! పాపం విషయంలో చనిపోయిన మనం,+ ఇంకా పాపం చేస్తూ ఎలా ఉండగలం?+
3 బాప్తిస్మం తీసుకొని క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉన్న మనందరం+ ఆయన మరణంలోకి కూడా బాప్తిస్మం తీసుకున్నామని+ మీకు తెలీదా?
4 ఆయన మరణంలోకి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మనం ఆయనతోపాటు పాతిపెట్టబడ్డాం.+ తండ్రి మహిమగల శక్తి ద్వారా క్రీస్తు మృతుల్లో నుండి బ్రతికించబడి కొత్త జీవితం జీవిస్తున్నట్టే మనం కూడా కొత్త జీవితం జీవించడానికి పాతిపెట్టబడ్డాం.+
5 మనం ఆయనలా చనిపోయాం అంటే,+ నిస్సందేహంగా ఆయనలాగే తిరిగి బ్రతికించబడతాం* కూడా.+ అలా మనం ఆయనతో ఐక్యంగా ఉంటాం.
6 మన పాత వ్యక్తిత్వం ఆయనతోపాటు కొయ్యకు దిగగొట్టబడిందని+ మనకు తెలుసు. మన పాపభరిత శరీరం మన మీద అధికారం చెలాయించకూడదని,+ మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకూడదని+ అలా దిగగొట్టబడింది.
7 ఎందుకంటే చనిపోయిన వ్యక్తి తన పాపం నుండి విడుదల పొందాడు.*
8 అంతేకాదు, మనం క్రీస్తుతోపాటు చనిపోయాం అంటే, ఆయనతోపాటు జీవిస్తాం అని కూడా నమ్ముతాం.
9 మృతుల్లో నుండి బ్రతికించబడిన క్రీస్తు ఇక చనిపోడని+ మనకు తెలుసు. మరణానికి ఇక ఆయన మీద అధికారం లేదు.
10 పాపం విషయంలో* ఆయన ఒక్కసారే చనిపోయాడు;+ కానీ ఇప్పుడు ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి జీవిస్తున్నాడు.
11 అలాగే, మీరు కూడా పాపం విషయంలో చనిపోయారని, క్రీస్తుయేసు శిష్యులుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి జీవిస్తున్నారని అనుకోండి.+
12 కాబట్టి నశించిపోయే మీ శరీరాల మీద పాపాన్ని రాజుగా ఏలనివ్వకండి,+ అప్పుడు మీరు శరీర కోరికలకు లొంగిపోరు.
13 అంతేకాదు మీ శరీరాల్ని* అవినీతి ఆయుధాలుగా పాపానికి అప్పగిస్తూ ఉండకండి. బదులుగా చనిపోయి బ్రతికిన వాళ్లలా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి, మీ శరీరాల్ని* కూడా నీతి ఆయుధాలుగా దేవునికి అప్పగించండి.+
14 ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం కింద కాకుండా దేవుని అపారదయ+ కింద ఉన్నారు కాబట్టి పాపాన్ని మీ మీద ఏలనివ్వకండి.+
15 మరైతే మనం ఏ ముగింపుకు రావాలి? మనం ధర్మశాస్త్రం కింద కాకుండా దేవుని అపారదయ కింద ఉన్నామని+ పాపం చేయాలా? అలా ఎప్పటికీ జరగకూడదు!
16 మీకు తెలీదా? మీరు లోబడడానికి ఎవరికైనా మిమ్మల్ని మీరు దాసుల్లా అప్పగించుకుంటే, ఆ వ్యక్తికి* మీరు దాసులౌతారు;+ మీరు పాపానికి దాసులుగా+ ఉంటే చనిపోతారు,+ కానీ దేవునికి దాసులుగా ఉండి ఆయనకు లోబడితే నీతిమంతులౌతారు.
17 ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నా, మీకు అప్పగించబడిన బోధకు మనస్ఫూర్తిగా లోబడ్డారు, అందుకు దేవునికి కృతజ్ఞతలు.
18 అవును, మీరు పాపం నుండి విడుదల చేయబడ్డారు+ కాబట్టి నీతికి దాసులయ్యారు.+
19 నేను మనుషులకు అర్థమయ్యే మాటలు ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీరు పాపం వల్ల బలహీనంగా ఉన్నారు; అంతకుముందు మీరు చెడ్డపనులు చేయడానికి మీ అవయవాల్ని అపవిత్రతకు, అవినీతికి దాసులుగా అప్పగించుకున్నారు, అలాగే ఇప్పుడు పవిత్రమైన పనులు చేయడానికి మీ అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించుకోండి.+
20 ఎందుకంటే, మీరు పాపానికి దాసులుగా ఉన్నప్పుడు నీతి విషయంలో స్వతంత్రులుగా ఉండేవాళ్లు.
21 మరైతే ఆ సమయంలో మీరు ఎలాంటి ఫలాలు ఫలించారు? ఎలాంటివంటే, వాటి గురించి ఇప్పుడు మీరు సిగ్గుపడుతున్నారు. వాటివల్ల చివరికి వచ్చేది మరణమే.+
22 ఇప్పుడైతే మీరు పాపం నుండి విడుదల చేయబడి దేవునికి దాసులయ్యారు కాబట్టి, పవిత్రతకు సంబంధించిన ఫలాలు ఫలిస్తున్నారు.+ వాటివల్ల చివరికి శాశ్వత జీవితం వస్తుంది.+
23 పాపంవల్ల వచ్చే జీతం మరణం,+ కానీ దేవుడు ఇచ్చే బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా శాశ్వత జీవితం.+
అధస్సూచీలు
^ లేదా “పునరుత్థానం చేయబడతాం.”
^ లేదా “పాపక్షమాపణ పొందాడు.”
^ అంటే, పాపాన్ని తీసేయడానికి.
^ అక్ష., “అవయవాల్ని.”
^ అక్ష., “అవయవాల్ని.”
^ లేదా “మీరు ఎవరికైతే లోబడుతున్నారో ఆ వ్యక్తికి.”