కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి​—⁠అది సజీవమైనది!

దేవుని వాక్యాన్ని ఉపయోగించండి​—⁠అది సజీవమైనది!

‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది.’—హెబ్రీ. 4:12.

1, 2. యెహోవా మోషేకు ఏ పని అప్పగించాడు? ఏ అభయం ఇచ్చాడు?

 యెహోవా ప్రజల తరఫున మాట్లాడడానికి మీరు, భూమ్మీద అత్యంత శక్తిమంతుడైన పరిపాలకుని ముందు నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. మీకెలా అనిపిస్తుంది? బహుశా మీకు కంగారుగా, మాట్లాడే సామర్థ్యం లేదన్నట్లుగా, భయంభయంగా అనిపించవచ్చు. మీరు చెప్పాలనుకున్న దానికోసం ఎలా సిద్ధపడతారు? మీరు సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధి కాబట్టి అధికారంగల వ్యక్తిలా మాట్లాడగలుగుతారా?

2 మోషేకు సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఐగుప్తు బానిసత్వం, అణిచివేత నుండి దేవుని ప్రజల్ని విడిపించడానికి ఫరో దగ్గరకు వెళ్లమని, ‘భూమ్మీదున్న వాళ్లందరిలో మిక్కిలి సాత్వికుడైన’ మోషేకు యెహోవా చెప్పాడు. (సంఖ్యా. 12:3) అయితే, తర్వాత జరిగిన సంఘటనలు చూపించినట్లు, ఫరో ఇతరులంటే లెక్కలేని, పొగరుబోతు. (నిర్గ. 5:1, 2) అయినా, ఐగుప్తులో ఉన్న లక్షలమంది బానిసల్ని విడిచిపెట్టేలా ఫరోను ఆజ్ఞాపించమని యెహోవా మోషేకు చెప్పాడు. అందుకు మోషే, “నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడను” అని అన్నాడు. ఆ పని తనవల్ల కాదని, తనకు అంత సామర్థ్యం లేదని మోషేకు అనిపించివుంటుంది. కానీ, “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును” అని చెబుతూ మోషే ఒంటరి వాడు కాడని యెహోవా అభయమిచ్చాడు.—నిర్గ. 3:9-12.

3, 4. (ఎ) మోషే ఎందుకు భయపడ్డాడు? (బి) మోషేకు ఎదురైనలాంటి సమస్య, మీకు ఎప్పుడు ఎదురుకావచ్చు?

3 మోషేకు ఎలాంటి భయాలు ఉన్నాయి? యెహోవా దేవుని ప్రతినిధి చెప్పే మాటను ఫరో వినడని లేదా పట్టించుకోడని మోషే భయపడ్డాడు. దానితోపాటు, ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తునుండి నడిపించడానికి యెహోవా తనను నియమించాడనే విషయం తన సొంత ప్రజలు నమ్మరని కూడా భయపడ్డాడు. అందుకే మోషే యెహోవాతో ఇలా చెప్పాడు, “చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు —యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు.”—నిర్గ. 3:15-18; 4:1.

4 యెహోవా మోషేకు ఇచ్చిన జవాబు నుండి, దాని తర్వాత జరిగిన సంఘటనల నుండి మనమందరం ఓ శక్తిమంతమైన పాఠం నేర్చుకోవచ్చు. నిజమే, ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి ముందు నిలబడాల్సిన పరిస్థితి మీకు ఎప్పటికీ రాకపోవచ్చు. అయితే దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి మీరు రోజూ కలిసే సామాన్య ప్రజలతో మాట్లాడడం మీకెప్పుడైనా కష్టంగా అనిపించిందా? అయితే, మోషే అనుభవం నుండి మీరేమి నేర్చుకోవచ్చో పరిశీలించండి.

“నీ చేతి లోనిది ఏమిటి?”

5. యెహోవా మోషే చేతికి ఏమి ఇచ్చాడు? అది మోషే భయాలను ఎలా పోగొట్టింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 తన మాటల్ని ఎవరూ పట్టించుకోరని మోషే భయపడినప్పుడు దేవుడు ఆయనకు ఎలా ధైర్యం చెప్పాడు? నిర్గమకాండములోని వృత్తాంతం ఇలా చెబుతుంది, “యెహోవా—నీ చేతి లోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు—కఱ్ఱ అనెను. అప్పుడాయన—నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా—నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కఱ్ఱ ఆయెను. ఆయన—దానిచేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా . . . నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.” (నిర్గ. 4:2-5) అవును, మోషే చెప్పే సందేశం తననుండే వచ్చిందని నిరూపించే ఓ రుజువును దేవుడు మోషే చేతికి ఇచ్చాడు. ఓ మామూలు కర్ర, దేవుని శక్తితో పాములా మారింది! ఆ అద్భుతం యెహోవా మోషే వెన్నంటే ఉన్నాడని నిరూపిస్తూ మోషే మాటలకు ఎంతో శక్తిని చేకూర్చింది. అందుకే యెహోవా మోషేతో, “ఈ కఱ్ఱను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెను” అని చెప్పెను. (నిర్గ. 4:17) దేవుడు ఇచ్చిన అధికారానికి సూచనగా ఉన్న ఆ కర్రతో, మోషే తన సొంత ప్రజల ముందు, ఫరో ముందు ధైర్యంగా సత్యదేవుని గురించి మాట్లాడాడు.—నిర్గ. 4:29-31; 7:8-13.

6. (ఎ) ప్రకటిస్తున్నప్పుడు మన చేతిలో ఏమి ఉంటుంది? ఎందుకు? (బి) దేవుని వాక్యం ఎలా ‘సజీవమైనది’? ఎలా ‘బలముగలది’?

6 “నీ చేతి లోనిది ఏమిటి?” అనే ప్రశ్న, బైబిలు సందేశాన్ని చెప్పడానికి వెళ్లినప్పుడు మనకూ ఎదురుకావచ్చు. చాలాసార్లు, మన చేతిలో ఉపయోగించడానికి వీలుగా బైబిలు ఉంటుంది. కొంతమంది దృష్టిలో బైబిలు కేవలం ఓ మామూలు పుస్తకమైనా, తన ప్రేరేపిత లేఖనాల ద్వారా యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. (2 పేతు. 1:21) దేవుని రాజ్య పరిపాలనలో నెరవేరే వాగ్దానాలు అందులో ఉన్నాయి. అందుకే, ‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది’ అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (హెబ్రీయులు 4:12 చదవండి.) దేవుని వాక్యం ఎలా సజీవమైనది? యెహోవా వాగ్దానాలన్నీ నెరవేరే దిశగా పయనిస్తున్నాయి, అవి సంపూర్ణంగా నెరవేరతాయి. (యెష. 46:10; 55:11) దేవుని వాక్యానికి సంబంధించిన ఈ విషయాన్ని ఓ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు, బైబిల్లో ఆయన చదివే మాటలు ఆయన జీవితంపై బలంగా పనిచేస్తాయి.

7. మనమెలా ‘సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించవచ్చు?’

7 అవును, యెహోవా సజీవమైన తన వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. దాన్ని ఉపయోగించి, మనం ప్రకటించే సందేశం నమ్మదగినదని, అది ఆయన నుండే వచ్చిందని నిరూపించవచ్చు. అందుకే, ‘సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించడానికి’ కృషిచేయమని పౌలు తన ఆధ్యాత్మిక వారసుడైన తిమోతిని ప్రోత్సహించాడు. (2 తిమో. 2:15) ఆ సలహాను మనమెలా పాటించవచ్చు? మన శ్రోతల హృదయాల్ని చేరేలా, జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న లేఖనాల్ని చదివి వినిపించడం ద్వారా అలా చేయవచ్చు. 2013⁠లో విడుదలైన కరపత్రాలను సరిగ్గా అదే ఉద్దేశంతో రూపొందించారు.

జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న ఒక లేఖనాన్ని చదవండి

8. కరపత్రాల గురించి ఒక సేవా పర్యవేక్షకుడు ఏమంటున్నాడు?

8 కొత్తగా విడుదలైన కరపత్రాలన్నీ ఒకేలా ఉన్నాయి. కాబట్టి, ఒక్క కరపత్రాన్ని ఉపయోగించడం నేర్చుకుంటే అన్నిటినీ ఉపయోగించవచ్చు. ఇంతకీ వాటిని ఉపయోగించడం సులభమేనా? అమెరికాలోని, హవాయ్‌ రాష్ట్రంలో ఉన్న ఒక సేవా పర్యవేక్షకుడు ఇలా రాశాడు, “ఈ కొత్త ఉపకరణాలు ఇంటింటి పరిచర్యలో, బహిరంగ సాక్ష్యంలో ఇంత సమర్థవంతంగా ఉంటాయని మేము ఊహించలేదు.” ఈ కరపత్రాలను రాసిన పద్ధతి వల్ల ఇంటివాళ్లు సులభంగా స్పందిస్తున్నారని, అది చక్కని సంభాషణలకు దారితీస్తుందని ఆయన గమనించాడు. కరపత్రం మీద ఉన్న ప్రశ్న, క్రిందున్న వివిధ జవాబుల వల్లే అది సాధ్యమౌతుందని ఆయన అనుకుంటున్నాడు. తప్పు జవాబు చెబుతామేమో అనే ఆందోళన ఇంటివాళ్లకు అవసరం లేదని ఆయన అంటున్నాడు.

9, 10. (ఎ) కరపత్రాల ద్వారా మనం బైబిల్ని ఎలా ఉపయోగించగలం? (బి) మీరు ఏయే కరపత్రాల్ని సమర్థవంతంగా ఉపయోగించారు? ఎందుకు?

9 ప్రతీ కరపత్రంలో జాగ్రత్తగా ఎంపిక చేసిన ఓ లేఖనం ఉంది, దాన్ని మనం గృహస్థులకు చదివి వినిపించవచ్చు. ఉదాహరణకు, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రాన్నే తీసుకోండి. ఆ ప్రశ్నకు వాళ్లు “వస్తుంది,” “రాదు,” “చెప్పలేం” అని ఏ జవాబు చెప్పినా, మీరేమీ మాట్లాడకుండా వెంటనే లోపలి పేజీ చూపించి, “పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయో చూడండి” అని చెప్పండి. తర్వాత ప్రకటన 21:3, 4 చదవండి.

10 అలాగే, బైబిలు ఎలాంటి పుస్తకం? కరపత్రాన్ని ఉపయోగిస్తున్నప్పుడు, ఇంటివాళ్లు అక్కడున్న మూడు జవాబుల్లో దేన్ని ఎంపిక చేసుకున్నా, మీరు లోపలి పేజీ తెరిచి ‘“లేఖనాలన్నీ దేవునిచే ప్రేరేపింపబడినవి” అని బైబిలు చెబుతుంది’ అనవచ్చు. మీరు ఇంకా ఇలా చెప్పవచ్చు, “నిజానికి, ఆ వచనాల్లో చాలా విషయాలు ఉన్నాయి.” అప్పుడు మీ బైబిలు తెరిచి, 2 తిమోతి 3:16, 17 వచనాలను పూర్తిగా చదవండి.

11, 12. (ఎ) పరిచర్యలో మీకు ఏ తృప్తి ఉంటుంది? (బి) పునర్దర్శనాల కోసం సిద్ధపడేందుకు కరపత్రాలు ఎలా సహాయం చేస్తాయి?

11 కరపత్రంలో ఎంత సమాచారం చదవాలి, ఎంత చర్చించాలనేది ఇంటివాళ్ల స్పందన మీద ఆధారపడివుంటుంది. ప్రజలకు కరపత్రం ఇవ్వడంతోపాటు మొదటిసారి కనీసం ఒకట్రెండు వచనాలను చదవగలిగినా, దేవుని వాక్యాన్ని ఇంటివాళ్లకు చదివి వినిపించారనే తృప్తి మీకు ఉంటుంది. మళ్లీ కలిసినప్పుడు మీ చర్చను కొనసాగించవచ్చు.

12 మళ్లీ కలిసినప్పుడు వాళ్లతో చర్చించడానికి వీలుగా, ప్రతీ కరపత్రం వెనక “ఒక్కసారి ఆలోచించండి . . . ” అనే శీర్షిక కింద ఓ ప్రశ్న, దానికి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కరపత్రంలో “దేవుడు ఈ లోకంలో మంచి మార్పును ఎలా తీసుకురాబోతున్నాడు?” అనే ప్రశ్న ఉంది. దాని క్రింద మత్తయి 6:9, 10, దానియేలు 2:44 లేఖనాలు ఉన్నాయి. చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? అనే కరపత్రంలో “మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?” అనే ప్రశ్న ఉంది. ఆదికాండము 3:17-19, రోమీయులు 5:12 లేఖనాలు అక్కడ ఉన్నాయి.

13. బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టడానికి కరపత్రాల్ని ఎలా ఉపయోగించవచ్చో వివరించండి.

13 బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి తొలిమెట్టుగా కరపత్రాల్ని ఉపయోగించండి. ఓ వ్యక్తి, మన కరపత్రం వెనక ఉన్న కోడ్‌ని స్కాన్‌ చేసినప్పుడు, బైబిలు అధ్యయనం చేయడానికి ఆయన్ను ప్రోత్సహించే కొంత సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో చూస్తాడు. ప్రతీ కరపత్రం, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషురులోని ఒకానొక పాఠానికి నడిపిస్తుంది. ఉదాహరణకు, ఈ లోకం ఎవరి గుప్పిట్లో ఉంది? కరపత్రం, బ్రోషురులో 5వ పాఠానికి నడిపిస్తుంది. కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం? కరపత్రం 9వ పాఠానికి నడిపిస్తుంది. కరపత్రాల్ని తయారుచేసిన ఉద్దేశం ప్రకారం ఉపయోగిస్తే, మొదటిసారి కలిసినప్పుడు లేదా పునర్ధర్శనం చేసేటప్పుడు బైబిల్ని ఉపయోగించడం చక్కగా అలవాటు చేసుకుంటారు. దానివల్ల మీరు మరిన్ని బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టగలుగుతారు. పరిచర్యలో బైబిల్ని సమర్థవంతంగా ఉపయోగించాలంటే ఇంకా ఏమి చేయాలి?

ప్రజలు ఎక్కువగా ఆలోచించే అంశాల గురించి మాట్లాడండి

14, 15. మీరు పరిచర్యలో పౌలును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

14 పౌలు తన పరిచర్యలో, “ఎక్కువమంది” ఎలా ఆలోచిస్తున్నారో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాడు. (1 కొరింథీయులు 9:19-23 చదవండి.) ‘యూదులను, ధర్మశాస్త్రానికి లోబడినవారిని, ధర్మశాస్త్రం లేనివారిని, బలహీనులను సంపాదించుకోవాలని’ పౌలు ఎంతో కోరుకున్నాడు. అవును, ఆయన ‘ఏ విధంగానైనా కొంతమందిని రక్షించడం కోసం’ అన్ని రకాల ప్రజలకు సువార్త ప్రకటించాలనుకున్నాడు. (అపొ. 20:20, 21) మనం కూడా ‘మనుష్యులందరికీ’ సత్యాన్ని ప్రకటించడానికి సిద్ధపడుతూ పౌలులా ఎలా ఆలోచించవచ్చు?—1 తిమో. 2:3, 4.

15 పరిచర్యలో ఎలా మాట్లాడాలో మన రాజ్య పరిచర్యలో అనేక సలహాలు వస్తుంటాయి. వాటిని ప్రయత్నించి చూడండి. ఒకవేళ మీ క్షేత్రంలోని ప్రజలు వేరే అంశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా, ఆసక్తి కలిగించేలా మాట్లాడండి. మీ చుట్టుపక్కల పరిస్థితుల గురించి, అక్కడ నివసించే ప్రజల గురించి, వాళ్లు ఎక్కువగా చింతించే వాటిగురించి ఆలోచించండి. వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా ఏ లేఖనం చదవాలో ఆలోచించండి. ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తాను, తన భార్య బైబిల్ని ఎలా ఉపయోగిస్తారో చెబుతూ ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా అన్నాడు, “మనం క్లుప్తంగా, విషయాన్ని సూటిగా చెప్తే చాలామంది గృహస్థులు ఒక వచనాన్ని చదివే అవకాశాన్ని మనకిస్తారు. సాధారణంగా మేము బైబిల్ని చేత్తో తెరిచి పట్టుకుని, వాళ్లను పలకరించి ఓ లేఖనాన్ని చదువుతాం.” ఇప్పుడు మనం, చాలా క్షేత్రాల్లో సమర్థవంతంగా ఉపయోగిస్తున్న అంశాలు, ప్రశ్నలు, లేఖనాలు పరిశీలిద్దాం. వాటిని మీ క్షేత్రంలో మీరు ప్రయత్నించి చూడవచ్చు.

పరిచర్యలో బైబిల్ని, కరపత్రాల్ని చక్కగా ఉపయోగిస్తున్నారా? (8-13 పేరాలు చూడండి)

16. యెషయా 14:7ను పరిచర్యలో ఎలా ఉపయోగించవచ్చు?

16 మీరు నివసిస్తున్న ప్రాంతంలో తరచూ గొడవలు, నేరాలు జరుగుతుంటే, ఇంటివాళ్లను ఇలా అడగవచ్చు, “‘ఇప్పుడు భూమంతా ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉంది, ప్రజలు సంతోషంతో పాటలు పాడుతున్నారు’ అని వార్తాపత్రికల్లో ముఖ్యాంశంగా ఎప్పుడైనా వస్తుందంటారా? యెషయా 14:7⁠లో బైబిలు అదే విషయాన్ని చెబుతుంది. నిజానికి, శాంతిసమాధానాలు ఉండే కాలాలు భవిష్యత్తులో రాబోతున్నాయని దేవుడు చేసిన అనేక వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి.” ఆ తర్వాత, అలాంటి వాగ్దానాల్లో ఒకదాన్ని బైబిల్లో చదివి వినిపించవచ్చేమో అడగండి.

17. మత్తయి 5:3ను మీ సంభాషణలో ఎలా పరిచయం చేయవచ్చు?

17 మీ ప్రాంతంలోని పురుషులకు, కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందా? అయితే, “తన కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఓ వ్యక్తి ఎంత సంపాదించాలి?” అని అడిగి మీ సంభాషణను ప్రారంభించవచ్చు. ఆయన ఏమి చెబుతాడో విన్న తర్వాత, “చాలామంది మగవాళ్లు అంతకన్నా ఎక్కువే సంపాదిస్తున్నారు, అయినా వాళ్ల కుటుంబాలు సంతోషంగా లేవు. కాబట్టి, నిజంగా అవసరమైనదేమిటి?” అని అడిగి మత్తయి 5:3 చదివి, బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించండి.

18. ఇతరులను ఓదార్చడానికి యిర్మీయా 29:11 మీరెలా ఉపయోగించవచ్చు?

18 మీ ప్రాంతంలోని ప్రజలు ఇటీవల సంభవించిన ఓ విపత్తు వల్ల బాధపడుతున్నారా? అయితే మీ సంభాషణను ఇలా ప్రారంభించవచ్చు, “నేను మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చాను. (యిర్మీయా 29:11 చదవండి.) మనకు మూడు విషయాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడని గమనించారా? ‘సమాధానం,’ ‘రాబోవు కాలం లేదా భవిష్యత్తు,’ ‘నిరీక్షణ.’ మనకు మంచి జీవితం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని తెలుసుకోవడం సంతోషంగా లేదా? కాని అదెలా సాధ్యం?” తర్వాత, మంచివార్త బ్రోషురులో దానికి సరిపోయే పాఠాన్ని చూపించండి.

19. దైవభక్తిగల ప్రజలతో మాట్లాడేటప్పుడు, ప్రకటన 14:6, 7 ఎలా ఉపయోగించవచ్చో వివరించండి.

19 మీ ప్రాంతంలోని ప్రజలకు దైవభక్తి ఉంటే, ఈ మాటలతో మీ సంభాషణ ప్రారంభించవచ్చు, “ఒక దేవదూత మీతో మాట్లాడితే, ఆయన చెప్పేది మీరు వింటారా? (ప్రకటన 14:6, 7 చదవండి.) ఆ దూత ‘దేవునికి భయపడండి’ అని చెబుతున్నాడు కాబట్టి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదా? ‘ఆకాశమును, భూమిని కలుగజేసిన వాని’ గురించి ఆ దూత మాట్లాడుతున్నాడు. ఎవరాయన?” అప్పుడు కీర్తన 124:8⁠లోని, “భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది” అనే మాటల్ని చదవండి. తర్వాత, యెహోవా దేవుని గురించి మరిన్ని విషయాలు చెప్పవచ్చేమో అడగండి.

20. (ఎ) దేవుని పేరు గురించి చెప్పడానికి సామెతలు 30:4ను ఎలా ఉపయోగించవచ్చు? (బి) మీరు పరిచర్యలో ఏ లేఖనం ఉపయోగించి మంచి ఫలితాలు పొందారు?

20 ఓ యువకునితో ఇలా సంభాషణ ప్రారంభించవచ్చు, “చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలున్న ఓ వచనాన్ని మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. (సామెతలు 30:4 చదవండి.) ఏ మనిషీ ఈ పనులను చేయలేడు, కాబట్టి ఆ వచనం సృష్టికర్త గురించే చెబుతుండాలి. a ఆయన పేరేమిటో మనమెలా తెలుసుకోవచ్చు? దాన్ని మీకు బైబిల్లో చూపిస్తాను.”

దేవుని వాక్యానికి ఉన్న శక్తిని మీ పరిచర్యలో ఉపయోగించండి

21, 22. (ఎ) జాగ్రత్తగా ఎంపిక చేసిన లేఖనం ఓ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చగలదు? (బి) పరిచర్యలో ఏమి చేయాలని మీరు తీర్మానించుకున్నారు?

21 జాగ్రత్తగా ఎంచుకున్న లేఖనం చూపిస్తే ప్రజలు చక్కగా స్పందిస్తారు. ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో ఇద్దరు సాక్షులు పరిచర్యలో ఓ స్త్రీ ఇంటి తలుపు తట్టారు. ఆ ఇద్దరిలో ఒకాయన, ఆమెను ఇలా అడిగాడు, “మీకు దేవుని పేరు తెలుసా?” ఆ తర్వాత కీర్తన 83:18వ వచనాన్ని చదివాడు. ఆ మహిళ ఇలా చెబుతుంది, “నా నోట మాట రాలేదు! వాళ్లు వెళ్లిపోయిన తర్వాత, నేను 56 కి.మీ ప్రయాణించి, ఒక పుస్తకాల షాపుకెళ్లి వేరే బైబిలు అనువాదాలను చూసి, డిక్షనరీలో ఆ పేరుకు అర్థం చూశాను. దేవుని పేరు యెహోవా అని తెలుసుకున్నాక, ఇంకా నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో అనిపించింది.” వెంటనే ఆ మహిళ, తనకు కాబోయే భర్త ఇద్దరూ బైబిలు అధ్యయనాన్ని మొదలుపెట్టి, తర్వాత బాప్తిస్మం కూడా పొందారు.

22 ప్రజల జీవితాన్ని మార్చే శక్తి దేవుని వాక్యానికి ఉంది. బైబిల్ని చదివేవాళ్లు యెహోవా వాగ్దానాల మీద బలమైన విశ్వాసాన్ని పెంచుకోగలుగుతారు. (1 థెస్సలొనీకయులు 2:13 చదవండి.) ఎదుటివ్యక్తి హృదయాన్ని చేరడానికి మనం చెప్పే మాటల కన్నా బైబిలు సందేశమే చాలా బలమైంది. అందుకే, అవకాశం దొరికినప్పుడల్లా మనం బైబిల్ని ఉపయోగించాలి. అది సజీవమైనది!

a కావలికోట (ఇంగ్లీషు) జూలై 15, 1987 సంచికలోని, 31వ పేజీలో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.