నిర్గమకాండం 5:1-23

  • ఫరో ముందు మోషే, అహరోను (1-5)

  • అణచివేత ఎక్కువౌతుంది (6-18)

  • ఇశ్రాయేలీయులు మోషే, అహరోనుల్ని నిందిస్తారు (19-23)

5  తర్వాత మోషే, అహరోను వెళ్లి ఫరోతో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నా ప్రజలు ఎడారిలో నాకు పండుగ ఆచరించేలా వాళ్లను పంపించేయి.’ ”  కానీ ఫరో ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయుల్ని పంపించడానికి యెహోవా ఎవరు?+ యెహోవా ఎవరో నాకు అస్సలు తెలీదు, అంతేకాదు ఇశ్రాయేలీయుల్ని నేను పంపించను.”+  అయితే వాళ్లు ఇలా అన్నారు: “హెబ్రీయుల దేవుడు మాతో మాట్లాడాడు. మేము మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి ఎడారిలో మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి దయచేసి మాకు అనుమతి ఇవ్వు;+ లేకపోతే ఆయన మమ్మల్ని వ్యాధితో, ఖడ్గంతో శిక్షిస్తాడు.”  అప్పుడు ఐగుప్తు రాజు వాళ్లతో ఇలా అన్నాడు: “మోషే, అహరోనూ, మీరెందుకు ప్రజల్ని పనిచేయనివ్వడం లేదు? మీరంతా వెళ్లి మీ పనులు చేసుకోండి!”+  ఫరో ఇంకా ఇలా అన్నాడు: “ఈ దేశంలో మీ ప్రజలు ఎంతమంది ఉన్నారో చూడండి, మీరు వాళ్లందర్నీ పనిచేయకుండా ఆపిన వాళ్లౌతారు.”  పనులు చేయించేవాళ్లకు, ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులకు ఫరో అదే రోజున ఇలా ఆజ్ఞాపించాడు:  “మీరు ఇక మీదట ఇటుకలు చేయడానికి వాళ్లకు గడ్డి ఇవ్వకూడదు.+ వాళ్లకు కావాల్సిన గడ్డి వాళ్లే వెళ్లి తెచ్చుకోవాలి.  అయితే వాళ్లు ఇంతకుముందు ఎన్ని ఇటుకలు చేసేవాళ్లో ఇప్పుడు కూడా అన్నే ఇటుకలు తయారుచేయాలి. లెక్క తగ్గించొద్దు, వాళ్లు సోమరులు; అందుకే, ‘మేము వెళ్లాలనుకుంటున్నాం, మా దేవునికి బలులు అర్పించాలనుకుంటున్నాం!’ అని అరుస్తున్నారు.  వాళ్లతో ఇంకా కష్టమైన పనులు చేయించండి, వాళ్లను ఖాళీగా ఉంచకండి; అప్పుడే వాళ్లు అబద్ధాల మీద మనసు పెట్టకుండా ఉంటారు.” 10  కాబట్టి పనులు చేయించేవాళ్లు,+ ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులు వెళ్లి ప్రజలతో ఇలా చెప్పారు: “ఫరో ఇలా అన్నాడు: ‘ఇప్పటినుండి నేను మీకు గడ్డి ఇవ్వను. 11  గడ్డి ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి మీకు కావాల్సిన గడ్డి మీరే తెచ్చుకోండి, చేయాల్సిన ఇటుకల లెక్క మాత్రం తగ్గించబడదు.’ ” 12  అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాలు* తెచ్చుకోవడానికి ఐగుప్తు దేశ నలుమూలలకు చెదిరిపోయారు. 13  పనులు చేయించేవాళ్లు, “గడ్డిని ఇచ్చినప్పుడు మీరు ప్రతీరోజు ఎన్ని ఇటుకలు తయారుచేశారో ఇప్పుడు కూడా అన్నే ఇటుకలు తయారుచేయాలి” అని అంటూ వాళ్లను ఒత్తిడిచేశారు. 14  అంతేకాదు ఫరో కింద ఉండే ఆ అధికారులు* తాము నియమించిన ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకుల్ని కొట్టారు.+ వాళ్లను, “ఇంతకుముందు చేసినన్ని ఇటుకలు ఎందుకు చేయలేదు? నిన్న అలాగే జరిగింది, ఈరోజూ అలాగే జరిగింది” అని అడిగారు. 15  కాబట్టి ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులు వెళ్లి ఫరోకు ఇలా ఫిర్యాదు చేశారు: “నీ సేవకులమైన మాతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? 16  నీ సేవకులమైన మాకు వాళ్లు గడ్డి ఇవ్వట్లేదు, అయినా ‘ఇటుకలు చేయండి!’ అంటున్నారు. నీ సేవకులమైన మమ్మల్ని కొడుతున్నారు, నిజానికి తప్పు నీ ప్రజలదే.” 17  కానీ ఫరో ఇలా అన్నాడు: “మీరు సోమరులు, బద్దకస్తులు!+ అందుకే మీరు, ‘మేము వెళ్లాలనుకుంటున్నాం, యెహోవాకు బలులు అర్పించాలనుకుంటున్నాం’ అంటున్నారు.+ 18  కాబట్టి ఇప్పుడు వెళ్లి పని చేసుకోండి! మీకు గడ్డి ఇవ్వము, అయినా అన్నే ఇటుకలు చేయాలి.” 19  “ఏదేమైనా ఇటుకల లెక్క తగ్గకూడదు” అనే ఆదేశాన్ని విన్నప్పుడు, తాము పెద్ద సమస్యలో చిక్కుకున్నామని ఇశ్రాయేలీయుల్లోని పర్యవేక్షకులకు అర్థమైంది. 20  తర్వాత వాళ్లు, తాము ఫరో దగ్గర నుండి వచ్చినప్పుడు తమను కలవడానికి దారిలో నిలబడి ఉన్న మోషే, అహరోనుల్ని కలిశారు. 21  వెంటనే వాళ్లు ఇలా అన్నారు: “మీరు చేసిందంతా యెహోవా చూడాలి, ఆయన మీకు తీర్పు తీర్చాలి. ఎందుకంటే మీరు ఫరో, అతని సేవకులు మమ్మల్ని నీచంగా చూసేలా చేశారు, మమ్మల్ని చంపడానికి వాళ్ల చేతిలో ఖడ్గం పెట్టారు.”+ 22  అప్పుడు మోషే యెహోవా వైపు తిరిగి ఇలా అన్నాడు: “యెహోవా, ఈ ప్రజల్ని ఎందుకు కష్టపెట్టావు? నన్నెందుకు పంపించావు? 23  నేను నీ పేరున మాట్లాడడానికి+ ఫరో ముందుకు వెళ్లినప్పటి నుండి అతను ఈ ప్రజలతో ఇంకా దారుణంగా ప్రవర్తించాడు,+ నువ్వు నీ ప్రజల్ని ఏమాత్రం విడిపించలేదు.”+

అధస్సూచీలు

పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
లేదా “పనులు చేయించేవాళ్లు.”