ఫిలిప్పీయులు 1:1-30
1 ఫిలిప్పీలోని+ క్రీస్తుయేసు శిష్యులైన పవిత్రులందరికీ, అలాగే పర్యవేక్షకులకు, సంఘ పరిచారకులకు+ క్రీస్తుయేసు దాసులైన పౌలు, తిమోతి రాస్తున్న ఉత్తరం.
2 మన తండ్రైన దేవుడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.
3 నేను మిమ్మల్ని గుర్తుచేసుకున్న ప్రతీసారి నా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను.
4 నేను మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థించినప్పుడల్లా అలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఎప్పుడూ మీ గురించి సంతోషంగా దేవుణ్ణి వేడుకుంటున్నాను.+
5 ఎందుకంటే మీరు మంచివార్త విన్న రోజు నుండి ఈ రోజు వరకు దాన్ని వ్యాప్తి చేయడంలో మీ సహకారం అందించారు.
6 మీలో ఒక మంచిపనిని మొదలుపెట్టిన దేవుడే, క్రీస్తుయేసు రోజుకల్లా+ దాన్ని పూర్తి చేస్తాడని+ నేను గట్టిగా నమ్ముతున్నాను.
7 మీరు నా హృదయంలో ఉన్నారు కాబట్టి నేను మీ అందరి గురించి అలా ఆలోచించడం సరైనదే. నేను చెరసాలలో ఉన్నప్పుడు+ మీరు నాకు సహాయం చేశారు. అంతేకాదు, మంచివార్త తరఫున వాదించే విషయంలో,* దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించే విషయంలో+ మీరు నాకు మద్దతిచ్చారు. అలా మీరూ, నేనూ దేవుని అపారదయ నుండి ప్రయోజనం పొందాం.
8 క్రీస్తుయేసుకు ఉన్నలాంటి వాత్సల్యమే మీ మీద నాకు ఉంది. ఆ వాత్సల్యంతోనే నేను మీ అందరి కోసం తపిస్తున్నాను, దీనికి దేవుడే సాక్షి.
9 మీ ప్రేమ సరైన జ్ఞానం,+ మంచి వివేచనలతో+ పాటు అంతకంతకూ పెరగాలని+ నేను ప్రార్థిస్తూ ఉన్నాను;
10 మీరు ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలని,+ అలా మీరు క్రీస్తు రోజు వరకు స్వచ్ఛంగా ఉండాలని, ఇతరులు విశ్వాసం కోల్పోవడానికి కారణం కాకుండా ఉండాలని+ నేను ప్రార్థిస్తున్నాను;
11 అలాగే యేసుక్రీస్తు ద్వారా మీరు పుష్కలంగా నీతిఫలం ఫలించాలని+ ప్రార్థిస్తున్నాను, దానివల్ల దేవునికి మహిమ, స్తుతి కలుగుతాయి.
12 సహోదరులారా, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పరిస్థితి నిజానికి మంచివార్తను వ్యాప్తి చేయడానికే తోడ్పడింది.
13 నేను క్రీస్తు కోసం ఖైదీగా ఉన్నాననే విషయం+ ప్రేతోర్య సైనికులందరికీ,* మిగతా వాళ్లందరికీ తెలిసింది.+
14 ప్రభువు సేవలో ఉన్న చాలామంది సహోదరులు నా సంకెళ్ల వల్ల ప్రోత్సాహం పొంది చాలా ధైర్యంగా, ఏమాత్రం భయపడకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.
15 నిజమే, కొందరు ఈర్ష్యతో, శత్రుభావంతో క్రీస్తును ప్రకటిస్తున్నారు, కానీ ఇతరులు మంచి ఉద్దేశంతో ప్రకటిస్తున్నారు.
16 మంచి ఉద్దేశంతో ప్రకటించేవాళ్లు ప్రేమతో క్రీస్తును ప్రకటిస్తున్నారు, ఎందుకంటే మంచివార్త తరఫున వాదించడానికి*+ దేవుడు నన్ను నియమించాడని వాళ్లకు తెలుసు.
17 కానీ ఈర్ష్యతో, శత్రుభావంతో ప్రకటించేవాళ్లు స్వచ్ఛమైన ఉద్దేశంతో కాకుండా, గొడవలకు దిగే మనస్తత్వంతో ప్రకటిస్తున్నారు; ఖైదీగా ఉన్న నాకు సమస్యలు సృష్టించాలని వాళ్లు అలా చేస్తున్నారు.
18 కానీ దానివల్ల ఏమైంది? చెడు ఉద్దేశంతోనో, మంచి ఉద్దేశంతోనో అన్నివిధాలుగా క్రీస్తు గురించిన సందేశం ప్రకటించబడుతోంది; అందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకముందు కూడా సంతోషిస్తూనే ఉంటాను.
19 ఎందుకంటే మీ ప్రార్థనల వల్ల,+ యేసుక్రీస్తు ఇచ్చే పవిత్రశక్తి వల్ల+ నాకు రక్షణ కలుగుతుందని నాకు తెలుసు.
20 నేను ఏ రకంగానూ సిగ్గుపడాల్సిన అవసరం రాదనే నమ్మకం, ఆశ నాకున్నాయి. అయితే, నేను ధైర్యంగా మాట్లాడడం వల్ల ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నా* ద్వారా క్రీస్తు మహిమపర్చబడతాడు; నేను బ్రతికున్నా సరే, చనిపోయినా సరే, నా ద్వారా ఆయన మహిమపర్చబడతాడు.+
21 నేను బ్రతికుంటే, నా జీవితాన్ని క్రీస్తు కోసం ఉపయోగిస్తాను.+ ఒకవేళ నేను చనిపోయినా, అదీ నాకు లాభమే.+
22 నేను బ్రతికుంటే, నా సేవలో ఇంకా ఎక్కువ ఫలితాలు సాధిస్తాను; అయితే నేను ఏది ఎంచుకుంటాననేది మాత్రం చెప్పను.
23 నేను ఈ రెండిటి మధ్య నలిగిపోతున్నాను. ఒకవైపు నేను విడుదల పొంది క్రీస్తుతో ఉండాలనుకుంటున్నాను,+ నిజానికి క్రీస్తుతో ఉండడమే చాలా మంచిది.+
24 మరోవైపు, మీకోసం నేను బ్రతికుండడం చాలా అవసరం.
25 కాబట్టి మీ ప్రగతి కోసం, విశ్వాసం వల్ల మీలో కలిగే సంతోషం కోసం నేను బ్రతికుండి మీ అందరితో పాటు ఉంటాననే నమ్మకం నాకుంది.
26 దానివల్ల, నేను మళ్లీ మీతో ఉన్నప్పుడు, క్రీస్తుయేసు శిష్యులైన మీకు నా వల్ల పట్టలేని సంతోషం కలుగుతుంది.
27 మీరు క్రీస్తు గురించిన మంచివార్తకు తగ్గట్టు ప్రవర్తించాలన్నదే* నా కోరిక.+ అప్పుడు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినా, రాకపోయినా, మీరు ఒకే ఆలోచనతో+ స్థిరంగా ఉంటూ, మంచివార్త మీదున్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా కృషి చేస్తున్నారనే వార్త నేను వినగలుగుతాను.
28 అంతేకాదు, మీరు వ్యతిరేకుల బెదిరింపులకు ఏమాత్రం లొంగిపోవట్లేదని కూడా నాకు తెలుస్తుంది. ఇది వాళ్ల నాశనానికి,+ మీ రక్షణకు రుజువు;+ ఈ రుజువు దేవుని నుండి వస్తుంది.
29 ఎందుకంటే, క్రీస్తు మీద నమ్మకం ఉంచే అవకాశమే కాదు, ఆయన కోసం బాధలు అనుభవించే అవకాశం కూడా మీకు దొరికింది.+
30 నేను ఏ పోరాటం చేయడం మీరు చూశారో,+ ఇప్పటికీ నేను ఏ పోరాటం చేస్తున్నానని మీరు వింటున్నారో, అదే పోరాటం మీరూ చేస్తున్నారు.
అధస్సూచీలు
^ న్యాయస్థానంలో అని తెలుస్తోంది.
^ అంటే, రోమా చక్రవర్తిని కాపాడే సైనికుల గుంపు.
^ న్యాయస్థానంలో అని తెలుస్తోంది.
^ అక్ష., “నా శరీరం.”
^ లేదా “పౌరులుగా నడుచుకోవాలన్నదే.”