కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేచివుండే వైఖరిని చూపించండి!

వేచివుండే వైఖరిని చూపించండి!

వేచివుండే వైఖరిని చూపించండి!

“రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.”మీకా 7:⁠7.

1, 2. (ఎ) తప్పుడు వైఖరి అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఎలా హాని కల్గించింది? (బి) సరైన వైఖరిని అలవర్చుకోని క్రైస్తవునికి ఏమి జరుగుతుంది?

మన వైఖరి ఆధారంగానే, జీవితంలోని అనేక విషయాలను అనుకూలంగా గానీ ప్రతికూలంగా గానీ దృష్టించవచ్చు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, వాళ్లకు అద్భుతరీతిలో మన్నా ఇవ్వబడింది. తమ చుట్టూ ఉన్న బంజరు భూమిని చూసి, తమకు యెహోవా ఆహారాన్ని అనుగ్రహిస్తున్నందుకు వాళ్లు ఆయనపట్ల ఎంతో కృతజ్ఞత చూపించి ఉండవలసింది. అది అనుకూల వైఖరిని ప్రతిబింబించి ఉండేది. దానికి బదులు, వాళ్లు ఐగుప్తులోని వివిధ రకాల ఆహారాన్ని గుర్తు తెచ్చుకుని మన్నా రుచీ పచీ లేనిదని గొణిగారు. ఎంత ప్రతికూలమైన వైఖరి!​—⁠సంఖ్యాకాండము 11:4-6.

2 అలాగే నేడు ఒక క్రైస్తవుడు కల్గివుండే వైఖరి, విషయాలను ఆశాజనకంగా గానీ లేక నిరాశాజనకంగా గానీ కనిపించేలా చేస్తుంది. సరైన వైఖరి లేకపోతే ఒక క్రైస్తవుడు సుళువుగా తన ఆనందాన్ని కోల్పోగలడు, అది గంభీరమైన విషయం కాగలదు ఎందుకంటే నెహెమ్యా ఇలా చెప్పాడు, “యెహోవాయందు ఆనందించుటవలన [మనము] బలమొందుదు[ము].” (నెహెమ్యా 8:​10) మనం బలంగా ఉండడానికీ, సంఘంలో సమాధాన ఐక్యతలను పెంపొందింపజేయడానికీ అనుకూలమైన, ఆనందభరితమైన వైఖరి మనకు సహాయం చేస్తుంది.​—⁠రోమీయులు 15:​13; ఫిలిప్పీయులు 1:⁠25,26.

3. కష్ట సమయాల్లో యిర్మీయాకు సరైన వైఖరి ఎలా సహాయం చేసింది?

3 కష్టసమయాల్లో జీవిస్తున్నప్పటికీ, యిర్మీయా అనుకూల వైఖరిని చూపించాడు. ఆయన సా.శ.పూ. 607 లో యెరూషలేము కూలిపోయినప్పుడు జరిగిన భీభత్సాన్ని చూసినప్పుడు కూడా ఆయన అనుకూల అంశాలను చూడగల్గాడు. యెహోవా ఇశ్రాయేలును మరచిపోడు, ఆ జనాంగం సజీవంగా నిలిచివుంటుంది. విలాపవాక్యములు పుస్తకంలో యిర్మీయా ఇలా వ్రాశాడు: “యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైన నమ్మదగినవాడవు.” (విలాపవాక్యములు 3:⁠22, 23) చరిత్రంతటిలోనూ దేవుని సేవకులు అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో కూడా అనుకూలమైన, ఆనందభరితమైన వైఖరిని కాపాడుకోవడానికి ప్రయత్నించారు.​—⁠2 కొరింథీయులు 7:⁠4; 1 థెస్సలొనీకయులు 1:⁠6; యాకోబు 1:⁠2,3.

4. యేసు ఏ వైఖరిని కల్గివున్నాడు, అది ఆయనకెలా సహాయం చేసింది?

4 యిర్మీయాకు ఆరు వందల సంవత్సరాల తర్వాత, యేసు తనకున్న అనుకూల వైఖరిని బట్టి సహించగలిగాడు. మనమిలా చదువుతాము: “[యేసు] తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు.” (హెబ్రీయులు 12:​1,2) యేసు ఏ వ్యతిరేకతను లేక హింసను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, చివరికి మ్రానుపై వేదనను అనుభవించ వలసి వచ్చినప్పుడు కూడా ఆయన “తనయెదుట ఉంచబడిన ఆనందము”పై తన మనస్సును నిలిపాడు. ఆ ఆనందమేమిటంటే యెహోవా సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపర్చడమూ, ఆయన నామాన్ని ఘనపర్చడమూ, అలాగే భవిష్యత్తులో విధేయులైన మానవజాతికి గొప్ప ఆశీర్వాదాలను తీసుకురావడమూ అనే ఆధిక్యతే.

వేచివుండే వైఖరిని అలవర్చుకోండి

5. విషయాలను గూర్చి సరైన దృక్కోణం కల్గివుండటానికి, వేచివుండే వైఖరి మనకు సహాయం చేయగల అతి సాధారణమైన పరిస్థితి ఒకటి ఏది?

5 మనం యేసుకున్నటువంటి మనోవైఖరిని వృద్ధి చేసుకుంటే, విషయాలన్నీ ఎల్లప్పుడూ మనం కోరుకున్నట్లే, మనం కోరుకున్నప్పుడే జరుగకపోయినా యెహోవా ఇచ్చే ఆనందాన్ని మనం కోల్పోము. ప్రవక్తయైన మీకా ఇలా చెప్పాడు: “అయినను యెహోవాకొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.” (మీకా 7:⁠7; విలాపవాక్యములు 3:​21) మనం కూడా వేచివుండే వైఖరిని ప్రదర్శించవచ్చు. ఎలా? ఎన్నో విధాలుగా ప్రదర్శించవచ్చు. ఒక విధం ఏమిటంటే, అధికారం ఉన్న ఒక సహోదరుడు తప్పుగా ప్రవర్తించినప్పుడు వెంటనే దాన్ని సరిచేయవలసిన అవసరం ఉందని మనం భావించవచ్చు. కానీ, వేచివుండే వైఖరి మనకు ఉంటే, ‘ఆయన నిజంగానే తప్పు చేశాడా లేక నేను పొరబడ్డానా? ఆయనదే తప్పైతే, ఒకవేళ ఆయన మారవచ్చనీ, మరీ గంభీరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరం లేదనీ యెహోవా భావిస్తూ కొంత సమయం గడవటానికి ఆయన అనుమతిస్తున్నాడా?’ అని పరిశీలించటానికి మనకు సాధ్యమౌతుంది.

6. వ్యక్తిగత సమస్యతో పోరాడే వారికి వేచివుండే వైఖరి ఎలా సహాయం చేయగలదు?

6 మనం ఏదైనా వ్యక్తిగత సమస్యతో బాధపడుతుంటే లేక ఏదైనా బలహీనతతో పోరాడుతుంటే మనకు వేచివుండే వైఖరి అవసరం కావచ్చు. మనం యెహోవా సహాయాన్ని కోరినప్పటికీ సమస్య అలాగే ఉందనుకోండి. అప్పుడెలా? సమస్యను పరిష్కరించటానికి మనం చేయగల్గినదంతా చేస్తూ, యేసు చెప్పిన ఈ మాటలపై విశ్వాసం ఉంచాలి: “అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.” (లూకా 11:⁠9) ప్రార్థిస్తూ, యెహోవా సమాధానం కోసం వేచివుండండి. సముచితమైన సమయంలో, యెహోవా తన స్వంత విధానంలో మీ ప్రార్థనలకు సమాధానమిస్తాడు.​—⁠1 థెస్సలొనీకయులు 5:⁠16-18.

7. బైబిలును గురించి క్రమమైన సుస్పష్టమైన అర్థం అందించబడడాన్ని మనం దృష్టించే విధానంలో, వేచివుండే వైఖరి మనకు ఏ విధంగా సహాయం చేయగలదు?

7 బైబిలు ప్రవచనాలు నెరవేరుతుండగా, లేఖనాలను గూర్చిన మన అవగాహన స్పష్టమౌతుంది. అయితే కొన్నిసార్లు ఫలాని వివరణ ఇంకా రావడం లేదేమిటని మనం అనుకోవచ్చు. మనం అనుకున్నప్పుడు అది రాకపోతే, మనం వేచివుండడానికి సుముఖంగా ఉన్నామా? “క్రీస్తు మర్మము”ను బయల్పర్చటానికి దాదాపు 4,000 సంవత్సరాలు గడవడం అవసరమైందనీ, అదీ దాన్ని దశలవారీగా కొద్దికొద్దిగా బయల్పర్చడమే సబబని యెహోవా భావించాడనీ గుర్తుంచుకోండి. (ఎఫెసీయులు 3:​3-6) మరి మనం అసహనంగా ఉండడానికి కారణమేదైనా ఉందా? యెహోవా ప్రజలకు “తగినవేళ అన్నము” పెట్టేందుకు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని’ నియమించాడన్న విషయాన్ని మనం శంకిస్తామా? (ఇటాలిక్కులు మావి.) (మత్తయి 24:​45) అన్నీ సంపూర్ణంగా అర్థం కాలేదని చెప్పి మనం మన దైవిక ఆనందాన్ని ఎందుకు కోల్పోవాలి? యెహోవా తాను “సంకల్పించినదానిని” ఎప్పుడు, ఎలా బయల్పర్చాలనేది తానే నిర్ణయించుకుంటాడని గుర్తుంచుకోండి.​—⁠ఆమోసు 3:⁠7.

8. యెహోవా చూపించిన సహనం ఎలా అనేకులకు ప్రయోజనకరమైనదిగా నిరూపించబడింది?

8 అనేక సంవత్సరాల నమ్మకమైన సేవ తర్వాత తాము, “యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము”ను చూసేంత వరకు జీవించి ఉండమేమోనని భావిస్తూ కొందరు నిరుత్సాహపడవచ్చు. (యోవేలు 2:​30, 31) అయినప్పటికీ, వాళ్లు అనుకూల అంశాలను బట్టి ప్రోత్సాహాన్ని పొందుతారు. పేతురు ఇలా ఉపదేశించాడు: “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” (2 పేతురు 3:​15) అదనంగా లక్షలాదిమంది నీతి హృదయులు సత్యాన్ని తెలుసుకోవటానికి యెహోవా సహనం అనుమతించింది. అది అద్భుతమైన విషయం కాదా? అంతేగాక, యెహోవా ఎంత ఎక్కువ కాలం సహనాన్ని కనబరిస్తే, మనం ‘భయముతోను వణకుతోను మన సొంతరక్షణను కొనసాగించుకోవటానికి’ మనకు అంత ఎక్కువ సమయం లభిస్తుంది.​—⁠ఫిలిప్పీయులు 2:​12; 2 పేతురు 3:11, 12.

9. యెహోవా సేవలో మనం చేయగల దాని విషయంలో మనం పరిమితులను కల్గివుంటే, పరిస్థితిని సహించడానికి వేచివుండే వైఖరి మనకెలా సహాయం చేయగలదు?

9 వ్యతిరేకత, అనారోగ్యం, పైబడుతున్న వయస్సు, లేక ఇతర సమస్యలు రాజ్య సేవలో ముందుకు సాగకుండా మనకు ఆటంకం ఏర్పరిస్తే, మనం నిరుత్సాహపడకుండా ఉండటానికి వేచివుండే వైఖరి మనకు సహాయం చేస్తుంది. మనం పూర్ణహృదయంతో ఆయన సేవ చేయాలని యెహోవా ఎదురు చూస్తాడు. (రోమీయులు 12:⁠1) అయితే, “నిరుపేదలయందును బీదలయందును” కనికరం చూపే దేవుని కుమారుడు మనం సహేతుకంగా ఇవ్వగల్గిన దానికన్నా ఎక్కువ కోరడు; యెహోవా కూడా అంతే. (కీర్తన 72:​13) కాబట్టి, మనం చేయగల్గినది చేస్తూ, ఈ విధానంలోనైనా లేక రానైయున్న విధానంలోనైనా పరిస్థితులు మారే వరకు సహనంతో వేచివుండాలని మనం ప్రోత్సహించబడుతున్నాము. గుర్తుంచుకోండి: “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”​—⁠హెబ్రీయులు 6:⁠10.

10. వేచివుండే వైఖరిగల వ్యక్తి ఏ దైవభక్తి రహితమైన లక్షణాన్ని నివారించగలడు? వివరించండి.

10 వేచివుండే వైఖరి అహంకారాన్ని నివారించటానికి కూడా మనకు సహాయం చేస్తుంది. మతభ్రష్టులుగా మారిన కొందరు వేచివుండడానికి సుముఖత చూపించలేదు. బైబిలును అర్థం చేసుకోవడంలో గానీ లేక సంస్థాగతమైన విషయాల్లో మార్పులు జరుగవలసిన అవసరముందని గానీ వాళ్లు భావించివుండవచ్చు. అయినప్పటికీ, యెహోవా తాను సముచితమని భావించిన సమయంలో మార్పులు చేసేలా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని పురికొల్పుతాడే గానీ మనం అవసరమని భావించినప్పుడు కాదని వాళ్లు గుర్తించలేకపోయారు. ఏ మార్పులైనా యెహోవా చిత్తానికి అనుగుణంగా ఉండాలి గానీ మన వ్యక్తిగత తలంపులకు కాదు. అహంకార వైఖరి తమ ఆలోచనా విధానాన్ని వక్రీకరించి తమకు అభ్యంతరం కల్గించడానికి మతభ్రష్టులు అనుమతిస్తారు. కానీ వాళ్లు క్రీస్తు మనోవైఖరిని అలవర్చుకుంటే, వాళ్లు తమ ఆనందాన్ని కాపాడుకుని యెహోవా ప్రజల మధ్యే మిగిలివుండడం సాధ్యమౌతుంది.​—⁠ఫిలిప్పీయులు 2:5-8.

11. వేచివుండటానికి వెచ్చించే సమయాన్ని మనం ప్రయోజనకరమైన విధంగా ఎలా ఉపయోగించుకోగలము, ఎవరి మాదిరులను అనుసరిస్తూ?

11 అయితే, వేచివుండే వైఖరి అంటే అర్థం సోమరిగా లేక నిష్ప్రయోజనకరంగా ఉండడమని కాదు. చేయవలసిన పనులు మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, మనం వ్యక్తిగత బైబిలు పఠనంలో నిమగ్నమై ఉండాలి, ఆధ్యాత్మిక విషయాల్లో నమ్మకమైన ప్రవక్తలూ దేవదూతలూ చూపించినలాంటి ఆసక్తినే మనమూ చూపించాలి. అలాంటి ఆసక్తి గురించి మాట్లాడుతూ, పేతురు ఇలా అన్నాడు: “మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణనుగూర్చి పరిశీలించుచు, . . . దానిని విచారించి పరిశోధించిరి. . . . దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు.” (1 పేతురు 1:​10-12) వ్యక్తిగత పఠనమే కాదు కూటాలకు క్రమంగా హాజరు కావడమూ ప్రార్థనా కూడా ఎంతో ఆవశ్యకం. (యాకోబు 4:⁠8) క్రమంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూ, తోటి క్రైస్తవులతో సహవసించడం ద్వారా తమ ఆధ్యాత్మిక అవసరాల గురించి శ్రద్ధ కల్గివున్నామని చూపించే వ్యక్తులు, తాము క్రీస్తు వైఖరిని అలవర్చుకున్నామని తెలియజేస్తారు.​—⁠మత్తయి 5:⁠3.

వాస్తవిక దృష్టి కల్గివుండండి

12. (ఎ) ఆదాము హవ్వలు ఏ స్వేచ్ఛను కోరుకున్నారు? (బి) మానవ జాతి ఆదాము హవ్వల మార్గాన్ని అనుసరించడం వల్ల కల్గిన ఫలితమేమిటి?

12 దేవుడు మొదటి మానవ జంటను సృష్టించినప్పుడు, తప్పొప్పుల ప్రమాణాలను నిర్ణయించే హక్కును ఆయన తన ఆధీనంలో ఉంచుకున్నాడు. (ఆదికాండము 2:​16, 17) ఆదాము హవ్వలు మాత్రం దేవుని నిర్దేశనం నుండి తమకు స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు, దాని ఫలితమే మనం నేడు మన చుట్టూ చూస్తున్న ప్రపంచం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:​12) ఆదాము కాలం నుండి ఆరు వేల సంవత్సరాల మానవ చరిత్ర, “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” అని పలికిన యిర్మీయా మాటల్లోని నిజత్వాన్ని నిరూపిస్తుంది. (యిర్మీయా 10:​23) యిర్మీయా పలికిన మాటలు నిజమని అంగీకరించడం పరాజయం పొందినట్లేమీ కాదు. అది వాస్తవిక దృష్టిని కల్గివుండడమే. మానవులు దేవుని ప్రమేయం లేకుండా తమను తాము పరిపాలించుకోవడంతో, “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చు”కున్న సుధీర్ఘమైన శతాబ్దాలన్నిటినీ అది వివరిస్తుంది.​—⁠ప్రసంగి 8:⁠9.

13. మానవులు సాధించగల దాని గురించి యెహోవాసాక్షులు ఏ వాస్తవికమైన దృక్కోణాన్ని కల్గివున్నారు?

13 మానవజాతి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా, ప్రస్తుత విధానంలో సాధించగల దానికి పరిమితులు ఉన్నాయని యెహోవాసాక్షులు గుర్తిస్తారు. అనుకూల వైఖరి మన ఆనందాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయగలదు, కానీ అదే అన్నింటికీ పరిష్కారం కాదు. అమెరికాకు చెందిన ఒక మతనాయకుడు 1950ల తొలికాలంలో, ది పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌ అనే ప్రజాదరణ పొందిన పుస్తకాన్ని ప్రచురించాడు. అనుకూల వైఖరితో వ్యవహరిస్తే అనేక అవాంతరాలను అధిగమించే అవకాశం ఉందని ఆ పుస్తకం సూచించింది. సరియైన ఆలోచనావిధానం కలిగిఉండడం కచ్చితంగా మెచ్చుకోదగినదే. అయితే జ్ఞానము, నైపుణ్యము, వస్తుసంపదలు, మరనేక ఇతర కారకాలు, వ్యక్తులుగా మనం సాధించగల దాన్ని పరిమితం చేస్తాయని అనుభవం చూపిస్తుంది. ప్రపంచ స్థాయిలో చూస్తే, మానవులు ఎంత అనుకూలమైన ఆలోచనా విధానాన్ని కల్గివున్నప్పటికీ, సమస్యలు, వారు విజయవంతంగా పరిష్కరించలేనంత పెద్దవిగా ఉన్నాయి!

14. యెహోవాసాక్షులకు ప్రతికూల వైఖరి ఉందా? వివరించండి.

14 యెహోవాసాక్షులు అలాంటి విషయాలపై తాము కల్గివున్న వాస్తవికమైన దృక్కోణాన్ని బట్టి కొన్నిసార్లు వారు ప్రతికూలమైన వైఖరిని కల్గివున్నట్లు నిందించబడుతున్నారు. అయితే మానవజాతి దుర్గతిని శాశ్వతంగా మార్చివేయగల ఏకైక వ్యక్తి గురించి ప్రజలకు చెప్పాలని వారు ఉత్సుకతతో ఉన్నారు. ఈ విషయంలో కూడా వాళ్లు క్రీస్తు మనోవైఖరిని అనుకరిస్తారు. (రోమీయులు 15:⁠2) దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకునేందుకు ప్రజలకు సహాయం చేయడంలో వారు నిమగ్నమైవున్నారు. చివరికిది ఎంతో మేలును చేకూరుస్తుందని వాళ్లకు తెలుసు.​—⁠మత్తయి 28:​19, 20; 1 తిమోతి 4:⁠16.

15. యెహోవాసాక్షుల పని వ్యక్తులను ఎలా మెరుగుపరుస్తుంది?

15 యెహోవాసాక్షులు తమ చుట్టూ ఉన్న సాంఘిక సమస్యల్ని, ప్రాముఖ్యంగా కలుషితపరిచే లేఖన విరుద్ధమైన ఆచారాలను అలక్ష్యం చేయరు. ఆసక్తిగల వ్యక్తి యెహోవా సాక్షి అయ్యేముందు, అతడు తన జీవితంలో మార్పులు చేసుకుంటాడు, అంటే దేవునికి అప్రీతికరమైన దుర్వ్యసనాలను మానుకుంటాడు. (1 కొరింథీయులు 6:​9-11) అలా యెహోవాసాక్షులు త్రాగుడు, మాదక ద్రవ్యాలు, లైంగిక దుర్నీతి, జూదం వంటి దుర్వ్యసనాల్ని అధిగమించేందుకు, ప్రతిస్పందించే మనస్తత్వంగల వారికి సహాయం చేశారు. అలా మారిన వ్యక్తులు తమ కుటుంబాల గురించి బాధ్యతాయుతంగా, యథార్థతతో శ్రద్ధ తీసుకోవటాన్ని నేర్చుకున్నారు. (1 తిమోతి 5:⁠8) వ్యక్తులకు, కుటుంబాలకు ఇలా సహాయం అందజేయబడినప్పుడు, సమాజంలో సమస్యలు తగ్గాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారి సంఖ్య తగ్గిపోయింది, కుటుంబాల్లో దౌర్జన్యం జరగడం తగ్గింది. తాము చట్టానికి విధేయులయ్యుండే పౌరులుగా ఉండడం ద్వారా, ఇతరులు వారి జీవితాలను మంచిగా మార్చుకునేలా వారికి సహాయం చేయడం ద్వారా, సాంఘిక సమస్యలతో వ్యవహరించాల్సిన బాధ్యతవున్న సంస్థల భారాన్ని యెహోవాసాక్షులు తగ్గిస్తున్నారు.

16. యెహోవాసాక్షులు లౌకికపరమైన సంస్కరణోద్యమాల్లో ఎందుకు తలదూర్చరు?

16 మరి యెహోవాసాక్షులు ప్రపంచంలోని నైతిక వాతావరణాన్ని మార్చారా? గత దశాబ్దంలో, చురుగ్గా ఉన్న సాక్షుల సంఖ్య 38,00,000 నుండి దాదాపు 60,00,000కు పెరిగింది. అంటే 22,00,000 మంది పెరిగినట్లు. క్రైస్తవులుగా మారినప్పుడు వారిలో చాలామంది తమ అవినీతికరమైన అలవాట్లను మార్చుకున్నారు. ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి! అయితే అదే కాలంలో ప్రపంచ జనాభాలో ఏర్పడిన పెరుగుదల అయిన 87,50,00,000తో పోల్చి చూస్తే, ఇది చాలా చిన్న సంఖ్యనే! ప్రతిస్పందించే మనస్తత్వంగల వారికి సహాయం చేయడం ఆనందానికి మూలమని యెహోవాసాక్షులు కనుగొన్నారు, అయితే మానవజాతిలోని కేవలం కొంతమంది మాత్రమే జీవమార్గాన్ని చేపడతారని కూడా వాళ్లు గుర్తించారు. (మత్తయి 7:​13, 14) సాక్షులు కేవలం దేవుడు మాత్రమే తీసుకురాగల ప్రపంచవ్యాప్త మార్పుల కోసం ఎదురుచూస్తూవుంటారు, లౌకికపరమైన సంస్కరణోద్యమాల్లో పాల్గొనరు, ఎందుకంటే సాధారణంగా అవి మంచి ఉద్దేశంతోనే ప్రారంభించబడతాయి గానీ చివరికి నిరాశకూ హింసాత్మక సంఘటనలకూ దారితీస్తాయి.​—⁠2 పేతురు 3:⁠13.

17. తన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయటానికి యేసు ఏమి చేశాడు, కాని ఆయనేమి చేయలేదు?

17 ఈ చర్యలను చేపట్టడంలో యెహోవాసాక్షులు, యేసు ఈ భూమిపైనున్నప్పుడు ఆయన యెహోవాయందు చూపించినలాంటి నమ్మకాన్నే చూపిస్తారు. పూర్వం మొదటి శతాబ్దంలో, యేసు స్వస్థపరిచే అద్భుతాలను చేశాడు. (లూకా 6:​17-19) ఆయన మృతులను పునరుత్థానం కూడా చేశాడు. (లూకా 7:⁠11-⁠15; 8:​49-56) కానీ ఆయన అనారోగ్య సమస్యను నిర్మూలించలేదు లేక శత్రువైన మరణాన్ని పూర్తిగా తీసివేయలేదు. అలా చేయటానికి దేవుని నియమిత సమయం ఇంకా రాలేదని ఆయనకు తెలుసు. పరిపూర్ణ మానవునిగా తనకున్న ఉన్నతమైన సామర్థ్యాలతో యేసు గంభీరమైన రాజకీయ సామాజిక సమస్యలను పరిష్కరించడానికి ఎంతో చేయగల్గివుండే వాడే. ఆయన సమకాలీనులు కొందరు ఆయన అధికారంలోకి వచ్చి అలా చేయాలని కోరుకున్నారని తెలుస్తుంది, అయితే యేసు దానికి నిరాకరించాడు. మనమిలా చదువుతాము: “ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి—నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.”​—⁠యోహాను 6:14, 15.

18. (ఎ) యేసు ఎల్లప్పుడూ వేచివుండే వైఖరిని ఎలా చూపించాడు? (బి) యేసు కార్యకలాపాలు 1914 నుండి ఎలా మారాయి?

18 యేసు రాజకీయాల్లో పాల్గొనడానికి లేదా సంపూర్ణ సంఘ సేవలో పాల్గొనడానికి నిరాకరించాడు, ఎందుకంటే రాజుగా తాను అధికారం చేపట్టి ప్రతి ఒక్కరి కోసం అంతటా స్వస్థత కార్యాలు చేపట్టడానికి ఇంకా సమయం రాలేదని ఆయనకు తెలుసు. ఆయన పరలోకానికి ఆరోహణమై అమర్త్యమైన ఆత్మ జీవితాన్ని పొందిన తర్వాత కూడా తాను చర్య తీసుకోకుండా, యెహోవా నియమిత కాలం కోసం వేచివుండటానికే ఇష్టపడ్డాడు. (కీర్తన 110:⁠1; అపొస్తలుల కార్యములు 2:​34, 35) అయితే, దేవుని రాజ్యానికి రాజుగా ఆయన 1914 లో సింహాసనాసీనుడైన తర్వాత, ఆయన “జయించుచు, జయించుటకు బయలు”వెళ్తున్నాడు. (ప్రకటన 6:2; 12:​10) క్రైస్తవులమని చెప్పుకునే ఇతరులు రాజ్యాన్ని గూర్చిన బైబిలు బోధలను తెలుసుకోవడానికి నిరాకరిస్తుండగా, ఆయన రాజరికానికి విధేయులమై ఉండటానికి మనమెంత కృతజ్ఞులమై ఉన్నామో కదా!

వేచివుండడం​—⁠చికాకు కల్గిస్తుందా లేక ఆనందాన్నిస్తుందా?

19. వేచివుండడం ‘హృదయాన్ని’ ఎప్పుడు ‘నొప్పిస్తుంది,’ అది ఆనందానికి ఎప్పుడు మూలము?

19 వేచివుండడం చికాకు కల్గించగలదని సొలొమోనుకు తెలుసు. ఆయనిలా వ్రాశాడు: “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును.” (సామెతలు 13:​12) కచ్చితంగా, ఒక వ్యక్తి ఎన్నటికీ నెరవేరని కోరికలను కల్గివుంటే, నిరాశతో హృదయం కృంగిపోతుంది. అయితే, వివాహం, శిశు జననం, లేక మనకు ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవడం వంటి సంతోషకరమైన సంఘటనల కోసం వేచివుండడం ఆ రోజులు రాకముందు మన హృదయాల్ని నిరీక్షణానందాలతో నింపుతుంది. రానున్న సంఘటన కోసం సిద్ధపాట్లు చేసుకుంటూ మనం వేచివుండే సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవడం మన ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.

20. (ఎ) ఏ అద్భుతమైన సంఘటనలు చూస్తామని మనం నమ్మకంగా ఎదురు చూడవచ్చు? (బి) యెహోవా సంకల్పాలు నెరవేరటానికి వేచివున్నప్పుడు మనం ఆనందాన్ని ఎలా కనుగొనవచ్చు?

20 మనం కోరుకుంటున్నవి తప్పక నెరవేరుతాయన్న సంపూర్ణ నమ్మకం మనకున్నప్పుడు, అవి ఎప్పుడు నెరవేరుతాయన్నది మనకు తెలియకపోయినప్పటికీ, మనం వేచివుండే ఆ సమయం ‘మన హృదయాన్ని నొప్పించదు.’ క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన త్వరలో రానైయుందని దేవుని నమ్మకమైన ఆరాధకులకు తెలుసు. అనారోగ్యం, మరణం వంటివాటి అంతాన్ని తాము చూస్తామన్న నమ్మకం వారికుంది. మరణించిన తమ ప్రియమైనవారితో సహా కోట్లాదిమంది మృతులను తిరిగి ఆహ్వానించగల సమయం కోసం వాళ్లు తీవ్రమైన ఆకాంక్షతో ఆనందంగా ఎదురుచూస్తారు. (ప్రకటన 20:1-3, 6; 21:​3, 4) పర్యావరణ సంక్షోభం ఉన్న ఈ సమయాల్లో, భూమిపై పరదైసు స్థాపించబడటాన్ని చూసే కచ్చితమైన ఉత్తరాపేక్ష వారికి ఉంది. (యెషయా 35:​1, 2, 7) “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తుల”మై ఉంటూ వేచివుండే ఈ సమయాన్ని వివేకవంతంగా ఉపయోగించుకోవడం ఎంత జ్ఞానయుక్తమైనది! (1 కొరింథీయులు 15:​58) ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూనే ఉండండి. యెహోవాతో మరింత సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి. యెహోవాను సేవించాలని కోరుకునే వారి కోసం వెదకండి. తోటి విశ్వాసులను ప్రోత్సహించండి. యెహోవా ఇంకా అనుమతించబోయే సమయం నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందండి. అప్పుడు, యెహోవా కోసం వేచివుండడం ఎన్నడూ ‘మీ హృదయాన్ని నొప్పించదు.’ బదులుగా, అది మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది!

మీరు వివరించగలరా?

• యేసు వేచివుండే వైఖరిని ఎలా చూపించాడు?

• క్రైస్తవులకు ఏ పరిస్థితుల్లో వేచివుండే వైఖరి అవసరం?

• యెహోవా కోసం వేచివుండడంలో యెహోవాసాక్షులు ఎందుకు సంతృప్తి కల్గివున్నారు?

• యెహోవా కోసం వేచివుండడం ఎలా ఆనందానికి మూలం కాగలదు?

[అధ్యయన ప్రశ్నలు]

[12వ పేజీలోని చిత్రాలు]

తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం యేసు సహించాడు

[13వ పేజీలోని చిత్రం]

సంవత్సరాలపాటు సేవ చేసిన తర్వాత కూడా, మనం మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు

[15వ పేజీలోని చిత్రాలు]

యెహోవా సాక్షులవ్వడం ద్వారా లక్షలాదిమంది తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారు