కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సౌలు ప్రకటనా పని ప్రతికూలతను రేకెత్తించింది

సౌలు ప్రకటనా పని ప్రతికూలతను రేకెత్తించింది

సౌలు ప్రకటనా పని ప్రతికూలతను రేకెత్తించింది

దమస్కులోని యూదులకు ఆ విషయం అస్సలు అంతుబట్టలేదు. సాంప్రదాయబద్ధమైన నమ్మకాలను గట్టిగా సమర్థించిన వ్యక్తి అంతలోనే మతభ్రష్టుడిగా ఎలా మారాడు? సౌలు యెరూషలేములో యేసు నామమున ప్రార్థించేవారిని హింసించే వ్యక్తిగా పేరుగాంచాడు. దమస్కులోని శిష్యులను హింసించడానికే అక్కడకు వెళ్ళాడు. అయితే ఆ తర్వాత అతను, దైవదూషణ చేసినందుకు కొరతవేయబడిన వ్యక్తిగా తృణీకరించబడిన మహాపరాధినే మెస్సీయ అని ప్రకటించడం మొదలుపెట్టాడు! సౌలుకు పిచ్చి పట్టిందా?​—⁠అపొస్తలుల కార్యములు 9:1, 2, 20-22.

సౌలు అలా మారడానికి కారణం ఉండే ఉండాలి. సౌలుతోపాటు యెరూషలేమునుండి బయలుదేరిన వారు మార్గ మధ్యంలో జరిగిన విషయాన్ని చెప్పారు. వారు దమస్కును చేరుకుంటుండగా అకస్మాత్తుగా వారి చుట్టూ తేజోవంతమైన వెలుగు ప్రకాశించింది, వారందరూ నేలపై పడ్డారు. అప్పుడు వారికి ఒక స్వరం కూడా వినిపించింది. సౌలు తప్ప మరెవరూ గాయపడలేదు. అతను పూర్తిగా నేలపై పడిపోయాడు. చివరకు అతను లేచి నిలబడిన తర్వాత ఇతర ప్రయాణికులు అతని చెయ్యి పట్టుకొని దమస్కుకు నడిపించవలసి వచ్చింది, ఎందుకంటే అతను గుడ్డివాడయ్యాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:3-8; 26:13, 14.

వ్యతిరేకించినవాడే సమర్థించడం ప్రారంభించాడు

దమస్కుకు వెళ్ళే మార్గంలో సౌలుకు ఏమి జరిగింది? ఆ దూర ప్రయాణం లేదా మధ్యాహ్న సూర్యుడి వేడి అతణ్ణి అశక్తుణ్ణి చేశాయా? సౌలు అలా విచిత్రంగా ప్రవర్తించడానికి సహజమైన కారణాలు ఉన్నాయని పట్టుపట్టే ఆధునిక సంశయవాదులు, అతనికి మానసిక ఆందోళన ఎక్కువై ఉంటుంది, మతిభ్రమించి ఉంటుంది, కలవరపడిన మనస్సాక్షివల్ల తీవ్రమైన మానసిక వ్యధకు గురై ఉంటాడు, అతనికి ఏదో మానసిక రుగ్మత ఉండవచ్చు లేదా మూర్ఛరోగము ఉండివుంటుంది అని అభిప్రాయపడుతున్నారు.

వాస్తవమేమిటంటే, ఆ తేజోవంతమైన వెలుగులో సౌలుకు యేసుక్రీస్తు కనిపించి తానే మెస్సీయనని చెప్పి ఒప్పించాడు. ఈ సంఘటనను చూపించే కొన్ని కళాత్మక చిత్రాల్లో సౌలు గుర్రంపైనుండి పడినట్లు కనిపిస్తుంది. బహుశా అలా కూడా జరిగి ఉండవచ్చు, అయితే బైబిలు సౌలు ‘నేలమీద పడ్డాడు’ అని మాత్రమే చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 22:6-11) సౌలు తాను పూర్వం ఎంతో అహంకారంతో చేసినవి తప్పు అని గ్రహించినప్పుడు పడిన సిగ్గుతో పోలిస్తే అతను శారీరకంగా క్రింద పడడం అంత సిగ్గుకరమైన విషయమేమీ కాదు. అతను యేసు అనుచరులు ప్రకటిస్తున్నది సత్యమేనని ఒప్పుకోవలసి వచ్చింది. అప్పుడు సౌలుకు ఉన్న ఒకే ఒక మార్గం వారితో కలిసి పని చేయడమే. కాబట్టి యేసు సందేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సౌలు దానిని అత్యంతాసక్తితో ప్రకటించే వ్యక్తిగా మారాడు. తన చూపును తిరిగి పొంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత, “సౌలు మరి ఎక్కువగా బలపడి—ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.”​—⁠అపొస్తలుల కార్యములు 9:22.

హత్యాయత్నం విఫలమయ్యింది

ఆ తర్వాత పౌలు అని పిలువబడిన సౌలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? గలతీయులకు వ్రాసినప్పుడు ఆయన ఇలా చెప్పాడు: “అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.” (గలతీయులు 1:17) “అరేబియా” అనే పదం అరేబియన్‌ ద్వీపకల్పంలోని ఏ ప్రాంతానికైనా అన్వయిస్తుంది. పౌలు సిరియా ఎడారికి లేదా అరెత IV రాజుకు చెందిన నబటీయ రాజ్యంలోని మరో ప్రాంతానికి వెళ్ళి ఉంటాడని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతున్నారు. యేసు తన బాప్తిస్మం తర్వాత అరణ్యప్రాంతానికి వెళ్ళినట్లే సౌలు తన బాప్తిస్మం తర్వాత ధ్యానించడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఉండవచ్చు.​—⁠లూకా 4:⁠1.

సౌలు దమస్కుకు తిరిగి వచ్చినప్పుడు ‘యూదులు అతనిని చంపాలని ఆలోచించారు.’ (అపొస్తలుల కార్యములు 9:23) దమస్కులో అరెత రాజుకు ప్రతినిధిగా ఉన్న అధిపతి సౌలును బంధించాలనే ఉద్దేశంతో పట్టణానికి కాపలా కాయించాడు. (2 కొరింథీయులు 11:32) అయితే శత్రువులు సౌలును హతమార్చాలని పథకం వేస్తుండగా, యేసు శిష్యులు ఆయన తప్పించుకోవడానికి ప్రణాళిక తయారు చేశారు.

సౌలు తప్పించుకొని పారిపోవడానికి సహాయం చేసినవారిలో అననీయ, సౌలు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సహవసించిన శిష్యులు ఉన్నారు. * (అపొస్తలుల కార్యములు 9:17-19) సౌలు దమస్కులో ప్రకటించడంవల్ల విశ్వాసులైనవారు కూడా అతనికి సహాయం చేసి ఉండవచ్చు ఎందుకంటే అపొస్తలుల కార్యములు 9:⁠25 ఇలా చెబుతోంది: “అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.” “అతని శిష్యులు” అనే పదం, సౌలు సత్యం బోధించినవారిని సూచించవచ్చు. ఏదేమైనా సౌలు విజయవంతంగా పరిచర్య చేయడం, అప్పటికే ఆయనపట్ల ఉన్న వ్యతిరేకతకు ఆజ్యం పోసివుంటుంది.

నేర్చుకోవలసిన పాఠం

సౌలు పరివర్తన మరియు బాప్తిస్మమప్పుడు జరిగిన సంఘటనలను పరిశీలించినప్పుడు, ఆయన ఇతరులు తననెలా దృష్టిస్తున్నారనే విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదని, తీవ్రమైన హింస ఎదురైనా ప్రకటించడం మానుకోలేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సౌలు తనకు లభించిన ప్రకటనా పనినే అత్యంత ముఖ్యమైన విషయంగా పరిగణించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 22:14, 15.

మీరు ఈ మధ్యనే సువార్త ప్రకటించడంలోని ప్రాముఖ్యతను గ్రహించారా? అలాగైతే నిజ క్రైస్తవులందరూ రాజ్య ప్రచారకులుగా ఉండాలనే విషయం మీకు తెలుసు. మీ పరిచర్యకు కొన్నిసార్లు ప్రతికూలమైన ప్రతిస్పందనలు వస్తే మీరు ఆశ్చర్యపోకూడదు. (మత్తయి 24:9; లూకా 21:12; 1 పేతురు 2:20) వ్యతిరేకతకు ప్రతిస్పందించే విషయంలో సౌలు మంచి మాదిరి ఉంచాడు. వెనుకంజ వేయకుండా కష్టాలను సహించే క్రైస్తవులు దేవుని అనుగ్రహం పొందుతారు. యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు.” ఆయన వారికి ఈ హామీ కూడా ఇచ్చాడు: “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.”​—⁠లూకా 21:17-19.

[అధస్సూచి]

^ పేరా 10 యేసు గలిలయలో ప్రకటించిన తర్వాత లేదా సా.శ. 33 పస్కా పండుగ తర్వాత క్రైస్తవత్వం దమస్కుకు విస్తరించి ఉంటుంది.​—⁠మత్తయి 4:24; అపొస్తలుల కార్యములు 2:⁠5.

[28వ పేజీలోని చిత్రం]

యేసు కనిపించినప్పుడు సౌలు ‘నేలమీద పడ్డాడు’

[29వ పేజీలోని చిత్రం]

సౌలు దమస్కులో తనను చంపాలని వేయబడిన పన్నాగం నుండి తప్పించుకున్నాడు