యోవేలు 2:1-32
2 “సీయోనులో బూర* ఊదండి!+
నా పవిత్ర పర్వతం మీద యుద్ధకేక వేయండి.
దేశ* నివాసులందరూ వణకాలి,ఎందుకంటే యెహోవా రోజు వస్తోంది!+ అది దగ్గర్లో ఉంది!
2 అది చీకటి, అంధకారం కమ్ముకునే రోజు,+మేఘాలు, కటిక చీకటి కమ్ముకునే రోజు.+అది, ఉదయకాంతి కొండల మీద వ్యాపిస్తున్నట్టు ఉంటుంది.
విస్తారమైన, బలమైన ఒక మిడతల* దండు ఉంది;+అలాంటిది ముందెప్పుడూ లేదు,తరతరాలపాటు ఇంకెప్పుడూ అలాంటిది ఉండదు.
3 వాటి ముందు అగ్ని దహించేస్తుంది,వాటి వెనక మంట కాల్చేస్తుంది.+
వాటికి ముందున్న ప్రాంతం ఏదెను తోటలా ఉంది,+కానీ వాటి వెనక నిర్మానుష్యమైన ఎడారి ఉంది,ఏదీ తప్పించుకోలేదు.
4 అవి గుర్రాల్లా కనిపిస్తున్నాయి,యుద్ధ గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి.+
5 అవి కొండల శిఖరాల పైన గంతులు వేస్తున్నప్పుడు ఆ ధ్వని+రథాల ధ్వనిలా, కొయ్యకాలు* మంటలో కాలుతున్నప్పుడు వచ్చే చిటపట శబ్దంలా ఉంది.
అవి యుద్ధ పంక్తులు తీరిన బలమైన జనంలా ఉన్నాయి.+
6 వాటి వల్ల ప్రజలు వేదన పడతారు.
ప్రతీ ఒక్కరి ముఖంలో భయం కనిపిస్తుంది.
7 అవి యోధుల్లా దాడి చేస్తాయి,సైనికుల్లా ప్రాకారాలు ఎక్కుతాయి,ప్రతీది తన దారిలోనే వెళ్తుంది,అవి తమ దారి నుండి పక్కకు మళ్లవు.
8 అవి ఒకదాన్ని ఒకటి తోసుకోవు;ప్రతీ ఒక్కటి తన దారిలో సాగిపోతుంది.
ఆయుధాల* వల్ల కొన్ని పడిపోయినా,మిగతావి తమ వరుస నుండి పక్కకి వెళ్లవు.
9 అవి నగరంలోకి దూసుకొస్తాయి, ప్రాకారాల మీద పరుగెత్తుతాయి.
ఇళ్ల మీదికి ఎక్కుతాయి, దొంగ దూరినట్టు కిటికీల గుండా దూరతాయి.
10 అవి సాగిపోతున్నప్పుడు దేశం వణుకుతోంది, ఆకాశం కంపిస్తోంది.
సూర్యుడు, చంద్రుడు చీకటయ్యాయి,+నక్షత్రాలు కాంతిని కోల్పోయాయి.
11 యెహోవా తన సైన్యం ముందు పెద్ద స్వరంతో మాట్లాడతాడు,+ ఎందుకంటే ఆయన దండు ఎంతో విస్తారమైనది.+
ఆయన మాట అమలు చేసే వ్యక్తి బలమైనవాడు;ఎందుకంటే యెహోవా రోజు గొప్పది, అది సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది.+
దాన్ని ఎవరు తట్టుకోగలరు?”+
12 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇప్పుడైనా సరే,మీరు ఉపవాసం ఉండి,+ ఏడుస్తూ, విలపిస్తూ హృదయపూర్వకంగా నా దగ్గరికి తిరిగిరండి.+
13 మీ వస్త్రాల్ని కాదు+ మీ హృదయాల్ని చింపుకొని+మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగిరండి.ఎందుకంటే ఆయన కనికరం,* కరుణ, ఓర్పు,*+ అపారమైన విశ్వసనీయ ప్రేమ గలవాడు,+విపత్తు గురించి ఆయన ఇంకోసారి ఆలోచిస్తాడు.*
14 ఆయన తన నిర్ణయం గురించి ఇంకోసారి ఆలోచిస్తాడేమో,*తన నిర్ణయం మార్చుకుని,+ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడేమో ఎవరికి తెలుసు?అప్పుడు మీ దేవుడైన యెహోవాకు మీరు ధాన్యార్పణను, పానీయార్పణను అర్పించవచ్చు.
15 సీయోనులో బూర ఊదండి!
ఉపవాసం ప్రకటించండి;* ప్రత్యేక సమావేశం కోసం పిలుపునివ్వండి.+
16 ప్రజల్ని సమకూర్చండి; సమాజాన్ని పవిత్రపర్చండి.+
ముసలివాళ్లను* పోగుచేయండి; పిల్లల్ని, పాలుతాగే పసిబిడ్డల్ని పోగుచేయండి.+
పెళ్లి కుమారుడు తన లోపలి గదిలో నుండి, పెళ్లి కూతురు తన గదిలో నుండి బయటికి రావాలి.
17 యెహోవాకు పరిచారం చేసే యాజకులువసారాకు, బలిపీఠానికి మధ్య+ నిలబడి ఏడుస్తూ ఇలా అనాలి:
‘యెహోవా, నీ ప్రజల విషయంలో జాలిపడు;నీ స్వాస్థ్యాన్ని అవమానాలపాలు చేయకు,వాళ్ల మీద ఇతర దేశాల్ని పరిపాలించనివ్వకు.
“వాళ్ల దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలవాళ్లు ఎందుకు అనాలి?’+
18 అప్పుడు యెహోవా తన దేశం కోసం ఎంతో ఆసక్తితో ఉంటాడు,తన ప్రజల మీద కనికరం చూపిస్తాడు.+
19 యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిస్తాడు:
‘ఇదిగో నేను మీకు ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసాన్ని, నూనెను ఇస్తున్నాను,మీరు పూర్తిగా తృప్తి పొందుతారు;+దేశాల మధ్య ఇక మిమ్మల్ని నిందలపాలు చేయను.+
20 నేను ఉత్తరం నుండి వచ్చే అతన్ని మీకు దూరంగా వెళ్లగొడతాను;ఎండిపోయి, నిర్మానుష్యమైన నిర్జన ప్రాంతానికి అతన్ని చెదరగొడతాను.అతని సైన్యం ముందు భాగాన్ని తూర్పు సముద్రం* వైపుకు,వెనక భాగాన్ని పడమటి సముద్రం* వైపుకు చెదరగొడతాను.
అతని శవం కంపు కొడుతుంది,ఆ దుర్వాసన పైకి లేస్తూ ఉంటుంది;+ఎందుకంటే దేవుడు* గొప్ప కార్యాలు చేస్తాడు.’
21 దేశమా, భయపడకు.
ఆనందించు, సంతోషించు,
ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు చేస్తాడు.
22 పొలంలోని పశువులారా, భయపడకండి,ఎడారిలోని పచ్చికబయళ్లు పచ్చగా అవుతాయి.+చెట్లకు పండ్లు కాస్తాయి;+అంజూర చెట్టు, ద్రాక్ష చెట్టు పూర్తి ఫలాన్ని ఇస్తాయి.+
23 సీయోను కుమారులారా, మీ దేవుడైన యెహోవాను బట్టి ఆనందించండి, సంతోషించండి;+ఆయన మీకు తగినంత తొలకరి వానను,* వర్షాల్ని కురిపిస్తాడు.ముందులాగే తొలకరి వానను, కడవరి వానను* పంపిస్తాడు.+
24 కళ్లాలు* ధాన్యంతో నిండిపోతాయి,గానుగలు కొత్త ద్రాక్షారసంతో, నూనెతో పొంగిపొర్లుతాయి.+
25 నేను మీ మీదికి పంపిన నా గొప్ప సైన్యం,అంటే మిడతల దండు, రెక్కల్లేని మిడతలు, తిండిబోతు మిడతలు, నాశనకరమైన మిడతలు
తినేసిన+ సంవత్సరాల పంటను మీకు మళ్లీ ఇస్తాను.
26 మీరు తప్పకుండా తృప్తిగా తింటారు,+మీ తరఫున అద్భుత కార్యాలు చేసినమీ దేవుడైన యెహోవా పేరును స్తుతిస్తారు;+నా ప్రజలు ఇంకెప్పుడూ అవమానానికి గురికారు.+
27 నేను ఇశ్రాయేలు మధ్య ఉన్నానని,+నేను మీ దేవుడైన యెహోవానని,+ నేను తప్ప ఇంకే దేవుడూ లేడని మీరు తెలుసుకుంటారు!
నా ప్రజలు ఇంకెప్పుడూ అవమానానికి గురికారు.
28 ఆ తర్వాత, నేను నా పవిత్రశక్తిని అన్నిరకాల ప్రజల మీద కుమ్మరిస్తాను,+మీ కుమారులు, కూతుళ్లు ప్రవచిస్తారు,మీ వృద్ధులు కలలు కంటారు,మీ యౌవనులు దర్శనాలు చూస్తారు.+
29 ఆ రోజుల్లో నేను నా దాసులు, దాసురాళ్ల మీద కూడానా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను.
30 నేను ఆకాశంలో, భూమ్మీద అద్భుతాల్ని,*అంటే రక్తాన్ని, అగ్నిని, పైకిలేచే దట్టమైన పొగను కలగజేస్తాను.+
31 సంభ్రమాశ్చర్యాలు పుట్టించే యెహోవా మహారోజు వచ్చేముందు+సూర్యుడు చీకటి అవుతాడు, చంద్రుడు రక్తంలా మారతాడు.+
32 అప్పుడు యెహోవా పేరు ఉపయోగించి ప్రార్థించే ప్రతీ ఒక్కరు రక్షించబడతారు;+ఎందుకంటే యెహోవా చెప్పినట్టు, సీయోను పర్వతం మీద, యెరూషలేములో తప్పించుకునేవాళ్లు ఉంటారు,+
వాళ్లు యెహోవా పిలిచేవాళ్లు.”
అధస్సూచీలు
^ అక్ష., “కొమ్ము.”
^ లేదా “భూమి.”
^ అక్ష., “ప్రజల.”
^ పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
^ లేదా “విసిరే ఆయుధాల.”
^ లేదా “దయ.”
^ లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తాడు.”
^ లేదా “విచారపడతాడు.”
^ లేదా “విచారపడతాడేమో.”
^ అక్ష., “ప్రతిష్ఠించండి.”
^ లేదా “పెద్దల్ని.”
^ అంటే, మృత సముద్రం.
^ అంటే, మధ్యధరా సముద్రం.
^ అక్ష., “ఆయన.”
^ తొలకరి వానలు దాదాపు అక్టోబరు మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ కడవరి వానలు దాదాపు ఏప్రిల్ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
^ లేదా “సూచనల్ని.”