యిర్మీయా 29:1-32

  • బబులోనులోని బందీలకు యిర్మీయా ఉత్తరం (1-23)

    • 70 ఏళ్ల తర్వాత ఇశ్రాయేలీయులు తిరిగొస్తారు (10)

  • షెమయాకు సందేశం (24-32)

29  బందీలుగా వెళ్లిన ప్రజల్లోని మిగతా పెద్దలకు, యాజకులకు, ప్రవక్తలకు, ప్రజలందరికీ యిర్మీయా ప్రవక్త యెరూషలేము నుండి రాసిన ఉత్తరంలోని మాటలు ఇవి. నెబుకద్నెజరు వాళ్లను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.  యెకొన్యా+ రాజు, రాజమాత,+ ఆస్థాన అధికారులు, యూదా యెరూషలేముల అధిపతులు, చేతిపనివాళ్లు, కమ్మరి వాళ్లు* యెరూషలేము నుండి వెళ్లిపోయిన తర్వాత+ అతను ఈ ఉత్తరం రాశాడు.  యూదా రాజైన సిద్కియా+ బబులోను రాజైన నెబుకద్నెజరు దగ్గరికి షాఫాను+ కుమారుడైన ఎల్యాశాను, హిల్కీయా కుమారుడైన గెమర్యాను పంపాడు. యిర్మీయా వాళ్ల ద్వారానే ఈ ఉత్తరాన్ని బబులోనుకు పంపించాడు. అందులో ఇలా ఉంది:  “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా, బందీలుగా ఉన్న ప్రజలందరితో, అంటే తాను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా వెళ్లేలా చేసిన ప్రజలందరితో ఇలా అంటున్నాడు:  ‘మీరు ఇళ్లు కట్టుకుని వాటిలో నివసించండి. తోటలు నాటుకుని వాటి పండ్లను తినండి.  పెళ్లి చేసుకుని కుమారుల్ని, కూతుళ్లను కనండి; వాళ్లు కూడా కుమారుల్ని, కూతుళ్లను కనేలా వాళ్లకు కూడా పెళ్లిళ్లు చేయండి. అక్కడ మీ సంఖ్య పెరగాలి కానీ తగ్గకూడదు.  నేను మిమ్మల్ని బందీలుగా పంపించిన నగర క్షేమాన్ని కోరుకోండి, దాని కోసం యెహోవాకు ప్రార్థించండి. ఎందుకంటే దాని క్షేమమే మీ క్షేమం.+  ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ మధ్య ఉన్న మీ ప్రవక్తల్ని, మీ సోదెగాళ్లను నమ్మి మోసపోకండి,+ కలలు కనేవాళ్ల మాటలు వినకండి.  ఎందుకంటే, ‘వాళ్లు నా పేరున మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. నేను వాళ్లను పంపలేదు’+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ” 10  “యెహోవా ఇలా అంటున్నాడు: ‘బబులోనులో 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, నేను మీ మీద దృష్టి పెడతాను,+ మిమ్మల్ని ఈ స్థలానికి తిరిగి తీసుకురావడం ద్వారా నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను.’+ 11  “ ‘ఎందుకంటే, నేను మీకు ఏంచేయాలని అనుకుంటున్నానో నాకు తెలుసు. నేను మీకు విపత్తును కాదు శాంతిని దయచేస్తాను.+ మీకు మంచి భవిష్యత్తు, నిరీక్షణ ఉండేలా చేస్తాను’+ అని యెహోవా అంటున్నాడు. 12  ‘మీరు నాకు మొరపెడతారు, వచ్చి నాకు ప్రార్థిస్తారు, నేను మీ ప్రార్థన వింటాను.’+ 13  “ ‘మీరు నన్ను వెదుకుతారు, కనుగొంటారు.+ ఎందుకంటే, మీరు నిండు హృదయంతో నన్ను వెదుకుతారు.+ 14  నేను మీకు దొరుకుతాను’+ అని యెహోవా అంటున్నాడు. ‘నేను చెరలో ఉన్న మిమ్మల్ని పోగుచేస్తాను, నేను ఏయే దేశాలకు, ప్రాంతాలకు మిమ్మల్ని చెదరగొట్టానో వాటన్నిట్లో నుండి మిమ్మల్ని సమకూరుస్తాను’+ అని యెహోవా అంటున్నాడు. ‘మీరు ఏ స్థలం నుండి బందీలుగా వెళ్లేలా చేశానో ఆ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.’+ 15  “కానీ మీరు, ‘యెహోవా మా కోసం బబులోనులో ప్రవక్తల్ని నియమించాడు’ అని అన్నారు. 16  “అయితే దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజుతో,+ ఈ నగరంలో నివసిస్తున్న ప్రజలందరితో, అంటే మీతోపాటు చెరలోకి వెళ్లని మీ సహోదరులతో యెహోవా ఇలా అంటున్నాడు: 17  ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే, “నేను వాళ్ల మీదికి ఖడ్గాన్ని, కరువును, తెగులును రప్పించి,+ తినలేనంతగా కుళ్లిపోయిన* చెడ్డ అంజూర పండ్లలా చేస్తాను.” ’+ 18  “ ‘నేను వాళ్లను ఖడ్గంతో, కరువుతో, తెగులుతో వెంటాడతాను.+ భూమ్మీది రాజ్యాలన్నీ వాళ్లను చూసి భయపడేలా చేస్తాను.+ నేను వాళ్లను దేశాల మధ్యకు చెదరగొడతాను, ఆ దేశాలు వాళ్లను శపిస్తాయి, వాళ్లను చూసి ఆశ్చర్యపోతాయి, ఈల వేస్తాయి,+ నిందిస్తాయి.+ 19  ఎందుకంటే నా సేవకులైన ప్రవక్తల్ని పదేపదే* పంపిస్తూ నేను చెప్పిన మాటల్ని వాళ్లు వినలేదు’ అని యెహోవా అంటున్నాడు.+ “ ‘మీరు కూడా నా మాట వినలేదు’+ అని యెహోవా అంటున్నాడు. 20  “కాబట్టి, నేను యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా పంపించిన మీరంతా యెహోవా చెప్పే మాట వినండి. 21  నా పేరున మీకు అబద్ధ ప్రవచనాలు చెప్తున్న+ కోలాయా కుమారుడైన అహాబు గురించి, మయశేయా కుమారుడైన సిద్కియా గురించి ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఇదిగో నేను వాళ్లను బబులోను రాజు నెబుకద్నెజరు* చేతికి అప్పగిస్తున్నాను, అతను మీ కళ్లముందే వాళ్లను చంపేస్తాడు. 22  వాళ్లకు జరిగేది బబులోనులో బందీలుగా ఉన్న యూదా ప్రజలందరి మధ్య ఒక శాపంగా మారుతుంది; వాళ్లు ఇలా శపిస్తారు: “యెహోవా నిన్ను బబులోను రాజు మంటల్లో కాల్చేసిన సిద్కియాలా, అహాబులా చేయాలి!” 23  ఎందుకంటే వాళ్లు తమ పొరుగువాళ్ల భార్యలతో వ్యభిచారం చేస్తూ, నేను ఆజ్ఞాపించని అబద్ధపు మాటల్ని నా పేరున చెప్తూ+ ఇశ్రాయేలులో అవమానకరంగా నడుచుకున్నారు.+ “ ‘ “అదంతా నాకు తెలుసు, నేనే దానికి సాక్షిని”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.’ ” 24  “నెహెలాము వాడైన షెమయాతో+ నువ్వు ఇలా చెప్పాలి: 25  ‘ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “నువ్వు యెరూషలేములో ఉన్న ప్రజలందరికీ, మయశేయా కుమారుడూ యాజకుడూ అయిన జెఫన్యాకు,+ యాజకులందరికీ నీ పేరున ఇలా ఉత్తరాలు రాశావు: 26  ‘యాజకుడైన యెహోయాదా స్థానంలో యెహోవా నిన్ను యాజకునిగా చేసి, యెహోవా మందిరం మీద పర్యవేక్షకునిగా నియమించాడు, ప్రవక్తలా నటించే ప్రతీ పిచ్చివాణ్ణి బొండలో వేసే అధికారం నీకు ఇచ్చాడు;+ 27  మరి మీకు ప్రవక్తలా నటిస్తున్న+ అనాతోతు వాడైన యిర్మీయాను+ నువ్వు ఎందుకు గద్దించలేదు? 28  ఎందుకంటే చివరికి అతను బబులోనులో ఉన్న మాకు కూడా ఇలా సందేశం పంపాడు: “మీరు అక్కడ చాలాకాలం ఉంటారు! ఇళ్లు కట్టుకుని వాటిలో నివసించండి. తోటలు నాటుకుని వాటి పండ్లు తినండి,+ —” ’ ” ’ ” 29  యాజకుడైన జెఫన్యా+ యిర్మీయా ప్రవక్త ముందు ఆ ఉత్తరం చదివినప్పుడు, 30  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 31  “బందీలుగా ఉన్న వాళ్లందరికీ ఈ సందేశం పంపు: ‘నెహెలాము వాడైన షెమయా గురించి యెహోవా ఇలా అంటున్నాడు: “నేను షెమయాను పంపకపోయినా అతను మీకు ప్రవచించి, మీరు అబద్ధాల్ని నమ్మేలా చేయడానికి ప్రయత్నించాడు.+ 32  కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నెహెలాము వాడైన షెమయా మీదికి, అతని వంశస్థుల మీదికి నా దృష్టి మళ్లిస్తున్నాను. అతని వంశస్థుల్లో ఎవ్వరూ ఈ ప్రజల మధ్య బ్రతికి బయటపడరు, నా ప్రజలకు నేను చేసే మంచిని అతను చూడడు. ఎందుకంటే, అతను యెహోవా మీదికి తిరుగుబాటును రేపాడు’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు.” ’ ”

అధస్సూచీలు

లేదా “రక్షణ గోడలు కట్టేవాళ్లు” అయ్యుంటుంది.
లేదా “చితికిపోయిన” అయ్యుంటుంది.
అక్ష., “పెందలకడే లేచి.”
అక్ష., “నెబుకద్రెజరు.”