నిర్గమకాండం 7:1-25

  • యెహోవా మోషేను బలపరుస్తాడు (1-7)

  • అహరోను కర్ర పెద్ద పాము అవుతుంది (8-13)

  • 1వ తెగులు: నీళ్లు రక్తంగా మారడం (14-25)

7  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో, నేను నిన్ను ఫరోకు దేవుడిలా* చేశాను, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు.+  నేను నీకు ఆజ్ఞాపించబోయే ప్రతీ మాటను నువ్వు నీ అన్న అహరోనుకు చెప్పాలి, అతను ఫరోతో మాట్లాడతాడు. ఫరో ఇశ్రాయేలీయుల్ని తన దేశం నుండి పంపించేస్తాడు.  అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం అవ్వనిస్తాను;+ ఐగుప్తు దేశంలో ఇంకా ఎక్కువ సూచనల్ని, అద్భుతాల్ని చేస్తాను.+  కానీ ఫరో నీ మాట వినడు. నేను ఐగుప్తు మీద నా చెయ్యి పెట్టి, గొప్ప తీర్పులు అమలు చేసి నా సమూహాల్ని,* అంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తాను.+  నేను ఐగుప్తుకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, దానిలో నుండి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు ఖచ్చితంగా తెలుసుకుంటారు.”+  మోషే, అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు, వాళ్లు సరిగ్గా అలాగే చేశారు.  వాళ్లు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏళ్లు, అహరోనుకు 83 ఏళ్లు.  తర్వాత యెహోవా మోషేకు, అహరోనుకు ఇలా చెప్పాడు:  “ఒకవేళ ఫరో మీతో, ‘ఒక అద్భుతం చేయండి’ అని అంటే, నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర తీసుకొని ఫరో ముందు కింద పడేయి’ అని చెప్పు. అప్పుడది పెద్ద పాము అవుతుంది.” 10  కాబట్టి మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లి సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను తన కర్రను ఫరో ముందు, అతని సేవకుల ముందు కింద పడేశాడు. అప్పుడది పెద్ద పాము అయింది. 11  అయితే ఫరో జ్ఞానుల్ని, మంత్రగాళ్లను పిలిపించాడు; ఇంద్రజాలం చేసే ఐగుప్తు పూజారులు+ కూడా తమ ఇంద్రజాలంతో అలాగే చేశారు.+ 12  ప్రతీ ఒక్కరు తమ కర్రను కింద పడేశారు, అవి పెద్ద పాములు అయ్యాయి. అయితే అహరోను కర్ర వాళ్ల కర్రల్ని మింగేసింది. 13  అయినా యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం కఠినం అయింది,+ అతను వాళ్ల మాట వినలేదు. 14  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో హృదయం మొద్దుబారింది.+ అతను ప్రజల్ని పంపించడానికి ఒప్పుకోలేదు. 15  ఉదయం నువ్వు ఫరో దగ్గరికి వెళ్లు. ఇదిగో! అతను నైలు నది దగ్గరికి వస్తున్నాడు! అతన్ని కలుసుకోవడానికి నువ్వు నైలు నది ఒడ్డున నిలబడి ఉండాలి; పాములా మారిన నీ కర్రను నీతోపాటు చేతిలో తీసుకెళ్లు. 16  నువ్వు అతనితో ఇలా అనాలి: ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు.+ “నా ప్రజలు ఎడారిలో నన్ను సేవించేలా వాళ్లను పంపించేయి” అని ఆయన అంటున్నాడు. అయితే నువ్వు ఇప్పటివరకూ ఆయన చెప్పింది చేయలేదు. 17  యెహోవా ఇలా అంటున్నాడు: “నేనే యెహోవాను అని దీనివల్ల నీకు తెలుస్తుంది.+ ఇదిగో, నేను నా చేతిలో ఉన్న కర్రతో నైలు నది నీళ్లను కొడుతున్నాను, అవి రక్తంగా మారతాయి. 18  అప్పుడు నైలు నదిలోని చేపలు చచ్చిపోతాయి, నైలు నది కంపు కొడుతుంది, ఐగుప్తీయులు దానిలోని నీళ్లను అస్సలు తాగలేరు.” ’ ” 19  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నువ్వు అహరోనుతో, ‘నీ కర్ర తీసుకొని ఐగుప్తులోని నీళ్ల మీద, దాని నదుల మీద, కాలువల* మీద, నీటి గుంటల మీద, చెరువులన్నిటి మీద చాపు; అప్పుడవి రక్తంగా మారతాయి’ అని చెప్పు. ఐగుప్తు దేశంలో ఎక్కడ చూసినా రక్తమే ఉంటుంది; చివరికి చెక్క పాత్రల్లో, రాతి పాత్రల్లో కూడా.” 20  వెంటనే మోషే, అహరోనులు సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశారు. అహరోను తన కర్ర ఎత్తి ఫరో కళ్లముందు, అతని సేవకుల కళ్లముందు నైలు నది నీళ్లను కొట్టాడు. అప్పుడు ఆ నదిలో ఉన్న నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.+ 21  నదిలోని చేపలు చచ్చిపోయాయి,+ దాంతో నది కంపు కొట్టసాగింది. దానివల్ల ఐగుప్తీయులు నైలు నది నీళ్లను తాగలేకపోయారు.+ ఐగుప్తు దేశమంతటా ఎక్కడ చూసినా రక్తమే. 22  అయితే, ఇంద్రజాలం చేసే ఐగుప్తు పూజారులు కూడా తమ రహస్య కళలు ఉపయోగించి అలాగే చేశారు.+ దాంతో యెహోవా ముందే చెప్పినట్టు, ఫరో హృదయం ఎప్పటిలాగే కఠినంగా ఉండిపోయింది, అతను వాళ్ల మాట వినలేదు.+ 23  తర్వాత ఫరో తన ఇంటికి తిరిగెళ్లిపోయాడు, ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. 24  ఐగుప్తీయులందరూ తాగేనీళ్ల కోసం నైలు నది చుట్టుపక్కలంతా తవ్వుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లు నైలు నది నీళ్లను తాగలేకపోయారు. 25  యెహోవా నైలు నదిని కొట్టాక, పూర్తిగా ఏడురోజులు గడిచిపోయాయి.

అధస్సూచీలు

అక్ష., “దేవుడిగా.”
అక్ష., “సైన్యాల్ని.”
అంటే, నైలు కాలువలు.