యెషయా 14:1-32

  • ఇశ్రాయేలీయులు తమ స్వదేశంలో నివసిస్తారు (1, 2)

  • బబులోను రాజును ఎగతాళి చేయడం (3-23)

    • మెరిసే నక్షత్రం ఆకాశం నుండి కిందపడుతుంది (12)

  • యెహోవా చెయ్యి అష్షూరును నలగ్గొడుతుంది (24-27)

  • ఫిలిష్తియ గురించి తీర్పు సందేశం (28-32)

14  యెహోవా యాకోబు మీద కరుణ చూపిస్తాడు,+ ఆయన ఇశ్రాయేలును మళ్లీ ఎంచుకుంటాడు;+ వాళ్లు తమ దేశంలో స్థిరపడేలా చేస్తాడు,*+ పరదేశులు వాళ్లతో చేరుతారు, వాళ్లు యాకోబు ఇంటివాళ్లతో ఒక్కటౌతారు.+  జనాలు వాళ్లను వాళ్ల సొంత దేశానికి తీసుకొస్తారు; యెహోవా దేశంలో ఇశ్రాయేలు ఇంటివాళ్లకు వాళ్లు దాసులు-దాసురాళ్లు అవుతారు;+ ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమను బందీలుగా చేసుకున్నవాళ్లను బందీలుగా చేసుకుంటారు, తమతో బలవంతంగా పని చేయించినవాళ్ల మీద అధికారం చెలాయిస్తారు.  నీ బాధ నుండి, కష్టం నుండి, కఠినమైన బానిసత్వం నుండి యెహోవా నీకు విశ్రాంతి కలగజేసిన రోజున,+  నువ్వు బబులోను రాజు గురించి కావ్యరూపంలో ఇలా అంటావు:* “ఇతరులతో బలవంతంగా పని చేయించిన వ్యక్తి ఎలా నాశనమయ్యాడో చూడండి! అణచివేత ఎలా ముగిసిపోయిందో చూడండి!+   యెహోవా దుష్టుల కర్రను విరగ్గొట్టాడు,పరిపాలకుల దండాన్ని విరగ్గొట్టాడు.+   వాళ్లు కోపంతో జనాల్ని కొడుతూ వచ్చారు,+ఆగ్రహంతో, ఆగని హింసతో దేశాల్ని లోబర్చుకుంటూ వచ్చారు.+   భూమంతా నెమ్మదితో విశ్రమిస్తోంది. ప్రజలు సంతోషంతో కేకలు వేస్తున్నారు.+   నీకు జరిగింది చూసి సరళవృక్షాలు* కూడా సంతోషిస్తున్నాయి,లెబానోనులోని దేవదారు చెట్లతో పాటు అవి సంతోషిస్తున్నాయి. అవి ఇలా అంటున్నాయి, ‘నువ్వు పడిపోయినప్పటి నుండికట్టెలు కొట్టేవాళ్లు ఎవ్వరూ మా మీదికి రాలేదు.’   నువ్వు వచ్చినప్పుడు నిన్ను కలవాలనికిందున్న సమాధిలో* కూడా కలకలం రేగింది. అది నిన్ను చూసి, మరణనిద్రలో ఉన్నవాళ్లను,అంటే ప్రజల్ని అణచివేసిన భూపాలకులందర్నీ* నిద్ర లేపుతుంది. దేశాల రాజులందర్నీ తమ సింహాసనాల మీది నుండి లేపుతుంది. 10  వాళ్లంతా మాట్లాడడం మొదలుపెట్టి నీతో ఇలా అంటారు,‘నువ్వు కూడా మాలాగే బలహీనుడివి అయ్యావా? నువ్వూ మాలాగే తయారయ్యావా? 11  నీ గర్వం, నీ తంతివాద్యాల శబ్దంసమాధిలోకి* తీసుకురాబడ్డాయి.+ పురుగులు నీ కింద పరుపులా పరుచుకున్నాయి,కీటకాలు దుప్పటిలా నిన్ను కప్పేశాయి.’ 12  మెరిసే నక్షత్రమా, వేకువ పుత్రుడా!నువ్వు ఆకాశం నుండి ఎలా కిందపడ్డావు! దేశాల్ని పడగొట్టిన నువ్వుఎలా నేలమట్టం చేయబడ్డావు!+ 13  నీ హృదయంలో నువ్విలా అనుకున్నావు, ‘నేను ఆకాశానికి ఎక్కివెళ్తాను.+ దేవుని నక్షత్రాల కన్నా పైకి నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను,+ ఉత్తర దిక్కున ఉన్న మారుమూల ప్రాంతాల్లోసమావేశ పర్వతం+ మీద నేను కూర్చుంటాను. 14  నేను మేఘాల కన్నా పైకి వెళ్తాను;నన్ను నేను సర్వోన్నతుడైన దేవునిలా చేసుకుంటాను.’ 15  కానీ నువ్వు సమాధిలోకి,*గోతిలోని మూలల్లోకి తోసేయబడతావు. 16  నిన్ను చూసేవాళ్లు నిన్ను తేరి చూస్తారు.వాళ్లు నిన్ను పరిశీలనగా చూసి ఇలా అంటారు:‘భూమిని కుదిపేస్తూ వచ్చిందీ,రాజ్యాల్ని వణికించిందీ ఇతనేనా?+ 17  భూలోకాన్ని ఎడారిలా* మార్చేసి,దాని నగరాల్ని పడగొట్టి,+ఖైదీలను స్వదేశానికి తిరిగెళ్లనివ్వని వ్యక్తి ఇతనేనా?’+ 18  దేశాల మిగతా రాజులందరూఅవును, వాళ్లందరూ ఘనంగా పడుకున్నారు,ప్రతీ రాజు తన సమాధిలో* పడుకున్నాడు. 19  కానీ నువ్వు మాత్రం సమాధి చేయబడలేదు,తిరస్కరించబడిన మొలకలా* నువ్వు పారేయబడ్డావు;ఖడ్గంతో చంపబడి,గోతిలోని రాళ్ల దగ్గరికి దిగిపోయేవాళ్లతో నువ్వు కప్పబడ్డావు;నువ్వు కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు. 20  నువ్వు సమాధిలో వాళ్లను కలుసుకోవు,ఎందుకంటే నువ్వు నీ సొంత దేశాన్ని నాశనం చేశావు,నీ సొంత ప్రజల్ని చంపావు. దుష్టుల పిల్లల పేర్లను ప్రజలు ఇంకెప్పుడూ జ్ఞాపకం చేసుకోరు. 21  అతని కుమారుల కోసం వధశాలను సిద్ధం చేయండివాళ్ల పూర్వీకుల దోషాన్ని బట్టి అలా చేయండి;అప్పుడు వాళ్లు లేచి భూమిని స్వాధీనం చేసుకోకుండా,దేశాన్ని తమ నగరాలతో నింపకుండా ఉంటారు.” 22  “నేను వాళ్ల మీదికి లేస్తాను”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. “నేను బబులోను నుండి పేరును, శేషాన్ని; వంశస్థుల్ని, వంశాన్ని తుడిచిపెట్టేస్తాను”+ అని యెహోవా అంటున్నాడు. 23  “నేను దాన్ని ముళ్లపందుల నివాస స్థలంగా, చిత్తడినేలగా చేస్తాను; సమూలనాశనం అనే చీపురుతో దాన్ని ఊడ్చేస్తాను”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. 24  సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రమాణం చేశాడు: “నేను అనుకున్నట్టు జరిగి తీరుతుంది,నేను నిర్ణయించింది నిజమౌతుంది. 25  నేను అష్షూరును నా దేశంలో నలగ్గొడతాను,నా పర్వతాల మీద అతన్ని తొక్కుతాను.+ అతని కాడి వాళ్ల మీద నుండి తీసేయబడుతుంది,వాళ్ల భుజాల మీద నుండి అతని బరువు తొలగించబడుతుంది.”+ 26  భూమంతటి గురించి తీసుకున్న నిర్ణయం ఇదే,దేశాలన్నిటి మీద చాపబడిన* చెయ్యి ఇదే. 27  సైన్యాలకు అధిపతైన యెహోవా నిర్ణయించాడు,దాన్ని ఎవరు అడ్డుకోగలరు?+ ఆయన చెయ్యి చాపబడి ఉంది,దాన్ని ఎవరు వెనక్కి తిప్పగలరు?+ 28  ఆహాజు చనిపోయిన సంవత్సరంలో+ ఈ సందేశం వచ్చింది: 29  “ఫిలిష్తియా, నిన్ను కొడుతున్నవాడి దండం విరగ్గొట్టబడిందనిఏమాత్రం సంతోషించకు. ఎందుకంటే, సర్పం వేరు+ నుండి విషసర్పం+ వస్తుంది,దాని సంతానం, మంటపుట్టించే విషమున్న ఎగిరే సర్పం.* 30  దీనుల మొదటి సంతానం భోంచేస్తున్నప్పుడు,పేదవాళ్లు సురక్షితంగా పడుకున్నప్పుడు,నేను నీ వేరును కరువుతో నాశనం చేస్తాను,నీలో మిగిలి ఉన్నది చంపబడుతుంది.+ 31  నగర ద్వారమా, గగ్గోలు పెట్టు! నగరమా, కేకలు వేయి! ఫిలిష్తియా, నీ ప్రజలందరి గుండెలు జారిపోతాయి!ఎందుకంటే ఉత్తరం వైపు నుండి ఒక పొగ వస్తోంది, అతని దండులో వెనకబడ్డవాళ్లు ఎవరూ లేరు.” 32  దేశాల సందేశకులకు వాళ్లు ఏమని జవాబు చెప్పాలి? యెహోవా సీయోనుకు పునాది వేశాడని,+ ఆయన ప్రజల్లోని దీనులు దానిలో ఆశ్రయం పొందుతారని చెప్పాలి.

అధస్సూచీలు

లేదా “వాళ్లకు విశ్రాంతినిస్తాడు.”
లేదా “ఇలా ఎగతాళి చేస్తావు.”
అంటే, జూనిపర్‌ చెట్లు.
లేదా “షియోల్‌లో,” అంటే మానవజాతి సాధారణ సమాధిలో. పదకోశం చూడండి.
అక్ష., “మేకపోతులన్నిటినీ.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “ఇంట్లో.”
లేదా “కొమ్మలా.”
లేదా “కొట్టడానికి సిద్ధంగా ఉన్న.”
లేదా “వేగంగా కదిలే విషసర్పం.”