అపొస్తలుల కార్యాలు 9:1-43
9 అయితే సౌలు ఇంకా ప్రభువు శిష్యుల్ని బెదిరిస్తూ ఉన్నాడు; వాళ్లను చంపేయాలని గట్టిగా కోరుకున్నాడు.+ అతను ప్రధానయాజకుడి దగ్గరికి వెళ్లి,
2 ప్రభువు మార్గానికి+ చెందిన స్త్రీపురుషులు ఎవరైనా కనిపిస్తే వాళ్లను బంధించి యెరూషలేముకు తీసుకొచ్చేలా, దమస్కు నగరంలోని సమాజమందిరాలకు ఉత్తరాలు రాసి ఇవ్వమని అడిగాడు.
3 అతను ప్రయాణిస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు, ఉన్నట్టుండి ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.+
4 దాంతో అతను నేల మీద పడిపోయాడు. అప్పుడు ఒక స్వరం, “సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు?” అని తనతో చెప్పడం అతను విన్నాడు.
5 అప్పుడు సౌలు, “ప్రభువా, నువ్వెవరు?” అని అడిగాడు. అందుకు ఆయన ఇలా అన్నాడు: “నేను నువ్వు హింసిస్తున్న యేసును.+
6 నువ్వు లేచి దమస్కు నగరానికి వెళ్లు. నువ్వు ఏంచేయాలో అక్కడ ఒక వ్యక్తి నీకు చెప్తాడు.”
7 అతనితో పాటు ప్రయాణిస్తున్న వాళ్లకు నోట మాట రాక అలాగే నిలబడిపోయారు. వాళ్లకు స్వరం* వినిపిస్తోంది కానీ మాట్లాడుతున్న వ్యక్తి కనిపించట్లేదు.+
8 అప్పుడు సౌలు నేల మీద నుండి లేచాడు, అతని కళ్లు తెరుచుకునే ఉన్నా అతనికి ఏమీ కనిపించట్లేదు. కాబట్టి వాళ్లు అతన్ని చేతులు పట్టుకొని నడిపించుకుంటూ దమస్కుకు తీసుకొచ్చారు.
9 మూడు రోజుల వరకు అతను ఏమీ చూడలేకపోయాడు.+ అతను ఏమీ తినలేదు, తాగలేదు.
10 దమస్కులో అననీయ+ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభువు ఒక దర్శనంలో అతనికి కనిపించి, “అననీయ!” అని పిలిచాడు. అతను, “చెప్పు ప్రభువా” అన్నాడు.
11 ప్రభువు అతనికి ఇలా చెప్పాడు: “నువ్వు లేచి, తిన్ననిది అనబడే వీధికి వెళ్లు. అక్కడ యూదా ఇంట్లో ఉన్న, తార్సుకు+ చెందిన సౌలు అనే వ్యక్తి కోసం అడుగు. ఇదిగో! అతను ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు.
12 అతను ఒక దర్శనంలో, అననీయ అనే వ్యక్తి లోపలికి రావడం, తనకు మళ్లీ చూపు వచ్చేలా+ ఆ వ్యక్తి తన మీద చేతులు ఉంచడం చూశాడు.”
13 అయితే అననీయ ఇలా అన్నాడు: “ప్రభువా, అతని గురించి, యెరూషలేములో ఉన్న నీ పవిత్రులకు అతను చేసిన హాని అంతటి గురించి చాలామంది చెప్తుంటే విన్నాను.
14 ఇప్పుడతను ముఖ్య యాజకులు ఇచ్చిన అధికారంతో, నీ పేరు మీద నమ్మకముంచే వాళ్లందర్నీ బంధించడానికి ఇక్కడికి వచ్చాడు.”+
15 అయితే ప్రభువు అతనికి ఇలా చెప్పాడు: “వెళ్లు! అన్యజనులకు,+ రాజులకు,+ ఇశ్రాయేలు ప్రజలకు నా పేరు గురించి సాక్ష్యమివ్వడానికి నేను ఎంచుకున్న వ్యక్తి*+ అతను.
16 నా పేరు కోసం అతను ఎన్ని బాధలు పడాలో నేను అతనికి చూపిస్తాను.”+
17 కాబట్టి అననీయ వెళ్లి ఆ ఇంట్లో ప్రవేశించి, సౌలు మీద చేతులుంచి, “సౌలా, సహోదరుడా, నువ్వు వస్తున్న దారిలో నీకు కనిపించిన ప్రభువైన యేసే నువ్వు చూపు పొందేలా, పవిత్రశక్తితో నింపబడేలా నన్ను నీ దగ్గరికి పంపాడు” అన్నాడు.+
18 వెంటనే సౌలు కళ్ల నుండి పొరల లాంటివి రాలాయి, అతనికి మళ్లీ చూపు వచ్చింది. అప్పుడు అతను లేచి బాప్తిస్మం తీసుకున్నాడు.
19 తర్వాత అతను కాస్త భోంచేసి బలపడ్డాడు.
సౌలు కొన్నిరోజులు దమస్కులోని+ శిష్యులతో ఉన్నాడు.
20 వెంటనే అతను, యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు.
21 అయితే అతని మాటలు విన్నవాళ్లంతా ఆశ్చర్యంలో మునిగిపోయి, “యెరూషలేములో యేసు పేరు మీద నమ్మకముంచిన వాళ్లను ఘోరంగా హింసించిన వ్యక్తి ఇతను కాదా?+ ఇతను ఇక్కడికి వచ్చింది యేసు శిష్యుల్ని బంధించి ముఖ్య యాజకుల దగ్గరికి తీసుకెళ్లడానికి కాదా?”+ అని చెప్పుకున్నారు.
22 అయితే సౌలు అంతకంతకూ శక్తి పొందుతూ,* యేసే క్రీస్తని రుజువులతో నిరూపిస్తూ+ దమస్కులో ఉన్న యూదుల్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు.
23 చాలా రోజులు గడిచాక, అక్కడి యూదులు సౌలును చంపాలని కుట్రపన్నారు.+
24 అయితే తన మీద వాళ్లు పన్నిన కుట్ర గురించి సౌలుకు తెలిసింది. అతన్ని చంపడానికి వాళ్లు రాత్రింబగళ్లు ఆ నగర ద్వారాల దగ్గర కూడా కాచుకొని ఉన్నారు.
25 కాబట్టి అతని శిష్యులు అతన్ని తీసుకెళ్లి, నగర ప్రాకారానికి ఉన్న కిటికీ గుండా రాత్రివేళ అతన్ని గంపలో కిందికి దించారు.+
26 సౌలు యెరూషలేముకు చేరుకున్నప్పుడు,+ అక్కడున్న శిష్యులతో కలవడానికి ప్రయత్నాలు చేశాడు. కానీ వాళ్లంతా అతనికి భయపడ్డారు. ఎందుకంటే అతను యేసు శిష్యుడయ్యాడని వాళ్లు నమ్మలేదు.
27 అయితే బర్నబా+ అతనికి సహాయం చేసి, అతన్ని అపొస్తలుల దగ్గరికి తీసుకెళ్లాడు. సౌలు దారిలో ప్రభువును చూడడం,+ ప్రభువు సౌలుతో మాట్లాడడం, దమస్కులో సౌలు యేసు పేరున ధైర్యంగా మాట్లాడడం+ గురించి బర్నబా వాళ్లకు వివరంగా చెప్పాడు.
28 కాబట్టి సౌలు యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ,* ప్రభువు పేరున ధైర్యంగా మాట్లాడుతూ వాళ్లతోనే ఉండిపోయాడు.
29 అతను గ్రీకు భాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ, వాళ్లతో వాదిస్తూ ఉన్నాడు. అయితే వాళ్లు అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేశారు.+
30 ఆ విషయం సహోదరులకు తెలిసినప్పుడు, వాళ్లు అతన్ని కైసరయకు తీసుకొచ్చి అక్కడి నుండి తార్సుకు పంపించేశారు.+
31 తర్వాత యూదయలో, గలిలయలో, సమరయలో+ ఉన్న సంఘమంతా కొంతకాలంపాటు ప్రశాంతతను అనుభవించింది, బలపడుతూ వచ్చింది. శిష్యులు యెహోవా* మార్గంలో* నడుస్తూ, పవిత్రశక్తి ద్వారా కలిగే ఆదరణకు*+ అనుగుణంగా జీవిస్తూ ఉండగా వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
32 పేతురు ఆ ప్రాంతమంతా తిరుగుతూ, లుద్దలో+ ఉన్న పవిత్రుల దగ్గరికి కూడా వచ్చాడు.
33 అక్కడ, ఎనిమిది సంవత్సరాలుగా పక్షవాతంతో మంచం పట్టిన ఐనెయ అనే వ్యక్తి అతనికి కనిపించాడు.
34 పేతురు అతనితో, “ఐనెయా, యేసుక్రీస్తు నిన్ను బాగుచేస్తున్నాడు.+ లేచి నీ పరుపు సర్దుకో”+ అన్నాడు. అతను వెంటనే లేచాడు.
35 లుద్దలో, షారోను మైదానంలో నివసిస్తున్న వాళ్లంతా అతన్ని చూసినప్పుడు వాళ్లు ప్రభువు మీద విశ్వాసముంచారు.
36 యొప్పేలో తబితా అనే శిష్యురాలు ఉంది. గ్రీకు భాషలోకి అనువదిస్తే ఆమె పేరు దొర్కా.* ఆమె ఎన్నో మంచిపనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది.
37 అయితే ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. కాబట్టి వాళ్లు ఆమెకు స్నానం చేయించి, మేడ మీదున్న గదిలో పడుకోబెట్టారు.
38 లుద్ద యొప్పేకు దగ్గర్లోనే ఉంది కాబట్టి పేతురు ఆ నగరంలో ఉన్నాడని శిష్యులు విన్నప్పుడు వాళ్లు ఇద్దరు మనుషుల్ని అక్కడికి పంపించి, “దయచేసి, ఆలస్యం చేయకుండా మా దగ్గరికి రా” అని అతన్ని వేడుకోమన్నారు.
39 దాంతో పేతురు లేచి వాళ్లతో పాటు వెళ్లాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు, వాళ్లు అతన్ని మేడ మీది గదిలోకి తీసుకెళ్లారు. విధవరాళ్లందరూ అతని దగ్గరికి వచ్చి ఏడుస్తూ, దొర్కా తమతో ఉన్నప్పుడు చేసిన వస్త్రాల్ని* చూపించారు.
40 అప్పుడు పేతురు అందర్నీ బయటికి పంపించి,+ మోకాళ్లూని ప్రార్థించాడు. తర్వాత అతను ఆమె మృతదేహం వైపుకు తిరిగి, “తబితా, లే!” అన్నాడు. దాంతో ఆమె కళ్లు తెరిచింది, పేతురును చూసి లేచి కూర్చుంది.+
41 అతను ఆమెకు చెయ్యి అందించి లేపి, పవిత్రుల్ని, విధవరాళ్లను పిలిచి తబితా మళ్లీ బ్రతికిందని వాళ్లకు చూపించాడు.+
42 ఈ విషయం గురించి యొప్పే అంతటా తెలిసిపోయింది. దాంతో చాలామంది ప్రభువు మీద విశ్వాసముంచారు.+
43 పేతురు యొప్పేలో సీమోను అనే చర్మకారుడి* ఇంట్లో చాలా రోజులు ఉన్నాడు.+
అధస్సూచీలు
^ లేదా “స్వరం శబ్దం.”
^ లేదా “పాత్ర.”
^ లేదా “ప్రకటించే విషయంలో అంతకంతకూ సమర్థుడిగా తయారౌతూ.”
^ లేదా “వస్తూ వెళ్తూ.”
^ లేదా “ప్రోత్సాహానికి; బలానికి.”
^ అక్ష., “భయంలో.”
^ అనుబంధం A5 చూడండి.
^ దొర్కా అనే గ్రీకు పేరుకు, తబితా అనే అరామిక్ పేరుకు “కొండజింక” అని అర్థం.
^ లేదా “పైవస్త్రాల్ని.”
^ అంటే, జంతు చర్మాల్ని తోలుగా మార్చే వ్యక్తి.