కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్య ముంగుర్తులు వాస్తవరూపం దాల్చాయి

దేవుని రాజ్య ముంగుర్తులు వాస్తవరూపం దాల్చాయి

దేవుని రాజ్య ముంగుర్తులు వాస్తవరూపం దాల్చాయి

‘చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్న ప్రవచనవాక్యమునందు లక్ష్యముంచినయెడల మీకు మేలు.’​2 పేతురు 1:19.

ఒక విపత్తు తర్వాత మరో విపత్తు​—⁠ఇదే నేటి లోకపు తీరుగా ఉంది. పర్యావరణ విపత్తులనుండి భౌగోళిక ఉగ్రవాదం వరకూ మానవుల సమస్యలు అదుపు చేయలేనంతగా విజృంభిస్తున్నాయి. ప్రపంచ మతాలు కూడా ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నాయి. నిజానికి అవి ప్రజలను విభజించే మతదురభిమానానికి, ద్వేషానికి, జాతీయతకు ఆజ్యంపోస్తూ పరిస్థితులను మరింత దిగజారుస్తున్నాయి. అవును, ముందే ప్రవచించబడినట్లు ‘జనములపై కటికచీకటి కమ్ముకుంది.’ (యెషయా 60:2) అయితే అదే సమయంలో లక్షలాదిమంది భవిష్యత్తు వైపు నమ్మకంగా చూస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్న” దేవుని ప్రవచనవాక్యానికి అవధానమిస్తున్నారు. వారు బైబిల్లోవున్న దేవుని “వాక్యము” లేదా సందేశం తమ అడుగులను నిర్దేశించడానికి అనుమతిస్తున్నారు.​—⁠2 పేతురు 1:19.

2 “అంత్యకాలము” గురించి ప్రవక్తయైన దానియేలు ఇలా వ్రాశాడు: “చాలమంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును . . . అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.” (దానియేలు 12:4, 10) దేవుని వాక్యంలో యథార్థంగా ‘నలుదిశలు సంచరించేవారికి’ అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవారికి, ఆయన ప్రమాణాలకు లోబడేవారికి, ఆయన చిత్తం చేయడానికి కృషి చేస్తున్నవారికి మాత్రమే ఆధ్యాత్మిక అవగాహన లభిస్తుంది.​—⁠మత్తయి 13:11-15; 1 యోహాను 5:20.

3 “అంత్యదినములు” ప్రారంభమవకముందు 1870వ దశాబ్దంలోనే యెహోవా దేవుడు “పరలోకరాజ్య మర్మముల” గురించి మరింత స్పష్టమైన అవగాహనను ఇవ్వడం ప్రారంభించాడు. (2 తిమోతి 3:1-5; మత్తయి 13:11) ఆ కాలంలోని బైబిలు విద్యార్థుల గుంపొకటి, సాధారణ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా, క్రీస్తు రాకడ అదృశ్యంగా జరుగుతుందని గ్రహించారు. యేసు పరలోకంలో సింహాసనాసీనుడైన తర్వాత అక్షరార్థంగా ఈ భూమికి రాడు కానీ రాజుగా తన అవధానాన్ని ఈ భూమిపై కేంద్రీకరిస్తాడు అని వారు అర్థం చేసుకున్నారు. ఒక దృశ్యమైన సంయుక్త సూచన ఆయన అదృశ్య ప్రత్యక్షత ప్రారంభమైందని ఆయన శిష్యులను అప్రమత్తం చేస్తుంది.​—⁠మత్తయి 24:3-14.

ముంగుర్తు వాస్తవరూపం దాల్చిన సమయం

4 రూపాంతర దర్శనం క్రీస్తు రాజ్యాధికార మహిమకు అద్భుతమైన ముంగుర్తుగా ఉంది. (మత్తయి 17:1-9) తమ లేఖన విరుద్ధమైన ఆశలను నెరవేర్చనందుకు చాలామంది యేసును వెంబడించడం మానుకున్న సమయంలో, ఆ రూపాంతర దర్శనం పేతురు, యాకోబు, యోహానుల విశ్వాసాన్ని బలపర్చింది. అదే విధంగా ఈ అంత్యకాలములో ఆ అద్భుతమైన దర్శనంతోపాటు దానికి సంబంధించిన అనేక ప్రవచనాల నెరవేర్పును మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి తన ఆధునిక దిన సేవకులకు సహాయం చేయడం ద్వారా యెహోవా వారి విశ్వాసాన్ని బలపర్చాడు. మన విశ్వాసాన్ని బలపరిచే ఆ ఆధ్యాత్మిక వాస్తవాల్లో కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాము.

5 రూపాంతరం గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.” (2 పేతురు 1:19) ఆ సూచనార్థక వేకువచుక్క లేదా “ప్రకాశమానమైన వేకువ చుక్క” మహిమాన్వితుడైన యేసుక్రీస్తే. (ప్రకటన 22:16) దేవుని రాజ్యము 1914లో పరలోకంలో స్థాపించబడినప్పుడు ఆయన ‘ఉదయించి’ ఒక కొత్త శకానికి ఆరంభాన్ని సూచించాడు. (ప్రకటన 11:15) రూపాంతర దర్శనంలో యేసుతోపాటు మోషే, ఏలీయాలు కనిపించి ఆయనతో మాట్లాడడం ప్రారంభించారు. వారు ఎవరికి ముంగుర్తుగా ఉన్నారు?

6 మోషే, ఏలీయా క్రీస్తు మహిమలో పాలుపంచుకున్నారు కాబట్టి, ఆ ఇద్దరు నమ్మకమైన సాక్షులు యేసుతోపాటు ఆయన రాజ్యంలో పరిపాలించేవారికి సూచనగా ఉండాలి. యేసుతోపాటు కొంతమంది సహపరిపాలకులుగా ఉంటారనే విషయం, సింహాసనాసీనుడైన మెస్సీయకు సంబంధించి దానియేలు ప్రవక్తకు ఇవ్వబడిన దర్శనానికి పొందికగా ఉంది. ‘మనుష్యకుమారుని పోలిన ఒక వ్యక్తి’ ‘మహావృద్ధుడైన’ యెహోవా దేవునినుండి ‘ఒక శాశ్వతమైన ప్రభుత్వమును’ పొందడం దానియేలు చూశాడు. అయితే ఆ తర్వాత దానియేలుకు ఏమి చూపించబడిందో గమనించండి. ఆయన ఇలా వ్రాశాడు: “ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును.” (దానియేలు 7:13, 14, 27) అవును రూపాంతరానికి ఐదు శతాబ్దాలకంటే ముందే, క్రీస్తు మహిమాన్వితమైన రాజ్యాధికారంలో కొందరు “పరిశుద్ధులు” పాలుపంచుకుంటారని దేవుడు వెల్లడి చేశాడు.

7 దానియేలు దర్శనంలోని పరిశుద్ధులు ఎవరు? అలాంటి వ్యక్తుల గురించే చెబుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” (రోమీయులు 8:16, 17) యేసు ఆత్మాభిషిక్త శిష్యులే ఆ పరిశుద్ధులు. ప్రకటన గ్రంథంలో యేసు అలా చెప్పాడు: “నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.” పునరుత్థానం చేయబడిన ఈ 1,44,000 మందే ‘జయించేవారిగా’ యేసుతోపాటు భూమిని పరిపాలిస్తారు.​—⁠ప్రకటన 3:21; 5:9, 10; 14:1, 3, 4; 1 కొరింథీయులు 15:53.

8 అయితే అభిషిక్త క్రైస్తవులు మోషే, ఏలీయా ద్వారా ఎందుకు సూచించబడ్డారు? ఎందుకంటే అభిషిక్తులు మానవులుగా భూమిపై ఉన్నప్పుడు మోషే, ఏలీయా చేసిన పనివంటి పనినే చేస్తారు. ఉదాహరణకు, వారు హింసలు ఎదురైనా యెహోవాకు సాక్షులుగా పని చేస్తారు. (యెషయా 43:10; అపొస్తలుల కార్యములు 8:1-8; ప్రకటన 11:​2-12) మోషే, ఏలీయాల్లాగే వారు ధైర్యంగా అబద్ధమతం నిజస్వరూపాన్ని బయటపెడతారు, అదే సమయంలో దేవునిపట్ల అవిభాగిత భక్తిని ప్రదర్శించమని యథార్థమైన ప్రజలను ప్రోత్సహిస్తారు. (నిర్గమకాండము 32:19, 20; ద్వితీయోపదేశకాండము 4:22-24; 1 రాజులు 18:18-40) వారి పని ఫలితాలను సాధించిందా? సాధించింది! వారు మిగతా అభిషిక్తులను సమకూర్చడంలో సహాయం చేయడమే కాక, ‘వేరే గొఱ్ఱెలకు’ చెందిన లక్షలాదిమంది యేసుక్రీస్తుకు ఇష్టపూర్వకంగా లోబడడానికి కూడా సహాయం చేశారు.​—⁠యోహాను 10:16; ప్రకటన 7:⁠4.

క్రీస్తు జయించడం పూర్తి చేస్తాడు

9 యేసు ఇప్పుడు గాడిద పిల్లపై కూర్చొని వచ్చిన మానవుడిగా లేడు, ఆయన ఒక శక్తిమంతమైన రాజుగా ఉన్నాడు. ఆయన ఒక గుర్రంపై స్వారీ చేస్తున్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. గుర్రం బైబిలులో యుద్ధానికి చిహ్నంగా ఉంది. (సామెతలు 21:31) “ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండియుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలువెళ్లెను” అని ప్రకటన 6:2 చెబుతోంది. అంతేకాక, యేసు గురించి కీర్తనకర్తయైన దావీదు ఇలా వ్రాశాడు: “యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.”​—⁠కీర్తన 110:⁠2.

10 యేసు మొదటిగా అత్యంత శక్తిమంతమైన శత్రువులైన సాతాను, అతని దయ్యాలపై విజయం సాధించాడు. ఆయన వాళ్ళను పరలోకంనుండి వెళ్ళగొట్టి భూమిమీదకు పడద్రోశాడు. తమకు సమయం కొంచమే ఉందని తెలుసుకున్న ఈ దుష్టాత్మలు తమ కోపోద్రేకాన్ని మానవులపై చూపిస్తూ ఘోరమైన కష్టాలను కలుగజేశారు. ప్రకటన గ్రంథంలో ఆ కష్టాలు మరో ముగ్గురు గుర్రపు రౌతుల స్వారీ ద్వారా సూచించబడ్డాయి. (ప్రకటన 6:3-8; 12:7-12) “[తన] రాకడకును ఈ యుగసమాప్తికిని సూచన” చెబుతూ యేసు ప్రవచించినట్లుగానే ఆ ముగ్గురు గుర్రపు రౌతులు చేస్తున్న స్వారీ యుద్ధాలకు, ఆహార కొరతలకు, ప్రాణాంతకమైన తెగుళ్ళకు దారి తీసింది. (మత్తయి 24:3, 7; లూకా 21:7-11) సాతాను దృశ్య సంస్థను సమూలంగా నాశనం చేయడం ద్వారా క్రీస్తు ‘జయించడాన్ని పూర్తి చేసేంతవరకూ’ అక్షరార్థమైన ప్రసవ వేదనల్లాగే ఈ “వేదనలు” అంతకంతకూ తీవ్రమవుతాయి. *​—⁠మత్తయి 24:⁠8.

11 ప్రపంచవ్యాప్తంగా రాజ్య సందేశం ప్రకటించాలనే ఆజ్ఞను నెరవేర్చేందుకు వీలుగా క్రైస్తవ సంఘాన్ని కాపాడడంలో కూడా యేసు రాజ్యాధికారం స్పష్టమవుతోంది. ప్రపంచ అబద్ధ మత సామ్రాజ్యమైన మహా బబులోనునుండి, ప్రతికూల ప్రభుత్వాలనుండి క్రూరమైన వ్యతిరేకత ఎదురైనా, ప్రకటనా పని నిరాటంకముగా కొనసాగడమే కాక, ప్రపంచ చరిత్రలో మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ప్రకటించబడుతోంది. (ప్రకటన 17:5, 6) క్రీస్తు రాజ్యాధికారానికి అది ఎంత శక్తిమంతమైన రుజువో కదా!​—⁠కీర్తన 110:⁠3.

12 అయితే విచారకరమైన విషయమేమిటంటే, క్రైస్తవులమని చెప్పుకునే కోట్లాదిమందితోపాటు చాలామంది భూమిపై జరుగుతున్న గమనార్హమైన సంఘటనల వెనకున్న అదృశ్యమైన వాస్తవాలను గ్రహించడం లేదు. వారు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నవారిని ఎగతాళి చేస్తున్నారు. (2 పేతురు 3:3, 4) ఎందుకు? ఎందుకంటే సాతాను వారి మనస్సులకు గ్రుడ్డితనము కలుగజేశాడు. (2 కొరింథీయులు 4:3, 4) నిజానికి, అతను క్రైస్తవులమని చెప్పుకునేవారిపై ఆధ్యాత్మిక అంధకారపు ముసుగు కప్పడం ఎన్నో శతాబ్దాల క్రితమే ప్రారంభించాడు, తత్ఫలితంగా వారు అమూల్యమైన రాజ్య నిరీక్షణను వదులుకున్నారు.

రాజ్య నిరీక్షణను వదులుకున్నారు

13 గోధుమల మధ్య వేయబడిన గురుగుల్లా, మతభ్రష్టులు క్రైస్తవ సంఘంలోకి జొరబడి చాలామందిని పక్కదారి పట్టిస్తారని యేసు ముందే చెప్పాడు. (మత్తయి 13:24-30, 36-43; అపొస్తలుల కార్యములు 20:29-31; యూదా 4) కాలం గడుస్తున్న కొద్దీ, క్రైస్తవులమని చెప్పుకునే వీరు అన్యమత పండుగలను, ఆచారాలను, బోధలను అంగీకరించి వాటికి “క్రైస్తవత్వానికి సంబంధించినవి” అనే పేరు తగిలించారు. ఉదాహరణకు మిత్రా, సాటర్న్‌ అనే అన్యమత దేవుళ్ళ ఆరాధనకు సంబంధించిన ఆచారాలనుండి క్రిస్మస్‌ పండుగ వచ్చింది. క్రైస్తవులకు తగని ఇలాంటి పండుగలను అంగీకరించడానికి క్రైస్తవులమని చెప్పుకునేవారిని ప్రేరేపించినదేమిటి? ద న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (1974) ఇలా చెబుతోంది: “రాబోయే క్రీస్తు రాకడ గురించి అపేక్షలు తగ్గుతున్న తరుణంలో యేసుక్రీస్తు జననానికి సంబంధించిన పండుగైన క్రిస్మస్‌ ప్రారంభించబడింది.”

14 “రాజ్యము” అనే పదానికున్న భావం ఎలా వక్రీకరించబడిందో కూడా పరిశీలించండి. కింగ్‌డమ్‌ ఆఫ్‌ గాడ్‌ ఇన్‌ ట్వంటీయెత్‌ సెంచరీ ఇంటర్‌ప్రెటేషన్‌ అనే పుస్తకం ఇలా నివేదిస్తోంది: “క్రైస్తవులు ‘రాజ్యము’ అనే పదాన్ని ఒక వ్యక్తి హృదయంలో దేవుని పరిపాలన అనే ఆంతరంగిక భావంతో ఉపయోగించడాన్ని ఆరిజెన్‌ [మూడవ శతాబ్దపు తత్వవేత్త] ప్రారంభించాడు.” ఆరిజెన్‌ దేని ఆధారంగా అలా బోధించాడు? లేఖనాల ఆధారంగా కాదు గానీ, “తత్వజ్ఞానం ఆధారంగా మరియు యేసు ఆలోచనా విధానానికీ తొలి చర్చీ ఆలోచనా విధానానికీ పూర్తి భిన్నంగా ఉన్న లోకజ్ఞానం ఆధారంగా” అలా బోధించాడు. హిప్పొకు చెందిన అగస్టీన్‌ తాను వ్రాసిన డి సివిటేట్‌ డియి (దేవుని నగరము) అనే పుస్తకంలో, చర్చీనే దేవుని రాజ్యము అని నివేదించాడు. అలాంటి లేఖనవిరుద్ధమైన ఆలోచనా విధానంవల్ల క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందినవారు రాజకీయ అధికారాన్ని స్వీకరించడానికి మత ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకున్నారు. వారు ఆ అధికారాన్ని ఎన్నో శతాబ్దాలపాటు ఎంతో క్రూరంగా ఉపయోగించారు.​—⁠ప్రకటన 17:5, 18.

15 అయితే నేడు చర్చీలు తాము విత్తినవాటినే పంటగా కోస్తున్నాయి. (గలతీయులు 6:7) చాలా చర్చీలు తమ అధికారాన్ని, తమ మతబోధకులను కోల్పోతున్నాయి. యూరప్‌లో అలాంటి ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. క్రిస్టియానిటీ టుడే అనే పత్రిక ప్రకారం “యూరప్‌లోని ప్రధాన చర్చీలు ఇప్పుడు ఆరాధనా మందిరాలుగా కాక వస్తు ప్రదర్శనశాలలుగా, కేవలం యాత్రికులు సందర్శించే స్థలాలుగా ఉన్నాయి.” ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అదే పోకడ కనిపిస్తోంది. అబద్ధ మతానికి అది దేనిని సూచిస్తోంది? అది ఆర్థిక మద్దతు, సభ్యులు లేక తెరమరుగవుతుందా? దానివల్ల సత్యారాధన ఎలా ప్రభావితమవుతుంది?

దేవుని మహాదినం కోసం సిద్ధంగా ఉండండి

16 అప్పటివరకూ నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం పొగను బూడిదను చిమ్మడం ప్రారంభిస్తే అది త్వరలోనే పేలుతుందని సూచించవచ్చు, అలాగే ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మతంపట్ల అంతకంతకూ పెరుగుతున్న ప్రతికూలత అబద్ధ మతానికి రోజులు దగ్గర పడ్డాయని సూచిస్తుంది. త్వరలోనే యెహోవా, ఈ లోకపు రాజకీయ శక్తులు ఆధ్యాత్మిక వేశ్యయైన మహాబబులోను నిజ స్వరూపాన్ని బయటపెట్టి దానిని నాశనం చేసేలా చేతులు కలపడానికి వాటిని ప్రేరేపిస్తాడు. (ప్రకటన 17:15-17; 18:21) ఆ సంఘటన గురించి, దాని తర్వాత “మహాశ్రమల్లో” భాగంగా జరిగే సంఘటనల గురించి నిజ క్రైస్తవులు భయపడాలా? (మత్తయి 24:21) అవసరం లేదు! నిజానికి దేవుడు దుష్టులకు వ్యతిరేకంగా చర్య తీసుకున్నప్పుడు వారు సంతోషించాలి. (ప్రకటన 18:20; 19:1, 2) మొదటి శతాబ్దంలోని యెరూషలేమును, అందులో నివసించిన క్రైస్తవుల ఉదాహరణను పరిశీలించండి.

17 రోమా సైన్యం సా.శ. 66లో యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు, ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉన్న క్రైస్తవులు ఆశ్చర్యపోలేదు, భయపడలేదు. వారు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసేవారు కాబట్టి ‘దాని నాశనము సమీపమైయున్నదని’ వారు గ్రహించారు. (లూకా 21:20) తాము తప్పించుకోవడానికి దేవుడు మార్గం తెరుస్తాడని కూడా వారికి తెలుసు. దేవుడు అలా చేసినప్పుడు క్రైస్తవులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. (దానియేలు 9:26; మత్తయి 24:15-19; లూకా 21:21) అదేవిధంగా నేడు దేవుని గురించి తెలుసుకొని ఆయన కుమారునికి విధేయత చూపించేవారు ఈ విధానాంతాన్ని విశ్వాసంతో ఎదుర్కోవచ్చు. (2 థెస్సలొనీకయులు 1:6-9) నిజానికి మహాశ్రమలు ప్రారంభమైనప్పుడు వారు సంతోషంగా ‘తమ తలలెత్తుకుంటారు, ఎందుకంటే తమ విడుదల సమీపించిందని వారికి తెలుసు.’​—⁠లూకా 21:28.

18 మహా బబులోను నాశనం చేయబడిన తర్వాత సాతాను మాగోగు వాడైన గోగు పాత్ర పోషిస్తూ యెహోవా శాంతియుత సాక్షులపై చివరిసారిగా నేరుగా దాడి చేస్తాడు. “మేఘము భూమిని కమ్మినట్లు” వచ్చే గోగు సంబంధీకులు తాము సులభంగా విజయం సాధిస్తామని అనుకుంటారు. కానీ వారు ఘోరంగా విఫలమవుతారు! (యెహెజ్కేలు 38:14-16, 18-23) అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. . . . జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది.” తిరుగులేని “రాజులకు రాజు” అయిన యేసుక్రీస్తు యెహోవా నమ్మకమైన ఆరాధకులను విడిపించి వారి శత్రువులందరినీ నాశనం చేస్తాడు. (ప్రకటన 19:11-21) రూపాంతర దర్శనపు నెరవేర్పుకు అది ఎంత గొప్ప ముగింపో కదా!

19 యేసు ‘ఆ దినమున విశ్వసించినవారందరిలో ప్రశంసించబడతాడు.’ (2 థెస్సలొనీకయులు 1:9) విజయం సాధించిన దేవుని కుమారుని ఎదుట భక్తిపూర్వక భయంతో నిలబడేవారిలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీ విశ్వాసాన్ని బలపర్చుకుంటూ, మీరు ‘సిద్ధముగా’ ఉన్నారని నిరూపించుకుంటూ ఉండండి, ఎందుకంటే ‘మనుష్యకుమారుడు మీరనుకొనని గడియలో రాబోతున్నాడు.’​—⁠మత్తయి 24:43, 44.

మెలకువగా ఉండండి

20 “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” దేవుని ప్రజలను ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండమని, మెలకువగా ఉండమని క్రమంగా ఉద్భోదిస్తున్నాడు. (మత్తయి 24:45, 46; 1 థెస్సలొనీకయులు 5:6) సముచితమైన ఆ జ్ఞాపికలు ఇవ్వబడుతున్నందుకు మీరు కృతజ్ఞతతో ఉన్నారా? మీ జీవితంలో ప్రాధాన్యతలు ఏర్పర్చుకోవడానికి మీరు వాటిని ఉపయోగిస్తున్నారా? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని కుమారుడు పరలోకంలో పరిపాలిస్తున్నాడని చూసేందుకు సహాయం చేసే స్పష్టమైన ఆధ్యాత్మిక దృష్టి నాకు ఉందా? ఆయన మహాబబులోనుకు సాతాను విధానానికి దైవిక తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడని నేను చూడగలుగుతున్నానా?’

21 ఇప్పుడు యెహోవా ప్రజలతో సహవసిస్తున్న కొంతమంది తమ ఆధ్యాత్మిక దృష్టి క్షీణించిపోవడానికి అనుమతించారు. యేసు తొలి శిష్యుల్లో కొందరిలా వారు ఓర్పును లేదా సహనాన్ని కోల్పోయారా? జీవిత చింతలు, ఐశ్వర్యాసక్తి, లేదా హింస వారిపై ప్రభావం చూపించాయా? (మత్తయి 13:3-8, 18-23; లూకా 21:34-36) బహుశా కొందరికి, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన నిర్దిష్టమైన సమాచారాన్ని అర్థం చేసుకోవడం కష్టమనిపించి ఉండవచ్చు. మీకు వీటిలో ఏదైనా జరిగివుంటే, మీరు దేవుని వాక్యాన్ని నూతనోత్తేజంతో అధ్యయనం చేసి, యెహోవాతో మళ్ళీ బలమైన సన్నిహితమైన సంబంధం కలిగివుండేలా సహాయం చేయమని ఆయనకు ప్రార్థించమని మేము మిమ్మల్ని కోరుతున్నాము.​—⁠2 పేతురు 3:11-15.

22 యేసు శిష్యులకు ప్రోత్సాహం అవసరమైనప్పుడు వారికి రూపాంతర దర్శనం చూపించబడింది. నేడు మనల్ని బలపర్చడానికి అంతకంటే గొప్ప విషయాలే ఉన్నాయి, రూపాంతర దర్శనము దానికి సంబంధించిన అనేక ప్రవచనాల అద్భుతమైన నెరవేర్పు మన ముందుంది. ఈ మహిమాన్వితమైన వాస్తవాల గురించి భవిష్యత్తులో అవి సాధించేవాటి గురించి మనం ఆలోచిస్తుండగా అపొస్తలుడైన యోహాను “ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము” అని అన్నప్పుడు వ్యక్తం చేసిన భావాలనే మనం కూడా హృదయపూర్వకంగా వ్యక్తం చేద్దాము.​—⁠ప్రకటన 22:20.

[అధస్సూచి]

^ పేరా 14 గ్రీకు మూలభాషలో, “వేదనలు” అని అనువదించబడిన పదానికి అక్షరార్థ భావం “ప్రసవ వేదనలు.” (మత్తయి 24:​8, కింగ్‌డమ్‌ ఇంటర్లీనియర్‌) ఈ లోకపు సమస్యలు ప్రసవ వేదనల్లాగే తరచుగా, తీవ్రంగా, కాలపరిమితిలో అంతకంతకూ ఎక్కువవుతూ చివరకు మహాశ్రమలతో ముగుస్తాయి.

మీకు గుర్తున్నాయా?

1870వ దశాబ్దంలో బైబిలు విద్యార్థుల చిన్న గుంపు క్రీస్తు రాకడ గురించి ఏమి అర్థం చేసుకుంది?

రూపాంతర దర్శనం ఎలా నెరవేరింది?

యేసు జైత్రయాత్ర ఈ ప్రపంచంపై, క్రైస్తవ సంఘంపై ఎలాంటి ప్రభావం చూపించింది?

యేసు జయించడం పూర్తి చేసినప్పుడు రక్షించబడేవారిలో ఉండాలంటే మనమేమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం నేడు లోకంలో ఎలాంటి భిన్న పరిస్థితిని చూస్తున్నాము?

2. “అంత్యకాలము” గురించిన దానియేలు ప్రవచనం ప్రకారం ఎవరికి మాత్రమే ఆధ్యాత్మిక అవగాహన లభిస్తుంది?

3. తొలి బైబిలు విద్యార్థులు 1870లలో ఏ ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించారు?

4. యెహోవా తన ఆధునిక దిన సేవకుల విశ్వాసాన్ని ఎలా బలపర్చాడు?

5. వేకువచుక్క ఎవరు, ఆయన ఎప్పుడు, ఎలా ‘ఉదయించాడు’?

6, 7. రూపాంతరములో కనిపించిన మోషే, ఏలీయా ఎవరికి సూచనగా ఉన్నారు, వారి ద్వారా సూచించబడినవారి గురించి లేఖనాలు ఏ ప్రాముఖ్యమైన వివరాలను వెల్లడిస్తున్నాయి?

8. యేసు అభిషిక్త శిష్యులు మోషే, ఏలీయాల్లా ఎలా పని చేస్తారు, వారి పని ఎలాంటి ఫలితాలు సాధించింది?

9. నేడు యేసు ఎలా ఉన్నాడనే విషయాన్ని ప్రకటన 6:2 ఎలా వర్ణిస్తోంది?

10. (ఎ) యేసు జైత్రయాత్ర మహిమాన్వితంగా ఎలా ప్రారంభమయ్యింది? (బి) క్రీస్తు మొదటి విజయం సాధారణ లోకంపై ఎలా ప్రభావం చూపించింది?

11. క్రైస్తవ సంఘ చరిత్ర క్రీస్తు రాజ్యాధికారానికి రుజువుగా ఎలా ఉంది?

12. చాలామంది క్రీస్తు అదృశ్య ప్రత్యక్షతను ఎందుకు గ్రహించడం లేదు?

13. ఆధ్యాత్మిక అంధకారపు ముసుగు దేనికి దారి తీసింది?

14. ఆరిజెన్‌ మరియు అగస్టీన్‌ల బోధలు రాజ్య సత్యాన్ని ఎలా తప్పుగా బోధించాయి?

15. క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన అనేక చర్చీల విషయంలో గలతీయులు 6:7 ఎలా నెరవేరింది?

16. మహాబబులోనుపట్ల పెరుగుతున్న ప్రతికూలత ఎందుకు గమనార్హమైనది?

17. యెహోవా నమ్మకమైన సేవకులు ఈ విధానాంతాన్ని ఎందుకు విశ్వాసంతో ఎదుర్కోవచ్చు?

18. గోగు యెహోవా సేవకులపై చివరిసారిగా నేరుగా దాడిచేసినప్పుడు ఏమి జరుగుతుంది?

19. క్రీస్తు పూర్తిగా విజయం సాధించడం ఆయన నమ్మకమైన శిష్యులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వారు ఇప్పుడు ఏమి చేయడానికి కృషి చేయాలి?

20. (ఎ) దేవుడు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి’ ఏర్పాటు చేసినందుకు మనం కృతజ్ఞత ఎలా చూపించవచ్చు? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

21. కొందరు తమ ఆధ్యాత్మిక దృష్టి క్షీణించిపోవడానికి ఎందుకు అనుమతించి ఉండవచ్చు, వారు వెంటనే ఏమి చేయాలి?

22. రూపాంతర దర్శనాన్ని, దానికి సంబంధించిన ప్రవచనాలను పరిశీలించడం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది?

[16, 17వ పేజీలోని చిత్రాలు]

ముంగుర్తు వాస్తవరూపం దాల్చింది

[18వ పేజీలోని చిత్రాలు]

యేసు తన జైత్రయాత్ర ప్రారంభించినప్పుడు ఏమి జరిగిందో మీకు తెలుసా?