సంఖ్యాకాండం 11:1-35

  • సణగడం వల్ల దేవుని నుండి అగ్ని వచ్చింది (1-3)

  • ప్రజలు మాంసం కోసం ఏడ్వడం (4-9)

  • మోషే తన సామర్థ్యం సరిపోదని అనుకున్నాడు (10-15)

  • యెహోవా 70 మంది పెద్దలకు పవిత్రశక్తిని ఇవ్వడం (16-25)

  • ఎల్దాదు, మేదాదు; మోషే విషయంలో యెహోషువకు రోషం వచ్చింది (26-30)

  • పూరేడు పిట్టల్ని రప్పించడం; కక్కుర్తి చూపించినందుకు ప్రజల మీదికి శిక్ష (31-35)

11  తర్వాత ప్రజలు యెహోవా ముందు విపరీతంగా సణగడం మొదలుపెట్టారు. అది విన్నప్పుడు యెహోవా కోపం మండిపోయింది, దాంతో యెహోవా దగ్గర నుండి అగ్ని రగులుకొని పాలెం పొలిమేరల్లో ఉన్న కొందర్ని దహించడం మొదలుపెట్టింది.  అప్పుడు ప్రజలు మోషేను వేడుకున్నారు, అతను యెహోవాను అభ్యర్థించాడు,+ దాంతో ఆ అగ్ని చల్లారిపోయింది.  అందుకే ఆ చోటుకు తబేరా* అనే పేరొచ్చింది; ఎందుకంటే అక్కడ యెహోవా దగ్గర నుండి అగ్ని వచ్చి వాళ్ల మీద ​రగులుకుంది.+  తర్వాత, వాళ్ల మధ్య ఉన్న వేరే జనాలు*+ స్వార్థపూరిత కోరికను వెలిబుచ్చారు,+ దాంతో ఇశ్రాయేలీయులు కూడా మళ్లీ ఏడ్వడం మొదలుపెట్టి ఇలా అన్నారు: “మాకు ఎవరు మాంసం ​పెడతారు?+  ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు మాకు చాలా గుర్తొస్తున్నాయి! ఆ దోసకాయలు, పుచ్చకాయలు, ఉల్లి ఆకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మాకు బాగా గుర్తొస్తున్నాయి!+  ఇప్పుడేమో మేము నీరసించిపోతున్నాం. మా కళ్లకు ఈ మన్నా తప్ప ఇంకేమీ కనిపించట్లేదు.”+  ఈ మన్నా+ ధనియాల్లా ఉండేది,+ చూడడానికి సువాసనగల జిగురులా ఉండేది.  ప్రజలు అన్నివైపులకు వెళ్లి దాన్ని ఏరుకునేవాళ్లు, తర్వాత దాన్ని తిరుగలిలో విసిరేవాళ్లు లేదా రోట్లో వేసి దంచేవాళ్లు; ఆ తర్వాత దాన్ని వంటపాత్రల్లో ఉడకబెట్టేవాళ్లు లేదా దానితో గుండ్రటి రొట్టెలు చేసుకునేవాళ్లు;+ దాని రుచి నూనె కలిపిన తియ్యని పిండివంటకంలా ఉండేది.  రాత్రిపూట పాలెంలో మంచు కురిసినప్పుడు, దానిమీద మన్నా కూడా కురిసేది.+ 10  ఒక కుటుంబం తర్వాత ఇంకో కుటుంబం ఏడ్వడం, ప్రతీ ఒక్కరు తమ డేరా గుమ్మం దగ్గరుండి ఏడ్వడం మోషే విన్నాడు. అప్పుడు యెహోవాకు విపరీతమైన కోపమొచ్చింది,+ మోషేకు కూడా వాళ్లు చేసింది అస్సలు నచ్చలేదు. 11  తర్వాత మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “నువ్వెందుకు నీ సేవకుడినైన నన్ను బాధపెట్టావు? నీ దృష్టిలో నేనెందుకు అనుగ్రహం పొందలేదు? ఈ ప్రజలందరి భారాన్ని నువ్వు నా మీద ఎందుకు పెట్టావు?+ 12  ‘సేవకుడు చంటిబిడ్డను ఎత్తుకున్నట్టు వాళ్లను నీ చంకనెత్తుకొని’ నువ్వు వాళ్ల పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి+ వాళ్లను తీసుకెళ్లమని నువ్వు నాతో చెప్పడానికి నేనేమైనా వాళ్లందర్నీ నా కడుపులో మోశానా? వాళ్లను కన్నానా? 13  ఈ ప్రజలందరికీ పెట్టడానికి నేను మాంసం ఎక్కడి నుండి తీసుకురావాలి? వాళ్లేమో, ‘మాకు మాంసం పెట్టు!’ అని నా ముందు ఒకటే ఏడుస్తున్నారు. 14  ఈ ప్రజలందర్నీ నేనొక్కడినే మోయలేకపోతున్నాను; ఇది నా తలకు మించిన భారంగా ఉంది.+ 15  ఒకవేళ నువ్వు ఈ భారాన్ని నామీద ఇలాగే ఉంచాలనుకుంటే, దయచేసి ఇప్పుడే నన్ను చంపేయి.+ నీ దృష్టిలో నేను అనుగ్రహం పొందివుంటే, ఇక ఎంతమాత్రం నన్ను విపత్తు చూడనివ్వకు.” 16  యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు పెద్దల్లో నుండి నా కోసం 70 మందిని సమావేశపర్చు; వాళ్లు ప్రజల పెద్దలని, అధికారులని+ నీకు తెలిసినవాళ్లు అయ్యుండాలి. నువ్వు వాళ్లను ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకెళ్లి, అక్కడ నీతోపాటు నిలబెట్టు. 17  నేను దిగివచ్చి+ అక్కడ నీతో మాట్లాడతాను,+ అంతేకాదు నీ మీద ఉన్న పవిత్రశక్తిలో+ కొంచెం తీసి వాళ్లమీద ఉంచుతాను; వాళ్లు ప్రజల భారాన్ని మోయడంలో నీకు సహాయం చేస్తారు, అప్పుడు నువ్వొక్కడివే ఆ భారం మోయాల్సిన అవసరం ఉండదు.+ 18  నువ్వు ప్రజలకు ఇలా చెప్పాలి: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకోండి,+ ఎందుకంటే రేపు మీరు ఖచ్చితంగా మాంసం తింటారు. “మాకు ఎవరు మాంసం పెడతారు? ఐగుప్తులోనే మాకు బాగుండేది”+ అని మీరు యెహోవాకు వినబడేలా ఏడ్చారు కదా.+ యెహోవా తప్పకుండా మీకు మాంసం ఇస్తాడు, మీరు తింటారు.+ 19  మీరు మాంసం తినేది ఒక్క రోజో, 2 రోజులో, 5 రోజులో, 10 రోజులో, 20 రోజులో కాదు; 20  ఒక నెలంతా మీరు మాంసం తింటారు; అది మీ ​ముక్కురంధ్రాల్లో నుండి బయటికి వచ్చేవ​రకు, మీకు దాని మీద అసహ్యం పుట్టేవరకు తింటారు.+ ఎందుకంటే మీ మధ్య ఉన్న యెహోవాను మీరు తిరస్కరించారు, “అసలు మేమెందుకు ఐగుప్తు నుండి బయటికి వచ్చాం?”+ అని అంటూ ఆయన ముందు ఏడుస్తూ ఉన్నారు.’ ” 21  అప్పుడు మోషే ఇలా అన్నాడు: “నేను ఏ ప్రజల మధ్య ఉన్నానో వాళ్లు 6,00,000 మంది పురుషులు;*+ అయినా, ‘నేను వాళ్లకు మాంసం ఇస్తాను, వాళ్లు పూర్తిగా నెల రోజుల పాటు ​కడుపు​నిండా మాంసం తింటారు’ అని నువ్వే స్వయంగా చెప్పావు! 22  ఉన్న మందలన్నిటినీ, పశువులన్నిటినీ వధించినా అవి వాళ్లకు ​సరిపోతాయా? సముద్రంలోని చేపలన్నిటినీ పట్టినా అవి వాళ్లకు సరిపోతాయా?” 23  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “యెహోవా చెయ్యి అంత చిన్నదా?+ నేను చెప్పింది జరుగుతుందో లేదో ఇప్పుడు నువ్వు చూస్తావు.” 24  కాబట్టి మోషే బయటికి వెళ్లి యెహోవా మాటల్ని ప్రజలకు చెప్పాడు. అలాగే ప్రజల పెద్దల్లో నుండి 70 మందిని సమావేశపర్చి వాళ్లను గుడారం చుట్టూ నిలబెట్టాడు.+ 25  తర్వాత యెహోవా మేఘంలో దిగివచ్చి+ అతనితో మాట్లా​డాడు,+ అంతేకాదు అతని పైన ఉన్న పవిత్ర​శక్తిలో కొంచెం తీసి+ ఆ 70 మంది పెద్దల్లో ఒక్కొక్కరి మీద దాన్ని ఉంచాడు. పవిత్రశక్తి వాళ్లమీదికి రాగానే వాళ్లు ప్రవచించడం* మొదలుపెట్టారు;+ కానీ ఆ తర్వాత వాళ్లు మళ్లీ అలా చేయలేదు. 26  అయితే వాళ్లలో ఇద్దరు మాత్రం ఇంకా పాలెంలోనే ఉన్నారు. వాళ్ల పేర్లు ఎల్దాదు, మేదాదు. పవిత్రశక్తి వాళ్లమీదికి కూడా రావడం మొదలుపెట్టింది. ఎందుకంటే, రాయబడిన పేర్లలో వాళ్ల పేర్లు కూడా ఉన్నాయి, కానీ వాళ్లు గుడారం ​దగ్గరికి వెళ్లలేదు. పవిత్రశక్తి వాళ్ల​మీదికి వచ్చినప్పుడు వాళ్లు పాలెంలో ప్రవచించడం* మొదలుపెట్టారు. 27  అప్పుడొక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి, “ఎల్దాదు, మేదాదు పాలెంలో ప్రవచిస్తున్నారు!”* అని చెప్పాడు. 28  అప్పుడు నూను కుమారుడూ, యౌవనంలో ఉన్నప్పటి నుండి మోషేకు పరి​చారకుడూ అయిన యెహోషువ,+ “మోషే, నా ప్రభువా, వాళ్లను ఆపు!” అన్నాడు.+ 29  అయితే మోషే ఇలా అన్నాడు: “నా గురించి నీకు రోషం వచ్చిందా? వద్దు, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అవ్వాలని, యెహోవా వాళ్ల మీద తన పవిత్రశక్తి ఉంచాలని నా కోరిక!” 30  తర్వాత మోషే ఆ ఇశ్రా​యేలు పెద్దలతో పాటు పాలెంలోకి తిరిగెళ్లాడు. 31  అప్పుడు యెహోవా దగ్గర నుండి గాలి బయల్దేరి, సముద్రం నుండి పూరేడు పిట్టలు వచ్చి పాలెం చుట్టూ పడిపోయేలా చేసింది.+ అవి పాలేనికి అన్నివైపులా ఒకరోజు ప్రయాణమంత దూరం పాటు, దాదాపు రెండు మూరల* ఎత్తు వరకు నేలమీద పడ్డాయి. 32  కాబట్టి ప్రజలు ఆ రోజంతా, రాత్రంతా, అలాగే మరుసటి రోజంతా అక్కడే ఉండి వాటిని ఏరుకున్నారు. ఎవరూ పది హోమర్‌ల* కన్నా తక్కువ ఏరుకోలేదు. వాళ్లు తమ కోసం వాటిని పాలెం అంతటా పరుస్తూ ఉన్నారు.* 33  అయితే ఆ మాంసం ఇంకా వాళ్ల పంటి కింద ఉండగానే, వాళ్లు దాన్ని నమలక ముందే, యెహోవా కోపం వాళ్ల మీద ​రగులుకుంది; దాంతో యెహోవా పెద్ద ఎత్తున వాళ్లను వధించడం మొదలుపెట్టాడు.+ 34  కాబట్టి వాళ్లు ఆ చోటుకు కిబ్రోతు-హత్తావా*+ అని పేరు పెట్టారు; ఎందుకంటే మాంసం కోసం కక్కుర్తిపడిన వాళ్లను+ ప్రజలు అక్కడ పాతిపెట్టారు. 35  తర్వాత, ప్రజలు కిబ్రోతు-హత్తావా నుండి హజేరోతుకు బయల్దేరి, హజేరోతులో దిగారు.+

అధస్సూచీలు

“కాలుతున్న” అని అర్థం. అంటే కార్చిచ్చు; జ్వాల.
ఇశ్రాయేలీయులుకాని వాళ్లు అని తెలుస్తోంది.
అక్ష., “కాల్బలం.” ఇది సైనిక సేవకు తగిన పురుషుల్ని సూచిస్తుందని తెలుస్తోంది.
లేదా “ప్రవక్తల్లా ప్రవర్తించడం.”
లేదా “ప్రవక్తల్లా ప్రవర్తించడం.”
లేదా “ప్రవక్తల్లా ప్రవర్తిస్తున్నారు.”
అప్పట్లో ఒక మూర 44.5 సెంటీమీటర్లతో (17.5 అంగుళాలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక హోమర్‌ 220 లీటర్లతో (దాదాపు 130 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
బహుశా ఎండబెట్టడానికి కావచ్చు.
“కక్కుర్తిపరుల సమాధి స్థలాలు” అని అర్థం.